ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం చెల్లదు | Vemulavada MLA Chennamaneni Ramesh Babu Disqualified By Union Home ministery | Sakshi
Sakshi News home page

ఆ ఎమ్మెల్యే షాక్‌ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

Published Wed, Sep 6 2017 1:41 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం చెల్లదు - Sakshi

ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం చెల్లదు

► ఆయన జర్మనీ పౌరుడే..: కేంద్ర హోంశాఖ
►ఎమ్మెల్యే పదవి కోల్పోయే అవకాశం
►సుప్రీంకోర్టు తుది తీర్పుపై ఉత్కంఠ
►రివ్యూ పిటిషన్‌ హక్కు వినియోగించుకుంటా: రమేశ్‌


సాక్షి, హైదరాబాద్‌: వేములవాడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు కేంద్ర హోం శాఖ షాక్‌ ఇచ్చింది! ఆయన భారత పౌరసత్వం చెల్లదని.. ఆయన జర్మనీ పౌరుడేనని మంగళవారం తేల్చిచెప్పింది. దీంతో రమేశ్‌బాబు ఎమ్మెల్యే పదవిని కోల్పోయే అవకాశాలున్నాయి. తప్పుడు ధ్రువపత్రాలతో దేశ పౌరసత్వం పొందినందున రమేశ్‌ ఎన్నిక చెల్లదంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి, బీజేపీ నేత ఆది శ్రీనివాస్‌ 2009 నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. రమేశ్‌ పౌరసత్వంపై ఆరు వారాల్లో తమకు నివేదిక అందించాలని ఆగస్టు 28న కేంద్ర హోం శాఖను సుప్రీంకోర్టు  ఆదేశించింది. నిబంధనల ప్రకారం రమేశ్‌బాబు పౌరసత్వం పొందారా.. లేదా అన్నది తేల్చాలని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ వారం రోజుల్లోనే తన నిర్ణయాన్ని ప్రకటించింది.

భారత పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి తాజాగా రమేశ్‌కు లేఖ కూడా పంపినట్లు సమాచారం. దీంతో రాజకీయ శ్రేణుల్లో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. రమేశ్‌బాబు తప్పుడు అఫిడవిట్‌ సమర్పించి భారత పౌరసత్వం పొందారని నిర్ధారణ అయితే ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించడంతోపాటు రూ.50 వేల జరిమానా, అయిదేళ్ల జైలుæ శిక్ష విధించే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. హోంశాఖ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు తీసుకునే తుది తీర్పుపై ఈ వ్యవహారం ఆధారపడి ఉంది.

2009 నుంచే వివాదం
రమేశ్‌బాబు కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ నేత చెన్నమనేని రాజేశ్వరరావు కుమారుడు. వారసత్వంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రమేశ్‌బాబు వేములవాడ నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో తొలిసారిగా టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. అదే సమయంలో పౌరసత్వం వివాదం మొదలైంది. అప్పటికే చాలాకాలం జర్మనీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆయనకు ఆ దేశ పౌరసత్వం ఉంది. ఎన్నికలకు ముందు భారత పౌరసత్వం తీసుకొని ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచారు. రమేశ్‌బాబు పౌరసత్వాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ పడ్డ ఆది శ్రీనివాస్‌ 2009లో హైకోర్టును ఆశ్రయించారు. రమేశ్‌బాబు 1993లో భారత పౌరసత్వాన్ని రద్దు చేసుకొని జర్మనీ పౌరసత్వం పొందారు. తిరిగి 2008 మార్చి 31న పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ పౌరసత్వ చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకునే నాటికి దేశంలో వరుసగా 365 రోజులు స్థిర నివాసం ఉండాలనే నిబంధన ఉంది.

ఆయన వరుసగా అన్ని రోజులు ఇక్కడ లేరని, అందుకే పౌరసత్వం చెల్లదంటూ శ్రీనివాస్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసు విచారణలోనూ రమేశ్‌బాబు కేవలం 96 రోజులు మాత్రమే దేశంలో ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన తప్పుడు ధ్రువ పత్రాలతో పౌరసత్వం పొందారని హైకోర్టు 2013లో తీర్పునిచ్చింది. ఆయన ఎన్నిక సైతం చెల్లదంటూ, ఓటర్ల జాబితాల్లోంచి ఆయన పేరును తొలగించాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రమేశ్‌బాబు సుప్రీంకోర్టుకు వెళ్లారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించింది. స్టేను సవాల్‌ చేస్తూ ఆది శ్రీనివాస్‌ సుప్రీంకోర్డులో తన తరఫున వాదనలు వినిపించారు.

దీంతో సుప్రీం ఈ కేసు విచారణ చేపట్టింది. పౌరసత్వం వివాదాన్ని తేల్చాలని గతంలో కేంద్ర హోం శాఖను ఆదేశించింది. ఇచ్చిన గడువు కూడా ముగియటంతో ఇటీవల ఆరు వారాల నిర్ణీత గడువును విధించింది. ఈ నేపథ్యంలోనే రమేశ్‌ పౌరసత్వం చెల్లదని హోంశాఖ తేల్చింది. కేసు విచారణలో ఉన్న క్రమంలో 2010లో రమేశ్‌బాబు ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోనూ ఆది శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ తరపున బరిలో నిలిచారు. 2014లో జరిగిన ఎన్నికల్లోనూ రమేశ్‌బాబు టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి మరోసారి గెలిచారు. ఆది శ్రీనివాస్‌ ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.

వేములవాడకు ఉప ఎన్నిక!
కేంద్ర హోం శాఖ తాజా నిర్ణయంతో చెన్నమనేని రమేశ్‌ ఎమ్మెల్యే పదవి కోల్పోయే పరిస్థితులున్నాయి. ఈ నిర్ణయమే వస్తే వేములవాడ అసెంబ్లీ స్థానం ఖాళీ అవుతుంది. అదే జరిగితే ఆరు నెలల్లోపు వేములవాడకు ఉప ఎన్నిక నిర్వహిస్తారు. సాధారణ ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో వేములవాడ ఉప ఎన్నిక రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారనుంది.  

రివ్యూ పిటిషన్‌ హక్కు వినియోగించుకుంటా: ఎమ్మెల్యే రమేశ్‌బాబు
ఈ కమిటీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ముందే భావించా. జాయింట్‌ సెక్రెటరీ స్థాయిలో తీసుకున్న నిర్ణయమిది. సెక్షన్‌ 15 ప్రకారం దీనిపై కేంద్ర హోం కార్యదర్శికి, హోం మంత్రికి రివ్యూ పిటిషన్‌ పెట్టుకునే హక్కు నాకుంది. నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేని కొన్ని శక్తులు నాపై ఏడు కేసులు వేసి నా జన్మభూమి, పౌరసత్వాన్ని వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాయి. 2013లో లాగే మళ్లీ దొంగదెబ్బ వేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లా.

న్యాయ వ్యవస్థపై నమ్మకముంది: ఆది శ్రీనివాస్, బీజేపీ నేత
నాకు ఇంకా అధికారికంగా ఎలాంటి ఆదేశాలు అందలేదు. 2013లో హైకోర్టులో నెగ్గాను. అదే విధంగా సుప్రీంకోర్టులోనూ నెగ్గుతానన్న విశ్వాసం ఉంది. కేంద్ర హోంశాఖ, సుప్రీంకోర్టులపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement