
ఓటర్ల తొలగింపుపై ఫిర్యాదు చేయొచ్చు
బిహార్ ఉదంతంలో సుప్రీం స్పష్టీకరణ
పౌరులను పట్టించుకోని పార్టీలెందుకు?
ఫిర్యాదుల దాఖలులో సహకరించండి
మీ కార్యకర్తలను రంగంలోకి దింపండి
బిహార్‌లోని 12 పార్టీలకు ఆదేశాలు
న్యూఢిల్లీ: బిహార్‌లో ఓటర్ల జాబితా నుంచి తొలగింపునకు గురైన వాళ్లు దాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసే ఫిర్యాదులకు మద్దతుగా ఆధార్‌ను కూడా సమర్పించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయమై ఎన్నికల సంఘం పేర్కొన్న 11 డాక్యుమెంట్లతో పాటు ఆధార్ కూడా చెల్లుబాటవుతుందని స్పష్టం చేసింది. ఎన్నికల జాబితా ముసాయిదాపై సకాలంలో అభ్యంతరాలు లేవనెత్తడంలో బిహార్‌లోని 12 రాజకీయ పార్టీలూ విఫలమయ్యాయంటూ గట్టిగా తలంటింది.
ఈ విషయంలో వాటిది పూర్తిగా చేతగానితనమేనంటూ ఆక్షేపించింది. బిహార్‌లో తాము చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) సందర్భంగా ముసాయిదాపై ఒక్క పార్టీ కూడా తమవద్ద అభ్యంతరాలు దాఖలు చేయలేదన్న కేంద్ర ఎన్నికల సంఘం అఫిడవిట్‌ను ఉటంకిస్తూ ఈ మేరకు పార్టీలను గట్టిగా మందలించింది. పైపెచ్చు ఓటర్ల జాబితా నుంచి తొలగింపునకు గురైన పౌరులకు కనీసం ఈసీ వద్ద అభ్యంతరాలు దాఖలు చేయడంలో ఒక్క పార్టీ కూడా చురుగ్గా వ్యవహరించి సాయం చేయలేదంటూ తీవ్రంగా ఆక్షేపించింది. ప్రజలతో ఇంతటి దూరం ఎందుకు ఏర్పడిందంటూ ప్రశ్నించింది.
ఈ విషయమై పార్టీలన్నీ ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ ఉద్బోధించింది. ఎస్‌ఐఆర్ కసరత్తును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ఇద్దరు సభ్యుల ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ‘‘ఓటర్ల ముసాయిదాలో పేర్లు గల్లంతైన వారికి ఫారం–6 సాయంతో ఈసీ వద్ద ఫిర్యాదులు చేయడంలో పూర్తిస్థాయిలో సహకరించండి. ఆ మేరకు మీ పార్టీల కార్యకర్తలందరికీ స్పష్టమైన ఆదేశాలివ్వండి’’ అంటూ బిహార్‌లోని 12 పార్టీల నూ ఆదేశించింది. వ్యక్తిగతంగా అభ్యంతరా లను ఆన్‌లైన్‌లో దాఖలు చేసేందుకు వీలు కల్పించాల్సిందిగా ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌ఐఆర్ కసరత్తు గడువు విషయమై ఈ దశలో ఎలాంటి మార్పుచేర్పులూ చేయలేదని స్పష్టం చేసింది.

బూత్ ఏజెంట్లు ఏం చేస్తున్నట్టు?
బిహార్‌లో ఏకంగా 1.68 లక్షల మంది బూత్ స్థాయి ఏజెంట్లున్నట్టు ఈసీ నివేదించింది. అలాంటప్పుడు ఓటర్ల జాబితా నుంచి తొలగింపులకు సంబంధించి ఇప్పటిదాకా కేవలం రెండంటే రెండే అభ్యంతరాలు దాఖలవడంపై ధర్మాసనానికి విస్మయం వ్యక్తం చేసింది. ఈ విషయంలో పార్టీలు, అవి నియమించిన బూత్ స్థాయి ఏజెంట్లు ఏం చేస్తున్నట్టని ప్రశ్నించింది. ‘‘తొలగించిన 65 లక్షల ఓటర్లు మరణించారా, నివాసాలు మార్చారా, మరేమైనా జరిగిందా అన్నది తేలాలి. ఈ దిశగా అన్ని పార్టీల ఏజెంట్లు పూర్తి స్థాయిలో తనిఖీలు జరపాలి’’ అని ఆదేశించింది.