fine rice
-
సన్నబియ్యానికి ‘నూకలు’ చెల్లినట్టే!
సాక్షి, హైదరాబాద్: సన్నబియ్యంలో నూకల పేరిట మిల్లర్లు భారీ స్కెచ్ వేశారు. 100 కిలోల సన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 58 కిలోల బియ్యం, 9 కిలోల నూకలు వస్తాయని కొత్తరాగం ఎత్తుకున్నారు. నిబంధనల ప్రకారం ఖరీఫ్‌లో 100 కిలోల ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 67 కిలోల బియ్యం లెక్కన ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. ఈసారి కొనుగోలు కేంద్రాలకు సన్న ధాన్యం (సన్నాలు) భారీ ఎత్తున వస్తాయని భావిస్తున్న మిల్లర్లు మిల్లింగ్‌లో చేతివాటం చూపేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు రబీలో వచ్చే ధాన్యాన్ని రా రైస్‌గా మిల్లింగ్ చేస్తే నూకల శాతం పెరుగుతుందని చెబుతూ వచ్చిన మిల్లర్లు.. ఈసారి సన్న ధాన్యానికి కూడా ఇదే వంక పెడుతున్నారు. గతంలో ఎన్నడూ ఖరీఫ్ ధాన్యం ఔటర్న్పై ఒక్కమాట కూడా మాట్లాడని మిల్లర్లు ఎకాఎకిన 9 కిలోల బియ్యానికి టెండర్ పెడుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సన్నబియ్యం ధర కిలోకు రూ. 50 చొప్పున లెక్క వేసుకున్నా... 9 కిలోలకు రూ. 450 అవుతుంది. క్వింటాల్ సన్న ధాన్యానికి రైతుకు ప్రభుత్వం రూ. 500 బోనస్‌గా ఇవ్వాలని భావిస్తుంటే... మిల్లింగ్ పేరు మీద క్వింటాల్ ధాన్యానికి రూ. 450 విలువైన బియ్యాన్ని ఎగవేసే పన్నాగంలో మిల్లర్లు ఉన్నట్లు అర్థమవుతోంది. 9 కిలోల బియ్యానికి బదులు నూకలు ఇస్తామనడం పట్ల పౌరసరఫరాల శాఖ అధికారులే విస్తుపోతున్నారు. బ్యాంక్ గ్యారంటీలపైనా తకరారు! ఖరీఫ్ సీజన్లో మిల్లర్లకు ధాన్యం కేటాయింపులో ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధంగానే బ్యాంకు గ్యారంటీలు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ రూపొందించిన మార్గదర్శకాలలో పొందుపరిచారు కూడా. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించాల్సి ఉండగా, ముసాయిదాతోనే నిలిపివేసి, మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. రైస్‌మిల్లు కెపాసిటీకి అనుగుణంగా కేటాయించిన ధాన్యం విలువలో 25 శాతం మేర బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. మిల్లును లీజుకు తీసుకుంటే.. కేటాయించిన ధాన్యం విలువలో 50 శాతం మేర లీజుదారుడు చెల్లించాలి. అయితే ఈ బ్యాంక్ గ్యారంటీ నిబంధనలను మిల్లర్లు వ్యతిరేకిస్తున్నారు. బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం అనేది తమకు తలకు మించిన భారమని, మిల్లింగ్ చార్జీలు కూడా ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని, ఏపీ వంటి రాష్ట్రాల్లో క్వింటాల్‌కు రూ.100 చెల్లిస్తుంటే మనరాష్ట్రంలో కేవలం రూ. 10 మాత్రమే ఇస్తున్నారని మిల్లర్లు చెబుతున్నారు. అది కూడా చాలా కాలంగా ఇవ్వడం లేదని వారి ఆరోపణ. ఈ నేపథ్యంలో బ్యాంకు గ్యారంటీలను ఎత్తివేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక సీజన్లో సీఎంఆర్ ఇవ్వకుండా డిఫాల్ట్ అయిన మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీ తీసుకొని ధాన్యం కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అంటే ఒక సీజన్లో సీఎంఆర్ డిఫాల్ట్ అయిన మిల్లర్లు తాము ఇవ్వాల్సిన బియ్యాన్ని అప్పగించడంతోపాటు అదనంగా 25 శాతం జరిమానా మొత్తానికి బ్యాంక్ గ్యారంటీ ఇస్తే వారికి ధాన్యం కేటాయిస్తారు. ఇలా ఒక సీజన్లో సీఎంఆర్ డిఫాల్ట్ అయిన మిల్లులు రాష్ట్రంలో 791 ఉన్నట్టు పౌరసరఫరాల సంస్థ తేల్చింది. రెండు, అంతకంటే ఎక్కువ సీజన్లలో డిఫాల్ట్ అయిన మిల్లులకు ఈసారి ధాన్యం కేటాయించమని మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో తేల్చిచెప్పారు. 386 మిల్లులను డిఫాల్ట్ మిల్లులుగా తేల్చడం గమనార్హం. మొత్తానికి బ్యాంకు గ్యారంటీల అంశం కూడా అటకెక్కినట్టేనని పౌరసరఫరాల శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
హైదరాబాద్: వాహనదారులకు షాక్.. దొరికారో 200 శాతం పెనాల్టీ తప్పదు!
సాక్షి,హైదరాబాద్: త్రైమాసిక పన్ను చెల్లించకుండా పట్టుబడే వాహనాలపై భారీ ఎత్తున పెనాల్టీలు విధించేందుకు రవాణాశాఖ చర్యలు చేపట్టింది. సాధారణంగా వాహనదారులు పెండింగ్‌ల ఉన్న పన్ను బకాయీలపైన స్వచ్చందంగా ముందుకు వస్తే 50 శాతం వరకు అపరాధ రుసుముతో చెల్లించేందుకు అవకాశం ఉంది. కానీ రవాణాశాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడితే మాత్రం ఏకంగా 200 శాతం వరకు పెనాలిటీల రూపంలో చెల్లించవలసి వస్తుంది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ఆర్టీఏ కొనసాగిస్తున్న ప్రత్యేక తనిఖీలు వాహనదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 2.17 లక్షల వాహనాలు త్రైమాసిక పన్ను చెల్లించకుండా తిరుగుతుండగా, ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 75 వేలకు పైగా పన్ను చెల్లించని వాహనాలు ఉన్నట్లు అంచనా. ఈ వాహనాల్లో కొన్ని 3 నెలల కాలపరిమితికే పన్ను చెల్లించాల్సి ఉండగా 80 శాతం వాహనాలు కోవిడ్ కాలం నుంచి పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. చాలా వరకు 9 నెలల నుంచి 18 నెలల వరకు త్రైమాసిక పన్ను చెల్లించకుండా తిరుగుతున్నాయి. దీంతో వాహనాల నుంచి బకాయిలను రాబట్టేందుకు రవాణాశాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఫిబ్రవరి నెలాఖరులోనే తనిఖీలకు శ్రీకారం చుట్టినప్పటికీ ఈ నెల ఒకటో తేదీ నుంచి తనిఖీలను ఉధృతం చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు పన్ను చెల్లింపులకు గడువు విధించడంతో తనిఖీలను తీవ్రతరం చేశారు. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 60 మంది మోటారు వాహన తనిఖీ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తేలికపాటి వాహనాలే అధికం.. గ్రేటర్లో సుమారు 5 లక్షల వరకు రవాణా వాహనాలు ఉన్నాయి. వీటిలో 2 లక్షల లారీలు ఉన్నాయి. సరుకు రవాణా రంగంలో కీలకమైన లారీల్లో చాలా వరకు ఎప్పటికప్పుడు పన్ను చెల్లించి రవాణాశాఖ నుంచి అనుమతి పొందాయి. అలాగే మరో 10 వేలకు పైగా స్కూల్ బస్సులు, ప్రైవేట్ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు,తదితర వాహనాలు సైతం సకాలంలో పన్ను చెల్లిస్తున్నట్లు అధికారులు చెప్పారు. చాలా వరకు తేలికపాటి రవాణా వాహనాల కేటగిరీ కిందకు వచ్చే టాటాఏస్‌లు, డీసీఎంలు, మినీ బస్సులు, మ్యాక్సీక్యాబ్‌లు వంటి వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. కోవిడ్ కాలంలో ఎలాంటి ఆదాయమార్గాలు లేకపోవడంతో వాహనదారులు త్రైమాసిక పన్ను చెల్లించలేకపోయారు. మరోవైపు రెండేళ్ల కాలపరిమితికి ప్రభుత్వం నుంచి మినహాయింపు లభించవచ్చుననే ఉద్దేశంతో చాలా మంది పన్ను చెల్లించకుండా ఉండిపోయారు. దీంతో ఇప్పుడు భారం పెరిగినట్లు వాహన యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు గతంలోనే రెండు త్రైమాసిక పన్ను వాయిదాలకు ప్రభుత్వం మినహాయింపునిచ్చినట్లు ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సకాలంలో చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో సుమారు రూ.13 కోట్ల వరకు బకాయీలను వసూలు చేశారు. ప్రతి రోజు సగటున రూ.60 లక్షలకు పైగా పన్నులు వసూలు చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో ఎంవీఐకి రూ.7 లక్షల వరకు టార్గెట్ విధించారు. తనిఖీలు ఉధృతం త్రైమాసిక పన్ను బకాయిలు పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయి. పూర్తిస్థాయిలో రాబట్టేందుకు కార్యాచరణ చేపట్టాం. పన్ను చెల్లించని వాహనాలపైన తనిఖీలను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించాం. వాహనదారులు స్వచ్చందంగా ఆన్లైన్లో లేదా ఈ సేవా కేంద్రాల ద్వారా పన్ను చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. తనిఖీ బృందాలు వాహనాలను జప్తు చేసి వెహికిల్ చెకింగ్ రిపోర్ట్ (వీసీఆర్) రాస్తే మాత్రం 200 శాతం పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. –జె.పాండురంగ నాయక్, జేటీసీ, హైదరాబాద్ -
ట్రంప్ రోజూ రూ. 7లక్షల జరిమానా కట్టాలటా! ఎందుకో తెలుసా?
Trumpobeys a subpoena and surrenders documents relating to his business: అమెరికా మాజీ అధ్యక్షుడు, వివాదాస్పద నాయకుడుగా తరచు వార్తలో నిలిచే డోనాల్డ్ ట్రంప్‌కి యూఎస్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ట్రంప్ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పత్రాలను న్యూయార్క్ అటార్నీ జనరల్ కార్యాలయానికి సమర్పించే వరకు ప్రతి రోజు సుమారు రూ. 7లక్షల వరకు జరిమాన కట్టాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎంగోరోన్ మాట్లాడుతూ...2019 విచారణలో ట్రంప్ తన ఆర్థిక ప్రయోజనాల కోసం తన ఆస్తుల విలువను తప్పుగా చూపించడమే కాకుండా అవసరమైన పత్రాలను సమర్పించడంలో విఫలమవ్వడంతోనే జరిమాన విధించినట్లు స్పష్టం చేశారు. అందువల్ల ట్రంప్ మంగళవారం నుంచే రోజువారి జరిమాన చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను దిక్కరించినట్లు తెలిపారు. గోల్ఫ్ క్లబ్‌లు, పెంట్‌హౌస్ అపార్ట్‌మెంట్‌తో సహా ఆస్తుల విలువలను దర్యాప్తులో తప్పుగా పేర్కొన్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఆస్తులుపై మంచి రుణాలు పొందడం కోసం వాటి విలువను అధికంగా చూపించారని, మరికొన్ని సందర్భాల్లో పన్ను ప్రయోజనాలను పొందడం కోసం వాటి విలువనే తక్కువగా కూడా చూపించారని పేర్కొన్నారు. వాస్తవానికి ట్రంప్ గతంలోనే కోర్టు ఆదేశాల మేరకు ఆ ఆస్తులకు సంబంధించిన పత్రాలు సమర్పించడంలో విఫలమయ్యారు. కానీ ఆయన తరుపున న్యాయవాదులు అభ్యర్థన మేరకు కోర్టు మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. అయితే ట్రంప్ తరుపు న్యాయవాది అలీనా హబ్బా విచారణ అనంతరం ఈ విషయమై అప్పీలు చేస్తానని చెప్పాడం గమనార్హం. (చదవండి: పుతిన్‌కు నా తడాఖా చూపించేవాడిని.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!) -
‘సన్న’గిల్లిన ఆశలు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం అందించే బోనస్‌పై రైతులు పెట్టుకున్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లు ఆరంభమై ఇరవై రోజులైనా ఇంతవరకు ఎలాంటి ప్రకటనా వెలువడకపోవడంతో రైతులు ఆశలు వదులుకుంటున్నారు. బోనస్ లేక ప్రోత్సాహకాలకు కేంద్రం విధించిన నిబంధనలు అడ్డుగా మారడం, అదనంగా ఒక్క రూపాయి చెల్లించినా ధాన్యం కొనుగోళ్లను నిలిపివేస్తామన్న హెచ్చరికలతో ప్రభుత్వం దీనిపై ముందుకెళ్లే ధైర్యం చేయట్లేదు. భారీగా వస్తున్న ధాన్యాన్ని తీసుకోవడంలో కేంద్ర ఆహారసంస్థ చేతులెత్తేస్తే, రాష్ట్రంపై పెనుభారం పడే అవకాశాలుండటంతో దీనిపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలు తక్కువేనని ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. పుంజుకోని కొనుగోళ్లు రాష్ట్రంలో వానాకాలానికి సంబంధించి 85.69 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరించాలని లక్ష్యం. 6,491 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ఇప్పటివరకు 3,600 కేంద్రాలు ప్రారంభించారు. వీటి ద్వారా 1.52 లక్షల మంది రైతుల నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరించారు. రోజూ 70 వేల నుంచి 80 వేల మెట్రిక్ టన్నులకు మించి సేకరణ జరగట్లేదు. ఇప్పటికే చాలా జిల్లాలో వరికోతలు పుంజుకున్నా సన్నాలకు ధరల విషయంలో నెలకొన్న సందిగ్ధంతో రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తేవట్లేదు. దీంతో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు మాత్రమే కేంద్రాలకు వచ్చాయి. ప్రస్తుతం చాలా రకాల సన్నాలకు క్వింటాలుకు రూ.1,888 చెల్లిస్తున్నారు. భువనగిరి, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో 17 శాతానికి మించి తేమ ఉందని, తాలు ఎక్కువగా ఉందంటూ మిల్లర్లు రూ.1,700కే కొంటున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో రూ.1,868 ధర చెబుతున్నా తేమ 17 శాతం కన్నా ఎక్కువగా ఉన్నా, ధాన్యం రంగుమారినా, తాలు, చెత్త ఎక్కువగా ఉన్నా క్వింటాల్‌కు 3–4 కిలోల చొప్పున తీసేస్తున్నారు. ఈ లెక్కన ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా 60 కిలోల మేర తరుగుపోతోంది. గతంలో ఎకరాకు 22–25 క్వింటాళ్ల మేర దిగుబడి రాగా, ఈ ఏడాది దోమకాటుతో 15 క్వింటాళ్లకు మించి దిగుబడి లేదు. దీంతో సన్నాలకు రూ.2,500 చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే రంగు మారిన సన్నరకం ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించడం మాత్రం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. ‘బోనస్’ ఆశ నిరాశేనా? ఇటీవల రైతు వేదికల ప్రారంభం సందర్భంగా సన్నాలకు రూ.100 లేక రూ.150 బోనస్ ఇచ్చే అంశంపై ఆలోచిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అయితే ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. సన్నాలు 40 లక్షల మెట్రిక్ టన్నుల మేర సేకరించాలని లక్ష్యం. క్వింటాలుకు రూ.100 బోనస్ ప్రకటించినా ప్రభుత్వంపై రూ.4 వేల కోట్ల భారం పడుతుందని అంచనా. అయితే, కేంద్రం నిబంధనల వల్ల బోనస్ ప్రకటన సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇక, దీపావళికి ముందు రోజు జరిగిన భేటీలోనూ సన్నాలకు బోనస్‌పై చర్చ జరిగినట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. రాష్ట్రం సేకరించే వరి ధాన్యానికి తాము నిర్ణయించిన ధరకు అదనంగా బోనస్ లేదా ప్రోత్సాహకాలు ఇవ్వదలిస్తే ఆ భారాన్ని రాష్ట్రమే మోయాల్సి ఉంటుందని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ స్పష్టంచేసింది. ధాన్యానికి మద్దతు ధరకంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బోనస్ లేదా ప్రోత్సాహకాలను చెల్లిస్తే రాష్ట్రం మొత్తంగా సేకరించాల్సిన ధాన్యంలో సెంట్రల్‌పూల్ కింద సేకరించాల్సిన ధాన్యాన్ని మాత్రమే మద్దతు ధరకు తాము సేకరిస్తామని, మిగతా ధాన్యాన్ని సేకరించబోమని తేల్చిచెప్పింది. ఈ షరతులే రాష్ట్రానికి గుదిబండగా మారాయని నాటి భేటీలో కేబినెట్ అభిప్రాయపడినట్టు తెలిసింది. సెంట్రల్‌పూల్ కింద సేకరించే ధాన్యానికి మాత్రమే ఆర్బీఐ రుణం పరిమితం కావాలని ఒప్పందపత్రంలో కేంద్రం షరతు విధించింది. దీని ప్రకారం రాష్ట్రం సేకరించే అదనపు ధాన్యానికి రుణాలు తీసుకొనే వెసులుబాటు ఉండదని పౌర సరఫరాలశాఖ వర్గాలు తెలిపాయి. ‘ప్రస్తుతం సెంట్రల్‌పూల్ కింద నిర్ణయించిన మేరకు ధాన్యాన్ని ఎఫ్‌సీఐ కొనుగోలు చేస్తోంది. మిగతా ధాన్యాన్ని రాష్ట్రం కొని బియ్యంగా మార్చి ఇస్తే దాన్ని ఎఫ్‌సీఐ వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తూ దానికి సంబంధించిన డబ్బును రాష్ట్రానికి ఇస్తోంది. అయితే ప్రస్తుతం మద్దతు ధరకన్నా ఒక్క రూపాయి అదనంగా ఇచ్చినా కేవలం తాము సెంట్రల్‌పూల్ కింద కొనాల్సిన దాన్నే కొంటామని, మిగతా ధాన్యంతో తమకు సంబంధం ఉండదని కేంద్రం చెబుతోంది. ఇక్కడే సన్నాలకు బోనస్ ఇద్దామన్నా, ప్రోత్సాహకం ఇద్దామన్నా సమస్య ఎదురవుతోంది’అని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
‘అందుకే ప్యాక్ చేసిన సన్నబియ్యం’
సాక్షి, అమరావతి : గత టీడీపీ ప్రభుత్వం సేకరించిన బియ్యంలో నాణ్యత లేదని, 40శాతం బియ్యం తినడానికే వీలులేకుండా చేశారని పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని ఆరోపించారు. తమ ప్రభుత్వం సెప్టెంబర్ 1నుంచి ప్రతి పేదవాడికి నాణ్యమైన సన్నబియ్యం అందిస్తుందని చెప్పారు. సన్నబియ్యం పథకాన్ని తొలివిడతగా శ్రీకాకుళం నుంచి ప్రారంభిస్తామని వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి రాష్ట్రం మొత్తం సన్నబియ్యం పంపణీ చేస్తామన్నారు. అవినీతికి, రిసైక్లింగ్‌కి తావు లేకుండా చేసేందుకే ప్యాక్ చేసిన బియ్యం ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. ప్యాకింగ్‌కు రూ.250 కోట్లు ఖర్చు పెడుతుందని టీడీపీ ఆరోపిస్తుంది.. రూ.12వేల కోట్ల బియ్యం పంపిణీ చేసినప్పుడు రూ.250 కోట్లు ఖర్చు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. బియ్యం పంపిణీలో అవినీతి లేకుండా పేదలకు సరఫరా చేస్తామన్నారు. అక్టోబర్ 2నుంచి కొత్త రేషన్‌కార్టుల జారీ ప్రక్రియ చేపడతామని తెలిపారు. గతంలో టీడీపీ 15 లక్షల రేషన్ కార్డులను అనర్హులకు ఇచ్చిందని, వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామ సచివాలయాల ద్వారా కొత్త కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. -
హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం
చెన్నూర్ : వసతిగృహా విద్యార్థులకు మంచిరోజులు రానున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు దొడ్డు బియ్యానికి బదులు ఫైన్‌రైస్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులు ప్రాతిపాదనలు తయారు చేస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 245 బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలు ఉన్నాయి. ఇందులో 41,381 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 50, ఎస్సీ 72, ఎస్టీ 123 చొప్పున బాలుర, బాలికల వసతి గృహాలు ఉన్నాయి. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండి విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు వచ్చే ఏడాది 2015 నుంచి సన్న రకం బియ్యంతో భోజనం పెట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. ఈ మేరకు జిల్లాలోని వసతి గృహాలకు ఎన్ని క్వింటాళ్ల బియ్యం అవసరమో ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. మండలాల్లో ఉన్న వసతి గృహాలకు ఎన్ని క్వింటాళ్ల బియ్యం అవసరమో నివేదిక సమర్పించాలని తహశీల్దార్లకు మంచిర్యాల ఆర్డీవో ఆదేశాలు జారీ చేశారు. హాస్టళ్ల వారీగా ఎంతకోటా బియ్యం అవసరమో నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు అప్పగించారు. తిండికి తిప్పలు ఉండదు ప్రభుత్వం ప్రస్తుతం వసతి గృహాలకు రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఈ బియ్యంతో విద్యార్థులు తిండికి తిప్పలు పడుతున్నారు. ఉడికి ఉడకని అన్నం తినలేక నానా అవస్థలు ఎదుర్కొన్నారు. గ్రామీణ విద్యార్థులు కొందరు ఈ భోజనం చేయలేక చదువులను మానేసిన ఘటనలు సైతం ఉన్నాయని పలువురు సంక్షేమాధికారులు చెప్పడం విశేషం. ప్రభుత్వం వసతి గృహాలకు ఫైన్ రైస్‌ను సరఫరా చేస్తే వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు సన్న రకం బియ్యంతో భోజనం చేయనున్నారు.