
సాక్షి,హైదరాబాద్: అర్హత ఆధారంగా ఎంతమందికైనా రేషన్‌కార్డులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త రేషన్ కార్డ్‌లలో చిప్ ఉంటుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. కొత్త రేషన్ కార్డులో క్యూ ఆర్ కోడ్ మాత్రమే ఉంటుందని, చిప్ ఉండదని స్పష్టం చేశారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీ, రేషన్ లబ్ధి దారులకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమంపై ఉత్తమ్ కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘ ఏప్రిల్ 30న తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రాబోతుంది. హుజూర్ నగర నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తున్నాం. తెలంగాణలో 85శాతం జనాభాకు సన్నబియ్యం అందబోతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకోవడానికి వీలుగా డ్రా సిస్టం అందుబాటులోకి తెస్తున్నాం. ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు కావాలన్నా అర్హతను ఆధారంగా ఇస్తున్నాం.
కొత్తగా ఫిజికల్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. కార్డు ఉన్నా లేకున్నా లబ్ధిదారుల లిస్ట్‌లో ఉంటే చాలు ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం ఇస్తాం. తెలంగాణ ఏర్పాటు నాటికి 89లక్షల 73వేల 708 కార్డులు ఉంటే.. గత పదేళ్ళలో 49వేల 479 కొత్త కార్డులు ఇచ్చారు. 90లక్షల రేషన్ కార్డులు. 2.85 కోట్ల లబ్దిదారులు ప్రస్తుతం ఉన్నారు.
రూ.10665 కోట్ల నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఖర్చు చేస్తున్నాయి. త్వరలోనే బియ్యంతో పాటు పప్పు, ఉప్పులాంటి వస్తువులు ఇస్తాం. ఉగాది రోజు సీఎం రేవంత్‌రెడ్డి సన్న బియ్యం కార్యక్రమం ప్రారంభిస్తారు. కొత్త రేషన్ కార్డులో క్యూ ఆర్ కోడ్ మాత్రమే ఉంటుంది. చిప్ ఉండదు. రేషన్ కార్డుపై ప్రధాని ఫోటోపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 30లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వం చేయనుంది’అని అన్నారు.