
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ పగలు కంటున్నారని కామెంట్స్ చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో రాబోయే రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్‌ఎస్ ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బంగారం లాంటి భూములను దోచుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అంటూ విమర్శలు చేశారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ఐఎంజీ భారత్‌కు భూములను అప్పనంగా కట్టబెట్టారు. అప్పుడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ భూమి కేటాయింపులను రద్దుచేసి ప్రభుత్వ భూములను కాపాడారు. రాష్ట్రంలో బంగారం లాంటి భూములను దోచుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపైన విచారణ జరగాలి. లక్షల కోట్ల అప్పుల్లో ముంచి తెలంగాణను నాశనం చేసిన వ్యక్తి కేటీఆర్. మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ పగటి కలలు కంటున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీనే ఉండదు అంటూ వ్యాఖ్యలు చేశారు.
అలాగే, మంత్రి వర్గ విస్తరణ ఏఐసీసీ పరిధిలో ఉంది. ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించాలని కోరాం. మొత్తం మంత్రి వర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. మంత్రి వర్గ విస్తరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రాంతాలు, కులాల వారీగా చూడాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది. మంత్రి వర్గ విస్తరణలో మైనార్టీకి అవకాశం ఉంటుందన్నారు.
మరోవైపు.. ఢిల్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..‘ఈడబ్ల్యూఎస్ కింద ముస్లింలకి బీజేపీ రిజర్వేషన్లను ఇస్తోంది. ఏపీ నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఆ రిజర్వేషన్లను తొలగించే దమ్ము బీజేపీకి ఉందా?. 70 ముస్లిం తెగలకు రిజర్వేషన్లు ఇచ్చామని గతంలోనే నరేంద్ర మోదీ చెప్పారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను బీజేపీ ఎందుకు అడ్డుకుంటుంది అని ప్రశ్నించారు.