
దేశంలోనే తొలిసారిగా రేషన్ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ
నేడు హుజూర్‌నగర్‌లో పథకం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదలందరికీ సన్న బియ్యం ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఉగాది రోజున ప్రారంభం కానుంది. ఆహార భద్రతా కార్డులు కలిగిన వారికి ఇప్పటివరకు ఇస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
దొడ్డు బియ్యం దురి్వనియోగంతో..
వేల కోట్ల రూపాయల సబ్సిడీ భరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ఇప్పటివరకు పంపిణీ చేస్తున్న బియ్యంలో 85 శాతానికి పైగా దుర్వినియోగం అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దొడ్డు బియ్యాన్ని తినేందుకు ఇష్టపడని పేద, మధ్య తరగతి వర్గాలు పెద్ద సంఖ్యలో రేషన్ దుకాణాల నుంచి తీసుకున్న బియ్యాన్ని ఆ సమీపంలోనే దళారులకు కిలో రూ.10 నుంచి 13 రూపాయలకు విక్రయించడం, లేదంటే డీలర్ల నుంచి అసలు బియ్యం తీసుకోకుండా అతను ఇచ్చిన మొత్తం తీసుకుని వెళ్లడం జరిగేది.
ఈ నేపథ్యంలోనే దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దీనిపై రేషన్‌కార్డులు, సన్న బియ్యం పంపిణీపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. ప్రజలు తినని దొడ్డు బియ్యాన్ని రూ.10,665 కోట్లు వెచ్చించి పంపిణీ చేయడం కంటే అదనంగా మరో రూ.2,800 కోట్లు వెచ్చించి సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల ఉచిత బియ్యం పథకం సద్వినియోగం అవుతుందని తేల్చింది. ఈ మేరకు సన్న బియ్యం పంపిణీకి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సన్న బియ్యం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి, ఏప్రిల్ నెల కోటాను ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు.
నెలకు 2 ఎల్‌ఎంటీలు అవసరం
నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరం కానున్నాయి. ఈ నేపథ్యంలో గత వానాకాలం సీజన్‌లో 4.41 లక్షల మంది రైతుల నుంచి సేకరించిన 24 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీల) సన్న ధాన్యాన్ని గత డిసెంబర్ నుంచే మిల్లింగ్ చేయించడం ప్రారంభించడం ద్వారా ఆరు నెలలకు సరిపడా సన్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆదీనంలోని గోడౌన్‌లలో నిల్వ చేసిన బియ్యాన్ని ఏప్రిల్ 1 నుంచి పంపిణీ చేసేందుకు వీలుగా మండల స్థాయి స్టాక్ (ఎంఎల్‌ఎస్) పాయింట్లకు పంపించింది.
రాష్ట్రంలో 2.85 కోట్ల లబ్ధిదారులకు పంపిణీ చేసే సన్న బియ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు రూ.10,665 కోట్లు సబ్సిడీ రూపంలో భరిస్తున్నాయి. సన్న బియ్యం పంపిణీ కారణంగా ఇకపై రూ.13,522 కోట్లు భరించాల్సి వస్తుంది. ఇందులో కేంద్రం రూ.5,489 కోట్లు భరిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.2,800 కోట్ల భారం పడడంతో భరించాల్సిన రాయితీ రూ.8,033 కోట్లకు పెరిగింది.
త్వరలోనే మరో 30 లక్షల మంది పీడీఎస్ నెట్‌వర్క్‌లోకి..
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డులకు తోడు కొత్త కార్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 30 లక్షల మందిని అర్హులుగా ప్రాథమిక పరిశీలనలో తేల్చారు. ఇందులో 18 లక్షల దరఖాస్తులు ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్లు చేర్చడం (అడిషన్స్) గురించి కాగా.. వీరందరినీ అర్హులుగా గుర్తించి ఇప్పటికే ఆన్‌లైన్‌లో చేర్పుల జాబితాలో పొందుపరిచినట్లు తెలిసింది. జాబితాలో పేర్లు ఉన్నవారికి కూడా సన్న బియ్యం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.
మరో 12 లక్షల మందిని (సుమారు 4 లక్షల కుటుంబాలు) కూడా రేషన్‌కార్డులకు అర్హులుగా జాబితాల్లో చేర్చాలని పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. వీరందరికీ కొత్తగా 4 నుంచి 5 లక్షల కార్డుల వరకు అవసరమని అంచనా వేశారు. కొత్త లబ్ధిదారుల చేరికతో సన్నబియ్యం వినియోగించుకునే వారి సంఖ్య 3.10 కోట్లకు పెరగనుంది. అలాగే కార్డుల సంఖ్య 94 లక్షలకు చేరే అవకాశం ఉంది.
84 % మందికి నెలకు 6 కిలోల చొప్పున
⇒ రాష్ట్రంలో ప్రస్తుతం 89.73 లక్షల ఆహార భద్రతా కార్డులు ఉండగా, వాటిలో 2.85 కోట్ల లబ్ధిదారులు నమోదై ఉన్నారు. ఇకనుంచి వీరందరికీ నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకం కింద సుమారు 35 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు.
వీరందరికీ గత మూడేళ్లుగా సన్న బియ్యంతోనే భోజనాన్ని వడ్డిస్తున్నారు. వీరు కాకుండా ఐసీడీఎస్ ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని 84 శాతం మందికి సన్న బియ్యం పంపిణీ అవుతాయని, దొడ్డు బియ్యం వినియోగం దాదాపు జీరో అవుతుందని చెబుతున్నారు.