సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య సేవల విషయంలో వైద్య, ఆరోగ్యశాఖ వైఖరి ప్రభుత్వానికి ఇబ్బందులు తెస్తోంది. ఎంప్లాయీ హెల్త్ స్కీం (ఈహెచ్‌ఎస్) కింద ఉద్యోగులకు చికిత్సలు అందించిన కార్పొరేట్ సహా అన్ని రకాల ప్రైవేటు ఆస్పత్రులకు వైద్య, ఆరోగ్యశాఖ దాదాపు ఏడాదిగా చెల్లింపులు నిలిపేసింది. కార్పొరేట్ ఆస్పత్రులకు రూ.200 కోట్లు, మిగిలిన ఆస్పత్రులకు రూ.200 కోట్ల చొప్పున బకాయి పడింది. దీంతో ఆస్పత్రులు ఉద్యోగులకు వైద్య సేవలను నిలిపివేయాలని నిర్ణయించాయి.
ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వారం కిందటే సమాచారం ఇచ్చాయి. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యోగులకు వైద్యం విషయంలో కటువుగా వ్యవహరిస్తున్నాయి. వైద్య సేవలు అందించేందుకు సమయం పడుతుందని చెబుతున్నాయి. దీంతో వైద్య సేవలు, చికిత్సల కోసం కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తున్న ఉద్యోగులకు అవమానాలు ఎదురవుతున్నాయి. అత్యవసర వైద్యం అవసరమయ్యే ఉద్యోగులు ఆస్పత్రులను బతిమిలాడుకొని సేవలు పొందాల్సిన పరిస్థితి నెలకొంటోంది. వైద్య, ఆరోగ్య శాఖ తీరుతో తమకు ఇబ్బందులు వస్తున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వం గతంలో ఏడాదికి రూ. 700 కోట్ల వరకు ఖర్చు చేసేదని, ఈహెచ్‌ఎస్‌తో ఇది రూ. 400 కోట్లకు తగ్గిందని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
1.19 లక్షల మందికి చికిత్సలు...
ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీ హెల్త్ స్కీం (ఈహెచ్‌ఎస్)ను ప్రవేశపెట్టింది. అలాగే అన్ని జిల్లాల్లో వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలుత హైదరాబాద్‌లో రెండు, సిద్దిపేట, వరంగల్‌లలో ఒకటి చొప్పున వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. 2016 డిసెంబర్ 17 నుంచి ఈహెచ్‌ఎస్ సేవలు మొదలయ్యాయి. వెల్‌నెస్ సెంటర్ల ద్వారా ఓపీ సేవలు, వైద్య పరీక్షలు, మందులను ఉచితంగా అందిస్తున్నారు. పరీక్షల ఆధారంగా అవసరమైన వైద్య చికిత్సల కోసం ఎంపిక చేసిన ఆస్పత్రులకు సిఫారసు చేస్తున్నారు.
ఈహెచ్‌ఎస్ సేవల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 ఆస్పత్రులు ఉన్నాయి. అన్ని ఆస్పత్రులలో కలిపి ఇప్పటివరకు 1,19,210 మంది ఇన్‌పేషెంట్లుగా చికిత్సలు పొందారు. ఈ సేవలకు రూ. 400 కోట్లు ఖర్చయింది. ఉద్యోగులకు వైద్యం అందించిన ఆస్పత్రుల జాబితాలో 16 బడా కార్పొరేట్ ఆస్పత్రులు కూడా ఉన్నాయి. అత్యవసర, క్లిష్టమైన సేవలు అందించేందుకు అన్ని వసతులుగల ఈ కార్పొరేట్ ఆస్పత్రులకు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డు గుర్తింపు ఉంది. ఎన్‌బీఏ గుర్తింపు ఉన్న ఆస్పత్రుల్లో 24,210 మందికి వివిధ రకాల చికిత్సలు నిర్వహించారు. వారిలో 10,225 మంది ఉద్యోగులు, 13,549 మంది పెన్షన్‌దారులు, 436 మంది జర్నలిస్టులు చికిత్సలు పొందారు. ఈహెచ్‌ఎస్ కింద అందించిన ఈ సేవల కోసం ఏడాదిలో రూ. 270 కోట్లు ఖర్చయ్యాయి.
ఈహెచ్‌ఎస్ మొదలైన కొత్తలో ఆస్పత్రులు అన్నింటికీ కలిపి వైద్య, ఆరోగ్యశాఖ రూ. 70 కోట్లు చెల్లించింది. కానీ గత 11 నెలలుగా మాత్రం చెల్లింపుల ప్రక్రియను పట్టించుకోవడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నా వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెల్లింపుల విషయంలో అడ్డుంకులు సృష్టిస్తున్నారని ఆస్పత్రుల నిర్వాహకుల సంఘం ముఖ్యలు ఆరోపిస్తున్నారు. బకాయిలు పెరిగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, శస్త్రచికిత్సలకు అవసరమయ్యే వివిధ రకాల వైద్య పరికరాలను కొనుగోలు చేయలేకపోతున్నామని వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment