
ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని 130 కోట్ల మంది కలిసి మెలిసి ఉండడానికి రాజ్యాంగమే కారణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మంగళవారం 70వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన పార్లమెంటు ఉభయ సభల సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను కొనియాడారు. రాజ్యాంగం మనకు వెలుగునిచ్చే దీపిక, ఎందరో వీరుల త్యాగానికి ప్రతీక అని చెప్పారు. రాజ్యాంగం ప్రమాదంలో పడినప్పుడు ప్రజలే రక్షించారని, ఇక ముందు కూడా రక్షించుకుంటారని వ్యాఖ్యానించారు. సేవాభావం కన్నా కర్తవ్యం గొప్పదని ప్రబోధించారు. 70 ఏళ్ల క్రితం రాజ్యాంగ నిర్మాణంలో ప్రత్యక్ష, పరోక్ష పాత్రధారులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
మరోవైపు ఇదే రోజు ముంబైలో ఉగ్రదాడులు జరగడం బాధాకరమని, మృతులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రభుత్వ పెద్దలు పాల్గొన్నారు. కాగా, మహారాష్ట్రలో బీజేపీ వైఖరికి నిరసనగా కాంగ్రెస్, శివసేన పార్టీలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి. పార్లమెంట్ వెలుపల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యాంగాన్ని చదవి, తన నిరసనను తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment