
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జిల్లాలోని సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుల కుటుంబంతో కలిసి సహపంక్తి భోజనం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సన్నబియ్యం పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో పలు కుటుంబాలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంలోని నేతలు సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా సారపాకలో రేవంత్ రెడ్డి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. లబ్ధిదారుడి కుటుంబం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యరాలు తులసమ్మను ఆరా తీశారు సీఎం.
దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు అసలు తీసుకునేందుకు ఆసక్తి చూపేవాళ్లం కాదని సీఎం రేవంత్ కు చెప్పిన తులసమ్మ.. ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేసింది. 200 యూనిట్స్ ఉచిత కరెంట్, రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకాలు అందుతున్నాయని ఆరా తీశారు సీఎం రేవంత్. తమకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతో సంతోషకరంగా ఉందని తులసమ్మ చెప్పుకొచ్చారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగిలో రేషన్ కార్డు లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఈ మేరకు మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. గతంలో దొడ్డు బియ్యం పెట్టినప్పుడు దళారులు, రైస్ మిల్లర్లు మాత్రమే బాగుపడేవారని, ఇప్పుడు సన్నబియ్యంతో ఆ పరిస్థితి లేదన్నారు. ఎవరు ఎన్ని అపోహలు సృష్టించిన రానున్న రోజుల్లో ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.