త్వరలో విధివిధానాలు ఖరారు చేసిన తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తాం: మండలిలో మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
అత్యంత పేదలకు గృహలక్ష్మి: పొంగులేటి
వ్యవసాయం చేసే రైతుకు భరోసా: తుమ్మల
సాక్షి, హైదరాబాద్: అర్హులైన పేదలకు రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు వేర్వేరుగా ఇస్తామన్నారు. రేషన్‌కార్డు నిబంధనలతో పోలిస్తే.. ఆరోగ్యశ్రీ కార్డు నిబంధనలు కాస్త భిన్నంగా ఉండడంతో ఈ మేరకు నిర్ణయించామని చెప్పారు. అతి త్వరలో మంత్రివర్గ ఉపసంఘం రేషన్ కార్డులపై భేటీ అవు తుందని, ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రభు త్వానికి నివేదించిన తర్వాత మార్గదర్శకాలు జారీ చేస్తామ న్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయి నుంచి నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించారు.
ఇప్పటికే స్వీకరించిన దరఖాస్తులు భద్రంగా ఉన్నా, మరింత లోతైన సమా చారం కోసం దరఖాస్తుల స్వీకరణ అనివార్యమని మంత్రి వెల్లడించారు. బుధవారం శాసనమండలిలో సభ్యులు తాతా మధుసూదన్, వాణీదేవి, జీవన్‌రెడ్డి తదితరులు లేవనెత్తిన అంశాలపై మంత్రి స్పందిస్తూ పైవిధంగా సమాధానమి చ్చారు. పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్కకార్డు కూడా జారీ చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.15వేల సాయం చేస్తామ ని చెప్పినా, అమలు కాలేదంటూ వాణీదేవి తదితరులు సభలో ప్రస్తావించగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన రూ.7,500 కోట్లు రైతులకు అందించినట్టు వెల్లడించారు.
రైతుభరోసా పథకానికి సంబంధించి విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదని, ఈ అంశంపై మంత్రివర్గంతోపాటు అన్నిరంగాల నిపుణులు, ప్రజాసంఘాల అభిప్రాయాలను సేకరిస్తున్నా మన్నారు. ఈ అంశంపై ఉభయసభల్లో చర్చించి ఆమోదం పొందిన తర్వాతే రైతుభరోసా అమలు చేస్తామని చెప్పారు. అర్హత ఉన్న రైతులకే భరోసా దక్కుతుందని, గత ప్రభుత్వం రైతులు కాని వారికి కూడా సాయం చేసిందన్నారు. కానీ ఈసారి సాగుచేసే రైతులకు తప్ప కుండా భరోసా అందిస్తామని మంత్రి వివరించారు. ఇందిరమ్మ గృహలక్ష్మి పథకం కింద రూ.5 లక్షల సాయం అందిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకం కింద పేదలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
గృహజ్యోతి నిరంతర ప్రక్రియ: ఉపముఖ్యమంత్రి భట్టి
రెండువందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంట్ అందిస్తున్నామని, మార్చి 1 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మండలిలో స్పష్టం చేశారు. ఈ పథకం నిరంతరం కొనసాగుతుందన్నారు. చెల్లుబాటు ఆహారభద్రత, రేషన్‌కార్డులున్నవారు ఈ పథకా నికి అర్హులని, ఇతరత్రా కారణాలతో ఒక్కోసారి 200 యూని ట్ల కంటే ఎక్కువ బిల్లు వచ్చినప్పుడు జీరో బిల్లు రాదని, ఆ తర్వాతి నెలలో 200 కంటే తక్కువ బిల్లు వస్తే తిరిగి జీరో బిల్లు అమలవుతుందన్నారు.
ఈ పథకం కింద అర్హులుంటే ఎప్పటికప్పుడు వారికి పథకాన్ని వర్తింపజే స్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటివరకు 1.79కోట్ల మంది ఈ పథకం కింద లబ్ధి పొందారని, రూ.2వేల కోట్లు ఖర్చు చేసి నట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడినప్పు డు మిగులు బడ్జెట్‌తో ఉంటే..పదేళ్లలో అప్పులపాలు చేసి ఆర్థిక వ్యవ స్థను అస్తవ్యస్తం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవ స్థను గాడిన పెడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తు న్నామని, ఒక్కో సమస్యను పరిష్క రిస్తున్నట్టు వివరించారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేత నాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
గుండు సున్నా వచ్చినా.. బుద్ధి మారకుంటే ఎలా?
శాసనసభలో బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ విమర్శలు
అభిప్రాయాలు తీసుకుందామనుకుంటే.. వివాదాలు రేపుతున్నారు
బయటికి పంపిస్తే.. బతుకు జీవుడా అంటూ వెళ్లిపోదామనుకుంటున్నారు
మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: అందరి అభిప్రాయాలు, సలహాలు స్వీకరించి ముందుకెళ్లే మంచి సంప్రదాయాన్ని అసెంబ్లీలో నెలకొల్పుదామనుకుంటే.. బీఆర్‌ఎస్ సభ్యులు సభను దురి్వనియోగం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రి కేటీఆర్ సత్యదూరమైన అంశాలను ప్రస్తావిస్తూ.. పాపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ‘‘బీఆర్‌ఎస్ ఏదో పోరాటం చేసినట్టు, ఆ పోరాటానికి ఢిల్లీ దద్దరిల్లినట్టు, పదేళ్లు చెమటోడ్చి తెలంగాణ అభివృద్ధిని ఆకాశంలోకి తీసుకెళ్లినట్టు చెప్పే ప్రయత్నం మంచిది కాదు.
కాంగ్రెస్ రూ.14,500 కోట్ల మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పగించింది. అప్పుడు ఏడాదికి రూ.6,500 కోట్లు అప్పులు కట్టాల్సి వచ్చేది. అదే ఇప్పుడు నెలకు రూ.6, 500 కోట్లు అప్పుల కింద కడుతున్నాం. మిత్తీలు కట్టీ కట్టీ నడుము వంగిపోయే పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని పెట్టి వెళ్లారు. ఏదో ఉద్ధరించినట్టు చెప్తున్నారు. కేన్సర్, ఎయిడ్స్ లాంటి రోగాలున్నా కూడా ఎర్రగా, బుర్రగా ఉన్నాను కాబట్టి పెళ్లి పిల్లను చూడాలని అడిగినట్టు ఉంది..’’అని రేవంత్ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని దివాళా తీయించారని, ఎక్కడి బిల్లులు అక్కడే పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.
అసలు విషయాలను పక్కనపెట్టి వివాదాలు రేపితే అసెంబ్లీ నుంచి బయటికి పంపిస్తారనే ఉద్దేశంతో, బతుకు జీవుడా అంటూ వెళ్లిపోవాలని బీఆర్‌ఎస్ సభ్యులు చూస్తున్నారని విమర్శించారు. ‘‘అలా పంపవద్దు, బీఆర్‌ఎస్ వారు ప్రజలకు సమాధానం చెప్పించాల్సిందే. అన్ని వివరాలు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బయటపెడతా..’’అని రేవంత్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గుండు సున్నా వచ్చినా కూడా బుద్ధి మారకపోతే ఎలాగని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment