సజీవ స్రవంతి మన రాజ్యాంగం: మోదీ
తానెన్నడూ రాజ్యాంగ పరిధి దాటలేదని వ్యాఖ్య
సుప్రీంకోర్టులో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగాన్ని జాతికి దారి చూపే కరదీపికగా ప్రధాని నరేంద్ర మోదీ అభివరి్ణంచారు. కీలకమైన పరివర్తన దశలో మన రాజ్యాంగం దేశానికి అన్ని విషయాల్లోనూ దారి చూపుతూ చుక్కానిలా వ్యవహరిస్తోందన్నారు. ‘‘మన రాజ్యాంగం కేవలం నిబంధనల పుస్తకం కాదు. అదో సజీవ స్రవంతి. కోట్లాది మంది భారతీయుల అవసరాలు, ఆశలను తీర్చడంలోనే గాక వారి ఆకాంక్షలు, అంచనాలను అందుకోవడంలో ఏనాడూ విఫలం కాలేదు. చివరికి ఎమర్జెన్సీ వంటి అతి పెద్ద సవాలును కూడా తట్టుకుని సమున్నతంగా నిలిచింది’’ అంటూ కొనియాడారు. మంగళవారం సుప్రీంకోర్టులో జరిగిన రాజ్యాంగ దిన వేడుకల్లో ప్రధాని ప్రసంగించారు. దేశమే ముందన్న భావన పౌరులందరిలో నిండుగా ఉండాలని హితవు పలికారు.
ఆ భావనే మన రాజ్యాంగాన్ని మరిన్ని శతాబ్దాల పాటు సజీవంగా ఉంచుతుందని అభిప్రాయపడ్డారు. స్వీయ అవసరాల కంటే దేశ ప్రయోజనాలను మిన్నగా భావించే కొద్దిమంది నిజాయతీపరులు దేశానికి చాలని 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ తొలి భేటీలో బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని గుర్తు చేశారు. ‘‘కాలానుగుణంగా వచ్చే మార్పులను రాజ్యాంగం తనలో ఇముడ్చుకునేలా దాని నిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.
స్వతంత్ర భారత ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు, పౌరుల అవసరాలు, సవాళ్లు కాలంతో పాటు ఎంతగానో మారతాయని వారికి బాగా తెలుసు’’ అని అన్నారు. జమ్మూ కశ్మీర్లో తొలిసారి రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలవుతుండటం ఆనందకరమన్నారు. ‘‘పౌరుల్లో మానవీయ విలువలను పాదుగొల్పాలని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారు. అందుకే రాజ్యాంగపు తొలి హస్తలిఖిత ప్రతిలో రాముడు, సీత, గురు నానక్, బుద్ధుడు, మహావీరుడు తదితరుల చిత్రాలను చేర్చారు’’ అని గుర్తు చేశారు.
ఎన్నడూ పరిధి దాటలేదు: మోదీ
రాజ్యాంగ పరిధులను తానెన్నడూ దాటలేదని ప్రధాని మోదీ అన్నారు. ప్రధానిగా ఎప్పుడూ రాజ్యాంగం నిర్దేశించిన సరిహద్దులకు లోబడి పని చేసేందుకే ప్రయతి్నంచానని స్పష్టం చేశారు. ‘‘ఇతర వ్యవస్థల్లో చొరబాట్లకూ నేనెన్నడూ ప్రయత్నించలేదు. నా దృక్కోణాన్ని, అభిప్రాయాలను కూడా పరిధులకు లోబడే వెల్లడించేందుకే శాయశక్తులా ప్రయతి్నంచా. ఈ వేదికపై ఇంతమాత్రం చెబితే చాలనుకుంటా. వివరించి చెప్పాల్సిన అవసరం లేదనే ఆశిస్తున్నా’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
మోదీకి ముందు మాట్లాడిన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్ ప్రభుత్వాల పనితీరుపై విమర్శలు గుప్పించారు. ‘‘తామే సర్వోన్నతులమనే భావనతో అవి అప్పుడప్పుడు అతి చేస్తున్నాయి. చట్టాలను వ్యక్తిగత, రాజకీయ అజెండాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి’’ అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపైనే పై విధంగా మోదీ స్పందించారని భావిస్తున్నారు.
నడిపించే శక్తి రాజ్యాంగం: సీజేఐ
‘‘ప్రభుత్వ వ్యవస్థలన్నీ తమకు దఖలుపడ్డ రాజ్యాంగపరమైన బాధ్యతలను గౌరవించాలి. వాటికి లోబడే నడుచుకోవాలి’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచించారు. ఎన్నికల ప్రక్రియ తాలూకు పర్యవసానాలతో న్యాయవ్యవస్థ ప్రభావితం కాకుండా ఉండేందుకు దానికి స్వతంత్ర ప్రతిపత్తి వంటి రక్షణలను రాజ్యాంగం కలి్పంచిందని గుర్తు చేశారు. అయితే, ‘‘ఏ వ్యవస్థా దానికదే స్వతంత్ర విభాగం కాదు. అవన్నీ పరస్పరం ఆధారితాలే. కనుక దేశ శ్రేయస్సే లక్ష్యంగా పరస్పర సమతుల్యతతో సమైక్యంగా సాగాలి’’ అని హితవు పలికారు.
‘‘భారత్‌ను ప్రగతిశీల దేశంగా తీర్చిదిద్దడంలో రాజ్యాంగం అతి కీలక పాత్ర పోషించింది. ఫలితంగా దేశ విభజన, నిరక్షరాస్యత, పేదరికం తదితర పెను సవాళ్లను అధిగమించగలిగాం. అత్యంత చైతన్యవంతమైన ప్రజాస్వామ్యంగా, అంతర్జాతీయంగా బలమైన శక్తిగా భారత్ నిలిచింది. వీటన్నింటి వెనకాల అడుగడుగునా రాజ్యాంగపు వెన్నుదన్ను ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment