
మళ్లీ తెరపైకి కర్రి గుట్టలు
గుట్టలపై షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులు, సానుభూతిపరులు
దిగువన మాటేసిన భద్రతా దళాలు
గుట్టల చుట్టూ బాంబులు అమర్చామంటున్న మావోయిస్టులు
తెలంగాణ– ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో టెన్షన్ టెన్షన్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రభుత్వం–మావోయిస్టుల మధ్య శాంతి చర్చలకు ప్రజాసంఘాలు, పౌరహక్కుల నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న తరుణంలో కర్రిగుట్టల్లో బాంబుల అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ మధ్య సహజ సరిహద్దుగా సుమారు వంద కిలోమీటర్ల పొడవునా కర్రిగుట్టలు విస్తరించి ఉన్నాయి. వీటిని సడేమలమ్మ గుట్టలు, సోములమ్మ గుట్టలని కూడా పిలుస్తారు. ఈ గుట్టలకు అవతలి వైపు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఉండగా, తెలంగాణ వైపు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కొంత భాగం ఉంది.
ఎప్పటినుంచో ఈ ప్రాంతం మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా ఉంది. ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత నిర్బంధం తీవ్రం కావడంతో గత వేసవి నుంచే మావోయిస్టులతోపాటు ప్రభుత్వ బలగాలంటే బెదిరిపోయే జన మిలీషియా సభ్యులు, సానుభూతిపరులు కూడా పెద్ద సంఖ్యలో కర్రిగుట్టలపైకి చేరుకున్నారు. వివిధ కోణాల్లో పోలీసువర్గాలకు అందిన పక్కా సమాచారం సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.
అయితే కర్రిగుట్టల మీదకు వెళ్లి మావోయిస్టులపై దాడులు చేయడమంటే జవాన్ల ప్రాణాలను రిస్క్‌లో పెట్టడమేననే అభిప్రాయం ప్రభుత్వ భద్రతాదళాల్లో వ్యక్తమవుతోంది. దీంతో సుదీర్ఘ కాలం గుట్టలపై మావోలు ఉండలేరని, కచ్చితంగా కిందకు రాక తప్పదనే అంచనాతో ఈ గుట్టల చుట్టూ మాటు వేసి ఉన్నారు. దీంతో తెలంగాణ– ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో టెన్షన్ నెలకొంది.
ఎన్‌కౌంటర్లు.. లొంగుబాట్లు
నెలల తరబడి పోలీసు నిర్బంధం పెరిగిపోవడంతో సానుభూతిపరులను కర్రి గుట్టలపై ఉంచుకోవడం మావోలకు భారంగా మారినట్టు తెలుస్తోంది. దీంతో నిత్యావసరాలు, మందులు, ఇతర అవసరాల కోసం జట్లు జట్లుగా సానుభూతిపరులను కర్రిగుట్టల నుంచి వారి స్వస్థలాలకు వెళ్లాలని కోరినట్టు తెలుస్తోంది.
అనారోగ్య సమస్యలు ఉన్న కామ్రేడ్లను వైద్యసాయం కోసం కర్రిగుట్టల నుంచి కిందకు పంపుతుండగా, ఇలా వస్తున్న సీనియర్ మావోలు ఎన్‌కౌంటర్లలో మృతి చెందుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పోలీసులకు పట్టుబడిన సానుభూతిపరులు అరెస్టవడమో లేక లొంగిపోవడమో జరుగుతోంది.
శాంతి చర్చలపై ఒత్తిడి పెంచేందుకేనా..?
రెండు వారాలు గడిచినా శాంతి చర్చలపై ప్రభుత్వం నుంచి బహిరంగ స్పందన రాలేదు. దీంతో ఈ ప్రతిపాదన విఫలమైతే బస్తర్ అడవుల్లో తీవ్రహింస తప్పదనే సంకేతాలు పంపేందుకే కర్రిగుట్టల్లో బాంబులు పెట్టిన అంశాన్ని మావోలు బహిర్గతం చేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీని ద్వారా మరోసారి శాంతిచర్చల అంశాన్ని ప్రజల మధ్యకు తీసుకురావడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం మావోల వ్యూహమనే వాదనలు వినిపిస్తున్నాయి.
శాంతి చర్చలకు మేం సిద్ధమే!
మావోయిస్టు పార్టీ నార్త్ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేశ్
చర్ల: శాంతి చర్చలకు తామెప్పుడూ సిద్ధమేనని.. ఇందుకోసం ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పించాలని మావోయిస్టు పార్టీ నార్త్ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం రూపేశ్ పేరిట విడుదలైన లేఖలోని వివరాలిలా ఉన్నాయి. శాంతి చర్చలకు సంబంధించి తమ కేంద్ర కమిటీ ప్రకటన విడుదల చేస్తూ చర్చలకు అనుకూల వాతావరణం కల్పించాలని కోరగా, ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్‌శర్మ తిరస్కరించారని తెలిపారు.
అనుకూల వాతావరణం లేకుండా చర్చలు సాధ్యం కాదనే విషయం ప్రభుత్వానికి తెలుసని, బస్తర్‌లో జరుగుతున్న మారణకాండను ఆపడం వల్ల శాంతిచర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని మరోసారి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ మారణకాండతో ప్రజలు భయానక వాతావరణంలో జీవిస్తున్నారని, అది వారి జీవనోపాధిపై ప్రభావం చూపిస్తూ యువత వలసబాట పడుతున్నారని పేర్కొన్నారు.
శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలనే తమ డిమాండ్‌కు ప్రజాస్వామ్య ప్రేమికులు, మేధావులు, మానవ హక్కుల సంఘాలు, సామాజిక సంస్థల కార్యకర్తలు, పాత్రికేయులు మద్దతు తెలపాలని రూపేశ్ కోరారు. ప్రభుత్వం – మావోయిస్టుల మధ్య శాంతిచర్చల కోసం ఏర్పాటైన కమిటీ సభ్యులు కూడా చొరవ తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.