Adi Srinivas
-
బీఆర్ఎస్లో మిగిలేది ఆ ఐదుగురే: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సాక్షి,హైదరాబాద్:ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ పార్టీ నేతలకు చెంప చెళ్లుమనిపించేలా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం(నవంబర్ 22) ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.‘హైకోర్టులో బీఆర్ఎస్ భంగపడింది. ఎమ్మెల్యేల అనర్హతపై సర్వాధికారాలు స్పీకర్‌కు ఉన్నాయని కోర్టు తేల్చింది.తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని మాత్రమే కోర్టు సూచించింది. నిర్ణీత సమయాన్ని కూడా కోర్టు ప్రస్తావించలేదు. అన్ని విషయాలు తెలిసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లి దెబ్బతిన్నారు. రాజ్యాంగం ప్రకారం స్పీకర్ నడుచుకుంటారు. కోర్టు తీర్పు రాకుండానే గతంలో కేటీఆర్ ఈ విషయంలో ఎగిరెగిరి పడ్డారు.అప్పుడే ఉప ఎన్నికలు వచ్చినట్లుగా హడావిడి చేశాడు. చేసిన పాపం గోచిలో పెట్టుకొని కాశీకి పోయినట్లు కేటీఆర్,బీఆర్ఎస్ నేతల తీరు ఉంది. పదేళ్లపాటు రాజ్యాంగాన్ని అపహస్యం చేసి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 60మందికి పైగా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ఎంపీలను బీఆర్ఎస్ చేర్చుకుంది.ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను క్యాబినెట్లో చేర్చుకొని నైతిక విలువలను తీసుకెళ్లి కాళేశ్వరంలో కలిపారు. పార్టీలకు పార్టీలను విలీనం చేసుకుని రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఎంత గగ్గోలు పెట్టినా కేసీఆర్ లెక్కచేయలేదు. తెలంగాణ పునర్ నిర్మాణం కోసం ఫిరాయింపులు చేసుకోవచ్చునని నిర్లజ్జగా చెప్పుకొని తిరిగారు.అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్కు రాజ్యాంగం,న్యాయస్థానాలు గుర్తుకు వచ్చాయి. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయం.ఐదారుగురు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉండరు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కు,కేటీఆర్ గెస్ట్‌హౌస్‌కు,హరీష్‌రావు నార్సింగిహౌస్కు పరిమితం కావాల్సిందే’అని ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: ఎమ్మెల్యేల అనర్హతపై ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు -
TG: చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టు తీర్పు కాసేపట్లో
సాక్షి,హైదరాబాద్:మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు బుధవారం(అక్టోబర్ 23) మధ్యాహ్నం తీర్పు వెలువరించనుంది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వం తీసుకున్నారని ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ ఆరేళ్లుగా సాగింది. తుది వాదనలు విన్న హైకోర్టు మంగళవారం ఈ కేసులో తీర్పు రిజర్వు చేసింది. రమేష్ బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆది శ్రీనివాస్ ఆయనపై పిటిషన్ దాఖలు చేశారు. రమేష్ జర్మనీ పౌరుడైనందున ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడని తీర్పు ఇవ్వాల్సిందిగా పిటిషన్లో ఆది శ్రీనివాస్ కోరారు. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్ పోటీ చేయలేదు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆదిశ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు. -
చెన్నమనేని రమేష్ పౌరసత్వ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు చెప్పనుంది. గత ఆరేళ్లుగా హైకోర్టులో వాదనలు కొనసాగాయి. చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేయాలని హైకోర్టులో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాసేపట్లో జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి బెంచ్ తీర్పు వెలువరించనుంది. -
'చెన్నమనేని బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే'
సాక్షి, సిరిసిల్లా : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమ్మనేని రమేశ్ పౌరసత్వంపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కీలక వాఖ్యలు చేశారు. రమేశ్ తాను భారతదేశ పౌరున్ని అంటూనే జర్మనీ పాస్‌పోర్టుపై జర్మనీ ఎలా ప్రయాణం చేస్తున్నాడని శ్రీనివాస్ పేర్కొన్నాడు. జర్మనీ పాస్‌పోర్టుపై మద్రాస్ నుంచి జర్మనీ వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చిందని, దీనిపై ప్రజలకు వివరణ ఇవ్వాల్పిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మూడు సార్లు చెన్నమనేని రమేశ్ భారతదేశ పౌరుడు కాదని తేల్చి చెప్పినా గత 11 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలను, దేశాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. సాక్షాత్తు భారతదేశ న్యాయస్థానం ఈ దేశ పౌరుడు కాదని తేల్చి చెప్పినా దొంగ చాటుగా పౌరసత్వం పొంది వివాదంలో కూరుకుపోయిన వ్యక్తికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎలా ఇచ్చిందని మండిపడ్డారు. ఇప్పటికే కోర్టు పలుమార్లు మొట్టికాయలు వేసినా ఆయనకు బుద్ధి రాలేదని , వెంటనే నియోజకవర్గ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. -
‘పౌరసత్వం రద్దు నిర్ణయం అభినందనీయం’
సాక్షి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం అభినందనీయమని పిటిషనర్ కాంగ్రెస్‌నేత ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి.. ఎమ్మెల్యే రమేష్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. చట్టాలను తప్పుదోవ పటించే వ్యక్తులు.. చట్టాలను తయారు చేసే వ్యక్తులుగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. గతంలోనే హైకోర్టు, సుప్రీంకోర్టు, కేంద్ర హోంశాఖ అతన్ని భారత పౌరుడు కాదని తేల్చిచెప్పాయని గుర్తు చేశారు. మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా అనటంతో హైకోర్తులో కెవియట్ పిటిషన్ దాఖలు చేశానని శ్రీనివాస్ వివరించారు. ఎమ్మెల్యే రమేష్ హైకోర్టును ఆశ్రయిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. తమ వాదనలను కూడా మరోసారి కోర్టుకు తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. న్యాయస్థానాలపై విశ్వాసం ఉందని.. హైకోర్టులో తాను గెలుస్తాననే నమ్మకం ఉందని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009 నుంచి న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. తప్పుడు ధ్రువపత్రాలతో మన దేశ పౌరసత్వం పొందినందున రమేశ్ ఎన్నిక చెల్లదంటూ ఆది వాదిస్తూ వస్తున్నారు. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ మరోసారి విచారణ జరిపి, తాజాగా తన నిర్ణయాన్ని వెలువరించింది. -
పౌరసత్వం రద్దుపై ఎమ్మెల్యే న్యాయపోరు
♦హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి చెందిన వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వ వివాదం మరోసారి ఉమ్మడి హైకోర్టుకు చేరింది. భారత పౌరసత్వాన్ని కేంద్ర హోం శాఖ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పౌరసత్వం రద్దు నిర్ణయం ఆగస్టు 31 నుంచి అమల్లో ఉంటుందంటూ కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి తీసుకున్న చెల్లదని చెన్నమనేని ఆ రిట్లో పేర్కొన్నారు. భారత పౌరసత్వ చట్టం–1955లోని సెక్షన్ 10(1) ప్రకారం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రతివాదులుగా కేంద్ర హోం శాఖ కార్యదర్శి/సంయుక్త కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్లలను చేశారు. తనకు భారత పౌరసత్వం ఇచ్చిన తర్వాత 30 రోజుల్లో మాత్రమే అభ్యంతరాలు చెప్పాలని భారత పౌరసత్వ చట్టం చెబుతోందన్నారు. ఆ చట్టంలోని సెక్షన్ 5(1) ప్రకారం తనకు పౌరసత్వం వచ్చిందని, అయితే తనపై వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్ చాలా ఆలస్యంగా ఫిర్యాదు చేసినా దానిపై కేంద్ర హోం శాఖ స్పందించిందని తప్పుపట్టారు. దేశ సమగ్రతను దెబ్బతీసే చర్యలకు పాల్పడినప్పుడు మాత్రమే పౌరసత్వం రద్దు చేసే వీలుందని, అయినా కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఆది శ్రీనివాస్ ఫిర్యాదుపై కమిటీ విచారణ నివేదిక తనకు ఇవ్వలేదన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై తిరిగి సమీక్షించాలని కోరే అవకాశం ఒక్కటే తనకు ఉందని, ఆ విధంగా కోరుతూనే హైకోర్టులో రిట్ దాఖలు చేశామన్నారు. కేంద్రం తీసుకున్న తన పౌరుసత్వ రద్దు నిర్ణయాన్ని కొట్టివేయాలని రిట్లో రమేశ్ కోరారు. భారతదేశంలో పుట్టి పెరిగి ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లిన తర్వాత అక్కడి పౌరసత్వం తనకు 1993లో వచ్చిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధులైన తన తల్లిదండ్రులు చేస్తున్న ప్రజాసేవకు స్ఫూర్తిగా తీసుకుని జర్మనీలో ఉంటూనే కరీంనగర్ జిల్లాలోని అనేక గ్రామాల్లో సేవాకార్యక్రమాల్ని చేపట్టానని, 2007లో తిరిగి భారతదేశానికి వచ్చాక వాటిని కొనసాగిస్తూనే భారత పౌరసత్వం కోసం చట్ట ప్రకారం పొందానన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజల మన్ననలు పొందానన్నారు. తనకు పౌరసత్వం ఇవ్వడం వల్ల ఏవిధంగా నష్టపోని, బాధితుడు కూడా కాని ఆది శ్రీనివాస్ రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన ఫిర్యాదుపై కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయాలని రిట్లో రమేశ్ హైకోర్టును కోరారు. -
ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం రద్దు
సాక్షి, న్యూఢిల్లీ : టీఆర్ఎస్ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తప్పుడు పత్రాలతో చెన్నమనేని భారత పౌరసత్వం పొందారని ఎస్కే టాండన్ జ్యుడీషియల్ కమిటీ విచారణలో తేలింది. దీంతో ఎమ్మెల్యే చెన్నమనేని పొందుతున్న ప్రయోజనాలను ఉపసంహరించాలని కేంద్రం ఆదేశించింది. తాజా ఉత్తర్వులపై బీజేపీ నేత ఆది శ్రీనివాస్ స్పందిస్తూ... తప్పుడు పత్రాలతో పౌరసత్వం పొందడం సిగ్గుచేటు అని, చెన్నమనేని తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా చెన్నమనేని భారత పౌరసత్వం చెల్లదని.. ఆయన జర్మనీ పౌరుడేనని మంగళవారం తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. దీంతో రమేశ్‌బాబు ఎమ్మెల్యే పదవిని కోల్పోనున్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో దేశ పౌరసత్వం పొందినందున రమేశ్ ఎన్నిక చెల్లదంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి, బీజేపీ నేత ఆది శ్రీనివాస్ 2009 నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. రమేశ్ పౌరసత్వంపై ఆరు వారాల్లో తమకు నివేదిక అందించాలని ఆగస్టు 28న కేంద్ర హోం శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనల ప్రకారం రమేశ్‌బాబు పౌరసత్వం పొందారా.. లేదా అన్నది తేల్చాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ వారం రోజుల్లోనే తన నిర్ణయాన్ని ప్రకటించింది. -
ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం చెల్లదు
-
ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం చెల్లదు
► ఆయన జర్మనీ పౌరుడే..: కేంద్ర హోంశాఖ ►ఎమ్మెల్యే పదవి కోల్పోయే అవకాశం ►సుప్రీంకోర్టు తుది తీర్పుపై ఉత్కంఠ ►రివ్యూ పిటిషన్ హక్కు వినియోగించుకుంటా: రమేశ్ సాక్షి, హైదరాబాద్: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు కేంద్ర హోం శాఖ షాక్ ఇచ్చింది! ఆయన భారత పౌరసత్వం చెల్లదని.. ఆయన జర్మనీ పౌరుడేనని మంగళవారం తేల్చిచెప్పింది. దీంతో రమేశ్‌బాబు ఎమ్మెల్యే పదవిని కోల్పోయే అవకాశాలున్నాయి. తప్పుడు ధ్రువపత్రాలతో దేశ పౌరసత్వం పొందినందున రమేశ్ ఎన్నిక చెల్లదంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి, బీజేపీ నేత ఆది శ్రీనివాస్ 2009 నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. రమేశ్ పౌరసత్వంపై ఆరు వారాల్లో తమకు నివేదిక అందించాలని ఆగస్టు 28న కేంద్ర హోం శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనల ప్రకారం రమేశ్‌బాబు పౌరసత్వం పొందారా.. లేదా అన్నది తేల్చాలని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ వారం రోజుల్లోనే తన నిర్ణయాన్ని ప్రకటించింది. భారత పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి తాజాగా రమేశ్‌కు లేఖ కూడా పంపినట్లు సమాచారం. దీంతో రాజకీయ శ్రేణుల్లో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. రమేశ్‌బాబు తప్పుడు అఫిడవిట్ సమర్పించి భారత పౌరసత్వం పొందారని నిర్ధారణ అయితే ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించడంతోపాటు రూ.50 వేల జరిమానా, అయిదేళ్ల జైలుæ శిక్ష విధించే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. హోంశాఖ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు తీసుకునే తుది తీర్పుపై ఈ వ్యవహారం ఆధారపడి ఉంది. 2009 నుంచే వివాదం రమేశ్‌బాబు కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత చెన్నమనేని రాజేశ్వరరావు కుమారుడు. వారసత్వంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రమేశ్‌బాబు వేములవాడ నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో తొలిసారిగా టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. అదే సమయంలో పౌరసత్వం వివాదం మొదలైంది. అప్పటికే చాలాకాలం జర్మనీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆయనకు ఆ దేశ పౌరసత్వం ఉంది. ఎన్నికలకు ముందు భారత పౌరసత్వం తీసుకొని ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు. రమేశ్‌బాబు పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పడ్డ ఆది శ్రీనివాస్ 2009లో హైకోర్టును ఆశ్రయించారు. రమేశ్‌బాబు 1993లో భారత పౌరసత్వాన్ని రద్దు చేసుకొని జర్మనీ పౌరసత్వం పొందారు. తిరిగి 2008 మార్చి 31న పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ పౌరసత్వ చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకునే నాటికి దేశంలో వరుసగా 365 రోజులు స్థిర నివాసం ఉండాలనే నిబంధన ఉంది. ఆయన వరుసగా అన్ని రోజులు ఇక్కడ లేరని, అందుకే పౌరసత్వం చెల్లదంటూ శ్రీనివాస్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కేసు విచారణలోనూ రమేశ్‌బాబు కేవలం 96 రోజులు మాత్రమే దేశంలో ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన తప్పుడు ధ్రువ పత్రాలతో పౌరసత్వం పొందారని హైకోర్టు 2013లో తీర్పునిచ్చింది. ఆయన ఎన్నిక సైతం చెల్లదంటూ, ఓటర్ల జాబితాల్లోంచి ఆయన పేరును తొలగించాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రమేశ్‌బాబు సుప్రీంకోర్టుకు వెళ్లారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించింది. స్టేను సవాల్ చేస్తూ ఆది శ్రీనివాస్ సుప్రీంకోర్డులో తన తరఫున వాదనలు వినిపించారు. దీంతో సుప్రీం ఈ కేసు విచారణ చేపట్టింది. పౌరసత్వం వివాదాన్ని తేల్చాలని గతంలో కేంద్ర హోం శాఖను ఆదేశించింది. ఇచ్చిన గడువు కూడా ముగియటంతో ఇటీవల ఆరు వారాల నిర్ణీత గడువును విధించింది. ఈ నేపథ్యంలోనే రమేశ్ పౌరసత్వం చెల్లదని హోంశాఖ తేల్చింది. కేసు విచారణలో ఉన్న క్రమంలో 2010లో రమేశ్‌బాబు ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోనూ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ తరపున బరిలో నిలిచారు. 2014లో జరిగిన ఎన్నికల్లోనూ రమేశ్‌బాబు టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి మరోసారి గెలిచారు. ఆది శ్రీనివాస్ ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వేములవాడకు ఉప ఎన్నిక! కేంద్ర హోం శాఖ తాజా నిర్ణయంతో చెన్నమనేని రమేశ్ ఎమ్మెల్యే పదవి కోల్పోయే పరిస్థితులున్నాయి. ఈ నిర్ణయమే వస్తే వేములవాడ అసెంబ్లీ స్థానం ఖాళీ అవుతుంది. అదే జరిగితే ఆరు నెలల్లోపు వేములవాడకు ఉప ఎన్నిక నిర్వహిస్తారు. సాధారణ ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో వేములవాడ ఉప ఎన్నిక రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారనుంది. రివ్యూ పిటిషన్ హక్కు వినియోగించుకుంటా: ఎమ్మెల్యే రమేశ్‌బాబు ఈ కమిటీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ముందే భావించా. జాయింట్ సెక్రెటరీ స్థాయిలో తీసుకున్న నిర్ణయమిది. సెక్షన్ 15 ప్రకారం దీనిపై కేంద్ర హోం కార్యదర్శికి, హోం మంత్రికి రివ్యూ పిటిషన్ పెట్టుకునే హక్కు నాకుంది. నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేని కొన్ని శక్తులు నాపై ఏడు కేసులు వేసి నా జన్మభూమి, పౌరసత్వాన్ని వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాయి. 2013లో లాగే మళ్లీ దొంగదెబ్బ వేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లా. న్యాయ వ్యవస్థపై నమ్మకముంది: ఆది శ్రీనివాస్, బీజేపీ నేత నాకు ఇంకా అధికారికంగా ఎలాంటి ఆదేశాలు అందలేదు. 2013లో హైకోర్టులో నెగ్గాను. అదే విధంగా సుప్రీంకోర్టులోనూ నెగ్గుతానన్న విశ్వాసం ఉంది. కేంద్ర హోంశాఖ, సుప్రీంకోర్టులపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉంది. -
ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం చెల్లదు