Civil Supplies Department
-
రాశులకొద్దీ ధాన్యం.. కొనేవారేరీ?
సాక్షి, హైదరాబాద్: పలు జిల్లాల్లో ఈసారి పంట దిగుబడి పెరగడంతో ధాన్యం రాశులతో పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. అయితే ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వెళ్లిన రైతులకు మాత్రం నిరాశే ఎదురవుతోంది. మంత్రి ఉత్తమ్ ప్రతిరోజూ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నా, క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. కొనుగోలు కేంద్రాలు తెరిచినా, కాంటా వేయడం లేదు. దీంతో రైతులకు పడిగాపులు తప్పడం లేదు. నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో పండిన మేలురకం సన్న ధాన్యాన్ని ఇప్పటికే బహిరంగ మార్కెట్లో రైతులు విక్రయించారు. క్వింటాల్‌కు రూ.500 బోనస్ వచ్చే సన్న ధాన్యాన్ని, ఎక్కువగా సాగయ్యే దొడ్డు ధాన్యాన్ని విక్రయించేందుకు వీలుగా రాష్ట్రంలో 7,572 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఇప్పటి వరకు 4,600 కేంద్రాలను తెరిచినా, అందులో సగం కేంద్రాల్లో కూడా ధాన్యం కొనుగోళ్లు సాగడం లేదు. బ్యాంకు గ్యారంటీలు ఇచ్చిన మిల్లర్లకే కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ధాన్యం కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో నాలుగు రోజుల క్రితం వరకు మిల్లర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు నయానో, భయానో మిల్లర్లను ఒప్పించి 15 రోజుల్లో బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని రాతపూర్వకంగా ‘అండర్‌టేకింగ్’తీసుకుంటూ మిల్లులకు ధాన్యం కేటాయిస్తున్నారు. దీంతో చాలా జిల్లాల్లో సోమవారం నుంచి కొనుగోళ్ల ప్రక్రియ కొంత మెరుగైంది. అయినా, అనేక జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు కుప్పలుకుప్పలుగా దర్శనమిస్తున్నాయి. బ్యాంక్ గ్యారంటీలిస్తేనే... ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ , నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్న ఈ డిఫాల్ట్ రైస్‌మిల్లర్ల నుంచి అండర్ టేకింగ్ తీసుకుంటూ బ్యాంక్ గార్యంటీలు, సెక్యూరిటీ డిపాజిట్లు ఇస్తామని కాగితాలు రాయించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క మిల్లర్ అవి ఇవ్వలేదని తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా: ఈ జిల్లాలో 615 ధాన్యం కొనుగోలు కేంద్రాలుండగా, 404 సన్నరకాలకు 211 దొడ్డు రకాల కొనుగోళ్లకు కేటాయించారు. వీటిల్లో కేవలం 121 కేంద్రాల్లో సన్న రకం, 86 కేంద్రాల్లో దొడ్డు రకం కొనుగోళ్లు సాగుతున్నాయి. మంగళవారం నాటికి 18,320 టన్నుల సన్నరకం, 11,334 టన్నుల దొడ్డురకం ధాన్యం సేకరించారు. బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని 190 మంది రైస్‌మిల్లర్లు అండర్ టేకింగ్ ఇచ్చారు. – కామారెడ్డి జిల్లాలో 423 కేంద్రాలకుగాను 150 కేంద్రాల్లో కొనుగోలు మొదలయ్యాయి. ఇందులో సన్నారకాలకు 63 కేంద్రాలే తెరిచారు. కేవలం 4,250 క్వింటాళ్ల సన్నరకం ధాన్యం కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా : ఉమ్మడి వరంగల్‌లో ఆయా జిల్లాల వారీగా చూస్తే..వరంగల్‌లో 203 కేంద్రాలకుగాను 24 కేంద్రాలే తెరుచుకోగా, అక్కడ కొనుగోళ్లు జరుగుతున్నాయి. హనుమకొండలో మొత్తంగా 149 కేంద్రాలు, జనగామలో మొత్తంగా 180, ములుగులో మొత్తంగా 178 కేంద్రాలు తెరుచుకున్నాయి. మహబూబాబాద్‌లో 234 కేంద్రాలకుగాను 59, భూపాలపల్లిలో 189గాను 79 కేంద్రాలే మొదలయ్యాయి. – జనగామ జిల్లాలో 33,336 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి 30 రా రైస్, బాయిల్డ్ రైస్‌మిల్లులకు సరఫరా చేశారు. మరో 19 రైస్‌మిల్లులకు ధాన్యం తరలించేందుకు 10 శాతం గ్యారంటీపై చర్చలు జరుగుతున్నాయి. – జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఇంకా ధాన్యం కొనుగోళ్లు మొదలు కాలేదు. హనుమకొండ జిల్లాలో ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు మొదలయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లాలో బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్న 145 మిల్లులకు సోమవారం ధాన్యం కేటాయింపులు షురూ చేశారు. 345 కేంద్రాలను ప్రారంభించినట్టు అధికారులు చెబుతున్నా, సగం కేంద్రాల్లో కూడా కొనుగోళ్లు సక్రమంగా సాగడం లేదు. మంగళవారం వరకు జిల్లాలో కేవలం 15 వేల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు జరిగాయి. అయితే ఇంతవరకు సన్నాల కొనుగోళ్లు మొదలే కాలేదు. – సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు కొనుగోళ్లను ప్రారంభించలేదు. కేవలం కేంద్రాలను మాత్రమే ప్రారంభించి కాంటాలను మరిచారు. గ్యారంటీ ఇచ్చిన 15 మిల్లులకు ధాన్యం కేటాయించారు. – యాదాద్రి జిల్లాలో అఫిడవిట్లు ఇచ్చిన 50 మిల్లులకు ధాన్యం అలాట్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా : మెదక్ జిల్లాలో 490 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, సన్నధాన్యం కొనుగోలుకు కేవలం 91 కేంద్రాలే కేటాయించారు. ఈ జిల్లాలోని 104 మిల్లుల్లో 60 మిల్లులు డిఫాల్ట్ జాబితాలో ఉండగా, 54 మిల్లులకే ధాన్యం కేటాయించాలని నిర్ణయించారు. వీరిలోనూ 30 మంది మిల్లర్లు మాత్రమే అండర్ టేకింగ్ ఇచ్చారు. దీంతో మంగళవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించారు. – సిద్దిపేట జిల్లాలో 417 కొనుగోలు కేంద్రాలకుగాను ఇప్పటి వరకు 348 కేంద్రాలను ప్రారంభించారు. బ్యాంక్ గ్యారంటీ ఇస్తామని అండర్ టేకింగ్ ఇచ్చిన 25 మిల్లులకు ధాన్యం కేటాయించారు. – సంగారెడ్డి జిల్లాలో 183 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, ఇప్పుటి వరకు కనీసం 50 సెంటర్లలో కూడా సేకరణ షురూ కాలేదు. – ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఇంకా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. కోతలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. కాంటా ఎప్పుడేస్తరో తెల్వదు నా పేరు చందు మల్లయ్య, నాది వరంగల్ జిల్లా రాయపర్తి. 8 ఎకరాల్లో వరి సాగుచేశా. అందులో పండిన వడ్లను రాగన్నగూడెం కొనుగోలు కేంద్రంలో పోశా. ఇప్పటివరకు కొనుగోళ్లు మొదలుకాలేదు. 15 రోజుల నుంచి కాంటా కోసం రైతులం ఎదురుచూస్తున్నం. పరదాలు అద్దెకు తెచ్చి వడ్లు పోశాం. కేంద్రం ఎప్పుడు తెరుస్తారో, కాంటా ఎప్పుడేస్తరో తెల్వదు. సాయంత్రం అయితే వర్షం ఎప్పుడు పడుతుందోనని భయంతో ఆకాశం వైపు చూస్తున్నాం. – చందు మల్లయ్యతేమ పేరుతో కొనడం లేదు నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చి పది రోజులువుతోంది. అధికారులు తేమ పేరుతో వడ్లు కొనడం లేదు. పది రోజులుగా కేంద్రం వద్దే పడిగాపులు కాస్తున్నాం. వానొస్తే వడ్లు తడిసి ఇంకా నష్టపోయే ప్రమాదముంది. – మూఢావత్ శంకర్, డిండి మిల్లుల కేటాయింపు జరగాలి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెంటనే రైస్ మిల్లులు కేటాయించాలి. కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులు పెరిగిపోతున్నాయి. కాంటాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. – లలిత, కొనుగోలు కేంద్రం నిర్వాహకురాలు, సింగారెడ్డి పాలెం,(సూర్యాపేట జిల్లా) -
సన్నబియ్యానికి ‘నూకలు’ చెల్లినట్టే!
సాక్షి, హైదరాబాద్: సన్నబియ్యంలో నూకల పేరిట మిల్లర్లు భారీ స్కెచ్ వేశారు. 100 కిలోల సన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 58 కిలోల బియ్యం, 9 కిలోల నూకలు వస్తాయని కొత్తరాగం ఎత్తుకున్నారు. నిబంధనల ప్రకారం ఖరీఫ్‌లో 100 కిలోల ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 67 కిలోల బియ్యం లెక్కన ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. ఈసారి కొనుగోలు కేంద్రాలకు సన్న ధాన్యం (సన్నాలు) భారీ ఎత్తున వస్తాయని భావిస్తున్న మిల్లర్లు మిల్లింగ్‌లో చేతివాటం చూపేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు రబీలో వచ్చే ధాన్యాన్ని రా రైస్‌గా మిల్లింగ్ చేస్తే నూకల శాతం పెరుగుతుందని చెబుతూ వచ్చిన మిల్లర్లు.. ఈసారి సన్న ధాన్యానికి కూడా ఇదే వంక పెడుతున్నారు. గతంలో ఎన్నడూ ఖరీఫ్ ధాన్యం ఔటర్న్పై ఒక్కమాట కూడా మాట్లాడని మిల్లర్లు ఎకాఎకిన 9 కిలోల బియ్యానికి టెండర్ పెడుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సన్నబియ్యం ధర కిలోకు రూ. 50 చొప్పున లెక్క వేసుకున్నా... 9 కిలోలకు రూ. 450 అవుతుంది. క్వింటాల్ సన్న ధాన్యానికి రైతుకు ప్రభుత్వం రూ. 500 బోనస్‌గా ఇవ్వాలని భావిస్తుంటే... మిల్లింగ్ పేరు మీద క్వింటాల్ ధాన్యానికి రూ. 450 విలువైన బియ్యాన్ని ఎగవేసే పన్నాగంలో మిల్లర్లు ఉన్నట్లు అర్థమవుతోంది. 9 కిలోల బియ్యానికి బదులు నూకలు ఇస్తామనడం పట్ల పౌరసరఫరాల శాఖ అధికారులే విస్తుపోతున్నారు. బ్యాంక్ గ్యారంటీలపైనా తకరారు! ఖరీఫ్ సీజన్లో మిల్లర్లకు ధాన్యం కేటాయింపులో ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధంగానే బ్యాంకు గ్యారంటీలు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ రూపొందించిన మార్గదర్శకాలలో పొందుపరిచారు కూడా. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించాల్సి ఉండగా, ముసాయిదాతోనే నిలిపివేసి, మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. రైస్‌మిల్లు కెపాసిటీకి అనుగుణంగా కేటాయించిన ధాన్యం విలువలో 25 శాతం మేర బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. మిల్లును లీజుకు తీసుకుంటే.. కేటాయించిన ధాన్యం విలువలో 50 శాతం మేర లీజుదారుడు చెల్లించాలి. అయితే ఈ బ్యాంక్ గ్యారంటీ నిబంధనలను మిల్లర్లు వ్యతిరేకిస్తున్నారు. బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం అనేది తమకు తలకు మించిన భారమని, మిల్లింగ్ చార్జీలు కూడా ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని, ఏపీ వంటి రాష్ట్రాల్లో క్వింటాల్‌కు రూ.100 చెల్లిస్తుంటే మనరాష్ట్రంలో కేవలం రూ. 10 మాత్రమే ఇస్తున్నారని మిల్లర్లు చెబుతున్నారు. అది కూడా చాలా కాలంగా ఇవ్వడం లేదని వారి ఆరోపణ. ఈ నేపథ్యంలో బ్యాంకు గ్యారంటీలను ఎత్తివేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక సీజన్లో సీఎంఆర్ ఇవ్వకుండా డిఫాల్ట్ అయిన మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీ తీసుకొని ధాన్యం కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అంటే ఒక సీజన్లో సీఎంఆర్ డిఫాల్ట్ అయిన మిల్లర్లు తాము ఇవ్వాల్సిన బియ్యాన్ని అప్పగించడంతోపాటు అదనంగా 25 శాతం జరిమానా మొత్తానికి బ్యాంక్ గ్యారంటీ ఇస్తే వారికి ధాన్యం కేటాయిస్తారు. ఇలా ఒక సీజన్లో సీఎంఆర్ డిఫాల్ట్ అయిన మిల్లులు రాష్ట్రంలో 791 ఉన్నట్టు పౌరసరఫరాల సంస్థ తేల్చింది. రెండు, అంతకంటే ఎక్కువ సీజన్లలో డిఫాల్ట్ అయిన మిల్లులకు ఈసారి ధాన్యం కేటాయించమని మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో తేల్చిచెప్పారు. 386 మిల్లులను డిఫాల్ట్ మిల్లులుగా తేల్చడం గమనార్హం. మొత్తానికి బ్యాంకు గ్యారంటీల అంశం కూడా అటకెక్కినట్టేనని పౌరసరఫరాల శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
సబ్సిడీలపై ఇవ్వడం ముఖ్యం కాదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యావసర వస్తువులను సబ్సిడీపై ఇవ్వడం ముఖ్యం కాదని.. దాని వల్ల ప్రయోజనం ఉండదని సీఎం చంద్రబాబు అన్నారు. ధరలు పెరగకుండా నియంత్రించడమే మేలు అని అన్నారు. ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. ‘నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన తర్వాత.. వాటిని తగ్గించే ప్రయత్నం చేయడం, సబ్సిడీలో అందించడం వల్ల ప్రయోజనం ఉండదు.దాని కంటే 3 శాఖలు నిరంతర పర్యవేక్షణ ద్వారా ధరలు పెరగకుండా ముందే చర్యలు తీసుకోవాలి. ధరల భారం ప్రజలపై పడకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా చర్యలు తీసుకోవాలి. డిమాండ్–సప్లై మధ్య వ్యత్యాసానికి గల కారణాలను విశ్లేíÙంచి తగు చర్యలు చేపట్టాలి. విజిలెన్స్ డిపార్ట్మెంట్ క్రియాశీలకంగా పనిచేయాలి. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఏపీలో పామాయిల్, కూరగాయలు, పప్పుల వంటి ఉత్పత్తులు పెంచేందుకు ప్రణాళిక అమలు చేయాలి. పెద్ద ఎత్తున గిడ్డంగులను అందుబాటులోకి తేస్తే రైతులకు న్యాయం చేయవచ్చు’ అని అన్నారు. -
ఖరీఫ్ నుంచే కొత్త నిబంధనలు
సాక్షి, హైదరాబాద్, : మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండా దారి మళ్లించడం, నాణ్యమైన బియ్యం విక్రయించి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి పౌరసరఫరాల శాఖను మోసం చేయడం వంటి చర్యలకు పాల్పడకుండా మిల్లర్లపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది.ఈ మేరకు రూపొందించిన మార్గదర్శకాలకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసింది. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. సోమవారం మంత్రి ఉత్తమ్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన సమావేశంలో ఈ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు తెలిసింది. కెపాసిటీకి అనుగుణంగా కేటాయింపులు రైస్‌మిల్లులు తమకు కేటాయించిన ధాన్యాన్ని ఏడాదిన్నర వరకు కూడా మిల్లింగ్ పూర్తి చేయకుండా తమ వద్దే నిల్వ ఉంచుకుంటున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. తద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగడం, ఎఫ్‌సీఐ రీయింబర్స్మెంట్ ఇవ్వడంలో ఆలస్యం చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మిల్లులు సీఎంఆర్ కోసం ప్రతిరోజు రెండు షిఫ్టుల్లో 16 గంటలు పనిచేయాలని మార్గదర్శకాల్లో పొందుపరిచారు. ముడి బియ్యం ఇచ్చే రా రైస్ మిల్లులకు వడ్లు కేటాయిస్తే 8 గంటల చొప్పున రెండు షిఫ్టుల్లో రోజుకు 16 గంటలు మిల్లింగ్ చేసి 75 రోజుల్లో కేటాయించిన ధాన్యంలో 67శాతం రా రైస్ ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లుల కెపాసిటీకి అనుగు ణంగా ధాన్యం కేటాయించనున్నారు. 25 శాతం బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరిమిల్లింగ్ కోసం ధాన్యం తీసుకునే మిల్లర్లు ధాన్యం విలువకు అనుగుణంగా బ్యాంక్ గ్యారంటీ తప్ప నిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అను గుణంగా నిబంధనలు సవరించారు. కేటాయించిన ధాన్యం మిల్లింగ్ కెపాసిటీని బట్టి మిల్లింగ్‌కు వచ్చే 15 రోజుల ముందే 25 శాతం బ్యాంక్ గ్యారంటీని సమర్పించాల్సి ఉంటుంది. లీజు మిల్లుదారుడైతే కేటాయించిన ధాన్యంలో 50 శాతం బ్యాంక్ గ్యారంటీ సమర్పించాల్సి ఉంటుంది. లీజు తీసుకున్న మిల్లులో గతంలో ఓనర్ సీఎంఆర్ డెలివరీ పెండింగ్ లేనట్టు డీఎంల నుంచి నోడ్యూస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతే మిల్లులకు కేటాయింపులు ఉంటాయి. రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలులో ఉన్న మిల్లర్లకు సైతం ధాన్యం కేటాయింపులు ఉండవని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.డిఫాల్టర్లపై ఉక్కుపాదంగతంలో అక్రమాలకు పాల్పడినట్టు తేలిన మిల్లర్లకు, ఫేక్ ట్రక్ షీట్లు సృష్టించి కేసుల్లో ఇరుకున్న వారికి, 6 ఏ ఈసీ యాక్ట్, క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్న వారికి ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కేటాయించకూడదని, వీరికి ఈ సీజన్‌తోపాటు వచ్చే రెండు సీజన్ల వరకు వడ్లు ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు. డిఫాల్ట్ అయిన మిల్లర్లు బకాయి పడ్డ సీఎంఆర్‌ను అప్పగించి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకుంటేనే కొత్తగా ధాన్యం కేటాయించనున్నారు. మిల్లర్లు లీజు డీడ్ ఇవ్వడంతోపాటు కేటాయించిన ధాన్యానికి బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరి కానుంది. కలెక్టర్ల పర్యవేక్షణ...జిల్లాల వారీగా రైస్‌మిల్లుల్లో సాగే సీఎంఆర్‌పై కలెక్టర్లకే బాధ్యతలు అప్పగించనున్నా రు. ధాన్యం కొనుగోళ్ల నుంచి మిల్లింగ్ వరకు వారే కీలకం. బాయిల్డ్ రైస్‌మిల్లర్లు ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చేందుకు డిసెంబర్ 31లోగా ఎఫ్ఆర్కే బ్లెండింగ్, సోర్టెక్స్ మెషీన్లు ఇన్స్టాల్ చేసుకు నేలా ఆయా జిల్లాల కలెక్టర్ చర్యలు తీసు కొని, వారికే ధాన్యం కేటాయించాల్సి ఉంటుంది. జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి అర్హత ఉన్న మేరకే ధాన్యం కేటాయించాలి. మిల్లు లను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కేటాయించిన ధాన్యం దారిమళ్లినా, ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రైవేట్‌గా విక్రయించినా క్రిమినల్ చర్యలు తప్పనిసరి. -
రేషన్ కార్డులకు సన్న బియ్యం ఎలా?
సాక్షి, హైదరాబాద్: రేషన్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పౌరసరఫరాల శాఖ గోడౌన్లలో సన్నబియ్యం నిల్వలు 50 వేల మెట్రిక్ టన్నులు కూడా లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకి అవసరమయ్యే సన్న బియ్యాన్ని ఎలా సేకరించాలనే విషయమై సంస్థ తర్జన భర్జన పడుతోంది. ఖరీఫ్ పంట అక్టోబర్ నుంచి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఎంత మేరకు ధాన్యం వస్తుందనే విషయంలో స్పష్టత లేదు. వచి్చన సన్నాలను మరాడించి సన్న బియ్యంగా జనవరి నుంచి రేషన్ దుకాణాలకు పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. 24 ఎల్ఎంటీల బియ్యం అవసరం రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో రేషన్‌కార్డులు 89.96 లక్షలున్నాయి. ఈ కార్డుల లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు నెలకు 1.80 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) బియ్యం అవసరం. అంటే ఏడాదికి 21.60 ఎల్ఎంటీల సన్నబియ్యం కావాలి. ఇవికాకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంక్షేమ హాస్టళ్లకు, మధ్యాహ్న భోజన పథకానికి కలిపి ఏటా 2.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలి. అంటే ఏటా సన్నబియ్యం 24 ఎల్ఎంటీలు అవసరమవుతుంది. ఇందుకోసం 36 ఎల్ఎంటీల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించాల్సి ఉంటుంది. విద్యార్థులకు గత ప్రభుత్వ హయాం నుంచే సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నారు. ఈ ఏడాది సన్నబియ్యం కొరత ఏర్పడటంతో గత మే నెలలో 2.2 ఎల్ఎంటీ సన్న బియ్యం కొనుగోలు కోసం టెండర్లను ఆహా్వనించిన ప్రభుత్వం తరువాత వెనకడుగు వేసింది. ఖరీఫ్‌లో వచ్చే సన్న ధాన్యం 5 ఎల్ఎంటీ లోపే.. రాష్ట్రంలో సగటున ఏటా కోటిన్నర మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని పౌరసరఫరాల శాఖ సేకరిస్తుంది. ఇందులో ఖరీఫ్‌లో మాత్రమే రైతులు సన్నాలను పండిస్తున్నారు. ఈ సీజన్లో పౌరసరఫరాల శాఖ 50 నుంచి 60 ఎల్ఎంటీల ధాన్యం మాత్రమే సేకరించగలుగుతోంది. ఇందులో 5 ఎల్‌ఎంటీలే సన్నాలు ఉంటున్నాయి. రైతులు ఈ సీజన్లో సన్నాలను పండించినప్పటికీ, తమ అవసరాలకు నిల్వ చేసుకుంటుండటంతో మార్కెట్‌కు రావట్లేదు. నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, నారాయణపేట జిల్లాల్లో పండే మేలు రకం సన్న ధాన్యం నేరుగా మిల్లులకు వెళ్లడం లేదంటే బియ్యంగా మార్చి విక్రయించడం జరుగుతోంది. రబీలో వచ్చే మరో 70 ఎల్ఎంటీల ధాన్యంలో సన్నాలు నిల్. రాష్ట్ర వాతావరణం రీత్యా రబీలో సన్న ధాన్యం పండిస్తే, నూకల శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది దీర్ఘకాల పంట పంట కావడంతో రైతులు దొడ్డు ధాన్యాన్నే పండిస్తున్నారు. ఈ ఖరీఫ్సీజన్పై సర్కార్ ఆశరూ.500 బోనస్ ప్రకటనతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సన్నాలను రైతులు అధికంగా పండించినట్లు ప్రభుత్వం భావిస్తోంది. ధాన్యం కనీస మద్ధతు ధర క్వింటాలుకు రూ.2,320 ఉండగా, ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తే ఆ మొత్తం రూ. 2,820 అవుతుంది. కాగా 30 రకాలను రూ. 500 బోనస్ ఇచ్చే ఫైన్ వెరైటీలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫైన్ వెరైటీల్లో అధిక డిమాండ్ ఉన్న హెచ్ఎంటీ, సోనా మసూరి, జైశ్రీరాం వంటి రకాలు అధిక ధరలకు అమ్ముడుపోయినా, మిగతా వెరైటీలకు డిమాండ్ లేకపోవడంతో అవి మార్కెట్‌కు వస్తాయని భావిస్తోంది. అక్టోబర్ చివరి నుంచి ధాన్యం సేకరణ చేపట్టి, సన్నాలను వెంటవెంటనే మిల్లింగ్ చేస్తే జనవరి నాటికి రేషన్ దుకాణాలకు పంపవచ్చని ఓ అధికారి చెప్పారు. -
బీఆర్ఎస్ వాకౌట్
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖలో సన్న బియ్యం కొనుగోళ్లలో రూ.1,100 కోట్ల స్కాం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. ధాన్యం అమ్మకాలు, సన్నబియ్యం కొనుగోళ్లలో జరిగిన కుంభకోణంపై సభాసంఘాన్ని నియమించా లన్న తమ డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించనందున, ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి తమ పార్టీ సభ్యు లతో కలిసి మంగళవారం రాత్రి శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తెలియకుండా సివిల్ సప్లయ్స్ శాఖలో చాలా జరుగుతున్నాయని ఆరోపించారు.రేషన్ కార్డులు, రైతులకు పంటలకు సంబంధించిన బోనస్ విషయంలో తమ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమా ధానం చెప్పకుండా బుల్డోజ్ చేస్తోందంటూ మండిపడ్డారు. ప్రతిపక్షం ఏం చెప్పినా ప్రభుత్వానికి రుచించటం లేదని దుయ్యబట్టారు. దీనిలో మంత్రి హస్తం లేకపోయినా పెద్దల హస్తం ఉందన్నారు. దీనిపై ప్రభుత్వం సమాధానం ఇస్తున్న తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ కుంభకోణంపై హౌజ్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ తీరుకు నిరసనగా అసెంబ్లీ నుంచి బాయ్‌కాట్ చేస్తున్నామని చెప్పారు. అంతకుముందు సభా సంఘాన్ని నియమించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు వెల్‌లో బైఠాయించి చప్పట్లు కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో కలి్పంచుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వారిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సన్న బియ్యం కొనలేదు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ.. సన్నబియ్యం ఒక్క గింజకూడా కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. తన శాఖలో ఏమి జరిగినా అందుకు తాను పూర్తి బాధ్యత వహిస్తానని, ఏదీ జరగకుండానే జరిగినట్లు ఆరోపించడం తగదని చెప్పారు. మీ హయాంలో రబీలో సేకరించిన ధాన్యం మిల్లుల్లో లేదన్నారు. అప్పట్లో ప్రభుత్వం ధాన్యం విక్రయానికి టెండర్లు పిలిస్తే క్వింటాల్‌కు రూ. 1700 మాత్రమేనని, కానీ తమ ప్రభుత్వం వచ్చాక దొడ్డు బియ్యానికి రూ.2007, సన్నధాన్యానికి రూ.2400 ఇచి్చనట్లు గుర్తు చేశారు. పారిపోయారు: శ్రీధర్‌బాబు పౌరసరఫరాల పద్దుపై విపక్ష సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పూర్తిగా సమాధానం ఇచ్చినా కూడా వారు సభ నుంచి పారిపోయారని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు. వారి హయాంలో అన్ని అవకతవకలేనని దుయ్యబట్టారు. పదేళ్లలో ఒక్క రైతుకైనా పంట నష్టపరిహారం ఇచ్చారా అని ప్రశ్నించారు. సభనా..? బస్టాండా..?: భట్టి విక్రమార్క ‘ఇది సభనా? బస్టాండా? సభలో వెల్‌లోకి వచ్చి చప్పట్లు కొట్టడం ఏంటి..? వీరు మంత్రులుగా పనిచేశారు.. ఇదేం పద్ధతి? పదేళ్లు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఒక్క రోజైనా మేము ఇలా సభామర్యాదలను అగౌరవపరిచేలా చేశామా? వెల్‌లోకి వచ్చి చప్పట్లు కొట్టడం, ప్లకార్డులు ప్రదర్శించడం సబబు కాదు. సభాసంప్రదాయాలను మంట కలిపేలా వ్యవహరించడం సరికాదు. ప్రజలు ఇప్పటికే వారికి (బీఆర్ఎస్) బుద్ధి చెప్పారు. బుద్ధి తెచ్చుకొని వారిని సీట్లలోకి వెళ్లి కూర్చోమనండి అధ్యక్షా..! సభాసంప్రదాయాలు పాటించే వారే ఈ సభలో ఉండాలి’ అంటూ భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బ్లాక్‌లిస్టులో మిల్లులు.. రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సెక్యూరిటీ డిపాజిట్ కానీ, బ్యాంక్ గ్యారంటీ కానీ లేకుండానే వేల కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించే విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వం భావిస్తోంది. ధాన్యం ఇచ్చేటప్పుడే మిల్లర్ల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవాలని, సకాలంలో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) అప్పగించక పోవడంతో పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించే మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. తాజాగా చర్చనీయాంశమైన 2022–23 రబీ సీజన్‌లోని 35 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీల) ధాన్యాన్ని సీఎంఆర్ చేయని, తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంట్రాక్టు సంస్థలకు ధాన్యం అప్పగించని మిల్లులపై కొరడా ఝుళిపించనుంది. మిల్లర్ల విషయంలో ఉదాసీనత గత కొన్నేళ్లుగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మిల్లర్ల విషయంలో అవలంభించిన ఉదాసీన వైఖరి ఇప్పుడు సర్కార్‌కు ఇబ్బందికరంగా మారింది. మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వకుండా తమ వద్దే ఉంచుకున్న 2022–23 రబీ (యాసంగి) సీజన్‌కు సంబంధించిన 35 ఎల్ఎంటీల ధాన్యం రికవరీ బాధ్యతలను.. ప్రభుత్వం టెండర్ల ద్వారా నాలుగు సంస్థలకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే 3 నెలలు గడిచినా 35 ఎల్‌ఎంటీల్లో 2 ఎల్ఎంటీల ధాన్యాన్ని కూడా రికవరీ చేయలేదు. దీంతో విపక్షాలు ఈ ధాన్యం రికవరీ టెండర్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 2022–23 యాసంగి సీజన్లో మిల్లుల్లో నిల్వ చేసినట్లుగా చెపుతున్న ధాన్యాన్ని 4 కాంట్రాక్టు సంస్థలకు అప్పగించకపోతే.. వాటిని డిఫాల్ట్ మిల్లులుగా పేర్కొంటూ బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. 2022–23 యాసంగి ధాన్యంపైనే రచ్చ ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్ధతు ధరకు కొని..సీఎంఆర్ కోసం మిల్లులకు పంపడం జరుగుతుంది. ఖరీఫ్ ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి సీఎంఆర్ కింద అప్పగించే మిల్లర్లు, రబీ ధాన్యాన్ని మాత్రం బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం)గా ఎఫ్‌సీఐకి ఇవ్వడం గత కొన్నేళ్లుగా జరుగుతోంది. రాష్ట్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రబీ ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేస్తే నూకలుగా విరిగిపోతాయి. ఈ నేపథ్యంలో 2021లో కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి బాయిల్డ్ రైస్‌ను సీఎంఆర్‌గా తీసుకునేది లేదని స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ సంప్రదింపుల తర్వాత ప్రతి ఏటా 10 నుంచి 15 ఎల్ఎంటీల బియ్యాన్ని మాత్రమే బాయిల్డ్ రైస్‌గా తీసుకునేందుకు ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో 2020– 2021, 2021–2022లలో మిల్లర్లు రబీ ధాన్యాన్ని కూడా ముడిబియ్యంగా మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి అప్పగించారు. కాగా 2022–23 రబీ సీజన్లో 65 ఎల్ఎంటీల ధాన్యాన్ని సేకరించిన ప్రభుత్వం యధావిధిగా మిల్లులకు అప్పగించింది. అయితే మిల్లర్లు ప్రభుత్వం వెసులుబాటు ఇచి్చన విధంగా సుమారు 20 ఎల్ఎంటీల ధాన్యాన్ని మాత్రమే బాయిల్డ్ రైస్‌గా మిల్లింగ్ చేసి, మిగతా ధాన్యాన్ని మిల్లులు, గోడౌన్లకు పరిమితం చేశారు. అప్పటి ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ, తాము యాసంగి బియ్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ అప్పగించలేమని మిల్లర్లు తెగేసి చెప్పారు. దీంతో పౌరసరఫరాల శాఖ మిల్లుల్లోని ధాన్యాన్ని వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 25 ఎల్ఎంటీల ధాన్యాన్ని విక్రయించేందుకు టెండర్లు ఆహ్వానించగా ఏడు సంస్థలు క్వింటాల్ ధాన్యాన్ని సగటున రూ.1,860 చొప్పున కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాయి. ధర తక్కువగా రావడంతో ఆ బిడ్లను రద్దు చేసిన అధికారులు మళ్లీ టెండర్లను పిలిచారు. ఈసారి 10 వేల టన్నుల కెపాసిటీ గల మిల్లర్లంతా టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు మార్చారు. అంటే ఏ మిల్లులో ఉన్న ధాన్యం ఆ మిల్లరే కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పించారు. అయితే అప్పటికే ఎన్నికల కోడ్ రావడంతో ఈ టెండర్లు ఆగిపోయాయి. కొత్త టెండర్లు.. స్కామ్ ఆరోపణలు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రాగానే మిల్లుల్లో ఉన్న 2022–23 రబీ ధాన్యాన్ని విక్రయించడంపై దృష్టి పెట్టింది. కానీ ఈ ధాన్యాన్ని ఇంతవరకు ఎందుకు మిల్లింగ్ చేయలేకపోయారనే అంశంపై శ్రద్ధ పెట్టలేదు. ఎప్పటిలాగానే మిల్లర్లకు భారం కాకుండా నిబంధనలను మార్చి మిల్లుల్లో ఉన్నట్టు చెబుతున్న 35 ఎల్ఎంటీల ధాన్యాన్ని విక్రయించేందుకు కొత్తగా టెండర్లు పిలిచారు. ఆరు సంస్థలు ధాన్యం కొనుగోలుకు ముందుకు రాగా, మూడు నెలల క్రితం నాలుగు సంస్థలను ఎంపిక చేశారు. క్వింటాలు ధాన్యానికి సగటున రూ.2,007 రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేలా ఆ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 90 రోజుల్లోగా అంటే ఈనెల 23వ తేదీ లోగా ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వానికి రూ.7 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. కానీ ఈ 4 సంస్థలు కలిపి ఇప్పటివరకు 2 ఎల్ఎంటీల ధాన్యాన్ని కూడా సేకరించలేదని ప్రభుత్వమే చెబుతోంది. ఈ లోపు విపక్షాలు ఈ తతంగాన్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వంపై ఆరోపణా్రస్తాలు సంధించడం మొదలు పెట్టాయి. మిల్లుల వద్ద ధాన్యానికి బదులు క్వింటాలుకు రూ.2,223 చొప్పున కాంట్రాక్టు సంస్థలు వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. మొత్తంగా రూ.1,000 కోట్ల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, ఈ ధాన్యం వేలం ప్రక్రియపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లోనే నిరుటి 35 ఎల్ఎంటీల రబీ ధాన్యం విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది. 4 సంస్థలకు మరో 3 నెలల గడువు ఇవ్వడంతో పాటు అప్పటికి ధాన్యం అప్పగించని మిల్లర్లను డిఫాల్టర్లుగా గుర్తించి బ్లాక్‌లిస్టులో పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. మిల్లర్లలో జవాబుదారీతనం పెంచేలా.. మిల్లర్లలో జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు ఇకపై వారివద్ద సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ధాన్యం అప్పగించేటప్పుడే సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటారు. ఈ విధానాన్ని అమలు చేస్తే మిల్లర్లలో జవాబుదారీతనం పెరగడంతో పాటు ధాన్యం కొనుగోళ్ల కోసం చేసే అప్పులు కూడా కొంతవరకు తగ్గుతాయని భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 3,500 పైగా రైస్ మిల్లులు ఉండగా, ఒక్కో మిల్లర్ నుంచి రూ.కోటి చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ తీసుకున్నా రూ.3,500 కోట్లకు పైగా జమయ్యే అవకాశం ఉంది. ఏపీలో 100% సెక్యూరిటీ డిపాజిట్ ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాలు సెక్యూరిటీ డిపాజిట్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. దీనివల్ల మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ అప్పగించకుంటే సెక్యూరిటీ డిపాజిట్‌ను జప్తు చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. ఏపీలో వంద శాతం సెక్యూరిటీ డిపాజిట్ అమల్లో ఉంది. అంటే మిల్లర్లు రూ.కోటి కడితే అంతే విలువైన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం ప్రభుత్వం అప్పగిస్తుందన్నమాట. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో 1:3 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటున్నారు. అంటే మిల్లర్లు రూ.కోటి చెల్లిస్తే రూ.3 కోట్ల విలువైన ధాన్యాన్ని వారికి ఇస్తారు. -
‘పౌర సరఫరా’లో రూ.1,000 కోట్ల స్కాం!: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. మిల్లుల్లో నిల్వ ఉన్న 35 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం సేకరణ పేరుతో రూ.700 కోట్ల నుంచి రూ.750 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం కోసం 2.20 ఎల్ఎంటీల సన్న బియ్యం కొనుగోలు పేరిట మరో రూ.300 కోట్లు..మొత్తం రూ.1,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో బి–టాక్స్, యు–ట్యాక్స్, ఆర్ఆర్– ట్యాక్స్ రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పార్టీ నేతలు శంభీపూర్ రాజు, పెద్ది సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులతో కలిసి కేటీఆర్ మాట్లాడారు. 4 కంపెనీలకే టెండర్లు వచ్చేలా చేశారు.. ‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022–23 యాసంగిలో రైతుల నుంచి సేకరించి మిల్లర్ల దగ్గర నిల్వ ఉంచిన 35 ఎల్ఎంటీల ధాన్యాన్ని విక్రయించేందుకు మూడు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ గ్లోబల్ టెండర్ల కహానీకి తెరలేపింది. అధికారంలోకి వచ్చి 50 రోజులైనా కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి 25న కమిటీ వేసి, మార్గదర్శకాలు జారీ చేశారు. క్వింటాలుకు రూ.2,100 చొప్పున కొనుగోలు చేయానికి రైస్ మిల్లర్లు ముందుకు వచ్చినప్పటికీ తిరస్కరించి గ్లోబల్ టెండర్లు పిలిచారు. ప్రత్యేక నిబంధనలతో కేవలం 4 కంపెనీలకే టెండర్లు వచ్చేలా చేశారు. కేంద్రీయ భండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందూస్తాన్ కంపెనీ, నాకాఫ్ అనే నాలుగు సంస్థలు బిడ్లను దక్కించుకున్నాయి. గురుకులాల్లో కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత సరిగ్గా పనిచేయనందుకు కేంద్రీయ భండార్ అనే సంస్థను 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంస్థ కోసం నిబంధనలు సడలించింది..’అని కేటీఆర్ విమర్శించారు. టెండర్ మొత్తానికంటే అదనంగా వసూళ్లు ‘మిల్లర్లు క్వింటాలు రూ.2,100కు కొంటామన్నప్పటికీ సగటున రూ.200 తగ్గించి రూ.1,885– రూ.2,007 మధ్య ఆ 4 సంస్థలు కొనేలా ఒప్పందం చేశారు. టెండర్ మార్గదర్శకాల ప్రకారం 90 రోజుల్లో 35 ఎల్ఎంటీల ధాన్యాన్ని తీసుకుని ప్రభుత్వానికి రూ.7,500 కోట్లు చెల్లించాలి. మిల్లర్లతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకూడదు. కానీ మిల్లర్లతో ఆయా సంస్థలు నేరుగా ఆర్థిక లావాదేవీలు చేస్తూ మనీలాండరింగ్‌కు పాల్పడ్డాయి. గోదాముల్లోని ధాన్యాన్ని తీసుకుపోకుండా రైస్ మిల్లర్లపై బెదిరింపులకు పాల్పడ్డాయి. టెండర్లు వేసిన మొత్తానికి కాకుండా అదనంగా చెల్లించాలంటూ రాష్ట్రంలోని 4 వేల మంది రైస్ మిల్లర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ‘సీఎం పేషీకి ఖర్చయ్యింది.. ఢిల్లీకి పోవాలి.. పార్లమెంటు ఎన్నికలు’అంటూ క్వింటాలుకు రూ.150 నుంచి రూ.236 అదనంగా చెల్లించి తీరాలని ఒత్తిడి చేస్తున్నారు. క్వింటాలుకు రూ.236 ఎక్కువగా ఇస్తే ధాన్యం లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు క్లియరెన్స్ ఇస్తామంటూ బంపరాఫర్ కూడా ఇచ్చారు. ఈ మేరకు జలసౌధలో అనధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. దాదాపు 35 ఎల్ఎంటీలకు గాను కింటాలుకు రూ.200 చొప్పున రూ.700 కోట్ల అదనపు డబ్బు మనీలాండరింగ్ ద్వారా మిల్లర్ల దగ్గర వసూలు చేస్తున్నారు. మరోవైపు ధాన్యం లిఫ్ట్ చేసేందుకు గడువు ఈ నెల 23తో అయిపోయింది. ఇప్పటికీ 20 శాతం కూడా లిఫ్ట్ చేయలేదు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి.. బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి. కానీ తమకు రావాల్సిన రూ.700 కోట్లు మొత్తం వాళ్ల చేతికి రాలేదు కాబట్టి ఈ డెడ్‌లైన్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు..’అని కేటీఆర్ ఆరోపించారు. సన్న బియ్యం పేరిట మరో స్కాం ‘రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకానికి 2.20 ఎల్ఎంటీల సన్న బియ్యం కావాలి. వీటి కోసం కూడా పౌరసరఫరాల శాఖ గ్లోబల్ టెండర్ పిలిచింది. ఇందులో కూడా అవే నాలుగు కంపెనీలు పాల్గొన్నాయి. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధర కిలో రూ.42–45 ఉంది. కానీ బహిరంగ మార్కెట్, మిల్లర్లను పక్కనబెట్టి టెండర్ల పిలిచారు. కిలోకు రూ.15 అదనంగా అంటే రూ.57కు టెండర్ ఖరారు చేశారు. 2.20 ఎల్ఎంటీలకు కిలోకు అదనంగా రూ.15 చొప్పున రూ.300 కోట్ల స్కామ్ జరిగింది. ఇలా మొత్తంగా రూ.1,000–1,100 కోట్ల స్కామ్ జరిగింది..’అపి కేటీఆర్ వివరించారు. ‘మా ప్రభుత్వం హయాంలో కొనుగోలు చేసిన దాంట్లో 1.6 ఎల్ఎంటీల సన్న ధాన్యం ఉంది. దాన్ని మిల్లింగ్ చేసి విద్యాశాఖకు ఇస్తే.. కేవలం 60 వేల టన్నులే కొనాల్సి వచ్చేది. కానీ 1.6 ఎల్ఎంటీల సన్న ధాన్యం కిలో రూ.22.59 పైసలకు అమ్మేశారు..’అని విమర్శించారు. -
దండిగా ధాన్యం.. నిండుగా నిధులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం రైతులకు బాసటగా నిలుస్తోంది. ధాన్యం కొనుగోలులో సంపూర్ణ మద్దతు ధర అందించడంతో పాటు.. దేశంలోనే తొలిసారిగా రైతులకు గన్నీ, హమాలీ, రవాణా (జీఎల్టి) చార్జీల కింద టన్నుకు రూ.2523 అదనంగా చెల్లిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఖరీఫ్ 2023–24లో 4.97లక్షల మంది రైతుల నుంచి రూ.6,538 కోట్ల విలువైన 29.91లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. వీటిల్లో 4.36లక్షల మంది రైతులకు రూ.5700 కోట్ల మద్దతు ధర చెల్లించింది. మిగిలిన 61 వేల మంది రైతులకు రూ.838 కోట్లు అందించేందుకు వీలుగా నిధులను సమీకరించింది. ఆర్బీకేల్లో షెడ్యూల్ చేసిన వివరాల ప్రకారం వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో మద్దతు ధర మొత్తాన్ని జమ చేయనుంది. తద్వారా ఖరీఫ్ కొనుగోళ్లలో సంపూర్ణ చెల్లింపులను చేయనుంది. ఇక రబీ సేకరణకు సమాయత్తం ఖరీఫ్ ధాన్యం సేకరణ పూర్తవడంతో ఏప్రిల్ మొదటి వారం నుంచి రబీ కొనుగోళ్లకు పౌరసరఫరాల సంస్థ సమాయత్తం అవుతోంది. రబీ సీజన్లో 25లక్షల టన్నులకుపైగా ధాన్యం వస్తుందని అంచనా వేస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా గోనె సంచులు, హమాలీలు, రవాణా సదుపాయాలను కల్పించేలా క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. గోదావరి జిల్లాల్లో రబీలో సాగు చేసే జయరకం (దుడ్డు బియ్యం)ధాన్యాన్ని సైతం మద్దతు ధరకు సేకరించనుంది. గతేడాది జయ రకం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించగా కేవలం 90వేల టన్నులు మాత్రమే వచ్చి ంది. ఈసారి 3లక్షల టన్నులు సేకరించేలా ప్రణాళిక రూపొందించింది. అయితే జయరకం ధాన్యాన్ని ప్రభుత్వం స్వయంగా మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండటం రైతులకు లాభసాటిగా మారింది. ఈ రకం ధాన్యం వినియోగం స్థానికంగా చాలా తక్కువ. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో దుడ్డు బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో గతంలో ప్రైవేటు వ్యాపారులు ఇచ్చి న రేటు తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వ జోక్యంతో ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి దుడ్డు బియ్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 37.68 లక్షల మంది రైతులకు మద్దతు టీడీపీ ఐదేళ్లలో కేవలం 17.94లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించింది. కానీ, సీఎం జగన్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం విశేషం. అంటే టీడీపీ హయాంలో కంటే 20లక్షల మంది రైతులకు అదనంగా సీఎం జగన్ ప్రభుత్వం మద్దతు ధర అందించింది. మొబైల్ బృందాలతో పరిశీలన.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. దళారీ, మిల్లర్ల వ్యవస్థకు చెక్‌పెడుతూ ఆర్బీకేల కేంద్రంగా ఈ–క్రాప్ డేటా ఆధారంగా ధాన్యం సేకరణ చేసి వాస్తవ రైతుకు సంపూర్ణ మద్దతు ధరను అందిచే పటిష్ట వ్యవస్థను తీసుకొచ్చారు. క్షేత్ర స్థాయికి ఆర్బీకే అసిస్టెంట్ వెళ్లి నాణ్యతను పరిశీలించడం, ఆన్లైన్లో ధాన్యం రైతు వివరాలు నమోదు, ట్రక్ షీట్ జనరేట్, చివరికి ధాన్యం తరలించాల్సిన మిల్లును కూడా ఆటోమేటిగ్గా ఎంపిక చేసే సాంకేతిక విధానాన్ని తీసుకొచ్చారు. లోడు పక్కదారి పట్టకుండా రవాణా వాహనాలకు జీపీఎస్‌ను సైతం అమర్చారు. మిల్లుల్లో ధాన్యం నాణ్యత సమస్యలను రైతులతో సంబంధం లేకుండా పరిష్కరించేందుకు కస్టోడియన్ అధికారులను నియమించారు. ప్రస్తుతం ఎన్నికల సమయం నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే మండలానికి ఒక ప్రత్యేక మొబైల్ బృందాన్ని ఏర్పాటు చేసి ధాన్యం రైతుల సమస్యలను పరిష్కరించేలా దృష్టి సారించారు. ప్రభుత్వ కాల్‌సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులతో పాటు స్థానికంగా రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నారు. దిగుబడిలో 60 శాతం కొనుగోలు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా బీపీటీ, నెల్లూరు, స్వర్ణ రకాలను పండిస్తున్నారు. వీటికి జాతీయ, అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంటుంది. ఇవి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు కాకుండా బయటకు వెళ్లిపోతాయి. మిగిలిన రకాల ధాన్యా న్ని ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఇలా.. ఏపీలో ధాన్యం దిగుబడుల్లో రైతుల అవసరాలకు నిల్వ చేసిన తర్వాత 60 శాతం పైగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. బాబు హయాంలో బకాయిలే! గతంలో రైతులకు మద్దతు ధర పేరుతో దళారులకు, మిల్లర్లకు దోచిపెట్టేవారు. పేరుకే ప్రభుత్వం ధాన్యం సేకరణ చేసేది. కొనేదంతా మిల్లర్లు.. దళారులే. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని 75 కేజీల బస్తాకు మద్దతు ధర కంటే రూ.200 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6వేలకు పైగా ప్రత్యక్షంగా రైతులు నష్టపోయేవారు. పైగా అప్పటి ఎన్నికల ముందు రైతులకు చెల్లించాల్సిన రూ.4వేల కోట్ల ధాన్యం డబ్బులను చంద్రబాబు ప్రచార పథకాలకు మళ్లించడంతో సమయానికి డబ్బులు అందక రైతులు అల్లాడిపోయారు. చివరికి చంద్రబాబు దిగిపోతూ ఇంకా రూ.960 కోట్లు బకాయిలు పెట్టారు. వీటిని కూడా సీఎం జగన్ ప్రభుత్వమే చెల్లించింది. -
కంది రైతుకు ‘మద్దతు’కు మించి ధర
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా కందులు కొనుగోలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. అదీ.. మద్దతు ధరకు మించి.. మార్కెట్ రేటుతో సమానంగా చెల్లిస్తోంది. దీంతో కంది రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యాన ఈ సీజన్లో దాదాపు 20వేల టన్నుల కందులు సేకరించనుంది. ఇప్పటికే అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభించింది.కేంద్రం క్వింటా కందుల మద్దతు ధర రూ.7 వేలుగా ప్రకటించింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు మార్కెట్లో ఉన్న రేటుకే రూ. 9,500 నుంచి రూ.10 వేలు చెల్లించి కొంటోంది. రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. రైతుకు ఈ ఖర్చులూ మిగులు ఇప్పటివరకు రైతులు కందులను మార్కెట్‌కు తీసుకువెళ్లి విక్రయించాల్సి వచ్చేది. ఇందుకోసం గోనె సంచులు, హమాలీలు, రవాణాకు (జీఎల్టీ) పెద్ద మొత్తంలో రైతుకు ఖర్చయ్యేది. రైతుకు ఈ బాధలన్నీ తప్పిస్తూ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే గ్రామాల్లోనే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తోంది. గోనె సంచులు, రవాణా, హమాలీ సౌకర్యాలను కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తోంది. దీంతో రైతుకు వ్యయప్రయాసలు తగ్గిపోయాయి. ఒకవేళ రైతులే సొంతంగా జీఎల్టీని సమకూర్చుకుంటే టన్నుకు రూ.746 అదనంగా వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. పొలం నుంచి పీడీఎస్‌లోకి ప్రస్తుతం మార్కెట్లో కిలో కందిపప్పు రూ.140కిపైగా ఉంది. పౌర సరఫరాల శాఖ రేషన్ లబ్దిదారులకు సబ్సిడీపై కిలో రూ.67కే అందిస్తోంది. కిలో రూ.170కిపైగా ఉన్నప్పుడు కూడా ఇదే ధరకు ఇచ్ఛింది. ఇటీవల మార్కెట్లో కందిపప్పుకు డిమాండ్ పెరగడంతో భారీగా వెచ్చించి కొనాల్సిన పరిస్థితి. జాతీయ స్థాయి నోడల్ ఏజెన్సీ అయిన హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ (హాకా) వద్ద కూడా నిల్వలు లేకపోవడంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నేరుగా రైతుల నుంచే కొని, ప్రాసెసింగ్, మిల్లింగ్ చేసి రేషన్ లబ్దిదారులకు ఇచ్చేందుకు పౌరసరఫరాల సంస్థ చర్యలు చేపట్టింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 2,500 టన్నులు కందులు సేకరించింది. ఇందులో 600 టన్నులకు పైగా కందిపప్పును ప్రాసెసింగ్, మిల్లింగ్ చేసి వినియోగదారులకు సరఫరా చేస్తోంది. ఊర్లోనే కొన్నారు.. మూడు రోజుల్లో డబ్బు జమ చేశారు నా పేరు చేజాల పెద్దరాజు. అనంతపురం జిల్లా ఉరవకొండ. కొంత సొంత భూమి, మరికొంత కౌలుకు తీసుకుని 27 ఎకరాల్లో కంది సాగు చేశాను. గతంలో పంట కోత పూర్తయిన తర్వాత బళ్లారి, రాయచూర్ మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మేవాళ్లం. ఈ మార్కెట్లు మా ప్రాంతం నుంచి 50 నుంచి 120 కిలో మీటర్లకు పైగా దూరం ఉండటంతో రవాణాకు ఎక్కువ ఖర్చయ్యేది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వమే మా ఊర్లో ఆర్బీకేలో కొనుగోలు కేంద్రం పెట్టింది. క్వింటాకు రూ.9,370 చొప్పున చెల్లించింది. సుమారు 80 క్వింటాళ్లు విక్రయించా. మూడు రోజుల్లోనే నాకు రూ.7 లక్షలకుపైగా నగదు జమైంది. ప్రభుత్వమే రవాణా, గోనె సంచులు సమకూర్చింది. ఒకప్పుడు మేము ఎంతో కష్టపడి మార్కెట్ వరకు తీసుకెళ్తే వచ్చే ధర ఇప్పుడు అధికారులు మా దగ్గరకే వచ్చి మరీ కొని, డబ్బులు జమ చేయడం సంతోషంగా ఉంది. నిరంతరం సరఫరా చేసేలా ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి మద్దతు ధరకు మించి ధర ఇచ్చి కందులు కొనడం ఇదే ప్రథమం. దీనివ్లల రైతుకు, రేషన్ లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతుంది. స్థానికంగా పండించిన పంటను స్థానిక అవసరాలకు వినియోగిస్తే సమయం, అదనపు భారం తగ్గుతాయి. బయట మార్కెట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదు. నిరంతరాయంగా వినియోగదారులకు పంపిణీ చేయొచ్చు. – హెచ్.అరుణ్‌కుమార్, ఎక్స్అఫీషియో సెక్రటరీ, ఏపీ పౌరసరఫరాల శాఖ మార్కెట్ రేటు ప్రకారమే.. ఈ సీజన్లో 20వేల టన్నులకు పైగా కందుల సేకరణపై దృష్టిపెట్టాం. పంట దిగుబడి ఎక్కువగా వచ్చే ప్రకాశం, పల్నాడు ప్రాంతాల్లో కొనుగోళ్లు వేగంగా ఉన్నాయి. ఈ–క్రాప్ ప్రామాణికంగా వాస్తవ రైతులకు మార్కెట్ రేటు ప్రకారం ధర ఇస్తున్నాం. జీఎల్టీ సైతం వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నాం. – జి.వీరపాండియన్, ఎండీ, ఏపీ పౌరసరఫరాల సంస్థ -
200 యూనిట్ల ఫ్రీ విద్యుత్, రూ.500కు సిలిండర్ షురూ.. 'పథకాలు ఆగవు'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా ఎన్నికల సమయంలో అభయహస్తం కింద ఇచ్చిన హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించవద్దని అన్నారు. ఆర్థిక నియంత్రణ పాటిస్తూ, దుబారా ఖర్చులు తగ్గించుకుని సంక్షేమ పథకాలను ఆర్థిక వెసులు బాటు మేరకు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం సచివాలయంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తదితరులతో కలిసి సీఎం ప్రారంభించిన అనంతరం రేవంత్ మాట్లాడారు. సంక్షేమ పథకాలు ఆపం ‘డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. ఇప్పుడు మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నాం. తెలంగాణ ఇచ్చిన విధంగానే, 2023 సెపె్టంబర్ 17న సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించారు. ఈ ఆరు గ్యారంటీల వల్లే అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. అందువల్ల ఆర్థికంగా ఎన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగతో మహిళల జీవితాలు దుర్భరంగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం దీపం పథకం తెచ్చింది. అప్పుడు రూ.400 ఉన్న సిలిండర్‌ను మోదీ ప్రధాని అయ్యాక రూ.1200కు పెంచారు. అలా ధర పెరిగిన సిలిండర్‌పై రాయితీ ఇవ్వాలన్న ఆలోచన కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు. కానీ ఎన్నికల సందర్భంగా మేం ఈ హామీ ఇచ్చాం. ఆ మేరకు లక్ష మంది మహిళల సమక్షంలో ఈ పథకాన్ని ప్రారంభించాలనుకున్నాం. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అడ్డు రావడంతో సచివాలయంలోనే ప్రారంభిస్తున్నాం. ఇతర సంక్షేమ పథకాలు కూడా అపం. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశానికే రోల్‌మోడల్‌గా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దుతాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు: భట్టి ‘గత ప్రభుత్వానికి అధికారం అప్పగించే సమయానికి తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉంది. కానీ గత పదేళ్లలో అప్పుల కుప్పగా మార్చారు. ఉద్యోగులకు వేతనాలు కూడా అప్పులు తెచ్చి చెల్లించేవారు. ప్రస్తుతం ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారని దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది. కాంగ్రెస్ హమీలు అమలు సాధ్యం కానివంటూ బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోంది. కానీ మేం హామీలన్నీ కచ్చితంగా అమలు చేసి చూపిస్తాం. అర్హత ఉన్న వారందరికీ మార్చిలో వచ్చే విద్యుత్ బిల్లు జీరో (200 యూనిట్లలోపు వినియోగిస్తే) బిల్లుగా వస్తుంది. ఇందులో ఎలాంటి ఆంక్షలూ లేవు. అయితే వారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. అర్హత ఉండి దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తాం..’అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారందరికీ రూ.500 కే సిలిండర్: ఉత్తమ్ ‘ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని, తెల్లరేషన్ కార్డు ఉన్నవారందరికీ రూ.500 సిలిండర్ అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఆయిల్ కంపెనీలకు ముందస్తుగా డబ్బు చెల్లిస్తామని, వారు ఆ తర్వాత లబ్ధిదారుల అకౌంట్లలో వేస్తారని తెలిపారు. మూడేళ్ల సగటు వినియోగం ఆధారంగా ఒక్కో సిలిండర్‌ను రూ.500కు ఇస్తామని వివరించారు. త్వరలోనే కేవలం రూ.500 చెల్లిస్తే.. గ్యాస్ సిలిండర్ అందించేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. ఎల్పీజీ కనెక్షన్ యాక్టివ్‌గా ఉండాలి రూ.500కే సిలిండర్ పొందాలంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. తెల్ల రేషన్‌కార్డు ఉండాలి. మూడేళ్ల సగటు వినియోగం ఆధారంగా రూ.500కు సిలిండర్లు అందజేస్తారు. దరఖాస్తు చేసుకున్న వారి పేరిట ఎల్పీజీ కనెక్షన్ యాక్టివ్‌గా (కనెక్షన్ వినియోగంలో ఉండాలి) ఉండాలి. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక సర్వీస్ కనెక్షన్‌కే వర్తింపు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందడానికి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. తెల్ల రేషన్‌కార్డు కలిగి, ఆధార్‌కార్డు విద్యుత్ సర్వీసు కనెక్షన్‌తో అనుసంధానమై ఉండాలి. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన వారికి జీరో బిల్లు వస్తుంది. రేషన్‌కార్డులోని యజమాని పేరు ఉన్న విధంగా ఈ పథకం కోసం విద్యుత్ సర్వీసు కనెక్షన్ పేరును డిస్కమ్‌లు మార్చవు. అలాంటి సర్వీసు ఉన్న వారికి యథావిధిగా బిల్లులు వస్తాయి. ఈ పథకం కింద విద్యుత్‌ను వాణిజ్య అవసరాలకు వాడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటారు. గృహజ్యోతి పథకం పొందడానికి అన్ని అర్హతలున్నా.. ప్రస్తుత పద్ధతిలోనే విద్యుత్ బిల్లు వస్తే..ఎంపీడీవో/మునిసిపల్ కార్యాలయాన్ని సందర్శించి తెల్ల రేషన్‌కార్డు, విద్యుత్ కనెక్షన్ సర్వీసు నంబర్ (యూనిక్ సర్వీస్ కనెక్షన్)తో అనుసంధానమైన ఆధార్ కార్డును జోడించి దరఖాస్తు ఇవ్వాలి. వినియోగదారులు ఎంపీడీవో/మునిసిపల్ కార్యాలయం లేదా ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తు అక్నాలెడ్జ్మెంట్ను చూపిస్తే చాలు..వారి దగ్గర నుంచి బిల్లును బలవంతంగా వసూలు చేయడం జరగదు. ఈ మేరకు ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
ధాన్యం దోపిడీ!
సాక్షి, హైదరాబాద్: రైస్ మిల్లుల్లో ఏడాది కాలంగా నిల్వ ఉన్న ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా.. ఆ ధాన్యాన్ని తక్కువ ధరకు పొందడం ద్వారా సర్కారు ఖజానాకు రూ. వందల కోట్ల నష్టం కలిగించేలా వ్యాపారులు, మిల్లర్లు చక్రం తిప్పుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ సహకార సంస్థ మాజీ చైర్మన్ కనుసన్నల్లో సిండికేట్ అయి తమ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని 12 లాట్లుగా విభజించి బిడ్లు ఆహ్వానించగా క్వింటాల్ ధాన్యం సగటున రూ. 1,950కన్నా తక్కువ మొత్తానికి దక్కించుకునేలా 27 బిడ్లు మాత్రమే దాఖలు కావడం వ్యాపారుల కుమ్మక్కును స్పష్టం చేస్తోంది. కాగా, ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం బిడ్డర్లకు ధాన్యాన్ని అప్పగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇదే జరిగితే ఇప్పటికే అప్పుల్లో ఉన్న పౌరసరఫరాల సంస్థకు దాదాపు రూ. 1,500 కోట్లకుపైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ వేలం ప్రక్రియకు పౌరసరఫరాల శాఖలోని కొందరు అధికారులతోపాటు ఇతర ఉన్నతాధికారులు సహకారాన్ని అందించారనే ఆరోపణలు విన్పిస్తుండటం గమనార్హం. యాసంగిలో 66.84 ఎల్ఎంటీల సేకరణ రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ చేయించి ఎఫ్‌సీఐకి అప్పగించడం... ఎఫ్‌సీఐ నుంచి ధాన్యం సొమ్మును రీయింబర్స్ చేసుకోవడం అనే ప్రక్రియ గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాల సంస్థ అప్పులు చేయడం... ఎఫ్‌సీఐ నుంచి డబ్బు తీసుకొని ఆ అప్పులు తిరిగి చెల్లించడం ఈ ప్రక్రియలో భాగమే. ఈ క్రమంలోనే 2022–23 రబీ (యాసంగి) సీజన్‌కు సంబంధించి సుమారు 7 వేల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి 66.84 ఎల్ఎంటీల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కనీస మద్దతు ధర కింద రూ. 13,760 కోట్లకుపైగా మొత్తాన్ని రైతుల ఖాతాల్లో వేసింది. సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించింది. కస్టమ్ మిల్లింగ్ చేయకుండా..లెక్క చూపకుండా.. యాసంగి సీజన్లో క్వింటాల్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 67 కిలోల ముడి బియ్యం (రా రైస్) ఎఫ్‌సీఐకి మిల్లర్లు అప్పగించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ముడి బియ్యం (రా రైస్)గా మిల్లింగ్ చేస్తే బియ్యం విరిగి నిర్ణీత లెక్క ప్రకారం 67 కిలోల బియ్యం రావని, అందువల్ల బాయిల్డ్ రైస్‌గా అయితేనే మిల్లింగ్ చేస్తామని మిల్లర్లు తేల్చిచెప్పారు. యాసంగి ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేయబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన వెసులుబాటు మేరకు సుమారు 12 ఎల్ఎంటీల వరకు బాయిల్డ్ రైస్‌గా ఎఫ్‌సీఐకి ఇచ్చారు. మిగతా ధాన్యం మిల్లుల్లోనే ఉన్నట్లు లెక్కలు చూపారు. అయితే నిల్వ ఉన్న ధాన్యంలో మేలు రకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ కింద ఇవ్వకుండా ఎక్కడికక్కడ బియ్యాన్ని మిల్లర్లు విక్రయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. సర్కార్ లెక్కల ప్రకారం ప్రస్తుతం మిల్లుల్లో కనీసం 50 ఎల్ఎంటీల ధాన్యమైనా నిల్వ ఉండాలి. కానీ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో టాస్‌్కఫోర్స్, విజిలెన్స్ జరిపిన తనిఖీల్లో ఈ మొత్తంలో ధాన్యం కాగితాల మీదే తప్ప భౌతికంగా లేకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తప్పిన వేలం మిల్లర్లు నిల్వ ఉంచిన ధాన్యాన్ని వేలం వేయాలని గత ఆగస్టులోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ మేరకు 25 ఎల్ఎంటీల ధాన్యాన్ని వేలానికి ఉంచగా 54 బిడ్లు దాఖలయ్యాయి. అప్పట్లో క్వింటాల్‌కు కనిష్టంగా రూ. 1,618, గరిష్టంగా రూ. 1,732, సగటున రూ. 1,670 ధర పలికింది. అయితే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం విలువ క్వింటాల్‌కు రూ. 2,060 కాగా రవాణా ఖర్చులు, నిల్వ వల్ల రుణాలపై పెరిగిన వడ్డీ కలిపి క్వింటాల్ ధాన్యానికి రూ. 2,300 వరకు అవుతుందని అప్పటి పౌరసరఫరాల కమిషనర్ అంచనా వేశారు. వేలంలో వచ్చే ధరతో పోల్చుకుంటే నష్టం వస్తుందనే కారణంతో ఆ టెండర్లను రద్దు చేశారు. నిబంధనలు మార్చి మరోసారి అక్టోబర్‌లో టెండర్లను ఆహ్వానించారు. అయితే ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ టెండర్లను నిలిపివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఇతర అధికారులతో చర్చించి మరోసారి ధాన్యం వేలం వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జనవరి 25న ఐదుగురు ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. 35 ఎల్ఎంటీల ధాన్యాన్ని వేలానికి ఉంచి ఇటీవల ఫైనాన్షియల్ బిడ్లను తెరిచారు. బిడ్ల కనిష్ట ధర రూ. 1,920గా ఉన్నట్లు తెలిసింది. చక్రం తిప్పిన మాజీ సహకార సంస్థ చైర్మన్ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించినప్పటికీ వేలంలో రాష్ట్రంలో పలుకుబడిగల మిల్లర్లు, కొందరు వ్యాపారులే పాల్గొన్నట్టు తెలిసింది. హైదరాబాద్‌లోని ఓ సహకార సంస్థ మాజీ చైర్మన్ వేలం ప్రక్రియలో చక్రం తిప్పినట్టుగా పౌరసరఫరాల శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో పలుకుబడి గల ఆయన కొత్త ప్రభుత్వంలోనూ తనదైన రీతిలో సిండికేట్ నడిపించినట్లు ప్రచారం జరుగుతోంది. క్వింటాల్ ధాన్యం రూ. 2 వేలలోపే ఉండేలా బిడ్డర్లతో రింగ్ అయినట్లు సమాచారం. వాస్తవానికి మిల్లుల్లో ఎంత యాసంగి ధాన్యం ఉందో కూడా సరిగ్గా తెలియదు. ఈ పరిస్థితుల్లోనే గత ప్రభుత్వం 25 ఎల్ఎంటీల ధాన్యం వేలం వేసేందుకు ప్రయత్నించింది. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం 35 ఎల్ఎంటీలు విక్రయించేందుకు సిద్ధమైంది. విజిలెన్స్, టాస్‌్కఫోర్స్ తనిఖీల నేపథ్యంలో వీలైనంత తక్కువ ధరకు ధాన్యాన్ని దక్కించుకొని ప్రభుత్వానికి ఆ మేరకు డబ్బు చెల్లించడం ద్వారా గండం గట్కెక్కాలనే ధోరణిలో మిల్లర్లు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో క్వింటాల్ ధాన్యం రూ. 2,300 వరకు పలికే అవకాశం ఉందని అధికారులు అంచనా వేయగా ఇప్పటి మార్కెట్ ధరను పరిగణనలోకి తీసుకుంటే..వేలం ప్రక్రియలో ముందుకెళ్లడం వల్ల సర్కారు ఖజానాకు రూ. 1,500 కోట్లకుపైగానే నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా టెండర్లపై ఏం నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది. -
1 నుంచి రేషన్ లబ్దిదారులకు రాగిపిండి పంపిణీ
సాక్షి, అమరావతి: వచ్చే నెల 1 నుంచి రేషన్ లబ్దిదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రాగిపిండిని పంపిణీ చేయనుంది. తద్వారా ప్రభుత్వం పౌష్టికాహార భద్రతకు పెద్దపీట వేయనుంది. ముందు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో బలవర్థక ఆహారంగా రాగి పిండిని సరఫరా చేయాలని నిర్ణయించింది. మార్చి 1 నుంచి కిలో ప్యాకెట్ల రూపంలో దీన్ని అందించనుంది. బహిరంగ మార్కెట్లో కిలో రాగిపిండి రూ.40పైనే పలుకుతుండగా ప్రభుత్వం లబ్దిదారులకు కిలో రూ.11కే పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. తొలుత శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, రాయలసీమలోని వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కాగా ఒక్కో కార్డుకు ప్రస్తుతం ఇస్తున్న బియ్యంలో కిలో బియ్యం బదులు రాగులు/జొన్నలను అందజేస్తోంది. ఈ క్రమంలోనే కార్డుదారులు వాటిని మిల్లింగ్ చేసుకుని వినియోగించుకుంటున్నారు. ఇకపై లబ్దిదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా.. పౌరసరఫరాల శాఖ చరిత్రలో తొలిసారిగా రాగిపిండి పంపిణీకి శ్రీకారం చుడుతోంది. నేరుగా రైతుల నుంచే కొనుగోలు రేషన్ లబ్ధిదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించడంలో భాగంగా స్థానిక రైతులకు సంపూర్ణ మద్దతు కల్పిస్తూ పౌరసరఫరాల సంస్థ రాగులు, జొన్నల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయ శాఖ ద్వారా రైతులను చిరుధాన్యాల సాగువైపు తీసుకెళ్తోంది. ఇందులో భాగంగానే రాయితీపై చిరుధాన్యాల విత్తనాలను అందిస్తోంది. కొర్రల కొనుగోలుకు సైతం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరీ మద్దతు ధరల జాబితాలో చేర్పించింది. కొర్రలు కోతలకు వచ్చే సమయంలో వాటిని రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇప్పుడు శ్రీసత్యసాయి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో రాగులు, అనంతపురం, నంద్యాల, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో జొన్నల కొనుగోలును చేపడుతోంది. ఆర్బీకేల ద్వారా ఈ–క్రాప్ ప్రామాణికంగా వ్యవసాయ క్షేత్రం నుంచే పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ రైతుకు బాసటగా నిలుస్తోంది. వాటిని ప్రాసెసింగ్ చేసి తిరిగిన స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పంపిణీ చేస్తోంది. దీంతోపాటు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ద్వారా ఇతర రాష్రా్టల నుంచి రాగులును దిగుమతి చేసుకుంటోంది. ఈ ఖరీఫ్‌లో ఇప్పటివరకు రాగులు, జొన్నలు కలిపి సుమారు 6,500 టన్నులకుపైగా సేకరించింది. మరో 20 వేల టన్నుల జొన్నలు.. నంద్యాల జిల్లాలో జొన్నలు మంచి దిగుబడులు వచ్చాయి. రైతుల నుంచి డిమాండ్ ఉండటంతో అదనంగా జొన్నల కొనుగోలుకు పౌరసరఫరాల సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. దీని ప్రకా రం మరో 20వేల టన్నుల వరకు జొన్నలను సేకరించనుంది. ఇందులో రాష్ట్ర అవసరాలకు పోనూ మిగిలిన వాటిని ఎఫ్‌సీఐకి అందించనుంది. తద్వారా రాష్ట్ర రైతులకు పూర్తి మద్దతు ధర దక్కేలా చర్యలు చేపడుతోంది. గోధుమ పిండికి డిమాండ్.. పీడీఎస్‌లో అందిస్తున్న ఫోర్టిఫైడ్ గోధుమ పిండికి మంచి డిమాండ్ ఉంది. ప్రతి నెలా 2,500 టన్నుల నుంచి 5 వేల టన్నుల వరకు వినియోగం ఉంటోంది. ఇదే గోధుమ పిండిని కేంద్ర ప్రభుత్వం భారత్ బ్రాండ్ పేరుతో కిలో రూ.27.50కు ఇస్తుంటే.. రాష్ట్రంలో కిలో రూ.16కే అందిస్తున్నారు. మార్కెట్ రేటు కంటే తక్కువకే నాణ్యమైన గోధుమపిండి లభిస్తుండటంతో కార్డుదారులు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పౌష్టికాహారం అందించాలన్నదే సీఎం జగన్ లక్ష్యం.. పీడీఎస్‌లో పౌష్టికాహారం అందించాలన్నదే సీఎం జగన్ లక్ష్యం. అందుకే నాణ్యమైన ఫోర్టిఫైడ్ బియ్యంతో పాటు రాగులు, జొన్నలు, ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని సరఫరా చేస్తున్నాం. రాగులుకు వినియోగదారుల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే వాటిని మిల్లింగ్ చేసుకుని వాడుకునేందుకు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి. అందుకే రాగిపిండిని ఇవ్వాలని నిర్ణయించాం. కిలో ప్యాకెట్ల రూపంలో రూ.11కే మార్చి నుంచి అందుబాటులోకి తెస్తున్నాం. రాగులను ప్రాసెసింగ్ చేసి.. పిండి ఆడించి, ప్యాకింగ్, రవాణా చేసేందుకయ్యే ఖర్చులను మాత్రమే రేటుగా నిర్ధారించాం. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో పెట్రోల్ కటకట!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలకు చుక్కలు చూపించింది. ప్రధానంగా హైదరాబాద్, ఇతర నగరాలు, పట్టణాల్లోని బంకులకు వాహనాలు పోటెత్తడం, ప్రధాన రహదారుల పక్కన కూడా బారులు తీరడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మధ్యాహ్నానికల్లా చాలావరకు బంకులు మూతపడటం, తెరిచి ఉన్న బంకులను ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఫోర్ వీలర్లు చుట్టు ముట్టడంతో ఒక దశలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. పలుచోట్ల బంకుల సిబ్బంది, వాహనదారుల మధ్య ఘర్షణలు జరగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. సాయంత్రానికి పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. బంకుల వద్ద ట్రాఫిక్ స్తంభన ప్రభావం ప్రధాన కూడళ్లు, రహదారులపై పడింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌తో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. పనుల మీద బయటకొచ్చిన వారు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక పెట్రోల్, డీజిల్ అయిపోయిన వాహనదారుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంతో.. వాస్తవానికి రెండురోజుల క్రితమే వంటగ్యాస్, డీజిల్, పెట్రోల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెకు దిగారు. ఫలితంగా ప్రెటోల్ బంకులకు సరఫరా నిలిచిపోయింది. ఇక బుధవారం నుంచి దేశవ్యాప్తంగా ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు పూర్తి స్థాయిలో సమ్మెకు దిగనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడంతో వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు పోటెత్తారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం వేలాదిగా వాహనాలు బారులు తీరాయి. సమ్మె ఎన్ని రోజులు కొనసాగుతుందో అన్న ఆందోళనతో ఎక్కువమంది ట్యాంకులు ఫుల్ చేయించడం కన్పించింది. కొందరు నిబంధనలకు విరుద్ధంగా పెద్దపెద్ద క్యాన్లలో ఆయిల్ నింపుకొని తీసుకెళ్లారు. దీంతో మధ్యాహ్నానికల్లా చాలా వరకు బంకుల్లో నిల్వలు ఖాళీ అయ్యాయి. ఆయా బంకుల యాజమానులు బంకులు మూసేసి నో స్టాక్ బోర్డులు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,500 పెట్రోల్ బంకులు ఉండగా 3 వేల వరకు బంకులు మూతపడటంతో సాయంత్రానికి పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమయ్యింది. హైదరాబాద్ నగరంలోని పెట్రోల్ బంకులన్నింటిలో నిల్వలు ఖాళీ అయ్యాయి. తాత్కాలికంగా సమ్మె విరమణ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో నిల్వలు ఖాళీ కావడంతో డీలర్ల సొంత ట్యాంకర్లను రంగంలోకి దింపారు. వారు ఆందోళన విరమించి ఇంధన సరఫరాకు సిద్ధమయ్యారు. మరోవైపు సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నట్లు రాష్ట్ర పెట్రోల్ డీజిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి ప్రకటించారు. కేంద్రం తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుకు నిరసనగా డ్రైవర్లు సోమవారం నుంచి ఆయిల్ టాంకర్స్ నిలిపివేసి ఆకస్మిక సమ్మెలోకి వెళ్ళారని తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ల అసోసియేషన్లు కూడా సమ్మె విరమించే అవకాశాలు ఉండటం, చమురు సంస్ధల డిపోల వద్దకు డీలర్ల ట్యాంకర్లు లోడింగ్‌కు చేరుకోవడంతో బుధవారం ఆయిల్ సరఫరాకు అంతరాయం ఉండబోదని డీలర్ల వర్గాలు ప్రకటించాయి. ఇంధన సరఫరాలో కొరత ఉండదు: పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఇంధన ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెకు పిలుపునివ్వడంతో పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ మంగళవారం పౌరసరఫరాల భవన్లో బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్ ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సమ్మె చేస్తున్న ట్యాంకర్ల డ్రైవర్లతో చర్చించాలని, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌కు కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాకుండా చూడాలన్నారు. ఆయిల్ కంపెనీలకు, డ్రైవర్లకు తాము పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తక్షణమే విధుల్లో చేరాలని ట్యాంకర్ల డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి కొరత ఉండదని, ప్రజలు ఆందోళనకు గురికావద్దని కమిషనర్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అప్పా జంక్షన్ వద్ద ఎస్ఐకి గాయాలు! రాజేంద్రనగర్: బండ్లగూడ అప్పా జంక్షన్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం రాత్రి సిబ్బందికి వాహనదారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పెట్రోల్ కోసం వచ్చిన సందర్భంగా వాగ్వావాదం జరగడంతో పరస్పరం దాడి చేసుకున్నట్టు సమాచారం. ఈ పెట్రోల్ బంకును పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా.. విధుల్లో ఉన్న ఒక ఎస్ఐ ర్యాంకు అధికారితో పాటు సిబ్బందికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. అయితే దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు చెప్పారు. -
AP: వలంటీర్లకు ప్రతినెలా అదనంగా రూ.750
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు వలంటీర్లకు ప్రతి నెలా గౌరవ వేతనంగా చెల్లిస్తున్న రూ.5,000కు అదనంగా మరో రూ.750ను ప్రోత్సాహకంగా చెల్లించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమంలో వలంటీర్లు క్రియాశీలకంగా పాల్గొంటున్నందుకు ఈ ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్టు తెలిపింది. ప్రతి నెలా రూ.750 మొత్తాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా వేరేగా వలంటీర్లకు అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ కొద్ది రోజుల క్రితం గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ టీఎస్ చేతన్ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతోపాటు జాయింట్ కలెక్టర్లు, జిల్లాల గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇన్చార్జిలు, మున్సిపల్ కమిషనర్లు, డీఎల్డీవోలు, ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 13న సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకుఇంటింటికీ æరేషన్ పంపిణీలో వలంటీర్లను మరింత భాగస్వాములను చేయనున్నారు. ఇందుకు సంబంధించి పౌరసరఫరాల శాఖ వలంటీర్లకు కొన్ని ప్రత్యేక విధులను నిర్ధారించింది. వీటిని కూడా రాష్ట్రవ్యాప్తంగా అధికారులకు తెలియజేశారు. కాగా వలంటీర్లకు రూ.750 అదనపు ప్రోత్సాహకాన్ని ఎప్పటి నుంచో వర్తింపజేస్తామో వేరేగా ఆదేశాలు జారీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఇంటింటికీ రేషన్ పంపిణీలో వలంటీర్లకు ప్రత్యేక విధులు.. వలంటీర్లు తమ క్లస్టర్ (గ్రామీణ ప్రాంతాల్లో 50 ఇళ్ల పరిధి, పట్టణ ప్రాంతాల్లో 75–100 ఇళ్ల పరిధి)లో ఇంటింటికీ రేషన్ పంపిణీలో పూర్తి అనుసంధానకర్తలుగా వ్యవహరించాల్సి ఉంటుంది. లబ్ధిదారులు ప్రతినెలా ప్రభుత్వం అందజేసే రేషన్ సరుకులను తీసుకునేలా విస్తృత ప్రచారం చేయాలి. రేషన్ వాహనాలు ఇంటింటికీ పంపిణీకి వచ్చే సమయాన్ని ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు తెలియజేయాలి. పంపిణీ జరిగే సమయంలో వలంటీర్లు కూడా ఉండాలి. రేషన్ సరుకులు తీసుకునే క్రమంలో లబ్ధిదారులు వేలిముద్రలు వేయడం తదితర అంశాల్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అక్కడికక్కడే వాటి పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. తమ పరిధిలో రేషన్ పంపిణీలో ఏవైనా లోపాలు, అవకతవకలు జరిగినట్టు గుర్తిస్తే.. ఆ వివరాలను వెంటనే సంబంధిత వీఆర్వో లేదా డిప్యూటీ తహసీల్దార్లకు తెలియజేయాల్సి ఉంటుంది. -
28 నుంచి రేషన్ దరఖాస్తుల స్వీకరణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు చాలా ఏళ్లుగా ఎదురు చూ స్తున్న కొత్త ఆహార భద్రత కార్డుల (రేషన్ కార్డులు) జారీకి ప్రభుత్వం సన్నద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు దరఖాస్తుల నమూనా లను ప్రభుత్వం ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. మీ–సేవ కార్యాలయాల ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరించి, అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు గ్రామ, బస్తీ సభలను నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే రేషన్‌కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానానికి సంబంధించి విధివిధానాలు ఆదివారం జరిగే జిల్లా కలెక్టర్ల సమావేశం తరువాత వెలువడే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు జారీ చేసిన రేషన్‌కార్డుల వివరాలను అడిగి తెలుసుకు న్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరు వాత మొదలైన తెలుపు, గులాబీ కార్డుల జారీ ప్రక్రియ భారీ ఎత్తున సాగింది. ఈ లెక్కన రాష్ట్రంలో తెలుపు, గులాబీ కార్డు లు తెలంగాణ ఏర్పాటయ్యే నాటికే 83 లక్షలకు పైగా జారీ అయ్యాయి. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత జాతీయ స్థాయిలో జరిగిన మార్పుల వల్ల తెలుపు, గులాబీ కార్డుల స్థానంలో ఆహారభద్రత కార్డులు మంజూరు అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం పదేళ్లలో కొత్తగా 6.50 లక్షల కార్డులు మంజూరు చేసింది. ఇవి కాకుండా 11 లక్షలకు పైగా రేషన్ కార్డుల దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ పథకాలకు కార్డు తప్పనిసరి కావడంతో... రేషన్ బియ్యం కన్నా రాష్ట్ర ప్రభుత్వం అందించే పలు పథకాలకు ఆహార భద్రత కార్డు తప్పనిసరిగా మారింది. ఆరోగ్యశ్రీతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలలో మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్, పేదల గృహ నిర్మాణం వంటి అనేక పథకాలకు ఆహార భద్రత కార్డు తప్పనిసరైంది. ఆరోగ్యశ్రీ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన నేపథ్యంలో పేద, మధ్య తరగతి వర్గాలకు రేషన్‌కార్డుల అవసరం తప్పనిసరైంది. గతంలో తొమ్మిది లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే 2021లో చివరిసారిగా 3 లక్షల కార్డులు జారీ చేశారు. కొత్త రేషన్‌కార్డులతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో పిల్లలు, కుటుంబసభ్యుల పేర్లు మార్పులు , చేర్పులు చేయడం వంటి ప్రక్రియ కూడా కొన్నేళ్లుగా నిలిపివేయడంతో ఈసారి డిమాండ్ పెరిగింది. కొత్త కార్డుల ప్రక్రియకు సంబంధించి విధి విధానాలు వస్తే అర్హులైన వారంతా దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. కొత్త దరఖాస్తుదారులు ఆధార్, అడ్రస్ ప్రూఫ్‌తో పాటు గ్యాస్ కనెక్షన్ వివరాలను కూడా పొందుపరచాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత వర్గాల వారికి కార్డులు జారీ చేయకుండా నిబంధనలు విధించనున్నారు. అదే సమయంలో ఇప్పటికే కార్డులు పొందిన వారిలో అనర్హులను గుర్తించే ప్రక్రియ కూడా చేపట్టే అవకాశం ఉన్నట్లు ఓ పౌరసరఫరాల శాఖ అధికారి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కార్డుల వివరాలు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడున్న కార్డుల సంఖ్య : 90,14,263 ఇందులో జాతీయ ఆహారభద్రత చట్టం (ఎన్ ఎఫ్ ఎస్) కింద జారీ చేసిన కార్డులు : 54,48,170 రాష్ట్ర ఆహారభద్రత కార్డులు : 35,66,093 ఈ కార్డుల లబ్ధిదారులు : 2,83,39,478 -
8 వేల టన్నుల కందిపప్పు సిద్ధం
సాక్షి, అమరావతి: ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా రైస్ కార్డుదారులందరికీ సబ్సిడీపై కందిపప్పు సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని జనవరిలో ఎనిమిదివేల టన్నుల కందిపప్పు నిల్వలను సిద్ధం చేస్తోంది. ఈ నెల 23వ తేదీలోగా మండలస్థాయి నిల్వ కేంద్రాలకు (ఎంఎల్ఎస్ పాయింట్లకు) సరుకు తరలించనుంది. ప్రస్తుత నెలలో 46.64 లక్షల మందికి సుమారు 4,604 టన్నుల కందిపప్పును కిలో రూ.67కే అందించింది. గిరిజన ప్రాంతాల్లోని జీసీసీల ద్వారా కూడా సబ్సిడీపై కందిపప్పు విక్రయాలు సాగించేలా ప్రోత్సహించనుంది. ఏడాదిగా మార్కెట్లో కందిపప్పు ధరలు పెరుగుతూ వచ్చాయి. మహారాష్ట్రలో భారీవర్షాలకు కందిపంట పూర్తిగా దెబ్బతినడంతో ఒక్కసారిగా కందిపప్పునకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లోకి కొత్తపంట వస్తుండటంతో రేటు నెమ్మదిగా దిగొస్తోంది. ఒకప్పుడు మార్కెట్లో కిలో కందిపప్పు రూ.115 ఉన్నప్పుడు సబ్సిడీపై రూ.67కే అందించిన ప్రభుత్వం.. ఆ తర్వాత రేటు రూ.160–170కి పెరిగినా సబ్సిడీని తగ్గించలేదు. మధ్యలో మూడు, నాలుగునెలలు మార్కెట్లో లోటు ఉండటంతో పీడీఎస్‌లో కందిపప్పు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇకపై నిరంతరాయంగా పంపిణీ చేసేలా పౌరసరఫరాలశాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. గోధుమపిండికి డిమాండ్ పీడీఎస్ లబ్దిదారులకు వీలైనన్ని ఎక్కువ పౌష్టికాహార పదార్థాల పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే పైలెట్ ప్రాజెక్టు కింద పట్టణ ప్రాంతాల్లో ఫోరి్టఫైడ్ (విటమిన్లతో కూడిన) గోధుమపిండిని పరిచయం చేసింది. ప్రజల నుంచి స్పందన బాగుండటంతో నెమ్మదిగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోంది. ప్రస్తుతం నెలకు మూడువేల టన్నుల గోధుమపిండి సరఫరా చేస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారత్ ఆటా పేరుతో కిలో రూ.27.50కు ఇస్తుంటే.. ఏపీలో మాత్రం కిలో రూ.16కే అందిస్తుండటం గమనార్హం. లబ్ధిదారులకు దీన్ని మరింత తక్కువ రేటుకు ఇచ్చేలా పౌరసరఫరాలశాఖ కేంద్ర ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన పంపనుంది. రైస్ కార్డుదారుల ఇష్టం మేరకు కిలో బియ్యానికి బదులు కిలో గోధుమపిండి ఇవ్వనుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం బియ్యం పరిమాణాన్ని తగ్గించుకుని దానికి బదులు గోధుమలను సరఫరా చేస్తుంది. వాటిని ప్రాసెసింగ్ చేసి ఫోరి్టఫైడ్ అనంతరం ప్యాకింగ్, రవాణాకు అయ్యే ఖర్చులను లెక్కించి పౌరసరఫరాలశాఖ ధర నిర్ణయించనుంది. ఈ విధంగా కిలో రూ.11–12కే గోధుమపిండి ఇవ్వొచ్చని భావిస్తోంది. ప్రస్తుతం ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకు మాత్రమే నెలకు 1,800 టన్నుల గోధుమలను కేంద్రం అందిస్తోంది. మిగిలిన కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా పంపిణీ చేస్తోంది. ఫిబ్రవరి నుంచి మొత్తం కార్డుదారులకు గోధుమపిండిని అందుబాటులో ఉంచేలా కసరత్తు చేస్తోంది. వీటితోపాటు పంచదార, రాయలసీమలో చిరుధాన్యాల పంపిణీకి అవసరమైన నిల్వలను తరలిస్తోంది. నెలాఖరులోగా కందుల సేకరణ పౌరసరఫరాలసంస్థ ద్వారా స్థానిక రైతుల నుంచి మద్దతు ధరకు కందులు సేకరించడంతోపాటు వాటిని ప్రాసెసింగ్, ప్యాకింగ్ చేసి తిరిగి పీడీఎస్‌లోకి ప్రవేశపెట్టేలా పౌరసరఫరాలశాఖ ప్రణాళికలు రూపొందించింది. ఈ నెలాఖరులోగా ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనుంది. అవసరమైతే మార్కెట్ రేటును చెల్లించైనా రైతుల నుంచి 35 వేల టన్నులకుపైగా కందులను సేకరించాలని నిర్ణయించింది. ధాన్యం మాదిరిగానే రవాణా, కూలీ, గోతాల ఖర్చులను సైతం రైతులకు ఇవ్వనుంది. కందులు సేకరించిన వారంలోగా రైతుల ఖాతాల్లో మద్దతు ధరను జమచేయనుంది. నాణ్యతలో రాజీలేకుండా ఇప్పటివరకు పీడీఎస్‌లో పంపిణీ చేస్తున్న కందిపప్పు బయట ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్నదే. తొలిసారిగా ఏపీలో పండిన పంటను రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి మర ఆడించి ప్రత్యేక ప్యాకింగ్‌లో రైస్ కార్డుదారులకు ఇవ్వాలని నిర్ణయించాం. తద్వారా అక్కడక్కడ కందిపప్పు నాణ్యతపై వస్తున్న విమర్శలను అధిగమించవచ్చు. ఏపీ అవసరాలకు తగినంత నిల్వలను ఇక్కడే సేకరిస్తాం. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఇకపై జాప్యం లేని పంపిణీకి చర్యలు చేపడుతున్నాం. ఆర్బీకేలోని క్షేత్రస్థాయి సిబ్బంది, జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాలసంస్థ సిబ్బంది సమన్వయంతో రైతులకు అవగాహన కల్పించి కందులు కొనుగోలు చేస్తా – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాలశాఖ -
వచ్చే నెల నుంచి కందిపప్పు పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు కందిపప్పు పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెల (నవంబర్) నుంచి క్రమం తప్పకుండా లబ్దిదారులకు కిలో చొప్పున అందించనుంది. తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ 10 వేల టన్నుల కందిపప్పు కొనుగోలుకు హైదరాబాద్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ (హాకా)కు ఆర్డర్ ఇచ్చింది. అయితే హాకా వద్ద కూడా తగినంత నిల్వలు లేకపోవడంతో 7,200 టన్నుల సరఫరాకు అంగీకరించింది. ఇందులో భాగంగా తొలి దశలో 3,660 టన్నులు, రెండో దశలో 3,540 టన్నులు అందించనుంది. ఇప్పటికిప్పుడు అంటే వచ్చే నెల అవసరాలకు గాను 2,300 టన్నుల సరఫరాకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయంగా పప్పుధాన్యాల కొరతతో రేట్లు ఆకాశాన్నంటాయి. దేశవ్యాప్తంగా పంట ఉత్పత్తులు బహిరంగ మార్కెట్‌కు వెళ్లిపోవడంతో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)వద్ద కూడా నిల్వలు కరువయ్యాయి. ఫలితంగా కందిపప్పు పంపిణీకి అవాంతరాలు ఏర్పడ్డాయి. ఈ నెలాఖరుకు సరుకు తరలింపు ప్రస్తుతం మార్కెట్లో కిలో కందిపప్పు రకాన్ని బట్టి రూ.150 నుంచి రూ.180 వరకు ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హాకా నుంచి మద్దతు ధర ప్రాతిపదికనే కందులు సేకరించినప్పటికీ.. వాటికి అదనంగా ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు అవ్వనున్నాయి. ఈ మొత్తంలో రూ.67కు మాత్రమే కిలో కందిపప్పును ప్రభుత్వం లబ్దిదారులకు ఇవ్వనుంది. అంటే దాదాపు సబ్సిడీ రూపేణా ప్రభుత్వం రూ.70పైగానే భరిస్తున్నట్టు సమాచారం. ఈ నెలాఖరు నాటికి చౌక ధరల దుకాణాల వద్దకు అందుబాటులో ఉన్న నిల్వల ప్రకారం సరుకును తరలించనుంది. డిసెంబర్, జనవరిల్లో పూర్తి స్థాయిలో కార్డుదారులకు సబ్సిడీ కందిపప్పును ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. మార్కెట్ రేటుకే కందుల కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు వీలుగా 50 వేల టన్నుల కందిపప్పును కేటాయించాలని కేంద్రానికి పదేపదే విజ్ఞప్తి చేసింది. తొలుత కర్ణాటకలోని బఫర్ స్టాక్ నుంచి 9,764 టన్నులు కందులు కేటాయించగా వాటిలో నాణ్యత లోపించింది. ఆ తర్వాత రెండుసార్లు జూన్, సెపె్టంబర్‌ల్లో కేటాయింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కానీ, కేంద్రం నుంచి స్పందన రాలేదు. మండల స్టాక్ సెంటర్ (ఎంఎల్ఎస్)ల్లోని స్టాక్ మొత్తాన్ని పంపిణీకి విడుదల చేయడంతో నిల్వలు నిండుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం హాకా నుంచి కందిపప్పును తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో వచ్చే మూడు నెలలకు హాకా సరఫరా చేసే కందిపప్పును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించనుంది. భవిష్యత్తులో అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు జనవరి నుంచి పౌరసరఫరాల సంస్థ ద్వారా నేరుగా రైతుల నుంచి మార్కెట్ ధరకు ప్రభుత్వం కందులు సేకరించనుంది. తొలుత ఈ ఖరీఫ్‌లో 30 వేల టన్నులు సేకరించాలనే యోచనలో ఉన్నారు. వాటిని స్వయంగా మరాడించి ప్యాకింగ్ చేయించి సబ్సిడీపై కార్డుదారులకు అందించేలా ప్రణాళిక రూపొందించారు. బాబుగారి ‘పప్పు’ డ్రామా అంతర్జాతీయంగా మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి డిమాండ్, సప్లై ఆధారంగా నిత్యావసరాల రేట్లు మారుతుంటాయి. చంద్రబాబు హయాంలో రేట్లు ఎంత పెరిగినా ఇచ్చే సబ్సిడీ మాత్రం పెరిగేది కాదు. పైగా ఆయన పాలన చేపట్టిన తర్వాత సెపె్టంబర్ 2014–జూలై 2015 వరకు కందిపప్పు ఊసే లేదు. ఆగస్టు 2015 నుంచి ఫిబ్రవరి 2017 వరకు కార్డుకు కిలో చొప్పున రూ.50 నుంచి రూ.120 మధ్యన రేట్లు పెంచి విక్రయించారు. 2015 డిసెంబర్లో ఏకంగా రూ.90కి పెంచారు. 2016 జూలై నుంచి 2017 ఫిబ్రవరి మధ్య రూ.120 చేశారు. 2018లో కందిపప్పు బహిరంగ మార్కెట్లో కిలో రూ.63 ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.23 రాయితీ ఇచ్చింది. చివరి ఏడాది మాత్రం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెండు కిలోల కందిపప్పు డ్రామా ఆడారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మొత్తం పంపిణీ చేసింది కేవలం 93 వేల టన్నులు మాత్రమే. ఇందు కోసం రూ.1605 కోట్లు ఖర్చు చేసింది. కానీ, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటివరకు 3.15 లక్షల టన్నుల కందిపప్పు పంపిణీకి రూ.3,084 కోట్లు ఖర్చు చేసింది. కరోనా సమయంలో నిత్యావసరాలను పూర్తి ఉచితంగా అందించింది. కార్డుదారులకు నిరంతరాయంగా పంపిణీ చేసేలా చర్యలు కార్డుదారులకు ప్రతి నెలా నిరంతరాయంగా కందిపప్పు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాం. హాకా ద్వారా కందిపప్పును సేకరిస్తున్నాం. ఇప్పటికే నాణ్యత ప్రమాణాలను పరిశీలించాం. ఈ నెలాఖరు నాటికి ఎఫ్పీ దుకాణాలకు సరుకు చేర్చేలా ఆదేశాలు జారీ చేశాం. డిసెంబర్, జనవరిల్లో వంద శాతం కార్డులకు పంపిణీ చేస్తాం. ఈ ఖరీఫ్‌లో రైతుల నుంచి కందులు కొనుగోలు చేయనున్నాం. ఇప్పటికే అన్ని జిల్లాల్లోని కలెక్టర్లకు కందుల కొనుగోలుపై ప్రచారం కల్పించాలని ఆదేశించాం. మన రైతుల నుంచి మార్కెట్ ధరకు కందులు కొనుగోలు చేసి వాటిని రాష్ట్ర వినియోగానికి వాడుకుంటే.. రైతులకు, లబ్దిదారులకు ఎంతో మేలు జరుగుతుంది. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
గల్ఫ్.. ప‘రేషన్’
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ దేశాల్లో పనిచేసే వలసకార్మికులు ఇప్పుడు పరేషాన్లో పడ్డారు. రేషన్‌కార్డుల్లో పేరు ఉన్న ప్రతి ఒక్కరు ఈ–కేవైసీ పూర్తి చేయించుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ సూచించిన విషయం తెలిసిందే. రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ యంత్రంపై రేషన్ వినియోగదారులు వేలిముద్ర వేసి తమ ధృవీకరణ పూర్తి చేయాలి. రాష్ట్రంలోని వినియోగదారులు ఏ ప్రాంతంలో ఉన్నాసరే సొంతూరుకు వెళ్లకుండానే ఈకేవైసీ పూర్తి చేసే వెసులుబాటు కల్పించారు. పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారు మాత్రం స్వరాష్ట్రానికి వచ్చి ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ–కేవైసీ ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. అయితే దీనికి నిర్ణీత గడువు తేదీని మాత్రం ప్రభుత్వం నిర్ణయించలేదు. వీలైనంత త్వరగా రేషన్‌కార్డుల్లో పేర్లు ఉన్నవారితో ఈకేవైసీ పూర్తి చేయించాలని అధికారులు రేషన్‌డీలర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒక కుటుంబంలోని సభ్యులు వేర్వేరు చోట్ల ఈకేవైసీ పూర్తి చేయించుకోవడానికి అవకాశముంది. ఈ విధానంతో పట్టణాలకు ఉన్నత చదువులకు వెళ్లినవారు, ఉపాధి పొందుతున్న వారు తాము ఉంటున్న పరిసరాల్లోనే ఈకేవైసీ పూర్తి చేయించుకోవచ్చు. కానీ గల్ఫ్‌తోపాటు ఇతర దేశాలకు వలస వెళ్లిన వారు ఇప్పట్లో వచ్చే అవకాశం లేకపోవడంతో వారి ఈకేవైసీ ఎలా అనే సంశయం నెలకొంది. పౌరసరఫరాల శాఖ నిబంధనల ప్రకారం ఈకేవైసీ చేయించుకోని వారి పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగించే ప్రమాదముంది. విదేశాలకు వెళ్లినవారు సంవత్సరాల తరబడి స్వదేశానికి దూరంగానే ఉంటున్నారు. వారు వచ్చిన తర్వాతైనా ఈకేవైసీ చేయించుకోవచ్చా? అనే విషయంపై స్పష్టత లేకపోవడమే ఈ గందరగోళానికి కారణం. స్థానికంగా నివాసం ఉండనందుకు రేషన్‌బియ్యం కోటా తమకు దక్కకపోయినా ఇబ్బంది లేదని, రేషన్‌కార్డుల నుంచి పేర్లు తొలగించవద్దని అని వలస కార్మికులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఏ సంక్షేమపథకం అమలు చేసినా రేషన్‌కార్డు ప్రామాణికంగా తీసుకుంటుంది. ఇలాంటి తరుణంలో తాము ఉపాధి కోసం సొంతూరిని విడచి వేరే ప్రాంతానికి వెళ్లామని, రేషన్‌కార్డుల నుంచి పేర్లు తొలగిస్తే ఎలా అని వలస కార్మికులు ప్రశి్నస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణవాసుల సంఖ్య 15లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈకేవైసీ నిబంధనతో వలస కార్మికులు అధిక సంఖ్యలో నష్టపోయే ప్రమాదం ఉంది. వలస కార్మికుల అంశంపై తమకు ఎలాంటి స్పష్టత లేదని నిజామాబాద్ పౌరసరఫరాలశాఖ అధికారి చంద్రప్రకాశ్ ‘సాక్షి’తో చెప్పారు. ఈకేవైసీ గడువు మూడు నెలల పాటు పొడిగించే అవకాశం ఉందన్నారు. పేర్లు తొలగించకుండా స్టార్‌మార్క్ చేయాలి ఈకేవైసీ పూర్తి చేయని వలస కార్మికుల పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగించకుండా స్టార్‌మార్క్ చేయాలి. వారు సొంతూరికి వచి్చన తర్వాత ఈకేవైసీ అవకాశం కల్పించాలి. వలస కార్మికుల పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగిస్తే వారు ఏ ప్రభుత్వ పథకానికి అర్హులు కాకుండా పోతారు. ప్రభుత్వం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. – మంద భీంరెడ్డి, గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకుడు -
బడా, లోకల్ మిల్లింగ్ కంపెనీలు కొనేలా!
సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ టెండర్ల ద్వారా రాష్ట్రంలోని రైస్‌మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వేలం వేయాలని నిర్ణయించిన పౌరసరఫరాల శాఖ బిడ్డింగ్ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. ఈ–వేలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి బడా కంపెనీలతో పాటు రాష్ట్రంలోని మిల్లింగ్ కంపెనీలు పాల్గొనేలా సరళమైన విధానాలను టెండర్ నిబంధనల్లో చేర్చారు. 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వేలానికి టెండర్ రాష్ట్రంలోని 2వేలకు పైగా రైస్‌మిల్లుల్లో నిల్వ ఉన్న సుమారు 70 ఎల్ఎంటీ ధాన్యం నుంచి తొలి విడతగా 25 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గత నెల 19వ తేదీన విధి విధానాలను ఖరారు చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయిలో టెండర్లను ఆహా్వనిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆసక్తి గల సంస్థలు, వ్యాపారులు దరఖాస్తులు చేసుకోవడంతో ప్రి బిడ్డింగ్ సమావేశాలను సంస్థ నిర్వహించింది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం విధించిన నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నిబంధనల ద్వారా స్థానిక వ్యాపారులు, మిల్లర్లకు అవకాశం దక్కదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే విడతలో 4లక్షల లేదా 5 లక్షల మెట్రిక్ టన్నుల లాట్లలో ధాన్యం వేలం వేయడం వల్ల బడా కంపెనీలే తప్ప రాష్ట్రంలోని మిల్లర్లు గాని, మిల్లర్ల సిండికేట్ గానీ కొనుగోలు చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం నిబంధనల్లో పలు మార్పులు చేయాలని నిర్ణయించింది. ప్రతీ లాట్‌ను ఒక లక్ష టన్నులుగా మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యాన్ని తొలి విడత 25 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు వేలం వేయాలని తొలుత నిర్ణయించగా... దాన్ని పూర్తిగా కేవలం 6 లాట్స్‌లో «వేలం వేయాలని టెండర్ నోటిఫికేషన్లో పొందుపరిచారు.. ఇందులో ఐదు లాట్స్‌లో 4లక్షల టన్నుల చొప్పున ఉండగా ఒక లాట్లో ఐదు లక్షల టన్నుల ధాన్యం ఉంది. ప్రి బిడ్ మీటింగ్ అనంతరం ఇందులో మార్పులు చేశారు. ప్రతీ లాట్‌ను ఒక లక్ష టన్నులుగా నిర్ణయించారు. అంటే 25 లాట్స్‌లో ధాన్యం వేలం వేయనున్నారు. లక్ష టన్నుల కెపాసిటీ ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రతి కంపెనీ ఈ వేలంలో పాల్గొనేలా నిబంధనలు మార్చారు. వార్షిక టర్నోవర్‌లోనూ భారీ మార్పులు తొలుత ప్రకటించిన టెండర్ నిబందనల ప్రకారం టెండర్లలో పాల్గొనే కంపెనీకి గడిచిన మూడేళ్లలో ప్రతిఏటా రూ.వెయ్యి కోట్ల వార్షిక టర్నోవర్‌తో పాటు రూ.100 కోట్ల నెట్‌వర్త్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అయితే రూ. 1000 కోట్ల టర్నోవర్ ఉన్న బియ్యం కొనుగోలు కంపెనీలు దేశంలో అతి తక్కువగా ఉంటాయన్న వాదనల మేరకు ప్రి బిడ్డింగ్ సమావేశంలో ఈ నిబంధనలు కూడా మార్చారు. రూ. 1,000 కోట్ల టర్నోవర్‌ను రూ.100 కోట్లకు, నెట్‌వర్త్ విలువ ను రూ.100 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు తగ్గించారు. ఇక వేలం తర్వాత ధాన్యం తీసుకెళ్లాల్సిన గడువును 30 రోజుల నుంచి 45 రోజులకు పెంచారు. నిబంధనల్లో మార్పులు చేయడంతో దరఖాస్తు, వేలం తేదీల్లోనూ మార్పులు చేశారు. ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దీంతో ఈ నెల 11న జరగాల్సిన వేలం ప్రక్రియను 16వ తేదీకి వాయిదా వేశారు. నిబంధనల్లో మార్పుతో స్థానిక వ్యాపారులు, మిల్లర్లు టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం లభించనుంది. నిబంధనల సడలింపుతో ఎక్కువ మంది బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం ఏర్పడింది. -
ధాన్యం రవాణాకూ జీపీఎస్
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యం పక్కదారులు పడుతున్నట్లు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిఘా చర్యలపై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు బియ్యం రవాణా వాహనాలకే పరిమితమైన జీపీఎస్ ట్రాకింగ్ విధానాన్ని ధాన్యం రవాణా విషయంలోనూ పాటించాలని నిర్దేశించింది. రైతుల నుంచి ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం నిర్దేశించిన ‘మినిమం త్రెషోల్డ్ పారామీటర్స్ – ఎంటీపీస్’లో భాగంగా ధాన్యం రవాణా వాహనాలన్నింటినీ జీపీఎస్‌తో అనుసంధానించాలని నిర్ణయించారు. ఈ వానాకాలం సీజన్లో వచ్చే పంట నుంచే ఈ విధానం అమలు చేసేందుకు విధివిధానాలను కేంద్రం తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు పంపింది. దీంతో ధాన్యం వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను అమర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ఇప్పటికే ఈ అంశంపై అధికారులతో చర్చించారు. మిల్లులకు తీసుకెళ్లే వాహనాలన్నింటికీ... రాష్ట్రంలో వానాకాలం, యాసంగి సీజన్లలో రైతుల నుంచి ధాన్యం సేకరణ జరుగుతుంది. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చాక తూకం వేసి రైస్‌మిల్లులకు పంపిస్తారు. ఈ ధాన్యం రైస్‌మిల్లులకు వెళ్లాక మిల్లింగ్ అయి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) రూపంలో ఎఫ్‌సీఐ గోదాములకు తరలుతుంది. ఈ క్రమంలో తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో మిల్లులకు ఎంత ధాన్యం వస్తోంది? మిల్లుల నుంచి బియ్యం రూపంలో గోదాములకు ఎంత పరిమాణంలో తిరిగి వెళ్తోందనే అంశంపై నిఘా కోసం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తీసుకెళ్లే ప్రతి వాహనాన్ని జీపీఎస్‌తో అనుసంధానించాలని ఆదేశించింది. రాష్ట్రంలో ప్రతి సీజన్లో సుమారు 7 వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఒక్కో కేంద్రం నుంచి మిల్లుల లభ్యతను బట్టి పక్క జిల్లాలకు, దూర ప్రాంతాలకు కూడా పంపుతున్నారు. సాధ్యాసాధ్యాలపై మల్లగుల్లాలు.. బియ్యం లారీలు గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు... అక్కడి నుంచి పౌరసరఫరాల దుకాణాలకు చేరేందుకు 2016లోనే జీపీఎస్ ట్రాకింగ్ విధానాన్ని రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా సీవీ ఆనంద్ ఉన్న కాలంలో ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ ఇప్పటికీ సక్రమంగా అమలు కావట్లేదు. దీన్ని పర్యవేక్షించే యంత్రాంగం కూడా లేదు. బియ్యం లారీల కోసం కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానించి ప్రతినెలా బియ్యం పంపిణీ జరుపుతుండగా దీన్నే తూతూమంత్రంగా అమలు చేస్తున్న పౌరసరఫరాల సంస్థ... ధాన్యం సేకరణలో జీపీఎస్ ట్రాకింగ్ చేయడం కష్టమేనని చెబుతోంది. ఎందుకంటే ప్రతి సీజన్లో రెండు నెలలపాటు సాగే ధాన్యం రవాణాకు అందుబాటులో ఉన్న అన్ని లారీలతోపాటు గ్రామాల్లో ఎక్కువగా ట్రాక్టర్లను వినియోగిస్తారు. రాష్ట్రంలోని 130కిపైగా ఉన్న సెక్టార్ల నుంచి సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వచ్చే ధాన్యాన్ని సేకరించి మిల్లులకు పంపేటప్పుడు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేయడం సాధ్యం కాదని అధికారులు తేల్చినట్లు సమాచారం. అయితే కేంద్రం ఈ విషయంలో కఠినంగా ఉండటంతో వానాకాలం సీజన్ నుంచే ఎలా అమలు చేయాలనే దానిపై ఈ నెల 21న ఢిల్లీలో జరిగే కార్యదర్శుల సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. -
కొత్తగా 1.63 లక్షల రైస్ కార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా బియ్యం కార్డుల మంజూరు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ప్రభుత్వం ఏటా రెండు సార్లు జూన్, డిసెంబర్లో అర్హులకు కొత్త కార్డులు అందజేస్తోంది. ఇప్పటివరకు 1,63,333 కొత్త రైస్ కార్డులకు ఆమోదం లభించగా తహసీల్దార్ల డిజిటల్ సంతకాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇది పూర్తయిన వెంటనే కార్డులను ముద్రించి వలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. జగనన్న సురక్షలో బియ్యం కార్డుల కోసం అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు ఈ దఫాలోనే కార్డులు అందించనున్నారు. దీనికి ఈ నెల 31వతేదీ వరకు అవకాశం కల్పించిన నేపథ్యంలో కొత్తగా జారీ చేసే బియ్యం కార్డుల సంఖ్య మరింత పెరగనుంది. కొత్తగా 3,81,061 మందికి లబ్ధి రాష్ట్రంలో ఇప్పటివరకు 1.46 కోట్ల కార్డులకుగాను 4.25 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. కొత్త కార్డుల మంజూరు ద్వారా అదనంగా 3,81,061 మందికి ప్రతి నెలా పీడీఎస్ ద్వారా లబ్ధి చేకూరనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. నాణ్యమైన (సార్టెక్స్)బియ్యాన్ని ఇంటివద్దకే అందించడంతో ప్రతి నెలా రేషన్ తీసుకువారి సంఖ్య పెరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం ఇచ్చినా దాన్ని తినేవారు తక్కువగా ఉండేవారు. పేదలకు ఇచ్చే బియ్యం ముక్కిపోవటం, పురుగులు పట్టడం, రాళ్లు, నూకలు ఎక్కువగా ఉండటంతో పాటు గింజ రంగు మారిపోయేది. బియ్యాన్ని లబ్ధిదారులు శుభ్రం చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడిస్తున్న నాణ్యమైన సార్టెక్స్ బియ్యం పేదల ఆకలి తీరుస్తోంది. కరోనా సమయంలో ప్రభుత్వం ఇచ్చిన నాణ్యమైన రేషన్ బియ్యమే ఎంతో మంది పేదలను ఆదుకుంది. బియ్యం సార్టెక్స్ కోసం కిలోకు రూపాయి చొప్పున నెలకు రూ.20 కోట్ల అదనపు భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. పీడీఎస్ వ్యవస్థ బలోపేతం.. టీడీపీ హయాంలో రేషన్ సబ్సిడీపై రూ.13 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చూపినా పేదలకు ప్రయోజనం దక్కలేదు. ఇప్పుడు నాలుగేళ్లలో ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతమైంది. 100.13 లక్షల టన్నుల నాణ్యమైన బియ్యం, 2.99 లక్షల టన్నుల కందిపప్పు, 2.34 లక్షల టన్నుల పంచదారను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇందుకు సుమారు రూ.23,680 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. పంచదార, కందిపప్పుపై గతంతో పోలిస్తే మూడు రెట్లకు పైగా సబ్సిడీ భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. వీటికి తోడు 18 జిల్లాల్లో నాణ్యమైన బలవర్థక బియ్యాన్ని (ఫోర్టిఫైడ్) అందిస్తోంది. ఏప్రిల్ నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాగి, జొన్నలు, అన్ని మున్సిపాల్టీల్లో గోధుమ పిండి పంపిణీని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం కేవలం జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కార్డులకు మాత్రమే రేషన్ ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం నాన్–ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు సైతం రేషన్ సరఫరా చేస్తూ పేదలకు అండగా నిలుస్తోంది. ఉచితంగా కిలో రూ.40 విలువైన బియ్యం ఒకవేళ రేషన్ తీసుకోకుంటే కార్డు రద్దు అవుతుందనే ఆందోళనతో కొందరు ప్రతి నెలా సరుకులు తీసుకుని దళారులకు విక్రయిస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ ప్రత్యేక వీడియో సందేశం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 50 లక్షల మంది కార్డుదారుల వాట్సాప్ నంబర్లకు వీడియో సందేశాలను చేరవేసింది. ఎండీయూ వాహనాల ద్వారా కూడా ప్రచారం చేస్తోంది. ప్రభుత్వం కిలోకు రూ.40 చొప్పున ఖర్చు చేస్తూ పేదలకు ఉచితంగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. ఇంత ఖరీదైన బియ్యాన్ని వృథా చేయకుండా ప్రజలు భోజనంగానే కాకుండా దోశలు, ఇడ్లీలు, మురుకులు, స్వీట్లు లాంటి చిరుతిళ్ల తయారీకి కూడా వినియోగించవచ్చని సూచిస్తోంది. కార్డు రద్దు చేయడం లేదు.. రేషన్ తీసుకోకుంటే ఎక్కడా కార్డును రద్దు చేయడం లేదు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార రేషన్‌ను ప్రజలు తక్కువగా చూడొద్దు. కొన్ని చోట్ల మధ్యవర్తులకు తక్కువ రేటుకు రేషన్ బియ్యన్ని విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. రేషన్ బియ్యం విక్రయాలు, అక్రమ రవాణాను పూర్తిగా అరికడతాం. కొత్త కార్డు కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏటా జూన్, డిసెంబర్లో అర్హులకు కార్డులు మంజూరు చేస్తున్నాం. తాజాగా జగనన్న సురక్ష దరఖాస్తులను పరిశీలించి వారికి కూడా కార్డులు ఇస్తున్నాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
తక్కువ ధరకే నిత్యావసరాల పంపిణీ
సాక్షి, అమరావతి: ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం, కందిపప్పును మార్కెట్ ధరల కంటే తక్కువ రేట్లకు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండు నెలలుగా బియ్యం, కందిపప్పు ధరల్లో పెరుగుదల నమోదైందని, ఈ క్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఆధ్వర్యంలో టోకు వ్యాపారులు, వాణిజ్య మండలి ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వ్యాపారులు, మిల్లర్లు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా తక్కువ రేట్లకు నిత్యావసరాలు విక్రయించేందుకు ముందుకు రావాలని మంత్రి విజ్ఞప్తి చేయగా సానుకూల స్పందన లభించిందని పేర్కొన్నారు. మరోవైపు ధరల నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వ్యాపారులు తమ వద్ద ఉన్న సరుకు నిల్వలను భారత ప్రభుత్వ వెబ్ సైట్ http://fcain foweb.nic.in/psp లో నమోదు చేయాలని సూచించినట్టు తెలిపారు. ధరల జాబితా ప్రదర్శించడంతో పాటు వినియోగదారులకు బిల్లులు ఇవ్వాలన్నారు. కొంత మంది వ్యాపారులు జీఎస్టీ మినహాయింపు కోసం 24, 26 కిలోల పరిమాణంలో వస్తువులను ప్యాకింగ్ చేసి విక్రస్తున్నారని, వినియోగదారుల నుంచి పన్నుతో కలిపి ధరను వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి, సరుకు నిల్వలు లేకపోవడం, స్వేచ్ఛా వాణిజ్యంలో భాగంగా ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడి సరుకులను కొనుగోలు చేయడంతో ధరలు పెరిగినట్టు తెలిపారు. ప్రధానంగా ఆఫ్రికా దేశాల్లో ఉత్పత్తి తగ్గిపోవడంతో కందుల దిగుమతులు మందగించాయన్నారు. బీపీటీ, సోనా మసూరి వంటి నాణ్యమైన రకాల బియ్యాన్ని తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర వ్యాపారులు కొనుగోలు చేయడం కూడా ఒక ప్రధాన కారణంగా అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. -
కొర్రలకు ‘మద్దతు’ ఇవ్వండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొర్రల సాగును ప్రోత్సహించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రైతులకు భరోసా కల్పించేలా కొర్రలను మద్దతు ధర పంటల జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటివరకు చిరుధాన్యాల్లో రాగులు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తోంది. అయితే అనంతపురం, కడప, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో ఎక్కువగా కొర్రలను సాగు చేస్తున్నారు. మంచి దిగుబడులు రావడం, మార్కెట్లో డిమాండ్ ఉండటంతో రైతుకు లాభసాటిగా మారింది. మరోవైపు ప్రభుత్వం కూడా సాంప్రదాయ పంటల నుంచి చిరుధాన్యాల సాగువైపు రైతులను నడిపించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పౌరసరఫరాల శాఖ కాన్ఫరెన్స్‌లో.. కొర్రలను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీంతో ఏపీ పౌరసరఫరాల సంస్థ సమగ్ర వివరాలతో కొర్రలకు మద్దతు ధర కోసం ప్రతిపాదనలు పంపే పనిలో నిమగ్నమైంది. పీడీఎస్ ద్వారా పంపిణీకి చర్యలు.. రాష్ట్రంలోని 1.47 కోట్ల రైస్ కార్డుదారులకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. రెండు నెలల నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్రలోని 13 జిల్లాల్లో రాగులు, జొన్నలను పంపిణీ చేస్తున్నారు. కార్డుదారుల ఐచ్చికం మేరకు 2 కేజీల బియ్యం బదులు వీటిని అందిస్తుండగా.. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రాయలసీమ, ఉత్తరాంధ్రలో రాగులను ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీంతో పీడీఎస్‌లో జొన్నల కంటే రాగులకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే 8 వేల టన్నులకు పైగా రాగులను పంపిణీ చేశారు. తాజాగా కొర్రలను కూడా పీడీఎస్ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానికంగా రైతుల నుంచే కొనుగోలు చేసి తిరిగి ప్రజలకు సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. గ్రామాల్లో సర్వే.. మరోవైపు రాష్ట్రంలోని అన్ని మునిసిపాల్టీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని పంపిణీ చేస్తున్నారు. కార్డుకు కిలో చొప్పున రూ.16కు ప్రత్యేక ప్యాకింగ్‌లో దీనిని అందిస్తున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో గోధుమ పిండి వినియోగం తక్కువ ఉండటంతో.. కొత్తగా సర్వే చేపట్టి వచి్చన ఫీడ్‌బ్యాక్ ప్రకారం పంపిణీకి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే బియ్యం బదులుగా కూడా గోధుమ పిండిని తీసుకునే వెసులుబాటు కల్పించి.. ఇప్పుడిచ్చే ధర కంటే తక్కువకే సరఫరా చేసే యోచనలో పౌరసరఫరాల శాఖ ఉంది. పౌష్టికాహారం తప్పనిసరి ఆరోగ్య రక్షణ దృష్ట్యా ప్రతి ఒక్కరూ బలవర్థక ఆహారం తీసుకోవాల్సిన అవసరముంది. అందుకే పేదలకు పీడీఎస్ ద్వారా పంపిణీ చేసే నిత్యావసరాల్లో చిరుధాన్యాలను అందిస్తున్నాం. ఇప్పటివరకు రాగులు, జొన్నలు ఇచ్చాం. ఇకపై కొర్రలను కూడా పంపిణీ చేసే ఆలోచన చేస్తున్నాం. దీని ద్వారా రైతులకు, వినియోగదారులకు లాభం కలుగుతుంది. ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని గ్రామీణ ప్రాంతాల్లోని కార్డుదారులు కూడా కోరుకుంటే అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
మిల్లర్ల బకాయిలు రూ. 2,072 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి రూ. వేల కోట్లలో బకాయి పడ్డారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ఇచ్చిన ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి ఇవ్వకుండా సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారు. దీంతో 2019 యాసంగి నుంచి 2022 యాసంగి వరకు పౌరసరఫరాల సంస్థకు రూ. 2,072 కోట్ల విలువైన 5.83 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం బకాయిపడ్డారు. ఈ మొత్తం బియ్యాన్ని లేదా అందుకు సమానమైన నగదును 25 శాతం జరిమానాతో డిఫాల్ట్ అయిన మిల్లుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఎక్స్అఫీషియో కార్యదర్శి హోదాలో కమిషనర్ అనిల్ కుమార్ ఇప్పటివరకు నాలుగు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు ఆయా మిల్లులకు రికవరీ నోటీసులు జారీ చేస్తున్నారు. ఆ బియ్యం విలువే రూ. 1,630 కోట్లు 2021–22 యాసంగికి సంబంధించి 2,37,310 మెట్రిక్ టన్నుల బియాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉండగా ఈ గడువు గత మే నెలాఖరుతో ముగిసింది. దీంతో ఈ బియ్యాన్ని 25 శాతం పెనాల్టితో రికవరీ చేయాలని లేదంటే బియ్యం విలువ రూ. 842.09 కోట్లను 25 శాతం పెనాల్టితో వసూలు చేయాలని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే గత నెల 23న 2021–22 వానాకాలానికి సంబంధించిన 2.22 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 25 శాతం పెనాల్టితో 494 మిల్లుల నుంచి రికవరీ చేసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ బియ్యం విలువ రూ. 787.67 కోట్లు. ఈ రెండు సీజన్లలోనే రూ. 1,630 కోట్ల వరకు రావాల్సి ఉంది. 2019 యాసంగి బకాయి 48,762 మెట్రిక్ టన్నులు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 2019 యాసంగి సీజన్‌కు సంబంధించి 118 మిల్లుల నుంచి సీఎంఆర్ కింద లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఈ ఏడాది మార్చిలోనే పెనాల్టీతో 125 శాతం రికవరీ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఈ మిల్లులు గడువులోగా బియ్యం ఇవ్వకపోవడంతో నెలకోసారి గడువును పెంచుతూ వచ్చారు. ఎట్టకేలకు ఈ నెలలో 14 మిల్లులు 125 శాతం బియ్యం రికవరీ చేశాయి. మరో 89 మిల్లులు 100 శాతం రికవరీ కింద సర్కారుకు సీఎంఆర్ అప్పగించాయి. ఇంకా 15 మిల్లులు ఎలాంటి రికవరీ చేయలేదు. దీంతో ఇంకా 48,762 మెట్రిక్ టన్నుల బియ్యం ఆయా మిల్లుల నుంచి రావాల్సి ఉంది. ఇప్పటికీ ఈ మిల్లులకు పెండింగ్ సీఎంఆర్ రికవరీ చేసుకొనే అవకాశం ఇస్తూ ఈ నెల 19న ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే 2020–21 సంవత్సరం యాసంగికి సంబంధించి మరో 73 మిల్లుల నుంచి 75,878 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉండగా ఈ మొత్తాన్ని కూడా పెనాల్టితో 125 శాతం రికవరీ చేయాలని సైతం ఈ నెల 19నే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు సంవత్సరాలకు సంబంధించిన బియ్యం 1.25 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఈ బియ్యం విలువనే రూ. 442 కోట్లు. 25 శాతం నగదు... 100 శాతం బియ్యం రికవరీ డిఫాల్ట్ మిల్లర్ల నుంచి 125 శాతం బియ్యాన్ని రికవరీ చేసే ప్రక్రియలో ముందుగా 25 శాతం బియ్యాన్ని లేదా అందుకు సమానమైన మొత్తాన్ని పెనాల్టీ రూపంలో ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ఇందులో 5 శాతం ఈ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేస్తేనే తరువాత సీజన్‌కు మళ్లీ సీఎంఆర్ ఇచ్చేందుకు వీలు కలుగుతుంది. అయితే 25 శాతం పెనాల్టిలో ఐదు శాతమే ఇప్పటికిప్పుడు ఇవ్వడం, మిగతా పెనాల్టీ మొత్తాన్ని 4 వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉండటంతో మిల్లర్లు ఇదే అదనుగా వ్యాపారాన్ని య«థేచ్ఛగా సాగిస్తున్నారనే విమర్శలున్నాయి.