
ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం రద్దు
సాక్షి, న్యూఢిల్లీ : టీఆర్‌ఎస్ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తప్పుడు పత్రాలతో చెన్నమనేని భారత పౌరసత్వం పొందారని ఎస్కే టాండన్ జ్యుడీషియల్ కమిటీ విచారణలో తేలింది. దీంతో ఎమ్మెల్యే చెన్నమనేని పొందుతున్న ప్రయోజనాలను ఉపసంహరించాలని కేంద్రం ఆదేశించింది. తాజా ఉత్తర్వులపై బీజేపీ నేత ఆది శ్రీనివాస్ స్పందిస్తూ... తప్పుడు పత్రాలతో పౌరసత్వం పొందడం సిగ్గుచేటు అని, చెన్నమనేని తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కాగా చెన్నమనేని భారత పౌరసత్వం చెల్లదని.. ఆయన జర్మనీ పౌరుడేనని మంగళవారం తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. దీంతో రమేశ్‌బాబు ఎమ్మెల్యే పదవిని కోల్పోనున్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో దేశ పౌరసత్వం పొందినందున రమేశ్ ఎన్నిక చెల్లదంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి, బీజేపీ నేత ఆది శ్రీనివాస్ 2009 నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. రమేశ్ పౌరసత్వంపై ఆరు వారాల్లో తమకు నివేదిక అందించాలని ఆగస్టు 28న కేంద్ర హోం శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనల ప్రకారం రమేశ్‌బాబు పౌరసత్వం పొందారా.. లేదా అన్నది తేల్చాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ వారం రోజుల్లోనే తన నిర్ణయాన్ని ప్రకటించింది.