హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగిలిన జిల్లాల్లో కదలని బియ్యం
మండల స్థాయి స్టాక్ పాయింట్ల నుంచి ఎక్కడికక్కడ నిలిచిన సరఫరా
187 స్టాక్ పాయింట్లకుగాను 100 చోట్లకుపైగా నెలకొన్న సమస్య
ఫలితంగా 4 రోజులుగా గ్రామాల్లో రేషన్ దుకాణాలను తెరవని డీలర్లు
ఇంత జరుగుతున్నా పట్టించుకోని పౌరసరఫరాలశాఖ అధికారులు
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరంలో రేషన్ బియ్యం కోసం పేదలు పడిగాపులు పడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా ఇప్పటివరకు చాలా జిల్లాల్లో రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా కాలేదు. స్టేజ్–1 గోడౌన్‌ల నుంచి జిల్లాల్లోని మండల స్థాయి స్టాక్ (ఎంఎల్‌ఎస్) పాయింట్లకు బియ్యం వచ్చినప్పటికీ ఎంఎల్‌ఎస్ పాయింట్లలో ఈ నెల ఒకటో తేదీ నుంచి హమాలీలు సమ్మె చేస్తున్న కారణంగా చాలా చోట్ల బియ్యం గ్రామాలకు చేరడం లేదు.
రెండేళ్లకోసారి పెంచాల్సిన హమాలీ రేట్లను గడువు దాటి ఏడాదైనా పెంచకపోవడంతోపాటు ఇటీవల ఇచ్చిన హామీని కూడా పౌరసరఫరాల శాఖ కమిషనర్ పట్టించుకోకపోవడంతో సమ్మెలోకి వెళ్లినట్లు హమాలీలు చెబుతున్నారు. రేట్లు పెంచే వరకు సమ్మె కొనసాగిస్తామని హమాలీలు తెగేసి చెబుతున్నారు. సమ్మె ఫలితంగా నాలుగు రోజులుగా చాలా గ్రామాల్లో రేషన్ దుకాణాలు తెరుచుకోవడంలేదు. ఇంత జరుగుతున్నా పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించడం లేదు.
హమాలీలు సమ్మె నోటీసు ఇచ్చినా..
రాష్ట్రంలోని ఎంఎల్‌ఎస్ పాయింట్లలో పనిచేస్తున్న హమాలీల రేట్లను రెండేళ్లకోసారి పెంచేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా 2022 వరకు రేట్ల పెంపు ప్రక్రియ కొనసాగింది. ఎంఎల్‌ఎస్ పాయింట్లకు వచ్చే బియ్యాన్ని దించడానికి, అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు తరలించడానికి హమాలీలకు క్వింటాలుకు రూ. 26 లెక్కన కూలి చెల్లిస్తున్నారు.
ఈ రేట్లను 2024లో సవరించాల్సి ఉండగా ప్రభుత్వం మారడంతో కాలయాపన జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు గతేడాది అక్టోబర్ 4న పౌరసరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్ వద్ద జరిగిన సమావేశంలో కూలి రేట్లను రూ. 26 నుంచి రూ. 29కి పెంచేందుకు ఒప్పందం కుదిరింది. అయితే అందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కాకపోవడంతో డిసెంబర్ 18న హమాలీలు పౌరసరఫరాల శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
నెలాఖరులోగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కాకుంటే జనవరి 1 నుంచి సమ్మెలోకి వెళ్తామని నోటీసు కూడా ఇచ్చారు. అలాగే గతేడాది డిసెంబర్ 28న మరోసారి నోటీసు పంపారు. అయినప్పటికీ రేట్ల పెంపు ఉత్తర్వులు కొత్త ఏడాదిలోనూ విడుదల కాకపోవడంతో ఒకటో తేదీ నుంచి సమ్మెకు దిగినట్లు హమాలీ సంఘం (ఏఐటీయూసీ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. మునీశ్వర్, ఎస్. బాలరాజ్ తెలిపారు.
హైదరాబాద్, రంగారెడ్డి మినహా...
రాష్ట్రంలో 187 ఎంఎల్‌ఎస్ పాయింట్లు ఉండగా సుమారు 3,600 మంది హమాలీలు పనిచేస్తున్నారు. వారంతా ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, బీఆర్‌ఎస్‌కేయూ సంఘాల్లో సభ్యులుగా ఉండగా ఏఐటీయూసీ అనుబంధ హమాలీ సంఘం సమ్మెకు పిలుపునిచ్చింది.
బీఆర్‌ఎస్‌కేయూ మినహా అన్ని సంఘాలు సమ్మెకు మద్దతిస్తున్నట్లు హమాలీ సంఘం నాయకులు చెప్పారు. రాష్ట్రంలో 17,335 దుకాణాలు ఉండగా అందులో శనివారం 9,319 దుకాణాలనే తెరిచారు. అంటే దాదాపు సగం దుకాణాలు ఇప్పటికీ తెరవలేదు. తెరిచిన చోట కూడా కోటా పూర్తిస్థాయిలో బియ్యం రాలేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment