రాశులకొద్దీ ధాన్యం.. కొనేవారేరీ? | Farmers in Trouble With Grain Purchase in Telangana | Sakshi
Sakshi News home page

రాశులకొద్దీ ధాన్యం.. కొనేవారేరీ?

Published Wed, Nov 6 2024 6:07 AM | Last Updated on Wed, Nov 6 2024 6:07 AM

Farmers in Trouble With Grain Purchase in Telangana

రైతులకు తప్పని పడిగాపులు  

సోమ, మంగళవారాల్లోనే చాలా జిల్లాల్లో మొదలైన కొనుగోళ్లు.. ముందుకు రాని మిల్లర్లు 

ఒప్పించేందుకు అధికారుల తంటాలు 

కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్‌ రోజువారీ సమీక్షలు  

సాక్షి, హైదరాబాద్‌: పలు జిల్లాల్లో ఈసారి పంట దిగుబడి పెరగడంతో ధాన్యం రాశులతో పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. అయితే ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వెళ్లిన రైతులకు మాత్రం నిరాశే ఎదురవుతోంది. మంత్రి ఉత్తమ్‌ ప్రతిరోజూ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నా, క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. కొనుగోలు కేంద్రాలు తెరిచినా, కాంటా వేయడం లేదు. దీంతో రైతులకు పడిగాపులు తప్పడం లేదు. 

నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో పండిన మేలురకం సన్న ధాన్యాన్ని ఇప్పటికే బహిరంగ మార్కెట్‌లో రైతులు విక్రయించారు. క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ వచ్చే సన్న ధాన్యాన్ని, ఎక్కువగా సాగయ్యే దొడ్డు ధాన్యా­న్ని విక్రయించేందుకు వీలుగా రాష్ట్రంలో 7,572 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభు­త్వం ప్రకటించింది. ఇందులో ఇప్పటి వరకు 4,600 కేంద్రాలను తెరిచినా, అందులో సగం కేంద్రాల్లో కూడా ధాన్యం కొనుగోళ్లు సాగడం లేదు. 

బ్యాంకు గ్యారంటీలు ఇచ్చిన మిల్లర్లకే కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కోసం ధాన్యం కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో నాలుగు రోజుల క్రితం వరకు మిల్లర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు నయానో, భయానో మిల్లర్లను ఒప్పించి 15 రోజుల్లో బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని రాతపూర్వకంగా ‘అండర్‌టేకింగ్‌’తీసుకుంటూ మిల్లులకు ధాన్యం కేటాయిస్తున్నారు. దీంతో చాలా జిల్లాల్లో సోమవారం నుంచి కొనుగోళ్ల ప్రక్రియ కొంత మెరుగైంది. అయినా, అనేక జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు కుప్పలుకుప్పలుగా దర్శనమిస్తున్నాయి.  

బ్యాంక్‌ గ్యారంటీలిస్తేనే... 
ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్‌ , నల్లగొండ, వరంగల్‌ జిల్లాల్లో ఎక్కువగా ఉన్న ఈ డిఫాల్ట్‌ రైస్‌మిల్లర్ల నుంచి అండర్‌ టేకింగ్‌ తీసుకుంటూ బ్యాంక్‌ గార్యంటీలు, సెక్యూరిటీ డిపాజిట్లు ఇస్తామని కాగితాలు రాయించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క మిల్లర్‌ అవి ఇవ్వలేదని తెలుస్తోంది.  

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా: 
ఈ జిల్లాలో 615 ధాన్యం కొనుగోలు కేంద్రాలుండగా, 404 సన్నరకాలకు 211 దొడ్డు రకాల కొనుగోళ్లకు కేటాయించారు. వీటిల్లో కేవలం 121 కేంద్రాల్లో సన్న రకం, 86 కేంద్రాల్లో దొడ్డు రకం కొనుగోళ్లు సాగుతున్నాయి. మంగళవారం నాటికి 18,320 టన్నుల సన్నరకం, 11,334 టన్నుల దొడ్డురకం ధాన్యం సేకరించారు. బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని 190 మంది రైస్‌మిల్లర్లు అండర్‌ టేకింగ్‌ ఇచ్చారు.  
– కామారెడ్డి జిల్లాలో 423 కేంద్రాలకుగాను 150 కేంద్రాల్లో కొనుగోలు మొదలయ్యాయి. ఇందులో సన్నారకాలకు 63 కేంద్రాలే తెరిచారు. కేవలం 4,250 క్వింటాళ్ల సన్నరకం ధాన్యం కొన్నారు.  

ఉమ్మడి వరంగల్‌ జిల్లా :  
ఉమ్మడి వరంగల్‌లో ఆయా జిల్లాల వారీగా చూస్తే..వరంగల్‌లో 203 కేంద్రాలకుగాను 24 కేంద్రాలే తెరుచుకోగా, అక్కడ కొనుగోళ్లు జరుగుతున్నాయి. హనుమకొండలో మొత్తంగా 149 కేంద్రాలు, జనగామలో మొత్తంగా 180, ములుగులో మొత్తంగా 178 కేంద్రాలు తెరుచుకున్నాయి. మహబూబాబాద్‌లో 234 కేంద్రాలకుగాను 59, భూపాలపల్లిలో 189గాను 79 కేంద్రాలే మొదలయ్యాయి.  

– జనగామ జిల్లాలో 33,336 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి 30 రా రైస్, బాయిల్డ్‌ రైస్‌మిల్లులకు సరఫరా చేశారు. మరో 19 రైస్‌మిల్లులకు ధాన్యం తరలించేందుకు 10 శాతం గ్యారంటీపై చర్చలు జరుగుతున్నాయి. 
– జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఇంకా ధాన్యం కొనుగోళ్లు మొదలు కాలేదు. హనుమకొండ జిల్లాలో ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు మొదలయ్యాయి.  

ఉమ్మడి నల్లగొండ జిల్లా:  
నల్లగొండ జిల్లాలో బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని అగ్రిమెంట్‌ చేసుకున్న 145 మిల్లులకు సోమవారం ధాన్యం కేటాయింపులు షురూ చేశారు. 345 కేంద్రాలను ప్రారంభించినట్టు అధికారులు చెబుతున్నా, సగం కేంద్రాల్లో కూడా కొనుగోళ్లు సక్రమంగా సాగడం లేదు. మంగళవారం వరకు జిల్లాలో కేవలం 15 వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోళ్లు జరిగాయి. అయితే ఇంతవరకు సన్నాల కొనుగోళ్లు మొదలే కాలేదు.  

– సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు కొనుగోళ్లను ప్రారంభించలేదు. కేవలం కేంద్రాలను మాత్రమే ప్రారంభించి కాంటాలను మరిచారు. గ్యారంటీ ఇచ్చిన 15 మిల్లులకు ధాన్యం కేటాయించారు.  
– యాదాద్రి జిల్లాలో అఫిడవిట్‌లు ఇచ్చిన 50 మిల్లులకు ధాన్యం అలాట్‌ చేశారు.  

ఉమ్మడి మెదక్‌ జిల్లా :  
మెదక్‌ జిల్లాలో 490 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, సన్నధాన్యం కొనుగోలుకు కేవలం 91 కేంద్రాలే కేటాయించారు. ఈ జిల్లాలోని 104 మిల్లుల్లో 60 మిల్లులు డిఫాల్ట్‌ జాబితాలో ఉండగా, 54 మిల్లులకే ధాన్యం కేటాయించాలని నిర్ణయించారు. వీరిలోనూ 30 మంది మిల్లర్లు మాత్రమే అండర్‌ టేకింగ్‌ ఇచ్చారు. దీంతో మంగళవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించారు.  

– సిద్దిపేట జిల్లాలో 417 కొనుగోలు కేంద్రాలకుగాను ఇప్పటి వరకు 348 కేంద్రాలను ప్రారంభించారు. బ్యాంక్‌ గ్యారంటీ ఇస్తామని అండర్‌ టేకింగ్‌ ఇచ్చిన 25 మిల్లులకు ధాన్యం కేటాయించారు. 
– సంగారెడ్డి జిల్లాలో 183 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, ఇప్పుటి వరకు కనీసం 50 సెంటర్లలో కూడా సేకరణ షురూ కాలేదు.  
– ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఇంకా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. కోతలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి.  

కాంటా ఎప్పుడేస్తరో తెల్వదు  
నా పేరు చందు మల్లయ్య, నాది వరంగల్‌ జిల్లా రాయపర్తి. 8 ఎకరాల్లో వరి సాగుచేశా. అందులో పండిన వడ్లను రాగన్నగూడెం కొనుగోలు కేంద్రంలో పోశా. ఇప్పటివరకు కొనుగోళ్లు మొదలుకాలేదు. 15 రోజుల నుంచి కాంటా కోసం రైతులం ఎదురుచూస్తున్నం. పరదాలు అద్దెకు తెచ్చి వడ్లు పోశాం. కేంద్రం ఎప్పుడు తెరుస్తారో, కాంటా ఎప్పుడేస్తరో తెల్వదు. సాయంత్రం అయితే వర్షం ఎప్పుడు పడుతుందోనని భయంతో ఆకాశం వైపు చూస్తున్నాం.  
– చందు మల్లయ్య

తేమ పేరుతో కొనడం లేదు  
నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చి పది రోజులువుతోంది. అధికారులు తేమ పేరుతో వడ్లు కొనడం లేదు. పది రోజులుగా కేంద్రం వద్దే పడిగాపులు కాస్తున్నాం. వానొస్తే వడ్లు తడిసి ఇంకా నష్టపోయే ప్రమాదముంది.  
– మూఢావత్‌ శంకర్, డిండి 

మిల్లుల కేటాయింపు జరగాలి 
ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెంటనే రైస్‌ మిల్లులు కేటాయించాలి. కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులు పెరిగిపోతున్నాయి. కాంటాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. 
– లలిత, కొనుగోలు కేంద్రం నిర్వాహకురాలు, సింగారెడ్డి పాలెం,(సూర్యాపేట జిల్లా) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement