పౌరసత్వం రద్దుపై ఎమ్మెల్యే న్యాయపోరు
♦హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వ వివాదం మరోసారి ఉమ్మడి హైకోర్టుకు చేరింది. భారత పౌరసత్వాన్ని కేంద్ర హోం శాఖ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పౌరసత్వం రద్దు నిర్ణయం ఆగస్టు 31 నుంచి అమల్లో ఉంటుందంటూ కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి తీసుకున్న చెల్లదని చెన్నమనేని ఆ రిట్‌లో పేర్కొన్నారు. భారత పౌరసత్వ చట్టం–1955లోని సెక్షన్ 10(1) ప్రకారం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రతివాదులుగా కేంద్ర హోం శాఖ కార్యదర్శి/సంయుక్త కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్లలను చేశారు.
తనకు భారత పౌరసత్వం ఇచ్చిన తర్వాత 30 రోజుల్లో మాత్రమే అభ్యంతరాలు చెప్పాలని భారత పౌరసత్వ చట్టం చెబుతోందన్నారు. ఆ చట్టంలోని సెక్షన్ 5(1) ప్రకారం తనకు పౌరసత్వం వచ్చిందని, అయితే తనపై వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్ చాలా ఆలస్యంగా ఫిర్యాదు చేసినా దానిపై కేంద్ర హోం శాఖ స్పందించిందని తప్పుపట్టారు. దేశ సమగ్రతను దెబ్బతీసే చర్యలకు పాల్పడినప్పుడు మాత్రమే పౌరసత్వం రద్దు చేసే వీలుందని, అయినా కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఆది శ్రీనివాస్ ఫిర్యాదుపై కమిటీ విచారణ నివేదిక తనకు ఇవ్వలేదన్నారు.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై తిరిగి సమీక్షించాలని కోరే అవకాశం ఒక్కటే తనకు ఉందని, ఆ విధంగా కోరుతూనే హైకోర్టులో రిట్ దాఖలు చేశామన్నారు. కేంద్రం తీసుకున్న తన పౌరుసత్వ రద్దు నిర్ణయాన్ని కొట్టివేయాలని రిట్‌లో రమేశ్ కోరారు. భారతదేశంలో పుట్టి పెరిగి ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లిన తర్వాత అక్కడి పౌరసత్వం తనకు 1993లో వచ్చిందన్నారు.
స్వాతంత్య్ర సమరయోధులైన తన తల్లిదండ్రులు చేస్తున్న ప్రజాసేవకు స్ఫూర్తిగా తీసుకుని జర్మనీలో ఉంటూనే కరీంనగర్ జిల్లాలోని అనేక గ్రామాల్లో సేవాకార్యక్రమాల్ని చేపట్టానని, 2007లో తిరిగి భారతదేశానికి వచ్చాక వాటిని కొనసాగిస్తూనే భారత పౌరసత్వం కోసం చట్ట ప్రకారం పొందానన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజల మన్ననలు పొందానన్నారు. తనకు పౌరసత్వం ఇవ్వడం వల్ల ఏవిధంగా నష్టపోని, బాధితుడు కూడా కాని ఆది శ్రీనివాస్ రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన ఫిర్యాదుపై కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయాలని రిట్‌లో రమేశ్ హైకోర్టును కోరారు.