న్యూఢిల్లీ: గత నెలలో తన నివాసంలో జరిగిన గణపతి పూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకావడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ స్పందించారు. నాడు గణపతి పూజకు మోదీ రావడంపై చెలరేగిన వివాదాన్ని ఆయన ప్రస్తావించారు. అలాంటి సమావేశాలలో న్యాయపరమైన విషయాలేవీ చర్చించలేదని పేర్కొన్నారు. ఈ మేరకు ముంబైలో లోక్‌సత్తా లెక్చర్ సిరీస్‌లో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించడం సర్వసాధారణమని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో న్యాయవ్యవస్థకు పాలనాపరమైన సంబంధాలు ఉంటాయని, వీటిపై మాట్లాడుకునేందుకు ప్రభుత్వ పెద్దలతో సీజేఐ, హైకోర్టు చీఫ్ జస్టిస్‌లు సమావేశమవుతారని తెలిపారు. ప్రభుత్వ పెద్దలను కలిస్తే.. ఇద్దరి మధ్యా ఏదో డీల్ కుదిరినట్టు భావించరాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలో మా విధులు మాకు తెలుసు, రాజకీయ నాయకులకు కూడా వారి విధులు తెలుసని తెలిపారు. ఏ న్యాయమూర్తులు కూడా (భారత ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తులు) ఏ ముప్పును కోరి తెచ్చుకోరని మనదేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు.
‘‘ఈ సమావేశాలు ఎందుకు అని ప్రజలు అనుకుంటున్నారు. రాజకీయ వర్గాల్లో కూడా న్యాయవ్యవస్థ పట్ల ఎంతో గౌరవం ఉండడంలోనే మన రాజకీయ వ్యవస్థ పరిపక్వత దాగి ఉంది.. ఇది తెలిసిందే. న్యాయవ్యవస్థకు కావాల్సిన నిధులను (బడ్జెట్) ప్రభుత్వాలు విడుదల చేస్తాయి. కాబట్టే సీఎంలతో సమావేశాలు తప్పనిసరి. ఈ బడ్జెట్ న్యాయమూర్తుల కోసం కాదు. కొత్త కోర్టు భవనాలు, జిల్లా న్యాయమూర్తులకు కొత్త నివాసాలు అవసరం. దీనికి ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి సమావేశాలు అవసరం. ఇలాంటి సమావేశాలు న్యాయ నిర్ణయాలపై కాకుండా న్యాయవ్యవస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాల సమస్యలపై మాత్రమే దృష్టి సారిస్తాయి.
తాను గతంలో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశానని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ‘ప్రధాన న్యాయమూర్తిని నియమించినప్పుడు వారు ముఖ్యమంత్రి ఇంటికి వెళతారు. అప్పుడు, ముఖ్యమంత్రి చీఫ్ జస్టిస్ ఇంటికి వస్తారు, ఈ సమావేశాలు ఎజెండాను నిర్ణయిస్తాయి. జడ్జిలతో జరిగిన సమావేశంలో ఏ సీఎం కూడా పెండింగ్ కేసుల ప్రస్తావన తేలేదు. జడ్జీలతో జరిగే మీటింగ్స్‌లో రాజకీయ వ్యవస్థ చాలా పరిపక్వతతో వ్యవహరించింది. దీని కోసం మీరు కలవాల్సిన అవసరం లేదా? కేవలం లేఖలు పంపి ఊరుకుంటే పనులు కావు. న్యాయమూర్తులు నేరుగా మాట్లాడాల్సి ఉంటుంది.’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment