అన్ని ప్రైవేట్‌ ఆస్తుల స్వాధీనానికి రాష్ట్రాలకు అధికారం లేదు | Historic judgment of Supreme Court On Private Property | Sakshi
Sakshi News home page

అన్ని ప్రైవేట్‌ ఆస్తుల స్వాధీనానికి రాష్ట్రాలకు అధికారం లేదు

Published Wed, Nov 6 2024 4:40 AM | Last Updated on Wed, Nov 6 2024 4:40 AM

Historic judgment of Supreme Court On Private Property

సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

ప్రైవేట్‌ ఆస్తులన్నీ సామాజిక వనరుల పరిధిలోకి రావు 

వచ్చేవాటిని నిర్దిష్ట అవసరాల నిమిత్తం సేకరించవచ్చు 

7: 2 మెజారిటీ తీర్పులో పేర్కొన్న రాజ్యాంగ ధర్మాసనం

తీర్పులు ప్రస్తుత, భావి అవసరాలకు అనుగుణంగా ఉండాలి 

గత పరిస్థితులు ప్రాతిపదిక కారాదు: సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ 

తీర్పుతో విభేదించిన జస్టిస్‌ ధూలియా, జస్టిస్‌ బి.వి.నాగరత్న

ఆర్టికల్‌ 39(బి)లో పేర్కొన్న సామాజిక వనరులు అన్న పదబంధం ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని ఆస్తులు, వనరులకు వర్తిస్తుందా అన్నది మా ముందున్న ప్రశ్న. సైద్ధాంతికంగా చూస్తే అవుననే సమాధానమే వస్తుంది. కానీ ఆ మేరకు జస్టిస్‌ కృష్ణయ్యర్‌ ఇచ్చిన తీర్పు, దాని ఆధారంగా సంజీవ్‌ కోక్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించలేకపోతున్నాం. కేవలం భౌతిక అవసరాల నిర్వచన పరిధిలోకి వచ్చినంత మాత్రాన ప్రతి ప్రైవేట్‌ ఆస్తినీ సామాజిక వనరుగా పరిగణించడం కుదరదు.
– సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌  

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ ఆస్తులపై ప్రభుత్వాల అధికార పరిధికి సంబంధించిన అతి కీలకమైన అంశంపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. అన్ని ప్రైవేట్‌ ఆస్తులూ సామాజిక వనరుల నిర్వచన పరిధిలోకి రావని స్పష్టం చేసింది. ‘‘కనుక రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని ప్రైవేట్‌ ఆస్తుల మీదా హక్కులు ఉండబోవు. సమాజ హితం, ఉమ్మడి ప్రయోజనాలు, సామాజిక పంపకం నిమిత్తం ఏ ప్రైవేట్‌ ఆస్తినైనా స్వాదీనం చేసుకునేందుకు వాటికి అధికారం లేదు’’ అని తేల్చి చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సారథ్యంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ మేరకు 7–2 మెజారిటీతో చరిత్రాత్మక తీర్పు వెల్లడించింది. 

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 39(బి) ఆధారంగా ప్రైవేట్‌ యాజమాన్యంలోని అన్ని వనరులను స్వా«దీనం చేసుకునే హక్కు రాష్ట్రాలకు లేదని పేర్కొంది. వాటికి ఆ అధికారం ఉందంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కృష్ణయ్యర్, జస్టిస్‌ చిన్నపరెడ్డి తదితరులు ఇచ్చిన గత తీర్పులతో విభేదించింది. వాటిలో వెలిబుచ్చిన అభిప్రాయాలను లోపభూయిష్టమైనవిగా, కాలదోషం పట్టినవిగా పేర్కొంది. ఆ తీర్పులను కొట్టేసింది. ఆర్థిక ప్రజాస్వామ్యానికి కూడా రాజ్యాంగం అనుమతిస్తోందంటూ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. 

అయితే, ‘‘కొన్ని ప్రైవేట్‌ ఆస్తులు మాత్రం ఆర్టికల్‌ 39(బి)లో పేర్కొన్న ‘సామాజిక వనరు­లు, సమాజ హితం’ పరిధిలోకి వస్తాయి. ఆ నిర్దిష్ట అవసరాల నిమిత్తం వాటిని ప్రభుత్వాలు స్వాదీనం చేసుకోవచ్చు’’ అని స్పష్టం చేసింది. సీజేఐతో పాటు జస్టిస్‌ హృషీకేశ్‌ రాయ్, జస్టిస్‌ జె.బి.పార్డీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్, జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీ ఈ మేరకు మెజారిటీ తీర్పు వెలువరించారు. వారి తరఫున సీజేఐ 193 పేజీల తీర్పును రాశారు. ఈ తీర్పుతో జస్టిస్‌ బి.వి.నాగరత్న పాక్షికంగా, జస్టిస్‌ సుధాన్షు ధూలియా పూర్తిగా విభేదించారు. 

కాలానుగుణంగా మారాలి: సీజేఐ 
ఆర్టికల్‌ 39(బి) కింద కేవలం ప్రైవేట్‌ ఆస్తులను కూడా సామాజిక వనరులుగా భావించవచ్చా అన్న అంశం 1992 నుంచి న్యాయస్థానాల్లో నలుగుతోంది. దీనికి సంబంధించి 16 పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. దీన్ని 2002లో తొమ్మిది మంది సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు. 2024లో సీజేఐ చంద్రచూడ్‌ ధర్మాసనం దీన్ని విచారణకు చేపట్టింది. ప్రైవేట్‌ ఆస్తులన్నింటినీ సామాజిక వనరులుగా భావించడానికి వీల్లేదని సీజేఐ తన తీర్పులో స్పష్టం చేశారు. 

అలా భావించవచ్చని, వాటిని సమాజ హితం కోసం స్వాదీనం చేసుకోవచ్చని పేర్కొన్న గత తీర్పులు సామ్యవాద ధోరణితో కూడినవని అభిప్రాయపడ్డారు. ‘‘ఆర్టికల్‌ 39(బి)లో పేర్కొన్న సామాజిక వనరులు అన్న పదబంధం ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని ఆస్తులు, వనరులకు వర్తిస్తుందా అన్నది మా ముందున్న ప్రశ్న. సైద్ధాంతికంగా చూస్తే అవుననే సమాధానమే వస్తుంది. కానీ ఆ మేరకు జస్టిస్‌ కృష్ణయ్యర్‌ ఇచ్చిన తీర్పు, దాని ఆధారంగా సంజీవ్‌ కోక్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించలేకపోతున్నాం. 

కేవలం భౌతిక అవసరాల నిర్వచన పరిధిలోకి వచ్చినంత మాత్రాన ప్రతి ప్రైవేట్‌ ఆస్తినీ సామాజిక వనరుగా పరిగణించడం కుదరదు. సదరు ఆస్తి తాలూకు స్వభావం, సమాజ శ్రేయస్సుపై దాని ప్రభావం, వనరుల అలభ్యత, అది ప్రైవేటు చేతుల్లో ఉంటే తలెత్తే పరిణామాలు తదితరాలన్నింటినీ బేరీజు వేసిన మీదట మాత్రమే అది సామాజిక వనరో, కాదో తేల్చాలి. ప్రజా విశ్వాస సిద్ధాంతాన్ని కూడా దీనికి వర్తింపజేయాల్సి ఉంటుంది. 

అడవులు, చెరువులు, చిత్తడి నేలలు, సహజ వనరులతో కూడిన భూముల వంటివి ప్రైవేట్‌ స్వాదీనంలో ఉంటే ఆర్టికల్‌ 39(బి) కింద వాటిని సమాజ అవసరాల నిమిత్తం ప్రభుత్వాలు సేకరించవచ్చు. అదే సమయంలో స్పెక్ట్రం, ఎయిర్‌వేవ్స్, సహజ వాయువు, గనులు, ఖనిజాల వంటి కొరతతో కూడిన పరిమిత వనరులు కొన్నిసార్లు ప్రైవేట్‌ అజమాయిషీలో ఉండేందుకు ఆస్కారముంది. కనుక పంపకం అనే మాటకున్న అర్థం విస్తృతమైనది’’ అని సీజేఐ పేర్కొన్నారు. 

‘‘గత తీర్పుల్లో జస్టిస్‌ కృష్ణయ్యర్, జస్టిస్‌ చిన్నపరెడ్డి నిర్దిష్ట ఆర్థిక సిద్ధాంతాల ప్రాతిపదికన అభిప్రాయాలు వెలిబుచ్చారు. కానీ స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో సంక్షేమ ఆధారిత విధానాలున్నాయి. తర్వాత మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, జాతీయీకరణ వంటివాటి కాలం నడిచింది. ఇది పెట్టుబడుల ఉపసంహరణల యుగం. ప్రైవేట్‌ పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. కనుక గత పరిస్థితులను ఇప్పుడు ప్రాతిపదికగా తీసుకోరాదు. ప్రస్తుత, భావి అవసరాలను తగ్గట్టుగా తీర్పులుండాలి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం కూడా ఫలానా ఆర్థిక విధానాన్నే పాటించాలని సూచించలేదన్నారు. 

ఇద్దరు న్యాయమూర్తులు ఏమన్నారంటే... 
ఏ ప్రైవేట్‌ ఆస్తులనైనా సమాజ హితానికి స్వా«దీనం చేసుకునే అధికారం ప్రభుత్వాలకు ఉందన్న జస్టిస్‌ కృష్ణయ్యర్, జస్టిస్‌ చిన్నపరెడ్డి తదితర తీర్పులకు నేటికీ కాలదోషం పట్టలేదని జస్టిస్‌ ధూలియా అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఆర్టికల్‌ 38, 39ల్లో పేర్కొన్న సూత్రాలను పక్కన పెట్టడం సబబు కాదన్నారు. అలా చేయడం ప్రభుత్వాల చేతులను కట్టేయడమే అవుతుందని 97 పేజీల తీర్పులో స్పష్టం చేశారు. ‘‘ఎందుకంటే అంబేడ్కర్‌ హెచ్చరించిన సామాజిక, ఆర్థిక అసమానతలు మన దేశంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 

పేద, సంపన్న వర్గాల మధ్య ఆదాయ, సంపదపరమైన భారీ అసమానతలు నానాటికీ మరింతగా పెరుగుతున్నాయి’’ అన్నారు. జస్టిస్‌ కృష్ణయ్యర్, జస్టిస్‌ చిన్నపరెడ్డి తీర్పులకు పూర్తిగా కాలదోషం పట్టలేదని జస్టిస్‌ నాగరత్న కూడా అభిప్రాయపడ్డారు. అయితే, ‘‘భౌతిక వనరులను ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్యంలోవిగా విభజించవచ్చు. పూర్తిగా వ్యక్తిగత అవసరాలను తీర్చేవాటిని మినహాయించి ఇతర ప్రైవేటు ఆస్తులను సమాజ హితం కోసం ప్రభుత్వం సేకరించవచ్చు. 

ఆ మీదట సమాజ హితం కోసం అర్హులకు వాటిని చట్టపరమైన మార్గాల్లో తాత్కాలిక/శాశ్వత ప్రాతిపదికన బేషరతుగానో, షరతులతోనో పంపకం చేయవచ్చు’’ అని ఆమె పేర్కొన్నారు. అయితే జస్టిస్‌ కృష్ణయ్యర్‌ తీర్పుపై సీజేఐ చంద్రచూడ్‌ వ్యాఖ్యలను ‘పరుషమైనవి, అనవసరమైనవి’గా జస్టిస్‌ ధూలియా, జస్టిస్‌ నాగరత్న అభివర్ణించడం విశేషం. వాటితో తాము గట్టిగా విభేదిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. 

కృష్ణయ్యర్, చిన్నపురెడ్డి తీర్పులు... 
సమాజహితం కోసం ప్రైవేట్‌ ఆస్తులను సేకరించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుందని 1977లో కర్నాటక ప్రభుత్వం వర్సెస్‌ రంగనాథరెడ్డి కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణయ్యర్‌ పేర్కొన్నారు. ప్రైవేట్‌ యాజమాన్యంలోని ఆస్తులు సామాజిక వనరుల నిర్వచనంలోకి రావంటూ ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన మెజారిటీతో తీర్పును వ్యతిరేకించారు. 

ప్రైవేట్‌ ఆస్తులు కూడా ఆ నిర్వచనం పరిధిలోకి వస్తాయంటూ ఆయన మైనారిటీ తీర్పు వెలువరించారు. ఆస్తులపై భూస్వాములు, పెట్టుబడిదారుల ఆస్తుల కోటలను బద్దలు కొట్టడానికి ఆర్టికల్‌ 39(బి)ని రాజ్యాంగంలో ఉద్దేశపూర్వకంగానే చేర్చారని అభిప్రాయపడ్డారు. 1983లో సంజీవ్‌ చోక్‌ కేసులో సీజేఐ చిన్నపరెడ్డి కూడా జస్టిస్‌ కృష్ణయ్యర్‌ మైనారిటీ తీర్పును పూర్తిగా సమర్థించారు. సామ్యవాద సిద్ధాంతకర్తల ఆదర్శాలే ఆర్టికల్‌ 39(బి)లో ప్రతిఫలించాయని ఆయన పేర్కొన్నారు. 

ఆర్టికల్‌ 39(బి) ఏం చెబుతోందంటే... 
‘‘సామాజిక వనరులు సమాజ విశాల హితం కోసం పంపిణీ అయేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. ఇందుకు వీలుగా సదరు వనరులపై యాజమాన్యం, నియంత్రణకు అవసరమైన విధానాలను రూపొందించాలి’’.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement