
హైదరాబాద్: త్వరలో తెలంగాణ సీఎం మారడం ఖాయమంటూ మాట్లాడిన బీజేఎల్సీ నేత మహేశ్వర్ రెడ్డిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. నాలుగైదు నెలలపాటు నిద్రపోయి.. ఇప్పుడు మళ్లీ మీడియా ముందు పిట్టకథలు చెబుతున్నాడని ధ్వజమెత్తారు ఆది శ్రీనివాస్. ‘సినిమా స్క్రిప్ట్ తయారు చేసుకుని చిట్ చాట్ ల పేరుతో చెత్త వాగుడు వాగుతున్నాడు. డిసెంబర్ లో ముఖ్యమంత్రి మారుతాడని, మీనాక్షి నటరాజన్ అందుకోసమే వచ్చారని కట్టు కథలు చెపుతున్నాడు.
మహేశ్వర్ రెడ్డి పరిస్థితి గురివింద గింజలా ఉంది. తన కింద ఉన్న నలుపు ను ఆయన చూడలేకపోతున్నాడు. సొంత పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య ఉన్న అసంతృప్తులు ఆయనకు కనిపించడం లేదు. గెలిచిన 8 మంది ఎమ్మెల్యేల్లో రాజాసింగ్ అసలు మీ పార్టీ ఆఫీసు వైపు కూడా రావడం లేదు. నా పైన కుట్ర చేస్తున్నారని, పార్టీ నుంచి వెళ్లిపోమ్మంటే పోతానని ఆయన బహిరంగంగానే చెపుతున్నారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి మోహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. ఇక మీ ఎంపీలు ఎవరి దుకాణం వాళ్లే పెట్టుకున్నారు.
పార్టీ అధ్యక్ష పదవి కోసం కొట్టుకు చస్తున్నారు.. ఈటెల రాజేందర్ ది ఒక దారి, రఘనందన్ రావు ది మరో దారి, ఇక ధర్మపురి అర్వింద్ ఎటో తెలియనే తెలియదు...బండి సంజయ్ ఏం మాట్లాడుతాడో తెలియదు. నీ పార్టీలో ఇన్ని లొసుగులు పెట్టుకుని నువ్వు మా ముఖ్యమంత్రి గురించి, మంత్రుల గురించి మాట్లాడుతవా..? , మహేశ్వర్ రెడ్డి... నువ్వు చిలుక జోస్యం ఆపకపోతే నీ భవిష్యత్తు గురించి మేం చెప్పాల్సి వస్తుంది జాగ్రత్త.. సీఎం రేవంత్ రెడ్డి 18 గంటలు కష్టపడుతు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు.బీఆర్ఎస్ అప్పనంగా రాష్ట్రాన్ని దోచుకున్నా బీజేపీ పట్టించుకోలేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురాకుండా విమర్శలు చేస్తారా. ప్రభుత్వం పైన ఓర్వ లేక ఈర్ష తో ప్రభుత్వంపైన మాట్లాడుతున్నారు. గోతికాడ నక్కలా బీఆర్ఎస్ తరహాలో బీజేపీ వ్యవహరిస్తోంది. ’ అంటూ విమర్శించారు ఆది శ్రీనివాస్.
Comments
Please login to add a commentAdd a comment