Chennamaneni Ramesh Citizenship
-
చెన్నమనేని రమేష్ పౌరసత్వ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు చెప్పనుంది. గత ఆరేళ్లుగా హైకోర్టులో వాదనలు కొనసాగాయి. చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేయాలని హైకోర్టులో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాసేపట్లో జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి బెంచ్ తీర్పు వెలువరించనుంది. -
జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేశా: చెన్నమనేని
హైదరాబాద్: పౌరసత్వ వివాదంపై వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేసినట్లు హైకోర్టుకు తెలిపారు. చెన్నమనేని దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌పై వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గడువు కోరింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు రెండు వారాల గడువు ఇచ్చింది. మరోసారి ఎవరూ గడువు కోరవద్దని తుది వాదనలకు సిద్ధం కావాలని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు విచారణను మరో రెండు వారాల పాటు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ గతంలో ఆది శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏడాది క్రితం కేంద్ర హోంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ కొనసాగుతోంది. రమేష్ పౌరసత్వం వివాదంపై గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. చెన్నమనేని పౌరసత్వంపై కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, ప్రస్తుతం ఆయన దేశంలోని ఉన్నాడని, రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వలన శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలుగటంలేదన్నారు. చదవండి: గోల్డ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్! -
ఎమ్మెల్యే పౌరసత్వంపై వీడని సస్పెన్స్
సాక్షి, హైదరాబాద్ : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై సస్పెన్స్ కొనసాగుతోంది. గతకొంత కాలంగా సాగుతున్న ఈ వివాదంపై మంగళవారం హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అఫిడవిట్లో తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్ర రావు కోర్టుకు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు గడువుకోసం కోర్టును కోరారు. కేంద్రం మాత్రం వారంలో విచారణ పూర్తిచేయాలని కోరుతోంది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేస్తు.. సిద్ధంగా ఉండాలని హైకోర్టు ఇరుపక్షాలకు సూచించింది. జర్మనీ పౌరసత్వం కలిగి పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని పిటిషనర్ ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవికిరణ్ కోర్టుకు తెలిపారు. చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు. రమేష్ పౌరసత్వం వివాదంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా స్పందించింది. చెన్నమనేని పౌరసత్వంపై కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, ప్రస్తుతం ఆయన దేశంలోని ఉన్నాడని, రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలు అందిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వలన శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలుగటంలేదన్నారు. కాగా 2017లో కేంద్ర హోంశాఖ చేపట్టిన మొదటి విచారణలో రమేష్ భారత పౌరుడు కారని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మళ్లీ ఓ సారి సమీక్షించాలని రమేష్ అభ్యర్తించగా రెండోసారి కేంద్ర హోంశాఖ పౌరసత్వం పై సమీక్షించి.. భారత పౌరుడు కాదని తేల్చింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలను సవాలు చేస్తూ రమేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. సహజ న్యాయ సూత్రాలు పాటించలేదని కోర్టును అభ్యర్థించాడు. దీంతో జూలై 23. 2019 తేదిన గతంలో కేంద్ర హోం శాఖ ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేస్తూ త్రిమెన్ ఇచ్చిన నివేదికను నుంచి పున: పరిశీలించాలని, పౌరసత్వం లో 10(3) నిబంధనను కూడా చట్టప్రకారం పరిశీలించాల్సిందిగా తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. 12 వారాలలో తేల్చాలని కేంద్రహోం శాఖకు తిరిగి అదేశించింది. అక్టోబర్ 31, 2019 న ఢిల్లీలోని కేంద్ర హోం శాఖ బోర్డర్ మేనేజ్ మెంట్ సెక్రటరీ నార్త్ బ్లాక్‌లోని ఓ గది లో ఇరుపక్షాలను విచారించారు. హైకోర్టు ఇచ్చిన 12 వారాల గడువు అనంతరం మళ్లీ కేంద్ర హోం శాఖ చెన్నమనేని భారతదేశ పౌరుడు కాదని తేల్చి చెప్పింది. కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మళ్ళీ చెన్నమనేని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై న్యాయస్థానం విచారిస్తోంది. మరో రెండు వారాల్లో ఇరుపక్షాలు దాఖలు చేసిన కౌంటర్ అనంతరం తిరిగి విచారించనుంది. తుది వాదనలకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్ట్ ఎలాంటి ఆదేశాలు జారీచేస్తుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
చెన్నమనేనిని ప్రశ్నించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దుపై స్టేను హైకోర్టు మరోసారి పొడిగించింది. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు గత నవంబర్‌లో స్టే ఇచ్చింది. తాజాగా ఆ ఉత్తర్వులను ఈ నెల 24 వరకు పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం జరిగిన విచారణలో చెన్నమనేని రమేశ్ ఇప్పటికీ జర్మనీ పాస్‌పోర్టుతోనే విదేశాలకు వెళ్లినట్లు కేంద్ర హోంశాఖ కోర్టుకు తెలిపింది. తద్వారా రమేష్ జర్మనీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని పేర్కొంది. దీంతో భారత పౌరసత్వం ఉందని చెప్తూనే జర్మనీ పాస్పోర్టుతో ఎందుకు వెళ్లావని న్యాయస్థానం చెన్నమనేనిని ప్రశ్నించింది.(చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో ఊరట) దీనికి ఆయన స్పందిస్తూ జర్మనీ పౌరసత్వం ఎప్పుడో రద్దు చేసుకున్నట్లు తెలిపారు. ‘జర్మనీ సిటిజన్‌షిప్ వదులుకున్నారా? అందుకు జర్మనీ ప్రభుత్వం ఆమోదించిందా?’ అని హైకోర్టు వరుస ప్రశ్నలు సంధించింది. అనంతరం జర్మనీ పౌరసత్వం రద్దు చేసుకున్నట్లు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెన్నమనేనికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. కాగా వాస్తవాలు దాచి మోసపూరిత విధానాల ద్వారా చెన్నమనేని రమేశ్ భారతీయ పౌరసత్వం పొందినట్లు నిర్ధారించి.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గతేడాది నవంబర్ 20న అతని పౌరసత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. (చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దు) -
చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు తెలంగాణ హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. ఆయనకు జర్మనీ, భారతీయ పౌరసత్వం ఉందని హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర హోంశాఖ ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయడంపై.. కోర్టు 8 వారాల పాటు స్టే విధించింది. ఈ క్రమంలో రమేష్ బాబు.. జర్మనీ పౌరసత్వాన్ని ఇప్పటికే రద్దు చేసుకున్నట్లు ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం విచారణ చేపట్టిన కోర్టు.. రమేష్ బాబు రెండు పౌరసత్వాలకు సంబంధించిన ఆధారాలు చూపించాలని, పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. -
చెన్నమనేనికి హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్ : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసు విషయమై శుక్రవారం హైకోర్టులో విచారణ జరుగగా, చెన్నమనేని తరపున సీనియర్ న్యాయవాది వేదల వెంకటరమణ వాదనలు వినిపించారు. చెన్నమనేని రమేష్ జర్మనీలో అగ్రికల్చర్ ఎకనామిక్స్‌లో పీహెచ్డీ చేశాడని తెలిపారు. 2008 జనవరిలో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా, 2009లో పౌరసత్వం వచ్చిందని వెల్లడించారు. తర్వాత ఎన్నికల కమిషన్ గుర్తింపు కార్డు జారీ చేసిందని వివరించారు. చెన్నమనేని రమేష్ 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందగా, 2010 ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించారని తెలిపారు. తర్వాత 2014, 2019 ఎన్నికల్లోనూ గెలిచి ప్రజాసేవ చేస్తున్నాడని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతకు ముందు ఈ కేసులో ప్రతివాది అయిన ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవి కిరణ్ రావు మాట్లాడుతూ.. భారతీయ పౌరుడు కాని చెన్నమనేని రమేష్ తప్పుడు అఫిడవిట్ పెట్టి ఎమ్మెల్యేగా గెలుపొందారని వాదించారు. చట్టాలను మోసం చేసే వాళ్లు చట్టసభల్లో ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇప్పుడు హోంశాఖ చెప్పిందని గుర్తు చేశారు. చెన్నమనేని రమేష్‌కు జర్మనీ పౌరసత్వం ఉందని అనేక ఆధారాలు ఉన్నందున హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు. ఇరు వైపుల వాదనలు విన్న హైకోర్టు స్టే విధించి తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
‘పౌరసత్వం రద్దు నిర్ణయం అభినందనీయం’
సాక్షి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం అభినందనీయమని పిటిషనర్ కాంగ్రెస్‌నేత ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి.. ఎమ్మెల్యే రమేష్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. చట్టాలను తప్పుదోవ పటించే వ్యక్తులు.. చట్టాలను తయారు చేసే వ్యక్తులుగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. గతంలోనే హైకోర్టు, సుప్రీంకోర్టు, కేంద్ర హోంశాఖ అతన్ని భారత పౌరుడు కాదని తేల్చిచెప్పాయని గుర్తు చేశారు. మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా అనటంతో హైకోర్తులో కెవియట్ పిటిషన్ దాఖలు చేశానని శ్రీనివాస్ వివరించారు. ఎమ్మెల్యే రమేష్ హైకోర్టును ఆశ్రయిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. తమ వాదనలను కూడా మరోసారి కోర్టుకు తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. న్యాయస్థానాలపై విశ్వాసం ఉందని.. హైకోర్టులో తాను గెలుస్తాననే నమ్మకం ఉందని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009 నుంచి న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. తప్పుడు ధ్రువపత్రాలతో మన దేశ పౌరసత్వం పొందినందున రమేశ్ ఎన్నిక చెల్లదంటూ ఆది వాదిస్తూ వస్తున్నారు. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ మరోసారి విచారణ జరిపి, తాజాగా తన నిర్ణయాన్ని వెలువరించింది. -
చెన్నమనేని పౌరసత్వ రద్దుపై స్టే పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: వేములవాడ టీఆర్ఎస్ శాసనసభ్యు డు చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వం చెల్లదన్న కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను నిలిపేస్తూ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను జూన్ 8 వరకు హైకోర్టు పొడిగించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామ మూర్తి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. చెన్నమనేని పౌరసత్వం చెల్లదని గత ఆగస్టు 31న కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వుల పునఃసమీక్షకు దరఖాస్తు చేసుకున్నందున నిర్ణయం వెలువడే వరకూ అమలు నిలిపేయాలని డిసెంబర్ 13న హైకోర్టును చెన్నమనేని ఆశ్రయించగా కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. కాగా, తాను తప్పుడు పద్ధతుల్లో పౌర సత్వం పొందినట్లు ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారని చెన్నమనేని తన వ్యాజ్యం లో ఆరోపించారు. దాని ఆధారంగా తనను కేసులో ప్రతివాది చేయాలని శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. శ్రీనివాస్‌ను ప్రతివాదుల జాబితాలో చేర్చాల ని న్యాయమూర్తి అధికారులను ఆదేశించారు. ఖర్చుల నిమిత్తం రూ.3 వేలు చెల్లించాలని చెన్నమనేనిని ఆదేశించారు. విచారణ జూన్‌కు వాయిదా పడింది. -
ఆ ఎమ్మెల్యే పౌరసత్వంపై ఆరు వారాల్లో తేల్చండి
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం అంశాన్ని ఆరు వారాల్లో తేల్చాలని కేంద్ర హోం శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల్లో రమేశ్ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. రమేశ్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నందున ఆయన ఎన్నిక చెల్లదంటూ గతంలో శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో రమేశ్ ఎన్నిక చెల్లదని, ఆయన భారత పౌరుడు కాదని 2013లో హైకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీం కోర్టులో రమేశ్ అప్పీలు చేయగా దీనిపై స్టే విధించింది. స్టేను తొలగించాలని ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గతేడాది ఆగస్టులో విచారించింది. 2008లో చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వం కోరుతూ కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారు. భారత పౌరసత్వం తిరిగి పొందగోరే వారు కనీసం ఏడాది కాలం దేశంలో ఉండాలి. అయితే చెన్నమనేని రమేశ్ ఏడాదిపాటు ఈ దేశంలో లేరని ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేయగా ప్రభుత్వ యంత్రాంగం విచారణ జరిపి కేవలం 96 రోజులే దేశంలో ఉన్నట్టు తేల్చింది. ఈ నేపథ్యంలో సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర హోం శాఖ రమేశ్‌కు నోటీసులు జారీచేసింది. అయితే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు త్రిసభ్య కమిటీ వేసి విచారణ జరపాలని చట్టం చెబుతోందని, అందువల్ల త్రిసభ్య కమిటీ వేయాలని చెన్నమనేని రమేశ్ హోం శాఖకు జవాబు పంపారు. కేంద్ర హోం శాఖ 2012లో త్రిసభ్య కమిటీ వేసి విచారణ జరిపింది. కానీ నివేదిక ఇవ్వలేదు. ఆ నివేదిక హోం శాఖ వద్ద పెండింగ్‌లో ఉందని పిటిషనర్ ధర్మాసనానికి విన్నవించడంతో రమేశ్ పౌరసత్వ స్థితిపై మూడు నెలల్లో తేల్చాలని, సంబంధిత నివేదికను హైకోర్టుకు సమర్పించాలని 2016 ఆగస్టు 11న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు వెలువడిన కొద్దికాలానికి కేంద్ర హోం శాఖ మరికొంత గడువు కావాలని కోరింది. ఆ గడువు కూడా పూర్తికావడంతో తాజాగా సోమవారం మరోసారి ఆది శ్రీనివాస్ సుప్రీం కోర్టును ఆశ్రయించి కోర్టు ఆదేశాలు అమలు కాలేదని విన్నవించడంతో.. ఆరు వారాల్లో కేంద్ర హోం శాఖ ఈ అంశాన్ని తేల్చాలని ధర్మాసనం ఆదేశించింది.