ఆస్పత్రుల్లో డాక్టర్లు లేక.. సమయానికి వైద్యం అందక.. ప్రాణాలు పోగొట్టుకుంటున్న గిరిజనులు
చాలా ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత
జిల్లా కేంద్రాల్లోనూ సర్జరీలు, ముఖ్యమైన చికిత్సలు అందని దుస్థితి
ఇప్పటికే ఓవైపు డెంగ్యూ, ఇతర విషజ్వరాల విజృంభణ
ఏజెన్సీ మంచం పట్టకముందే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తులు
అటవీ ప్రాంతాల్లో విధులపై ప్రభుత్వ వైద్యుల విముఖత
ఒకవేళ అక్కడ పోస్టింగ్ వచ్చినా.. వీలైనంత త్వరగా బదిలీ చేయించుకుంటున్న తీరు
అందితే సర్కారు వైద్యం.. లేదంటే ఆకు పసర్లే ఆధారం అన్నట్టుగా బతికే గిరిజనులు వారు.. ఏదైనా జబ్బు వస్తే దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లడానికే నానా యాతన. అక్కడ డాక్టర్ లేకుంటేనో, మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలంటేనో.. ప్రాణాల మీద ఆశలు పోయినట్టే. పట్టణాలకు వచ్చి ప్రైవేటు వైద్యం చేయించుకునే స్థోమత లేక.. దూర ప్రాంతాల్లోని పెద్దాస్పత్రులకు తరలించేలోపే ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. ఇదేదో ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కాదు.. ఏనాడూ ఎవరూ సరిగా పట్టించుకోని సమస్య. ప్రభుత్వాలు ఆస్పత్రులు ఏర్పాటు చేయకపోవడం.. ఆస్పత్రులు కట్టినా పోస్టులు భర్తీ చేయకపోవడం.. చేసినా ఆ వైద్యులు, సిబ్బంది ట్రాన్స్‌ఫర్ చేయించుకుని వెళ్లిపోవడం.. పరిస్థితి మళ్లీ మొదటికి రావడం.. ఇంకా ఎన్నాళ్లిలా గోసపడాలని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి నెట్‌వర్క్: ఏజెన్సీ ప్రాంతాల్లో స్పెషాలిటీ వైద్య సేవలు అందించాల్సిన వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులు నామ్‌కేవాస్తేగా మారుతున్నాయి. పీహెచ్‌సీల నుంచి వచ్చిన రోగులకు స్పెషాలిటీ సేవలు అందించాల్సింది పోయి.. బోధనాస్పత్రులకు రిఫర్ చేసేందుకే పరిమితం అవుతున్నాయి. కాదంటే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు దారి చూపిస్తున్నాయి. ఏజెన్సీ ఏరియాల్లో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కొరతే దీనికి కారణమవుతోంది. అయితే స్పెషలిస్టు వైద్యులు లేకపోవడం, వారు ఉన్నా రేడియాలజిస్టులు, మత్తుమందు నిపుణులు, స్టాఫ్‌నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్ల వంటివారు లేకపోవడంతో.. వైద్య సేవలు సరిగా అందించలేని దుస్థితి నెలకొంది.
ప్రోత్సాహక నిర్ణయాలేవీ?
ఏజెన్సీ ఆస్పత్రుల్లో పనిచేయడానికి వైద్యులు, సిబ్బంది వెనకడుగు వేస్తున్న అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రోత్సాహకాలు ఇస్తే పరిస్థితి మారుతుందని, ఏపీలో వైఎస్ జగన్ హయాంలో తీసుకున్న చర్యలు బాగున్నాయని వైద్యవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీలో కాంట్రాక్టు పద్ధతిలో స్పెషలిస్టు వైద్యుల జీతభత్యాలను రూ.2.50లక్షలకు పెంచారని, బిడ్డింగ్ నెగోషియేషన్‌కు అవకాశం కల్పించారని.. దీంతో భద్రాచలం పక్కన ఉన్న అల్లూరి జిల్లాలో గైనకాలజిస్టు ఏకంగా నెలకు రూ.3.80 లక్షల జీతం అందుకోగలుతున్నారని వివరిస్తున్నాయి.
డాక్టర్లు, సిబ్బంది బదిలీలతో..
ఏజెన్సీ ప్రాంతాలు, జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పనిచే సేందుకు డాక్టర్లు, వైద్య సిబ్బంది ఇష్టపడటం లేదు. సౌకర్యాలు, సదుపాయాల లేమితోపాటు వేతనాల సమస్య కూడా దీనికి కారణమవుతోంది. వైద్యవిధాన పరిషత్‌లో మైదాన, గ్రామీణ, ఏజెన్సీ అన్ని ప్రాంతాల వారికి ఒకేవిధమైన జీతభత్యాలు అందుతున్నాయి. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 శాతం అలవెన్సులు, పాత జిల్లా కేంద్రాల్లో 17శాతం అలవెన్సులు అందితే.. ఏజెన్సీ ఏరియాల్లో 11 శాతమే వస్తాయని వైద్యులు, సిబ్బంది చెప్తున్నారు.
మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే.. అదనంగా అందాల్సిందిపోయి, తక్కువ వేతనం ఉండటం ఇబ్బందికరమని అంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఏజెన్సీ ఏరియాల నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల చేపట్టిన బదిలీల్లో ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు చాలా మంది వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది వెళ్లిపోవడం గమనార్హం.
కొన్ని ప్రాంతాల్లో ఇదీ పరిస్థితి..
భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో నాలుగేళ్ల కింద 13 మంది వైద్యులు సేవలందించగా.. ఏటా వేల సంఖ్యలో కాన్పులు, సర్జరీలు జరిగేవి. ఒక్కొక్కరుగా వైద్యులు ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడంతో వైద్య సేవలు తగ్గిపోయాయి. సరిపడా గైనకాలజిస్టులు లేక కాన్పు కోసం వచ్చే గర్భిణులను ఇతర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఇక ఇక్కడ ఒక్కరే నేత్ర వైద్యుడు ఉన్నారు. వారానికి ఒక రోజును పూర్తిగా సర్జరీలకే కేటాయించినా.. వచ్చే డిసెంబర్ వరకు అపాయింట్‌మెంట్లు ఫుల్ అయ్యాయి.
⇒ నాగర్‌కర్నూల్ జిల్లా టీజీవీవీపీ పరిధిలో నాలుగు ఆస్పత్రులు ఉన్నాయి. 107 మంది డాక్టర్లు పనిచేయాల్సిన చోట 36 మందే ఉన్నారు.
⇒ మహబూబాబాద్ జిల్లా గార్లలో ఇటీవలి వరకు 10 మంది వైద్యులు పని చేశారు. ఇటీవలి బదిలీల్లో తొమ్మిది మంది వెళ్లిపోగా ఒక్కరే మిగిలారు.
⇒ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 173 డాక్టర్ పోస్టులకుగాను 90 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ ఆస్పత్రిలో 15 మంది పనిచేయాల్సిన చోట ఐదుగురే ఉన్నారు.
⇒ ములుగు జిల్లా ఏటూరునాగారం ఆస్పత్రిలో 17 పోస్టులకుగాను నలుగురే ఉన్నారు.
⇒ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఆస్పత్రిలో 33 డాక్టర్ పోస్టులుండగా 11 మందే పనిచేస్తున్నారు. ఇక్కడ గైనకాలజీ, పీడియాట్రిక్ వైద్యులు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.
ములుగు జిల్లా మంగపేట మండలం నర్సాపురానికి చెందిన వల్లె పోగు వినోద్‌బాబు కడుపునొప్పి తో బాధపడుతూ మణుగూరు ఆస్పత్రికి వెళ్లాడు. సర్జరీ సౌకర్యం లేనందున భద్రాచలం వెళ్లాలని వైద్యులు సూచించారు. అప్పు చేసి ఆటోలో భద్రాచలం వస్తే ఇక్కడ మరో ఇబ్బంది ఎదురైంది. ‘స్కానింగ్ చేసేందుకు రేడియాలజిస్టు లేడు. ఆపరేషన్‌కు సహకరించే మత్తు డాక్టర్ బదిలీ అయ్యాడు. కొత్తగూడెం వెళ్లాలంటూ వైద్యుల నుంచి సూచన వచ్చింది.
కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం మోవాడ్‌కు చెందిన కుమురం లక్ష్మి జిల్లా కేంద్రంలోని గిరిజన డిగ్రీ కళాశాలలో ఫస్టియర్ చదువుతోంది. ఆమెకు జ్వరం రావడంతో కాలేజీ సిబ్బంది పారాసిటమాల్ మాత్రలు ఇచ్చారు. పరిస్థితి విషమించడంతో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పూర్తిస్థాయి వైద్యం అందే పరిస్థితి లేదని.. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. లక్ష్మి అదే రోజు రాత్రి మృత్యువాత పడింది.
ఆసిఫాబాద్ మండలం మానక్‌గొందికి చెందిన మడావి రవి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఓ ఆటోడ్రైవర్ అతడిని వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. తలకు బలమైన గాయమవడం, చెవి నుంచి రక్తం కారుతుండటంతో వైద్యులు రవిని మంచిర్యాల ఆస్పత్రికి రెఫర్ చేశారు. కుమురం భీం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జనరల్ సర్జన్, న్యూరోసర్జన్, ఇతర స్పెషాలిటీ వైద్య నిపుణులు లేక.. ఇలాంటి సమస్యలు వస్తున్నాయి.
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఎల్మపల్లికి చెందిన నిండు గర్భిణి స్వర్ణకు రాత్రి 8 గంటల సమయంలో పురిటినొప్పులు రావడంతో అమ్రాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అందుబాటులో లేక అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే.. ఆమెకు బీపీ ఎక్కువగా ఉందంటూ నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రికి పంపించారు. రాత్రి 10 గంటలకు జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి వెళ్తే.. అక్కడి డాక్టర్లు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. చివరికి మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో అర్ధరాత్రి ప్రసవం చేసినా తల్లీబిడ్డ ఇద్దరూ మరణించారు. ఆరు నెలల కింద ఈ ఘటన జరిగినా.. ఇప్పటికీ ఇక్కడి ఆస్పత్రుల్లో పరిస్థితులేవీ మారలేదు.
Comments
Please login to add a commentAdd a comment