సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వెల్లడి
ముంబై: న్యాయస్థానాలు, న్యాయమూర్తులు సైతం సూక్ష్మ పరిశీలనకు గురి కావాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. న్యాయమూర్తుల పనితీరును చుట్టూ ఉన్న సమాజం పరిశీలిస్తూనే ఉంటుందని అన్నారు. అయితే, సమాజం పట్ల ఉన్న దయ, కరుణ, జాలి, అనురాగం వల్లే తాను అన్ని రకాల పరిశీలనలు, పరీక్షలకు నిలిచి, న్యాయమూర్తిగా నిలదొక్కుకున్నానని తెలిపారు. సమాజం పట్ల తమ ప్రేమానురాగాలు తమ తీర్పుల ద్వారా వెల్లడవుతాయని వివరించారు.
జస్టిస్ చంద్రచూడ్ వచ్చే నెల 10వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ముంబైలో ఆయనను ఘనంగా సత్కరించారు. జస్టిస్ చంద్రచూడ్ అందించిన సేవలను న్యాయవాదులు ప్రశంసించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ తాను ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. ‘‘ఐఐటీ–ధన్‌బాద్‌లో చేరేందుకు సకాలంలో అడ్మిషన్ ఫీజు రూ.17,500 చెల్లించలేకపోయిన దళిత విద్యార్థికి మా ఆదేశాలతో ప్రవేశం లభించింది. ఇలాంటి తీర్పులు తనకెంతో సంతృప్తిని ఇచ్చాయి’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment