దేశానికి తక్షణావసరం: మోదీ
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం మతపరమైన పౌరస్మృతి అమల్లో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘దాన్ని 75 ఏళ్లుగా భరిస్తున్నాం. ఆ స్మృతికి చరమగీతం పాడి దాని స్థానంలో దేశ ప్రజలందరికీ సమానంగా వర్తించే ‘లౌకిక’ పౌరస్మృతిని రూపొందించుకోవాల్సిన సమయం వచ్చింది’’ అని కుండబద్దలు కొట్టారు. ‘‘రాజ్యాంగ స్ఫూర్తి కూడా అదే.
దేశమంతటికీ ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ఉండాలని ఆదేశిక సూత్రాలు కూడా స్పష్టంగా చెబుతున్నాయి. దాని ఆవశ్యకతను సుప్రీంకోర్టు కూడా పలుమార్లు నొక్కిచెప్పింది. ఆ మేరకు తీర్పులు వెలువరించింది’’ అని గుర్తు చేశారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం మోదీ ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేయడం ఆయనకిది వరుసగా పదకొండోసారి కావడం విశేషం.
బీజేపీ ఎజెండా అంశాల్లో, ప్రధాన ఎన్నికల ప్రచార నినాదాల్లో ఒకటైన యూసీసీని వీలైనంత త్వరగా అమల్లోకి తెస్తామని ఈ సందర్భంగా ప్రధాని స్పష్టమైన సంకేతాలిచ్చారు. ‘‘ప్రస్తుత పౌరస్మృతి ఒకవిధంగా మతపరమైనదన్న అభిప్రాయం సమాజంలోని మెజారిటీ వర్గంలో ఉంది. అందులో వాస్తవముంది. ఎందుకంటే అది మతవివక్షతో కూడినది. అందుకే దాన్నుంచి లౌకిక స్మృతివైపు సాగాల్సి ఉంది.
తద్వారా రాజ్యాంగ నిర్మాతల కలను నిజం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. అది తక్షణావసరం కూడా’’ అని పేర్కొన్నారు. ‘ఒక దేశం–ఒకే ఎన్నిక’ కూడా దేశానికి చాలా అవసరమని మోదీ అన్నారు. ‘‘2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్ కలను సాకారం చేసుకుందాం. అందుకు 140 కోట్ల పై చిలుకు భారతీయులంతా భుజం భుజం కలిపి కలసికట్టుగా సాగుదాం’’ అని పిలుపునిచ్చారు. రంగాలవారీగా తమ పాలనలో దేశం సాధించిన ప్రగతిని 98 నిమిషాల పాటు వివరించారు. తద్వారా అత్యంత ఎక్కువ సమయం పాటు పంద్రాగస్టు ప్రసంగం చేసిన ప్రధానిగా సొంత రికార్డు (94 నిమిషాల)నే అధిగమించారు.
కొత్తగా 75,000 వైద్య సీట్లు
‘‘వైద్య విద్య కోసం మన యువత విదేశీ బాట పడుతోంది. ఇందుకోసం మధ్యతరగతి తల్లిదండ్రులు లక్షలు, కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. అనామక దేశాలకు కూడా వెళ్తున్నారు’’ అని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. వచ్చే ఐదేళ్లలో 75 వేల వైద్య సీట్లను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ‘‘ఉన్నత విద్య కోసం యువత భారీగా విదేశాలకు వెళ్తోంది. దీన్ని సమూలంగా మార్చేస్తాం. విదేశాల నుంచే విద్యార్థులు మన దగ్గరికొచ్చే స్థాయిలో విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తాం. అలనాటి నలంద విశ్వవిద్యాలయ స్ఫూర్తితో 21వ శతాబ్దపు అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతాం. నూతన విద్యా విధానానిది ఇందులో కీలక పాత్ర కానుంది.
కిరాతకులకు వణుకు పుట్టాలి
మహిళలపై హింసకు తక్షణం అడ్డుకట్ట వేయాల్సిందేనని మోదీ అన్నారు. ‘‘మహిళలపై అకృత్యాలకు తెగించేవారికి కఠినాతి కఠినమైన శిక్షలు విధించాలి. ఉరి తప్పదన్న భయం రావాలి. మహిళలను ముట్టుకోవాలంటేనే వణుకు పుట్టే పరిస్థితి కలి్పంచడం చాలా ముఖ్యం. ఇలాంటి కేసుల్లో పడ్డ శిక్షల గురించి అందరికీ తెలిసేలా మీడియాలో విస్తృత ప్రాచుర్యం కల్పించాలి. అప్పుడే ప్రజల్లో తిరిగి విశ్వాసం పాదుగొల్పగలం’’ అన్నారు.
కోల్‌కతాలో వైద్యురాలిపై దారుణ హత్యాచారం దేశమంతటినీ కుదిపేస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘మహిళల భద్రత బాధ్యత కేంద్రంపై, రాష్ట్రాలపై, ప్రజలందరిపై ఉంది. కోల్‌కతా ఘోరంపై దేశమంతా తీవ్రంగా ఆక్రోశిస్తున్న తీరును అర్థం చేసుకోగలను. నాదీ అదే మనఃస్థితి. నేనెంత బాధ పడుతున్నానో మాటల్లో చెప్పలేను. ఆ కేసు విచారణను సత్వరం ముగించి దోషులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి నీచకృత్యాలు పదేపదే జరుగుతుండటం బాధాకరం’’ అన్నారు.
బంగ్లాలో పరిస్థితులు ఆందోళనకరం
కల్లోల బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడుల పట్ల 140 కోట్ల పై చిలుకు భారతీయుల్లో ఆందోళన నెలకొందని మోదీ అన్నారు. అక్కడ త్వరలో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వెలిబుచ్చారు. అందుకు భారత్ అన్నివిధాలా సహకారం అందిస్తుందని చెప్పారు.
లక్ష మంది యువత రాజకీయాల్లోకి
రాజకీయ రంగంలో కుల, కుటుంబవాదాలకు అడ్డుకట్ట వేయాలని మోదీ అన్నారు. అందుకోసం ఏ రాజకీయ నేపథ్యమూ లేని లక్ష మంది యువతీ యువకులు ప్రజా జీవితంలోకి రావాలని పిలుపునిచ్చారు. ‘‘వారికి నచి్చన పారీ్టలో చేరి అన్ని స్థాయిల్లోనూ ప్రజాప్రతినిధులుగా మారాలి. కొత్త ఆలోచనలతో కూడిన ఆ కొత్త రక్తం మన ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయగలదు’’ అన్నారు.
ప్రతికూల శక్తులతో జాగ్రత్త
దేశ ప్రగతిని కొందరు ఓర్వలేకపోతున్నారని విపక్షాలనుద్దేశించి మోదీ విమర్శించారు. ‘‘ప్రతిదాన్నీ ధ్వంసం చేయాలని వాళ్లు కలలుగంటున్నారు. అవినీతిని ఘనకార్యంగా ప్రచారం చేసుకుంటున్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. అలాంటి ప్రతికూల శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి’’ అన్నారు. అంతర్గతంగా, బయటి నుంచి భారత్ లెక్కలేనన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు.
రాజస్తానీ రంగుల తలపాగా
ఎప్పట్లాగే ఈ పంద్రాగస్టు సందర్భంగా కూడా మోదీ ప్రత్యేక తలపాగాతో మెరిసిపోయారు. పసుపు, ఆకుపచ్చ, కాషాయ రంగులతో కూడిన రాజస్తానీ సంప్రదాయ లెహరియా తలపాగాతో ఆకట్టుకున్నారు. తెల్ల కుర్తా, చుడీదార్, నీలిరంగు బంద్‌గలా ధరించారు.
Comments
Please login to add a commentAdd a comment