
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భద్రతా దళాల నిఘా
మావోయిస్టులే లక్ష్యంగా వ్యూహాలు
మరోసారి భద్రతా దళాల కన్నుగప్పిన డేంజరస్ హిడ్మా
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్‌టీఆర్‌ఓ).. కేంద్రప్రభుత్వ ఆదీనంలో పనిచేసే ఇంటెలిజెన్స్ సంస్థ ఇది. దేశ అంతర్గత భద్రతా వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి వివరాలు కేంద్రానికి అందిస్తుంది. ఇందుకోసం భూమి నుంచి 15వేల అడుగుల ఎత్తులో సంచరించే శాటిలైట్లు, డ్రోన్ల ద్వారా ఛాయాచిత్రాలను తీస్తూ ఎప్పటికప్పుడు విశ్లేషిస్తుంటుంది.
ఆపరేషన్ కగార్‌లో భాగంగా ప్రస్తుతం ఎన్‌టీఆర్‌ఓ సహాయ సహకారాలను యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌లో పాల్గొంటున్న భద్రతా దళాలు తీసుకుంటున్నాయి. ఒడిశా–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఘరియాబంద్ దగ్గర జనవరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి మరణించాడు. అప్పుడే యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌లో ఎన్‌టీఆర్‌ఓ పాత్రకు సంబంధించిన సమాచారం తొలిసారి బయటకొచ్చింది.
టీసీఓఏకు కౌంటర్‌గా..
ప్రతీ వేసవిలో అడవుల్లో భద్రతాదళాల దూకుడుకు అడ్డుకట్ట వేసేలా మావోయిస్టులు ట్యాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ (టీసీఓఏ – వ్యూహాత్మక ఎదురుదాడులు) పేరుతో ఎదురుదాడులు చేస్తుంటారు. అడవుల్లో కూంబింగ్‌కు వచ్చే భద్రతా దళాలపై ఆంబుష్ దాడులు చేయడం, కవ్వింపు చర్యలకు పాల్పడటం ద్వారా తమకు పట్టున్న ప్రాంతాల్లోకి పోలీసులను రప్పించి మెరుపుదాడులు చేయడం ఇందులో భాగం.
అయితే, ఇటీవల వరుస ఎదురుదెబ్బలు తింటున్న మావోలు ఈసారి భారీగా ప్రతీకార దాడులకు ప్లాన్ చేసే అవకాశముందనే అనుమానంతో భద్రతా దళాలు తమ పంథా మార్చాయి. కూంబింగ్ ఆపరేషన్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించాయి. ఎన్‌టీఆర్‌ఓ సహకారంతో ‘శాటిలైట్–డ్రోన్’డేటా ఉపయోగించుకుంటూ మావోల కదలికలను పసిగడుతున్నాయి. అదను చూసి పదును పెట్టి దాడులు చేస్తున్నట్టు తాజా ఎన్‌కౌంటర్లతో తెలుస్తోంది.
హిడ్మా మరోసారి
తెలంగాణతో సరిహద్దు పంచుకునే ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా జిల్లాలు దక్షిణ బస్తర్ పరిధిలోకి వస్తాయి. మావోయిస్టులు జనతన సర్కార్ విజయవంతంగా నడిపింది ఇక్కడే. ఈ ప్రాంతంలోనే మావోయిస్టుల సాయుధ శిక్షణ శిబిరం, ఆయుధ కర్మాగారాలు, నేలమాలిగలు వెలుగు చూశాయి. మోస్ట్ వాంటెండ్ మిలిటెంట్, పీఎల్‌జీఏ కంపెనీ–1 కమాండర్ హిడ్మా కార్యక్షేత్రం ప్రధానంగా ఈ రెండు జిల్లాలే.
హిడ్మా రక్షణలోనే సెంట్రల్ రీజనల్ కమిటీ, తెలంగాణ కమిటీ, దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీలున్నాయి. దీంతో హిడ్మాను టార్గెట్ చేసేందుకు ఏడాది కాలంగా భద్రతా దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. హిడ్మా ఆచూకీ కనుగొనేందుకు అన్ని అవకాశాలనూ వినియోగించుకుంటున్నాయి.
గురువారం జరిగిన ఆపరేషన్ సైతం హిడ్మానే లక్ష్యంగా చేసుకోగా పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ, పీఎల్‌జీఏ కంపెనీ–2లు పోలీసులకు టార్గెట్ అయ్యాయి. ఆధునిక పరిజ్ఞానం వాడినా మరోసారి హిడ్మా భద్రతా దళాల కన్నుగప్పినట్టయింది.
Comments
Please login to add a commentAdd a comment