
సన్న బియ్యం, రాజీవ్ యువ వికాసం పథకాలకు విస్తృత ప్రచారం
టీపీసీసీ యోచన..త్వరలో కార్యాచరణ
ప్రజలకు మేలు చేసే పథకాలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయిందనే భావన
కంచ గచ్చిబౌలి భూముల వివాదమే కారణమంటున్న నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ, రాజీవ్ యువ వికాసం పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. పేదలకు మేలు చేసే ఈ రెండు పథకాలు కంచ గచ్చిబౌలి భూముల వివాదంతో చర్చలో లేకుండా పోయాయని అభిప్రాయపడుతోంది. ఆ రెండు పథకాలపై ఫోకస్ పెంచి ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టాలని యోచిస్తోంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత 15 నెలల్లో అమలు చేసిన అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రచారం కల్పించేందుకు వీలుగా ఓ కరపత్రాన్ని టీపీసీసీ సిద్ధం చేసింది. ఈ కరపత్రాలను క్షేత్రస్థాయిలో పంపిణీ చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు పార్టీ శ్రేణులు వివరించనున్నాయి. ముఖ్యంగా సన్న బియ్యం, రాజీవ్ యువ వికాసం కార్యక్రమాల గురించి ప్రజలకు ప్రత్యేకంగా వివరించే విధంగా పార్టీ కార్యాచరణ రూపొందుతోందని, దీనిని ఒకట్రెండు రోజుల్లో టీపీసీసీ విడుదల చేయనుందని సమాచారం.
భూముల వివాదంతో మరుగున..
పదేళ్ల పాటు అధికారంలో ఉన్నా బీఆర్‌ఎస్ చేయలేని పేదలకు ఉపయోగపడే రెండు కార్యక్రమాలను కాంగ్రె స్ ప్రభుత్వం చేపట్టినప్పటికీ, కంచ గచ్చిబౌలి భూము ల వ్యవహారంతో అవి మరుగున పడ్డాయనే అభిప్రా యం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని 80 శాతం ప్రజలకు అమలయ్యే విధంగా రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించినా పెద్దగా ప్రచారం లేకుండా పోయిందనే చర్చజరుగుతోంది.
రాజీవ్ యువ వికాసం పరిస్థితి కూడా ఇ దే విధంగా ఉందని అంటున్నారు. పదేళ్లపాటు నిరు ద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలు అమలు కాలేదని, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు కూడా నిర్వీర్యమయ్యాయనే ఉద్దేశంతో మళ్లీ గ్రామాల్లోని యువతకు ఉపాధి కల్పించేలా దీనికి రూపకల్పన చేసినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు.
లబ్దిదారులతో భోజనాలు.. నిరుద్యోగులకు సాయం
టీపీసీసీ కీలక నేత ఒకరు మాట్లాడుతూ ‘కంచ గచ్చిబౌలిభూముల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వాన్ని ఓ వైపు బద్నాం చేస్తూనే మరోవైపు పార్టీకి ప్రయోజనం చేకూర్చే పథకాలు మరుగున పడేలా చేస్తోంది. రాజకీయ రాద్ధాంతం కింద పేదల సంక్షేమం నలిగిపోతోంది..’అని వ్యాఖ్యానించడం కాంగ్రెస్ నేతల్లో ఉన్న అభిప్రాయానికి అద్దం పడుతోంది.
ఈ నేపథ్యంలో సన్న బియ్యంతో కూడిన భోజనాన్ని లబ్ధిదారులతో కలిసి చేసేలా పార్టీలోని అన్ని స్థాయిల నేతలకు దిశానిర్దేశం చేయాలని, మరోవైపు రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు క్షేత్రస్థాయి కేడర్ సహకరించేలా పిలుపునివ్వాలని టీపీసీసీ యోచిస్తుండడం గమనార్హం.