
సాక్షి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం అభినందనీయమని పిటిషనర్ కాంగ్రెస్‌నేత ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి.. ఎమ్మెల్యే రమేష్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. చట్టాలను తప్పుదోవ పటించే వ్యక్తులు.. చట్టాలను తయారు చేసే వ్యక్తులుగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. గతంలోనే హైకోర్టు, సుప్రీంకోర్టు, కేంద్ర హోంశాఖ అతన్ని భారత పౌరుడు కాదని తేల్చిచెప్పాయని గుర్తు చేశారు. మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా అనటంతో హైకోర్తులో కెవియట్ పిటిషన్ దాఖలు చేశానని శ్రీనివాస్ వివరించారు.
ఎమ్మెల్యే రమేష్ హైకోర్టును ఆశ్రయిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. తమ వాదనలను కూడా మరోసారి కోర్టుకు తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. న్యాయస్థానాలపై విశ్వాసం ఉందని.. హైకోర్టులో తాను గెలుస్తాననే నమ్మకం ఉందని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009 నుంచి న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. తప్పుడు ధ్రువపత్రాలతో మన దేశ పౌరసత్వం పొందినందున రమేశ్ ఎన్నిక చెల్లదంటూ ఆది వాదిస్తూ వస్తున్నారు. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ మరోసారి విచారణ జరిపి, తాజాగా తన నిర్ణయాన్ని వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment