
ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సన్నబియ్యం పథకం ప్రారంభోత్సవంలో లబ్ధిదారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎమ్మెల్యే పద్మావతి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు
ఈ పథకం దేశ చరిత్రలో నిలిచిపోతుంది
భవిష్యత్తులో ఏ సీఎం వచ్చినా దీన్ని రద్దు చేయలేరు
సన్న బియ్యం పథకం ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి
3.10 కోట్ల మందికి ప్రతిరోజూ పండుగ
దొడ్డు బియ్యం పేదల కడుపు నింపడం లేదనే సన్న బియ్యం పంపిణీ
కేసీఆర్ ఏనాడైనా ఈ ఆలోచన చేశారా?
ఫాంహౌస్‌లో పండించిన ధాన్యాన్ని క్వింటాల్ రూ.4,500కు అమ్ముకున్నరు
అంత ధర పెట్టి కొన్నారంటే అవి వడ్లా? బంగారమా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సన్న బియ్యం పథకం దేశ చరిత్రలోనే నిలిచిపోతుందని, ఆ చరిత్రకు హుజూర్‌నగర్ వేదికగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. భవిష్యత్తులో ఏ సీఎం వచ్చినా ఈ పథకాన్ని రద్దు చేయలేరని చెప్పారు. ఆనాడు ఇందిరాగాంధీ రోటీ, కప్‌డా, మకాన్ అనే నినాదంతో పేద వారికి కడుపు నిండా అన్నం, గుడ్డ, ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో 25 లక్షల ఎకరాలను పేదలకు పంచారని గుర్తుచేశారు.
దాంతో పేదల్లో చైతన్యం వచ్చి పెద్ద ఎత్తున పంటలు పండించారని, నేడు అదే స్ఫూర్తితో తెలంగాణలో పెద్ద ఎత్తున పంటలు పండిస్తున్నారని పేర్కొన్నారు. ఆనాడు పేదలు.. పండుగ నాడే కాకుండా ప్రతిరోజూ తెల్ల బువ్వ తినాలనే ఉద్దేశంతో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి రూ.1.90కు కిలో బియ్యం పథకం తెచ్చారని, అయితే ఎన్నికల కారణంగా అది అమలు కాలేదని చెప్పారు.
తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ రూ.2కు కిలో బియ్యం పథకాన్ని 1983లో ప్రారంభించారని..ఆనాడు మొదలు పెట్టిన దొడ్డు బియ్యం పంపిణీ పథకమే ఇప్పటివరకు కొనసాగిందని అన్నారు. అయితే దొడ్డు బియ్యం పేదల కడుపు నింపడం లేదని ఆలోచించి, పేదలంతా తినేలా తాము సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టామని వివరించారు.
ఇక నుంచి 3.10 కోట్ల మందికి సన్న బియ్యం ఇచ్చి ప్రతిరోజూ పండుగలా పేదవాడి కడుపు నింపాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తెచ్చామని చెప్పారు. ఉగాది సందర్భంగా ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహరంగ సభలో మాట్లాడారు.
నల్లగొండ గడ్డకు ఎంతో చరిత్ర
‘ఈ పథకాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన, పద్మావతిరెడ్డి ఆధ్వర్యంలో హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ప్రారంభించడం హర్షించదగిన విషయం. ఈ ప్రాంతం పోరాటాలకు మారు పేరు. ఎందరో మహనీయులు భూమి కోసం భుక్తి కోసం, విముక్తి కోసం ఇక్కడి నుంచే పోరాటాలు చేశారు. రావి నారాయణరెడ్డిని నెహ్రూ కంటే అత్యధిక మెజార్టీతో గెలిపించిన చరిత్ర కూడా నల్లగొండ గడ్డకే ఉంది. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో నల్లగొండ ఎంపీని గెలిపించింది కూడా నల్లగొండ బిడ్డలే. ఇలాంటి చోట ప్రారంభించిన ఈ సన్న బియ్యం పథకం దేశ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ పథకం ద్వారా 3.10 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
మిల్లర్లు, దళారుల చేతుల్లోకి దొడ్డు బియ్యం
‘ప్రభుత్వం 3 కోట్ల మందికి దొడ్డు బియ్యం ఇస్తుంటే, ఆ పథకం మిల్లర్ల మాఫియా, దళారుల చేతిలోకి వెళ్లిపోయి, రూ.10 వేల కోట్ల దోపిడీ జరుగుతోంది. పేదలు దొడ్డు బియ్యం తినలేక, రూ.10కు కిలో అమ్ముకుంటుంటే మిల్లర్లు కొనుగోలు చేసి, రీసైక్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికే కిలో రూ.30కి అమ్ముతున్నారు. పేదలకు దొడ్డు బియ్యం ఉపయోగ పడటం లేదనే సన్న బియ్యం ఇస్తున్నాం..’ అని రేవంత్ తెలిపారు.
రైతులను వరి వద్దన్న కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో పండించారు
‘రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన, 80 వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే కేసీఆర్.. ఏనాడైనా పేదలకు సన్న బియ్యం ఇవ్వాలన్న ఆలోచన చేశారా? మీరు వరి వేస్తే ఉరేసుకున్నట్లేనని, మేం వడ్లు కొనమని చెప్పిన ఆయన.. ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో వడ్లనే పండించారు. ఆ వడ్లను క్వింటాల్‌కు రూ.4,500 చొప్పున చెల్లించి కావేరీ సీడ్స్ అనే కంపెనీ కొనుగోలు చేసింది. రైతులు పండించిన ధాన్యాన్ని రూ.2 వేలకు కొనేవారు దిక్కులేక వాళ్లు ఉరేసుకుంటుంటే, ఆయన పండించిన ధాన్యాన్ని క్వింటాల్‌కు అంత ధర పెట్టి కొన్నారంటే అవి వడ్లా లేదా బంగారమా? చెప్పాలి..’ అని సీఎం అన్నారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పక్కనబెట్టారు
‘నల్లగొండ జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు నాగార్జునసాగర్ సహా అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ తెచ్చింది. జిల్లా కాంగ్రెస్ నేతలు పోరాటం చేసి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వంటి పథకాలు సాధించుకున్నారు. కానీ కేసీఆర్ వాటిని పక్కన పెట్టారు. 44 కిలోమీటర్ల సొరంగం అప్పట్లోనే 34 కిలోమీటర్లు పూర్తయింది. ఏటా ఒక్క కిలోమీటర్ తవ్వినా బీఆర్‌ఎస్ కాలంలోనే సొరంగం పూర్తయ్యేది. 3.5 లక్షల ఎకరాలకు నీరు పారేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి టన్నెల్ పనులు ప్రారంభించాం. రూ.లక్ష కోట్లతో కేసీఆర్ కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలిపోయింది. ఈ విషయంలో కేసీఆర్‌కు ఉరేసినా తప్పులేదు..’ అంటూ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్‌కు నాకు పోలికేంటి..?
‘2006లో జెడ్పీటీసీగా రాజకీయం మొదలుపెట్టిన నేను ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్సీ అయ్యా. 2018లో కేసీఆర్ నాపై కక్షగట్టి ఎమ్మెల్యేగా ఓడించినా ప్రజలు ఆశీర్వదించి ఎంపీగా గెలిపించారు. ఢిల్లీకి వెళితే సోనియాగాంధీ పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు. అదే నన్ను సీఎంను చేసింది. కేసీఆర్‌కు నాకు పోలికేంటి? మా ఇద్దరికి నందికి, పందికి ఉన్నంత తేడా ఉంది. నేను రుణమాఫీ చేశా. రైతుబంధును పెంచా.
కేసీఆర్ ఎగ్గొట్టిన రైతుబంధు రూ.7,625 కోట్లు..మా ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే రైతుల ఖాతాల్లో వేశాం. 15 నెలల కాలంలో రుణమాఫీ కింద రూ.21 వేల కోట్లు, రైతు భరోసా కింద రూ.12 వేల కోట్లు వేశాం. సన్న వడ్లకు రూ.1,200 కోట్లు బోనస్ ఇచ్చాం. రైతులకు పంగనామం పెట్టిన కేసీఆర్ నన్ను పోల్చుకోవడమేంటి? మేం రైతుల గుండెల్లో శాశ్వతంగా నిలిచేలా కార్యక్రమాలు చేశాం.
ఒకరోజు వెనుకా ముందూ అయినా ఇచ్చిన హామీలను అమలు చేస్తాం..’ అని సీఎం స్పష్టం చేశారు. సభలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, ఎంపీలు కుందూరు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.