Bar Association
-
సమాజం పట్ల కరుణతోనే న్యాయమూర్తిగా నిలదొక్కుకున్నా..
ముంబై: న్యాయస్థానాలు, న్యాయమూర్తులు సైతం సూక్ష్మ పరిశీలనకు గురి కావాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. న్యాయమూర్తుల పనితీరును చుట్టూ ఉన్న సమాజం పరిశీలిస్తూనే ఉంటుందని అన్నారు. అయితే, సమాజం పట్ల ఉన్న దయ, కరుణ, జాలి, అనురాగం వల్లే తాను అన్ని రకాల పరిశీలనలు, పరీక్షలకు నిలిచి, న్యాయమూర్తిగా నిలదొక్కుకున్నానని తెలిపారు. సమాజం పట్ల తమ ప్రేమానురాగాలు తమ తీర్పుల ద్వారా వెల్లడవుతాయని వివరించారు. జస్టిస్ చంద్రచూడ్ వచ్చే నెల 10వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ముంబైలో ఆయనను ఘనంగా సత్కరించారు. జస్టిస్ చంద్రచూడ్ అందించిన సేవలను న్యాయవాదులు ప్రశంసించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ తాను ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. ‘‘ఐఐటీ–ధన్బాద్లో చేరేందుకు సకాలంలో అడ్మిషన్ ఫీజు రూ.17,500 చెల్లించలేకపోయిన దళిత విద్యార్థికి మా ఆదేశాలతో ప్రవేశం లభించింది. ఇలాంటి తీర్పులు తనకెంతో సంతృప్తిని ఇచ్చాయి’’ అని తెలిపారు. -
విజ్ఞాన యాత్రలో విషాదం
విజయవాడ స్పోర్ట్స్/సాక్షి, అమరావతి: బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) న్యాయవాదులు చేపట్టిన విజ్ఞాన యాత్రలో విషాదం చోటుచేసుకుంది. దసరా సెలవులు కావడంతో ఈ నెల 2న 80 మంది న్యాయవాదులు విజయవాడ నుంచి 2 బస్సుల్లో యాత్రకు బయలుదేరారు. ఆంధ్రా, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని పలు న్యాయస్థానాలు, విజ్ఞాన ప్రాంతాలను చూసుకుంటూ ఈ నెల 6న రాజస్థాన్ చేరుకున్నారు. 7న రాత్రి రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి జైపూర్ వస్తుండగా మార్గ మధ్యలోని జో«ధ్‌పూర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఓ బస్సు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో ఆలిండియా లాయర్స్ యూనియన్ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతిచెందారు. రాజేంద్రప్రసాద్‌తో పాటు బీబీఏ కార్యదర్శి అరిగల శివరామప్రసాద్ (రాజా), న్యాయవాదులు పద్మజ, అరుణదేవి, నాగరాజు, గంగాభవాని, జయలక్ష్మీ, సత్యవాణి, శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్‌తో పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు జోధ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. మృతురాలు జ్యోత్స్న విద్యార్ధి ఉద్యమ కార్యకర్తగా పనిచేశారు. నేటి తరుణీతరంగాలు, సేఫ్ లను స్థాపించడంతో కీలకభూమిక పోషించారు. జ్యోత్స్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని విమానంలో బుధవారం విజయవాడ తీసుకువచ్చేందుకు న్యాయవాదులు సన్నాహాలు చేస్తున్నారు. క్షతగాత్రులైన వారు సైతం విమానంలో విజయవాడ చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, విమానం టికెట్లు లభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని బీబీఏ కార్యదర్శి రాజా తెలిపారు. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థినులను చైతన్యం పరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించిన జ్యోత్స్న మృతి బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన సాయం అందించాలని తన కార్యాలయ అధికారులకు సీఎం సూచించారు. రాజస్థాన్ సీఎం బజన్ లాల్ శర్మతో ఫోన్లో మాట్లాడి బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరారు. -
Justice Sanjay Kishan Kaul: సహనశీలత తగ్గుతోంది
న్యూఢిల్లీ: ఎదుటి వారి అభిప్రాయాల పట్ల ప్రజలు సహనం కలిగి ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సమాజంలో నేడు సహనశీలత స్థాయిలు తగ్గుతూండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు ధైర్యం కలిగి ఉండటం చాలా కీలకమైన అంశమన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడే బాధ్యత బార్ అసోసియేషన్‌దేనని చెప్పారు. అత్యున్నత న్యాయస్థానంలో ఆరేళ్ల 10 నెలలపాటు బాధ్యతలు నిర్వర్తించిన జస్టిస్ ఎస్కే కౌల్ ఈ నెల 25న పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీంకోర్టుకు ఈ నెల 18 నుంచి వచ్చే జనవరి 2వ తేదీ వరకు శీతాకాల సెలవులు. దీంతో, శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో సమావేశమైన వీడ్కోలు ధర్మాసనంలో జస్టిస్ కౌల్ మాట్లాడారు. ‘సర్వోన్నత న్యాయస్థానం నిర్భయంగా న్యాయాన్ని అందించిన న్యాయ దేవాలయం. ఈ ఒరవడి ఇలాగే కొనసాగాలి’అని ఆయన ఆకాంక్షించారు. పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్.. జస్టిస్ కౌల్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘70ల్లో నేనూ జస్టిస్ కౌల్ కలిసి కాలేజీకి వెళ్లాం. పుట్టస్వామి గోపత్యా హక్కు కేసు, వైవాహిక సమానత్వ కేసు, తాజాగా ఆరి్టకల్ 370 కేసు..ఇలా పలు కేసుల్లో ఇరువురం కలిసి ఇదే వేదికపై నుంచి తీర్పులు వెలువరించడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’ అన్నారు. గోప్యతా హక్కు ప్రాథమిక హక్కేనంటూ తీర్పు వెలువరించిన తొమ్మిదిమంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ కౌల్ కూడా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దును సమరి్థస్తూ ఇటీవల తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలోనూ ఉన్నారు. 1958లో జని్మంచిన కౌల్ 1982లో ఢిల్లీ వర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా అందుకున్నారు. 1999లో సీనియర్ న్యాయవాది గుర్తింపు పొందారు. 2001లో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జీగా, 2003లో శాశ్వత జడ్జిగా పదోన్నతి పొందారు. 2013లో పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2014లో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2017లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. -
బుద్వేల్ భూముల వేలంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: బుద్వేల్ భూముల అంశంలో హెచ్ఎండీఏ వేలాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదుల సంఘం తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. భూముల వేలంపై స్టే ఇవ్వాలని కోర్టుని కోరింది. అయితే లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. దీనిపై స్పందిస్తూ.. బార్ అసోసియేషనల్లో విభేదాలు ఉన్నాయని, అందరూ ఏకాభిప్రాయంతో వస్తే వాదనలు వింటామని స్పష్టం చేసింది. కాగా బుద్వేల్ లోని ప్రభుత్వ భూములను గతంలో హైకోర్టు కోసం కేటాయిస్తామన్న వాదనతో బార్ అసోసియేషన్ కోర్టుకు వెళ్లింది. దీంతో బుద్వేల్ భూముల వేలంపై న్యాయవాదుల సంఘం కోర్టుని ఆశ్రయించింది. రంగారెడ్డి బుద్వేల్లోని 100 ఎకరాలకు హెచ్ఎండీఏ ఈ వేలం వేసేందుకు సిద్ధమైంది. 100 ఎకరాల్లో 14 ప్లాట్‌కు ఆన్లైన్ వేలం జరపాలని నిర్ణయించింది. ఈ భూమూలను దక్కించుకోవాలని రియల్ ఎస్టేట్ దిగ్గజాలు పోటీపడుతున్నాయి. దీని ద్వారా రూ.4 వేల కోట్ల ఆదాయం వస్తుందని హెచ్ఎండీఏ అంచనా వేస్తోంది. చదవండి: హవ్వ.. చెట్లను కొట్టేసి మొక్కలు నాటుతారట? -
ఇక్కడ ఎవరూ ఎవరినీ... బెదిరించలేరు
ప్రయాగ్‌రాజ్: కొలీజియం విషయంపై కేంద్రానికి, న్యాయవ్యవస్థకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో న్యాయ మంత్రి కిరెణ్ రిజిజు మరోసారి స్పందించారు. ప్రయాగ్‌రాజ్‌లో అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ 150వ వార్షికోత్సవంలో పాల్గొని రిజిజు ప్రసంగించారు. హైకోర్టు జడ్జీల బదిలీలు, నియామకాల్లో ఏదైనా ఆలస్యమైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని కేంద్రప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడం తెల్సిందే. దీనిపై శనివారం మంత్రి రిజిజు మాట్లాడారు. ‘ భారత్‌లో ప్రజలే అసలైన యజమానులు. మనమంతా సేవకులం. రాజ్యాంగం చూపిన మార్గనిర్దేశకత్వంలో ప్రజలకు సేవ చేసేందుకే మనం ఇక్కడ ఉన్నాం. ప్రజాభీష్టం మేరకు రాజ్యాంగానికి లోబడే దేశపాలన కొనసాగనుంది. ఇక్కడ ఎవరూ ఎవరినీ బెదిరించలేరు. కొన్ని సార్లు కొన్ని అంశాలపై చర్చలు జరుగుతాయి. ప్రజాస్వామ్యంలో వారి అభిప్రాయం చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. బాధ్యతాయుత పదవుల్లో ఆసీనులైన వారు ఏదైనా చెప్పేముందు ఆలోచించాలి’ అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలనుద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. దేశంలోని వేర్వేరు కోర్టుల్లో 4.90 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ‘చిన్న చిన్న కేసులు కోర్టుల బయటే పరిష్కారం పొందుతాయి. దీంతో కోర్టులకు కేసుల భారం చాలా తగ్గుతుంది’ అని మంత్రి అన్నారు. -
మోడల్ బైలాస్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తాం
సాక్షి, అమరావతి: మోడల్ బైలాస్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం (ఏపీహెచ్‌ఏఏ) ఎన్నికలు నిర్వహిస్తామని ప్రస్తుత కార్యవర్గం బుధవారం హైకోర్టుకు నివేదించింది. ఇప్పటికే ఖరారు చేసిన షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఆ షెడ్యూల్ ప్రకారం ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఈ వ్యాజ్యంలో ఇక విచారించేందుకు ఏమీ లేదని, వ్యాజ్యాన్ని మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యవర్గం కాలపరిమితి ముగిసిప్పటికీ, ఎన్నికలకు బార్ కౌన్సిల్ చర్యలు తీసుకోలేదని, తన ఫిర్యాదునూ పట్టించుకోలేదని న్యాయవాది ఎన్.విజయభాస్కర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సింగిల్ జడ్జి జస్టిస్ దేవానంద్ ఇటీవల విచారణ జరిపారు. పిటిషనర్ ఫిర్యాదు ఆధారంగా తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని బార్ కౌన్సిల్‌ను ఆదేశించారు. ఈ ఆదేశాలతో హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యకలాపాల నిర్వహణకు ఏడుగురు న్యాయవాదులతో ఓ అడ్హాక్ కమిటీని బార్ కౌన్సిల్ చైర్మన్ నియమించారు. దీంతో అడ్హాక్ కమిటీ వెంటనే కార్యవర్గం నుంచి బాధ్యతలు తీసుకోవాలని జస్టిస్ దేవానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రస్తుత కార్యవర్గం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కోనపల్లి నర్సిరెడ్డి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. తాము మోడల్ బైలాస్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రస్తుత అధ్యక్షుడు జానకిరామిరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ఎస్.సత్యనారాయణ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ను ఈ నెల 14న కోర్టు ముందుంచామని, దాని ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. -
ప్రేమించడం కారణంగానే చనిపోతున్నారు: చీఫ్ జస్టీస్ కీలక వ్యాఖ్యలు
భారత్‌లో ప్రేమించడం వల్లే ప్రతి ఏడాది వందలాది మంది యువకులు మరణిస్తున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి డీ వై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ముంబైలోని బార్ అసోసియేషన్ నిర్వహించిన అశోక్ దేశాయ్ స్మారక ఉపన్యాసంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ ఉపన్యాసంలో న్యాయమూర్తి చంద్రచూడ్ చట్టం, నైతికత అనే అంశాలపై ప్రసంగించారు. లీగల్ న్యూస్ వెబ్సైట్ బార్ అండ్ బెంచ్ ప్రకారం..నెతికతో ముడిపడిన బ్రెస్ట్ ట్యాక్స్, స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే 377 సెక్షన్, మంబైలో బార్ డ్యాన్స్‌పై నిషేధం, వ్యభిచారం తదితర కేసులు గురించి ప్రస్తావిస్తూ...ఆదిపత్య సముహాలు బలహీన వర్గాలను అధిగమించే ప్రవర్తన నియమావళే నైతికతను నిర్ణయిస్తుందన్నారు. బలహీనమైన అట్టడుగు వర్గాల సభ్యులకు తమ మనుగడ కోసం ఆధిపత్య సంస్కృతికి లొంగిపోవడం తప్ప వేరే మార్గం లేదన్నారు. అదీగాక అణిచేత వేత వర్గాల చేతిలో అవమానింపబడే వేర్పాటువాదం కారణంగా సమాజంలో బలహీన వర్గాల వారు ప్రతివాద సంస్కృతిని సృష్టించలేకపోతున్నారని అన్నారు. ఒక వేళ బలహీన వర్గాలు అభివృద్ది చెందుతుంటే.. వారిని అణిచివేసేలా కొన్ని ప్రభుత్వ సముహాలు తమ అధికారాన్ని వినయోగిస్తున్నాయని చెప్పారు. వాస్తవానికి బలహీన వర్గాలు పురోగతిని సాధిస్తున్నప్పటికి వారిని సామాజిక నిర్మాణంలో దిగువన ఉంచడంతో వివక్షతను ఎదుర్కొంటూనే ఉంటున్నారని చెప్పారు. అలాగే ఒకరికి న్యాయం అనిపించింది మరోకరికి న్యాయంగా ఉండాల్సిన అవసరం ఉందా అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. 1991లో ఉత్తప్రదేశ్‌లో 15 ఏళ్ల బాలికను ఆమె తల్లిదండ్రులు ఎలా చంపారనే కథనం గురించి విరించారు. వాస్తవానికి వారు నివశిస్తున్న సమాజంలో ప్రవర్తన నియమావళిని అనుసరించి ఇది అక్కడ సమంజసం కావచ్చు. వాస్తవానికి చట్టం ప్రకారం ఇది హేతబద్ధమైన చర్య, ఘోరమైన నేరం కూడా. కొన్ని నెలల వాదనల అనంతరం అక్కడి గ్రామస్తులు ఈ నేరాన్ని అంగీకరించారని కూడా చెప్పారు. ప్రస్తుతం యువత తమ కులానికి వ్యతిరేకంగా ప్రేమించడం లేదా పెళ్లి చేసుకోవడం కారణంగా పరువు హత్యలకు దారితీసి చంపబడుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ ప్రసంగంలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించని సుప్రీం కోర్టు తీర్పును కూడా ప్రస్తావిస్తూ...న్యాయాన్ని సరిదిద్దాం. రాజ్యంగ నైతికత వ్యక్తుల హక్కులపై దృష్టి పెడుతూ...సమాజంలో నైతికతను కాపడుతుందని చెప్పారు. భారత రాజ్యంగం ప్రజల కోసం రూపొందించబడింది కాదని, ఫ్రాథమిక హక్కలు ప్రకారం వారు ఎలా ఉండాలో చెబుతోంది. ఇదే మన రోజువారీ జీవితాన్ని మార్గ నిర్దేశిస్తుందని చెప్పారు. (చదవండి: ఈవెంట్‌కి వెళ్లకుండా అడ్డుకుందని..సుత్తితో కొట్టి..పది ముక్కలుగా కోసేశాడు) -
పౌర హక్కులకు... మేమే సంరక్షకులం
ముంబై: దేశంలో పౌరుల స్వేచ్ఛ తదితర హక్కులకు న్యాయస్థానాలే శ్రీరామరక్ష అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ పునరుద్ఘాటించారు. ప్రజలు కూడా ఈ విషయంలో న్యాయవ్యవస్థపైనే అపారమైన నమ్మకం పెట్టుకున్నారని స్పష్టం చేశారు. శనివారం బాంబే బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జస్టిస్ అశోక్ హెచ్.దేశాయ్ స్మారకోపన్యాసం చేశారు. దేశంలో స్వేచ్ఛా దీపిక నేటికీ సమున్నతంగా వెలుగుతోందంటే దాని వెనక ఎందరో గొప్ప న్యాయవాదుల జీవితకాల కృషి దాగి ఉందన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తన మనోగతాన్ని కుండబద్దలు కొట్టారు. ‘‘ఏ కేసూ చిన్నది కాదు, పెద్దదీ కాదు. నిన్న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన ఒక సామాన్య కేసే ఇందుకు తాజా ఉదాహరణ. విద్యుత్ పరికరాల దొంగతనం కేసులో యూపీకి చెందిన ఒక వ్యక్తికి ట్రయల్ కోర్టు తొమ్మిది కేసుల్లో రెండేసి సంవత్సరాల చొప్పున జైలు శిక్ష విధించింది. కానీ అది ఏకకాలంలో, అంటే రెండేళ్లలోనే పూర్తి కావాలని స్పష్టమైన ఆదేశాలివ్వడం మర్చిపోయింది. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ తప్పిదాన్ని సరిదిద్దాల్సి వచ్చింది. లేదంటే చిన్న దొంగతనం కేసులో దోషి ఏకంగా 18 ఏళ్ల జైల్లో మగ్గాల్సి వచ్చేది. అందుకే మరోసారి చెప్తున్నా. జిల్లా కోర్టు మొదలుకుని హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా ఏ కోర్టుకైనా చిన్న కేసు, పెద్ద కేసు అని విడిగా ఏమీ ఉండవు. అన్ని కేసులూ ముఖ్యమైనవే’’ అన్నారు. పౌర హక్కుల్ని అంతిమంగా న్యాయవ్యవస్థే పరిరక్షిస్తుందని ఈ కేసుతో మరోసారి తేటతెల్లమైందని అభిప్రాయపడ్డారు. సదరు కేసులో అలహాబాద్ హైకోర్టు కూడా ట్రయల్ కోర్టు తీర్పునే సమర్థించింది. దాంతో శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ సీజేఐ సారథ్యంలోని ధర్మాసనమే శుక్రవారం తీర్పు వెలువరించడం తెలిసిందే. ‘‘మనిషి ప్రవర్తన సజావుగా ఉండేలా చూడటంలో చట్టంతో పాటు నైతికతది కూడా కీలక పాత్ర. మన బయటి ప్రవర్తనను చట్టం నియంత్రిస్తే మనోభావపరమైన లోపలి ప్రవర్తనను నైతికత దారిలో ఉంచుతుంది’’ అని ఈ సందర్భంగా సీజేఐ అభిప్రాయపడ్డారు. కోర్టుల వల్లే సుస్థిర ప్రజాస్వామ్యం ఎమర్జెన్సీ సమయంలో కోర్టుల స్వతంత్ర వ్యవహార శైలే దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు బాంబే హైకోర్టులో సత్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ‘‘ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొంటూ స్వతంత్రంగా, నిర్భీతిగా వ్యవహరించే న్యాయస్థానాలే నాడు దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాయి. మనకబారిన ప్రజాస్వామ్య స్వేచ్ఛా ప్రమిద పూర్తిగా కొడిగట్టిపోకుండా జస్టిస్ రాణే వంటి న్యాయమూర్తులే కాపాడారు. బార్ నుంచి వచ్చిన న్యాయమూర్తులు కూడా ఇందులో కీలక పాత్ర పోషించి ప్రజాస్వామ్య పతాకాన్ని సమున్నతంగా నిలిపారు. మన ప్రజాస్వామ్యం ఇప్పటికీ సుస్థిరంగా నిలిచి ఉందంటే అదే కారణం’’ అన్నారు. పలువురు న్యాయమూర్తులతో తాను పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ‘‘యువత న్యాయవాద వృత్తిని చేపట్టేలా ప్రోత్సహించడంలో బాంబే బార్ అసోసియేషన్ చురుౖMðన పాత్ర పోషించాలి. ఈ విషయంలో న్యాయమూర్తులపైనా గురుతరమైన బాధ్యత ఉంది’’ అని అభిప్రాయపడ్డారు. -
ఏపీహెచ్‌ఏఏ ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేయండి : హైకోర్టు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం (ఏపీహెచ్‌ఏఏ) ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎంతమాత్రం తగదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని పేర్కొంది. ఎన్నికల నిర్వహణ విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని, అసలు ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం ఉందా? అని ప్రస్తుత కార్యవర్గాన్ని ప్రశ్నించింది. 2023 మార్చిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రస్తుత కార్యవర్గం సమర్పించిన షెడ్యూల్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ సిద్ధం చేయాలని, ఆ వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రస్తుత కార్యవర్గం కాల పరిమితి ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించేందుకు బార్ కౌన్సిల్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఈ విషయంలో తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ న్యాయవాది ఎన్.విజయభాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారించిన సింగిల్ జడ్జి జస్టిస్ దేవానంద్.. పిటిషనర్ ఫిర్యాదు ఆధారంగా ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియజేస్తూ నివేదిక ఇవ్వాలని బార్ కౌన్సిల్‌ను ఆదేశించారు. ఈ ఆదేశాలతో బార్ కౌన్సిల్ చైర్మన్.. ఏపీహెచ్‌ఏఏ కార్యకలాపాల నిర్వహణకు సీనియర్ న్యాయవాదులతో ఓ అడహక్ కమిటీని నియమించారు. దీంతో వెంటనే ప్రస్తుత కార్యవర్గం నుంచి బాధ్యతలు తీసుకోవాలని అడహక్ కమిటీని ఆదేశిస్తూ జస్టిస్ దేవానంద్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రస్తుత కార్యవర్గం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కోనపల్లి నర్సిరెడ్డి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై విచారించిన ధర్మాసనం సింగిల్‌జడ్జి ఉత్తర్వులపై స్టే విధించిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం సీజే ధర్మాసనం ఈ అప్పీళ్లపై మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రస్తుత కార్యవర్గం తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి ఎన్నికల షెడ్యూల్‌ను మెమో రూపంలో ధర్మాసనం ముందుంచారు. అయితే మార్చిలో ఎన్నికలు నిర్వహించే విధంగా ఆ షెడ్యూల్ ఉండటంతో దానిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణలో జాప్యం చేస్తే, సింగిల్‌జడ్జి ఉత్తర్వులపై తాము విధించిన స్టేను ఎత్తేస్తామని చెప్పింది. ఎన్నికల నిర్వహణ బాధ్యతలను తాత్కాలిక కమిటీకి అప్పగిస్తామంది. తిరిగి షెడ్యూల్ ఖరారు చేసి, ఆ వివరాలతో సవరించిన మెమోను కోర్టు ముందుంచుతామని మోహన్‌రెడ్డి తెలిపారు. -
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయండి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం అనంతరం హెలిప్యాడ్‌లో ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టును ఏర్పాటు చేయాలని, అమరావతి నుంచి కర్నూలుకు హైకోర్టు తరలించేవరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. సీఎంను కలిసిన వారిలో కృష్ణరంగడు, పుల్లారెడ్డి, జయరాజ్, ఓంకార్, రవిగువేరా, నరసింహ, లక్ష్మీనారాయణ ఉన్నారు. -
హైకోర్టును కర్నూలుకు తరలించాలి
కర్నూలు(సెంట్రల్/లీగల్): కర్నూలుకు వెంటనే హైకోర్టును తరలించాలని కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. గురువారం కర్నూలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి.. కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఆర్ కృష్ణ, జేఏసీ కన్వీనర్ వై.జయరాజ్ మాట్లాడుతూ.. గతంలో కర్నూలుకు జరిగిన అన్యాయాన్ని కొంతవరకైనా తగ్గించాలంటే హైకోర్టును ఏర్పాటు చేయాల్సిందేనన్నారు. సీఎం వైఎస్ జగన్ హైకోర్టు ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నారని, టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టు తరలింపును అడ్డుకునే పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో తెలియజేస్తామన్నారు. హైకోర్టు తరలింపు కోసం వెంటనే తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు విధులను బహిష్కరించి.. తమ ఆందోళన తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు పి.రవిగువేరా, సీనియర్ న్యాయవాదులు ఓంకార్, వి.నాగలక్ష్మీ, పి.సువర్ణరెడ్డి, ఎం.సుబ్బయ్య, బి,చంద్రుడు, కర్నాటి పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జస్టిస్ ఖన్విల్కర్ క్రమశిక్షణ గల జడ్జి: సీజేఐ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ శ్రమించేతత్వం, క్రమశిక్షణగల వ్యక్తి అని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. సుప్రీం కొలీజియంలో భాగమైన జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ ఖన్విల్కర్‌తో కలిసి తాము ఏడాది కాలంలో ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకాల కోసం 250 పేర్లను పరిశీలించినట్లు ఆయన వెల్లడించారు. సుప్రీం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటైన జస్టిస్ ఖన్విల్కర్ వీడ్కోలు కార్యక్రమంలో సీజేఐ ప్రసంగించారు. సుప్రీంకోర్టులో ఆయన 8,446 కేసులను పరిష్కరించడంతోపాటు 187 తీర్పులను రాశారన్నారు. ఆయన శ్రమించే తత్వం అందిరికీ తెలిసిందేనన్నారు. జస్టిస్ ఖన్విల్కర్ సుప్రీంకోర్టులో సుమారు ఆరేళ్లపాటు పనిచేశారు. ఆయన పదవీ విరమణ కారణంగా అత్యున్నత న్యాయస్థానంలోని 34 జడ్జీల పోస్టులకు గాను 31 మంది మిగిలారు. ఇదీ చదవండి: ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల పెండింగ్ కేసులు -
తెలుగు ప్రజల ఆశీర్వాదమే నన్ను ఈ స్థాయికి చేర్చింది: ఎన్వీరమణ
సాక్షి, కృష్ణాజిల్లా: తెలుగు ప్రజల ఆశీర్వాదమే తనను ఈ స్థాయికి చేర్చిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ అన్నారు. పొన్నవరం పర్యటనపై సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పర్యటనకు సహకరించిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన కుటుంబ సభ్యులకు సొంత గ్రామం చూపించడం పట్ల ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆతిథ్యమిచ్చిన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి సీఎం జగన్‌కి ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. బెజవాడ బార్ అసోసియేషన్, ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్, ఏపీ బార్ కౌన్సిల్, హైకోర్టు ఉద్యోగులు, రోటరీ క్లబ్ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
చంద్రబాబుపై క్రిమినల్ కేసు
కర్నూలు కల్చరల్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై కర్నూలులో క్రిమినల్ కేసు నమోదైంది. కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాసుపోగు సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కర్నూలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ కళా వెంకట్రమణ తెలిపారు. చంద్రబాబు ఈ నెల 6వ తేదీ టీవీ చానెల్స్‌తో మాట్లాడుతూ కర్నూలు కేంద్రంగా ఎన్440కే కరోనా వేరియంట్ పుట్టిందని, అది 10 నుంచి 15 రెట్లు వేగంగా వ్యాప్తి చెంది మానవనష్టం జరుగుతుందంటూ సామాన్య ప్రజలు భయాందోళనలకు గురయ్యేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనివల్ల కర్నూలు ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడానికి సిద్ధపడుతున్నారని, ఇతర ప్రాంతాల ప్రజలు ఇక్కడికి రావడానికి భయపడుతున్నారని తెలిపారు. కర్నూలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా స్త్రీలు, చిన్నపిల్లలు భయపడి, మానసిక ఒత్తిడికిలోనై చనిపోవడానికి చంద్రబాబు మాటలు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. ఎన్440కే వేరియంట్ అంత ప్రమాదకారికాదని సీసీఎంబీ కూడా తేల్చి చెప్పిందని తెలిపారు. చంద్రబాబు దుష్ప్రచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, అందువల్ల కేసు నమోదు చేసి విచారించాలని కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కర్నూల్లో చంద్రబాబుపై ఐపీసీ 155, 505(1)(బి)(2) సెక్షన్ల కింద కేసు (క్రైం నెం.80/2021) నమోదు చేశారు. అలాగే 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టంలోని సెక్షన్ 4 కింద నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మద్దికుంట లింగం
సాక్షి, హైదరాబాద్: సిటీ సివిల్ కోర్టు అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది మద్దికుంట లింగం నారాయణ ఎన్నికయ్యారు. మార్చి 5న (శుక్రవారం) హొరా హోరిగా జరిగిన ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. అత్యధికంగా 535 ఓట్లు సాధించి ఆయన అధ్యక్షుడిగా గెలిచారు. ఉపాధ్యక్షులుగా ఎన్. నాగభూషణం, జి. శ్రీలత ఎన్నికయ్యారు. కార్యదర్శిగా ఈ. కిశోర్‌కుమార్, సంయుక్త కార్యదర్శిగా ఎం. మురళీ మోహన్ గెలిచారు. నాయీ బ్రాహ్మణుల హర్షం 160 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సిటీ కోర్టు అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో తమ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాది మద్దికుంట లింగం నాయీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల తెలుగు రాష్ట్రాల్లోని నాయీ బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ అభినందలు తెలుపుతున్నారు. -
విమర్శ హద్దు దాటితే వ్యవస్థకే ప్రమాదం
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేయడం, దానికి గ్రేడింగ్స్ ఇవ్వడం సమాజంలోని అన్ని వర్గాల ప్రజల్లో, అన్ని వ్యవస్థలపై నెలకొన్న అసహనానికి ప్రతీక అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ వ్యాఖ్యానించారు. ‘నా తరువాత అంతా నాశనమే’ అన్న తరహాలో కొందరు మాజీ జడ్జీల తీరు ఉందన్నారు. మద్రాస్ హైకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన ‘కోవిడ్ కాలంలో భావ ప్రకటన స్వేచ్ఛ’ అంశంపై ఆదివారం ఆయన ఆన్లైన్ ప్రసంగం చేశారు. ‘గతంలో మన న్యాయవ్యవస్థలో భాగంగా ఉన్న కొందరిలో ఒక సమస్య ఉంది. నా తర్వాత∙అన్నీ తప్పులే జరుగుతున్నాయి అనే భావనలో వారున్నారు. ఆ భావనే ప్రమాదకరం. ఇప్పుడు మాట్లాడుతున్నవారే గతంలో చాలా తప్పులు చేశారు’ అని అన్నారు. కొంతమందికి ఎప్పుడూ వార్తల్లో ఉండటం ఇష్టమన్నారు. హద్దులు దాటి ఆరోపణలు చేయడం ‘తప్పుడు సమాచార మహమ్మారి’ వంటిదన్నారు. విమర్శలు అవసరమే కానీ హద్దులు దాటకూడదని సూచించారు. ‘విమర్శలు హద్దులు దాటితే వ్యవస్థపై అనుమానాలు ఎక్కువవుతాయి. ఏ వ్యవస్థకయినా అది మంచిది కాదు. వ్యవస్థపై విశ్వాసం కోల్పోతే వ్యవస్థే మనుగడలో లేకుండా పోతుంది. అప్పుడంతా అరాచకమే’ అని హెచ్చరించారు. సొంతూళ్లకు కాలినడకన వెళ్తున్న వలస కూలీల అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించడానికి ఒక రోజు ముందు సుమారు 20 మంది ప్రముఖ న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు లేఖ రాశారు. వలస శ్రామికులపై కోర్టు చూపుతున్న నిర్లిప్తత సరికాదని వారు అందులో పేర్కొన్నారు. అనంతరం ఈ కేసు విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ‘ఎప్పుడూ ప్రతికూల భావజాలాన్ని ప్రచారం చేసేవారు, ఇళ్లల్లో కూర్చుని ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శించే మేథావులు మన దేశంలో చాలామంది ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. -
కరోనా: చైనాను కోర్టుకు లాగాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణంటూ అమెరికాతో పాటు పలు ప్రపంచ దేశాలు గట్టిగా వాదిస్తున్నాయి. వైరస్‌పై కుట్రపూరితంగా వ్యవరించినందుకు చైనా నుంచి పెద్ద మొత్తంలో నష్టపరిహారం రాబట్టాలంటూ యూఎస్‌తో సహా ఐరోపా ఖండంలోని పలు దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే చైనా నుంచి వైరస్ లీక్ అయిందనే ఆరోపణలపై భారత ప్రభుత్వం ఇంత వరకు స్పందించలేదు. ఈ క్రమంలోనే వైరస్ వ్యాప్తికి కారణమైన డ్రాగన్‌ను కోర్టుకు ఈడ్చాలంటూ భారతీయ న్యాయవాదులు సైతం ప్రణాళికలు రచిస్తున్నారు. కరోనా వైరస్ ముమ్మాటికీ చైనా ప్రభుత్వ పనేనని, దానికి ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని లాయర్లు హెచ్చరించారు. చైనా నుంచి పెద్ద మొత్తంలో నష్టపరిహారం రాబట్టాలని డిమాండ్ చేశారు. (మోదీపై విషం కక్కిన అఫ్రిది) ఈ మేరకు ఆల్ ఇండియా బార్ అసోషియేషన్ నేతృత్వంలోనే న్యాయవాదులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. భారతీయ న్యాయ చట్టాల ప్రకారం విదేశాలపై ఎలాంటి దావా వేయడానికి వీలులేదు. ఈ క్రమంలో సివిల్ ప్రొసిజర్ కోడ్ (సీపీసీ)లోని సెక్షన్ 86ను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చైనాపై పిటిషన్ వేసేందుకు వీలుగా చట్టంలో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిత్తులమారి చైనా పన్నిన కుట్రకు భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున పౌరుల ప్రాణాలను కోల్పోయాయని, దీనికి ఆ దేశం శిక్ష అనుభవించాల్సిందేనని న్యాయవాదులు లేఖలో ఆరోపించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. (కరోనా: డబ్ల్యూహెచ్ఓ వార్షిక సమావేశం ప్రారంభం) -
మహిళా జడ్జీకి లాయర్ల బెదిరింపు
తిరువనంతపురం: కొందరు లాయర్లు తనను బెదిరించారంటూ ఓ మహిళా జడ్జీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 12 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఓ నిందితుడి బెయిల్ రద్దు విషయమై మాట్లాడేందుకు తన చాంబర్‌కు వచ్చిన లాయర్లు చట్టవిరుద్ధంగా ప్రవర్తించారంటూ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ దీపా మోహన్ లిఖిత పూర్వకంగా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆ ఫిర్యాదును పోలీసులకు పంపారు. దీనిపై స్పందించిన పోలీసులు తిరువనంతపురం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌తోపాటు 12 మందిపై దాడి, ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం వంటి నేరాల కింద పలు కేసులు పెట్టారు. ‘ఒక నిందితుడి బెయిల్ రద్దు, రిమాండ్‌పై చర్చించేందుకు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేపీ జయచంద్రన్ మరికొందరితో కలిసి నా బాంబర్‌కు వచ్చారు. సదరు నిందితుడి రిమాండ్ ఉత్తర్వులు రద్దు చేస్తారా లేదా అంటూ బెదిరించారు. మహిళ కాకపోయుంటే మిమ్మల్ని కొట్టి ఉండేవాళ్లం. బయటికి వస్తే అంతుచూస్తామంటూ జయచంద్రన్ వెళ్లిపోయారు’అని బాధిత జడ్జీ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర జ్యుడీషియల్ అధికారుల సంఘం కేరళ హైకోర్టులో పిటిషన్ వేసింది. కాగా, మహిళా జడ్జీ ఆరోపణలన్నీ అబద్ధాలేనంటూ తిరువనంతపురం బార్ అసోసియేషన్ శుక్రవారం విధులు బహిష్కరించింది. -
కేసులకు అనుగుణంగా కోర్టుల పెంపు
నల్లగొండ లీగల్: రాష్ట్రంలో పెరుగుతున్న కేసులకు అనుగుణంగా కోర్టుల సంఖ్యను పెం చుతున్నట్లు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ తెలిపారు. మంగళవారం నల్లగొండలోని బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో న్యాయవాదులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. జూనియర్ న్యాయవాదులు నిరంతరం అధ్య యనం చేస్తూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. భూ సేకరణ కేసుల పరిష్కారానికి త్వరలో జరగనున్న జాతీయ లోక్ అదాలత్ వేదిక కానుందని తెలిపారు. న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా విస్తృతంగా ప్రజలకు న్యాయ సహాయం అందించాలని సూచించారు. -
చంద్రబాబుపై ఫైర్ అవుతోన్న బార్ అసోసియేషన్ సభ్యులు
సాక్షి, గుంటూరు : చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో లాయర్లకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన హామీలను కాపీ కొడుతున్నారని విమర్శించారు. ఈ నాలుగున్నరేళ్లలో లాయర్లకు ఇచ్చిన 18 హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి రాగానే రూ. 100 కోట్లతో లాయర్ల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు, హౌసింగ్ సొసైటీ, హెల్త్ కార్డులు కూడా మంజూరు చేస్తామని ప్రకటించారన్నారు. ఈ హామీలతో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్ హామీలను కాపీ కొడుతున్నారని విమర్శించారు. -
బార్‌కు.. బెంచ్‌కి మధ్య సమన్వయం అవసరం
సాక్షి, విశాఖపట్నం: బార్ అసోసియేషన్‌లో కూర్చున్న వారే తర్వాతి రోజుల్లో బెంచ్‌లో తీర్పులిస్తుంటారని.. అందువల్ల బార్‌కు, బెంచ్‌కి మధ్య సమన్వయం ఉండాల్సిన అవసరం ఉందని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్ అన్నారు. దిగువ కోర్టు తీర్పులను కనీసం చదవకుండా పైస్థాయి కోర్టుల్లో వాదించడం వల్ల తీర్పులకు ఒకదానికొకటి సంబంధం లేకుండా వస్తున్నాయని, తద్వారా సామాన్యులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయంలో శనివారం సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ రాధాకృష్ణన్.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ దివంగత డీవీ సుబ్బారావు స్మారకోపన్యాసం చేశారు. న్యాయవాదిగా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా, నగర మేయర్‌గా, ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా, ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలకు అధ్యక్షుడిగా విభిన్న రంగాల్లో ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా అందరి మన్ననలు అందుకున్న సుబ్బారావు లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారన్నారు. కొందరు కక్షిదారులు కేసులో తమ తరఫున న్యాయవాదులను నియమించుకొని, విచారణ సమయంలో వారు కోర్టులకు రావట్లేదన్నారు. కక్షిదారులు విధిగా కోర్టులకు రావాలని, అప్పుడే తమకు ఏ మేరకు న్యాయం జరుగుతుంది, న్యాయవాదులు ఏవిధంగా వాదిస్తున్నారో అర్థమవుతుందన్నారు. తీర్పు చెప్పేటప్పుడు జడ్జి స్థానంలో కూర్చున్న వారు ఒకటి రెండుసార్లు ఆలోచించి విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీర్పులివ్వాలని సూచించారు. న్యాయస్థానాల్లో అందరూ సమానులేనని స్పష్టం చేశారు. తాను న్యాయవాదిగా ఉన్నంత కాలం ఏనాడూ అలసత్వం వహించలేదని, సత్యం మాత్రమే ప్రకటించి కక్షిదారులకు సహాయం చేశానని గుర్తు చేశారు. సత్యాన్ని నమ్ముకుంటే న్యాయం దానంతట అదే వస్తుందన్న సిద్ధాంతాన్ని న్యాయవాదులు ముందుగా తెలుసుకోవాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ లా యూనివర్సిటీ (బెంగుళూరు) ఉపకులపతి ప్రొఫెసర్ ఆర్.వెంకటరావు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీ సోమయాజులు, విశాఖకు చెందిన న్యాయనిపుణులు, విద్యావేత్తలు, మేధావులు, తదితరులు పాల్గొన్నారు. -
లాయర్ దీపిక సంచలన వ్యాఖ్యలు
శ్రీనగర్ : బాధితుల తరపున న్యాయం కోసం పోరాడుతుంటే తోటి న్యాయవాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని లాయర్ దీపికా సింగ్ రాజవత్ తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం చేసిన కతువా గ్యాంగ్ రేప్, హత్య కేసులో బాధితుల తరపున ఆమె వాదిస్తున్నారు. జమ్మూకశ్మీర్ కతువా జిల్లాలో నోమాడియక్ బకెర్వాల్ తెగకు చెందిన 8 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 60 ఏళ్ల సాంజి రామ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో బాలిక తల్లిదండ్రుల పక్షాన జమ్మూ హైకోర్టులో వాదనలు వినిపిస్తున్న దీపిక సంచలన వాఖ్యలు చేశారు. ‘ఈ కేసులో బాధితుల తరపున నిలబడ్డ క్షణం నుంచి అనేక రకాల బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఎన్ని హెచ్చరికలు వచ్చినా న్యాయం కోసం వాటిని పట్టించుకోను. హైకోర్టులో తోటి న్యాయవాదులే నన్ను దూషిస్తున్నారు. 8 ఏళ్ల బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపేస్తే అక్కడ స్థానిక లాయర్లు కేసు నమోదు కాకుండా నిందింతులకు సహాయం చేశారు. దీని వెనుక వారి ఉద్దేశం అర్థవవుతుంది. జమ్మూ బార్ అసోషియేషన్ అధ్యక్షుడు బీఎస్ సలాథియా నన్ను ఈ కేసు వాదించవద్దన్నారు. ఒకవేళ నువ్వు వాదిస్తే నిన్ను ఎలా అడ్డుకోవాలో తెలుసని ఆయన బెదిరించారు. భయంతో నేను భద్రత కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయించానని.. వారు తనకు రక్షణ కల్పించాలని పోలీసు శాఖను ఆదేశించార’ని దీపిక వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణ పట్ల బాలిక తల్లిదండ్రులు సంతృప్తిగా ఉన్నారని, అలాంటప్పుడు సీబీఐ దర్యాప్తు అవసరం ఏముందని ఆమె అభిప్రాయపడ్డారు. -
న్యాయవాదిపై రౌడీషీట్.. లాయర్స్ ఫైర్..!
సాక్షి, విజయవాడ: బెజవాడ పోలీసులు ఓ న్యాయవాదిపై అక్రమంగా రౌడీషీట్ నమోదు చేశారు. దీనిపై ఆగ్రహించిన బెజవాడ బార్ అసోసియేషన్ నేటి నుంచి నాలుగు రోజుల పాటు కోర్టుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. ఈ రోజు నుంచి న్యాయవాదులు కోర్టు సెంటర్లో నిరసన దీక్షలు చేపట్టునున్నారు. బెజవాడ పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. భవానీపురం పోలీస్ స్టేషన్లో న్యాయవాదిపై నమోదు చేసిన రౌడీషీట్ ఉపసంహరించుకోవాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. న్యాయవాదులు పోలీసుల వేధింపులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో పోలీస్ ఉన్నతాధికారులు ఏవిధమైన చర్యలు తీసుకోలేదు. దీంతో లాయర్స్ తీవ్ర ఆందోళనకు దిగారు. -
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చాంద్‌బాషా
– ప్రధాన కార్యదర్శిగా సి.వి. శ్రీనివాసులు విజయం – ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు కర్నూలు(లీగల్): జిల్లా న్యాయవాద సంఘం అధ్యక్షుడిగా ఎస్.చాంద్‌బాషా, ప్రధాన కార్యదర్శిగా సి.వి.శ్రీనివాసులు(వాసు)లు గెలుపొందారు. నాలుగు పదవుల కోసం నిర్వహించిన పోలింగ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. అధ్యక్ష స్థానం కోసం పోటీ చేసిన చాంద్‌బాషా తన ప్రత్యర్థి ఎం.సుబ్బయ్యపై 312 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, ఉపాధ్యక్ష స్థానం కోసం పోటీ చేసిన ఎ.అనిల్‌కుమార్ తన ప్రత్యర్థి బి.దేవపాల్పై 351 ఓట్లతో, ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసిన జి.జయలక్ష్మిదేవిపై సి.వి.శ్రీనివాసులు 429 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. మహిళా ప్రతినిధిగా బి.గీతామాధురి, సుమలత, వరలక్ష్మిలు పోటీ పడగా గీతామాధురి 238 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 777 మంది ఓటర్లుండగా ఎన్నికలో 684 ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో న్యాయవాదులు తమ ఓటును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన చాంద్ బాషా, అనిల్‌కుమార్, సి.వి.శ్రీనివాసులు, ఏకగ్రీవంగా కార్యదర్శి పదవికి ఎన్నికైన కర్నాటి పుల్లారెడ్డి, కోశాధికారిగా ఎన్నికైన ఎం.ఏ. తిరుపతయ్య, గ్రంథాలయ కార్యదర్శి అబ్దుల్ కరీం, మహిళా ప్రతినిధి గీతామాధురిలకు ఎన్నికల అధికారి ఎన్.నారాయణరెడ్డి డిక్లరేషన్ ఫారాలను అందించి అభినందించారు. ఎన్నికల సహ అధికారులుగా ఎం. శ్రీనివాసరెడ్డి, ఎస్.మనోహర్, రాజ్‌మోహన్‌రెడ్డి, బి.లోకేశ్వర్‌రెడ్డిలు వ్యవహరించారు. -
అదనపు జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలి
హుజూర్నగర్: పట్టణంలోని కోర్టులో అన్ని వసతులు ఉన్నందున అదనపు జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కుక్కడపు బాలకృçష్ణ కోరారు. ఆదివారం స్థానికంగా జరిగిన అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోనే మోడల్ కోర్టుగా అత్యాధునిక హంగులతో హుజూర్నగర్ కోర్టును నిర్మించడం జరిగిందన్నారు. అంతేగాక అన్ని అవకాశాలు ఉన్న హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసే విషయమై చొరవ చూపాలన్నారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి జక్కుల వీరయ్య, కోశాధికారి ఉదారి యాదగిరి, క్రీడా కార్యదర్శి భూక్యా నాగేశ్వరరావు, సాంస్కృతిక కార్యదర్శి కె.ప్రదీప్తి, సీనియర్ న్యాయవాదులు కొణతం శ్రీనివాసరెడ్డి, విజయదుర్గ పాల్గొన్నారు. -
బాధ్యతలు స్వీకరించిన బార్ కార్యవర్గం
నెల్లూరు(లీగల్) : ఇటీవల జరిగిన నెల్లూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన సభ్యులు బార్ కార్యాలయంలో బుధవారం బాధ్యతలను స్వీకరించారు. మాజీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, బాలసుబ్రహ్మణ్యం బాధ్యతలను అప్పగించారు. అధ్యక్షుడిగా ఫణిరత్నం, ఉపాధ్యక్షుడిగా రవికుమార్, జనరల్ సెక్రటరీగా రోజారెడ్డి, జాయింట్ సెక్రటరీగా రమణారెడ్డి, కోశాధికారి సుభానీ, లైబ్రరీ సెక్రటరీగా శివశంకర్, సీనియర్ ఈసీ మెంబర్లుగా మస్తానయ్య, శంకరయ్య, సత్యకుమార్, జూనియర్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ మెంబర్లుగా రియాజ్‌బాషా, ఝాన్సీ, రాజేష్, రమణారెడ్డి, రమణయ్య, లేడీ రెప్రజెంటేటివ్‌గా రామలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. -
బార్ అసోసియేషన్ కార్యాలయ భవనానికి భూమి పూజ
కర్నూలు(లీగల్) : కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘ నూతన కార్యాలయ భవనానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లాపరిపాలనా పర్యవేక్షకులు జస్టిస్ ఎస్.వి.భట్ శనివారం భూమిపూజ చేశారు. ఉదయం 8:30 గంటలకు స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు న్యాయవాదుల సంఖ్య అనుగుణంగా నూతన కార్యాలయ భవనం నిర్మాణానికి కృషి చేస్తామని జస్టిస్ ఎస్వీ భట్ తెలిపారు. తన గ్రంథాలయాన్ని న్యాయవాద సంఘానికి వితరణగా ఇచ్చిన సీనియర్ న్యాయవాది బి.జంగంరెడ్డికి సభాపూర్వకంగా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కె.ఓంకార్, కె.కుమార్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
సీజేతో టీ బార్ అసోసియేషన్ సభ్యుల భేటీ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా న్యాయాధికారుల సస్పెన్షన్‌ను రీకాల్ చేయాల్సిందిగా వారు సీజేను కోరారు. అయితే ఈ వ్యవహారంలో.. సమ్మె విరమించాల్సిందిగా బార్ అసోసియేషన్ సభ్యులను సీజే కోరారు. న్యాయవాదులు ఆందోళనకరమైన పరిస్థితులు సృష్టించొద్దని ఆయన సూచించారు. హైకోర్టు విభజనపై కేంద్ర మంత్రి సదానంద గౌడతో మాట్లాడుతానని తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యులకు సీజే తెలిపారు. అయితే.. సమ్మె విరమించిన తరువాతే ఈ వ్యవహారంలో తాను జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని సీజే తేల్చి చెప్పారు. సమ్మె విరమించే విషయంలో సభ్యులందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బార్ అసోసియేషన్ సభ్యులు సీజేకు వెల్లడించినట్లు తెలిపారు. -
జైలు నుంచి బెయిల్‌పై లాయర్ల విడుదల
స్వాగతం పలికిన బార్ అసోసియేషన్ నాయకులు హైకోర్టును విభజించాలని నినాదాలు పోచమ్మమైదాన్ : న్యాయమూర్తిపై దాడి కేసులో అరెస్టరుున న్యాయవాదులు బుధవారం సాయంత్రం విడుదలయ్యారు. మొద టి అదనపు కోర్టు జడ్జి కేవీ నర్సింహులు తనపై న్యాయవాదులు దాడి చేశారని ఫిర్యాదు చేయడంతో 8 మంది న్యాయవాదులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైకో ర్టు విభజన చేయాలని గత 20 రోజులుగా న్యాయవాదులు సాముహికంగా విధులు బహిష్కరించి ఉద్యమిస్తున్నారు. రంజిత్, శ్యాంకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, అంబటి శ్రీనివా స్, అల్లం నాగరాజు, రమణ, తీగల జీవన్‌గౌడ్, అఖిల్‌పాషాను మంగళవారం జైలుకు తరలించారు. విడుదలైన న్యాయవాదులు బయటకు వచ్చిన తర్వాత హైకోర్టును విభజించాలని నినాదాలు చేశారు. జై తెలంగాణ నినాదాలతో జైలు ఆవరణ హోరెత్తింది. విడుదలైన న్యాయవాదులను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జయాకర్ మాట్లాడుతూ ఎన్ని కేసులు పెట్టినా హైకోర్టు విభజన కోసం ఉద్యమం కోనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు సహోదర్‌రెడ్డి, వద్దిరాజు గణేష్, సంజీవ్ పాల్గొన్నారు. -
జూలై 1న హైకోర్టు విధుల బహిష్కరణ
తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం తీర్మానం సాక్షి, హైదరాబాద్: న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితాను ఉపసంహరిం చుకోవడంతో పాటు ఉమ్మడి హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో జూలై 1న హైకోర్టు విధుల బహిష్కరణ కార్యక్రమం చేపట్టాలని తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం తీర్మానించింది. ఈ మేరకు బుధవారం హైకోర్టులో జరిగిన సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సంఘం అధ్యక్షుడు గండ్ర మోహనరావు ఒక ప్రకటనలో తెలిపారు. నాంపల్లి, రంగారెడ్డి, సిటీ సివిల్ కోర్టులకు చెందిన న్యాయవాదులను పోలీసులు అరెస్ట్ చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసినట్లు మోహనరావు తెలిపారు. హైకోర్టులో ప్రవేశానికి రిజిస్ట్రార్ జనరల్ పేరు మీద జారీ అయిన మార్గదర్శకాల్లో ఐదో క్లాజ్‌ను తొలగించాలని కూడా తీర్మానం చేసినట్లు తెలిపారు. అలాగే కేటాయింపుల వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. ఏసీజేను కలిసిన బార్ కౌన్సిల్ సభ్యులు హైకోర్టు విభజన, ప్రాథమిక కేటాయింపుల జాబితా ఉపసంహరణ అభ్యర్థనలతో బార్ కౌన్సిల్ సభ్యులు బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. ఈ సందర్భంగా ఒక వినతి పత్రం సమర్పించినట్లు బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు విధులను బహిష్కరిస్తున్న నేపథ్యంలో తమ అభ్యర్థనలపై దృష్టి సారించాలని కోరినట్లు తెలిపారు. తమ అభ్యర్థనల పట్ల తాత్కాలిక సీజే సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారన్నారు. -
ఆదాయం కోసం వ్యాపారులను ఇబ్బంది పెట్టం
తెలంగాణ రెస్టారెంట్, బార్ల అసోసియేషన్‌కు ఆబ్కారీ శాఖ మంత్రి పద్మారావు హామీ సాక్షి, హైదరాబాద్: ఆదాయం కోసం మద్యం వ్యాపారులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి టి. పద్మారావుగౌడ్ స్పష్టం చేశారు. బార్ల లెసైన్సు ఫీజు పెంపు, కొత్త లెసైన్సుల జారీ నిబంధనల మేరకే జరుగుతోందని హామీ ఇచ్చారు. తెలంగాణ రెస్టారెంట్ అండ్ బార్ లెసైన్సీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. మనోహర్ గౌడ్ నేతృత్వంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన బార్ల యజమానులు గురువారం సచివాలయంలో మంత్రి పద్మారావును కలిశారు. కొత్త బార్ పాలసీలో లెసైన్సు ఫీజులను మరో రూ.5లక్షల వరకు పెంచాలన్న ఆబ్కారీశాఖ ప్రతిపాదనలను బార్ల యజమానులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఇప్పటి వరకు బార్ల లెసైన్స్ రెన్యూవల్ ఫీజు రూ. 10వేలు ఉంటే దానిని లక్షకు పెంచారని, కొత్త బార్ విధానంలో ఏకంగా లెసైన్సు ఫీజునే పెంచే ప్రతిపాదనలను అధికారులు చేశారని వివరించారు. ఈ ఏడాది లెసైన్స్ ఫీజు పెంచితే భరించే పరిస్థితిలో బార్ల యజమానులు లేరన్నారు. దీనిపై స్పందించిన మంత్రి.. తాను అమెరికాలో ఉన్నందు వల్ల ఆబ్కారీ శాఖ ప్రతిపాదనలు తన దృష్టికి రాలేదన్నారు. కొత్త బార్ పాలసీలో వ్యాపారులకు ఇబ్బంది లేని విధంగా నిర్ణయాలు ఉంటాయని హామీ ఇచ్చారు. -
హైకోర్టును విభజించాలి
♦ ‘బార్ అసోసియేషన్’ ప్రతినిధుల డిమాండ్ ♦ వికారాబాద్‌లో రాస్తారోకో ♦ ఏడీజేను అడ్డుకున్న న్యాయవాదులు ‘‘రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినా.. తెలంగాణలో ఆంధ్రా పెత్తనం కొనసాగించేందుకు ప్రయత్నించడం దారుణం. ఉమ్మడి హైకోర్టును కూడా వెంటనే విభజించాలి. దీనిపై కేంద్రం తక్షణమే స్పందించాలి. న్యాయమూర్తుల నియామకాల్లో స్థానికులకు అవకాశం కల్పించాలి. లేదంటే ఆందోళన తప్పదు.’’ వికారాబాద్: హైకోర్టులో నియామకం చేపట్టనున్న జడ్జీల పోస్టుల్లో తెలంగాణ వారికే అవకాశం ఇవ్వాలని వికారాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపూర్ణ ఆనంద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు న్యాయవాదులతో కలిసి సోమవారం జిల్లా అదన పు న్యాయస్థానం గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. ఏడీజే కోలా రంగారావును కోర్టులోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ.. న్యాయమూర్తుల నియామకాల్లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి అవకాశం ఇవ్వొద్దని కోరారు. దీనికోసం ఈ నెల 6 నుంచి వారం రోజుల పాటు కోర్టు విధులను బహిష్కరిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపామని పేర్కొన్నారు. ఏడీజేను కోర్టులోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో.. ఆయన తన సెల్ ఫోన్ నుంచి జిల్లా జడ్జి విజేందర్కు ఫోన్ చేసి.. బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘మీ నిరసన కార్యక్రమాన్ని మీరు చేసుకోండి.. కానీ న్యాయమూర్తులను అడ్డుకోవాల్సిన అవసరం లేదు’ అని సూచించారు. దీంతో నిరసనకారులు ఏడీజేను లోనికి వెళ్లనిచ్చారు. స్తంభించిన రాకపోకలు... కోర్టు ముందు రోడ్డుపై రెండు గంటల పాటు రాస్తారోకో చేశారు. దీంతో హైదరాబాద్ - తాండూరు రూట్లో వెళ్లే వాహనాలు రోడ్డుపై బారులుతీరాయి. స్పం దించిన సీఐ రవి ట్రాఫిక్‌ను నియంత్రించే నేపథ్యంలో వాహనాలను రాజీవ్‌కాలనీ సమీపంలోని రిక్షా కాలనీ నుంచి అనంతగిరిపల్లి మీదుగా పట్టణంలోకి వచ్చే విధంగా దారి మళ్లించారు. ఎట్టకేలకు న్యాయవాదులకు నచ్చజెప్పి నిరసన కార్యక్రమం ఆపేలా చేశారు. అనంతరం న్యాయవాదులందరూ చలో హైకో ర్టు కార్యక్రమానికి తరలివెళ్లారు. ఈ కా ర్యక్రమంలో న్యాయవాదులు అశోక్, కో ల్కుంద సంతోష్‌కుమార్, యాదవరెడ్డి, బస్వరాజ్, విజయ్‌భాస్కర్‌రెడ్డి, మాధవరెడ్డి, శుభప్రద్‌పటేల్, లక్ష్మణ్, శేఖర్,ర వి, శ్రీనివాస్, చంద్రశేఖర్, శంకర్, రఫీ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ న్యాయమూర్తులను ఏపీకి ఇవ్వండి
-ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ డిమాండ్ హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతానికి చెందిన న్యాయమూర్తులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ డిమాండ్ చేసింది. సీమాంధ్ర ప్రాంత న్యాయమూర్తులారా క్విట్ తెలంగాణ అనే నినాదంతో ఫెడరేషన్ బుధవారం పోస్టర్‌ను ఆవిష్కరించింది. తెలంగాణకు వెంటనే హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి న్యాయవాదికి ఆరోగ్య భద్రత కార్డు, ఇళ్ల స్థలాలు, జూనియర్ న్యాయవాదులకు ఐదేళ్ల వరకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం, సంక్షేమ నిధిని రూ.100 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచాలని అన్నారు. నేర విచారణ చట్టం సెక్షన్ 41(ఎ) నేరస్తులకు మేలు చేకూర్చే విధంగా ఉందని, ఈ సెక్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ లను కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. -
ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా నాగేశ్వరరావు
ఉపాధ్యక్షురాలిగా జాగర్లమూడి కోటేశ్వరిదేవి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా చిత్తరువు నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన తరువాత సంఘానికి తొలిసారి గురువారం జరిగిన ఎన్నికల్లో ఎంఎస్.ప్రసాద్‌పై నాగేశ్వరరావు 41 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా సంఘం అధ్యక్షుడిగా నాగేశ్వరరావు పనిచేశారు. ఉపాధ్యక్షురాలిగా జాగర్లమూడి కోటేశ్వరిదేవి, కార్యదర్శులుగా భాస్కరరావు జోస్యుల, తుహిన్ కుమార్ గెడ్డెల, సంయుక్త కార్యదర్శిగా చేజర్ల సుబోధ్, కోశాధికారిగా సుంకర హేమలత గెలుపొందారు. కార్యవర్గ సభ్యులుగా ఎస్.వి.భువనేశ్వరి, కొప్పర్తి సుమతి, సి.బి.ఆదర్శకుమార్, ఎం.ఢిల్లీబాబు, ఎన్.నిర్మలకుమార్, ిసీహెచ్.సాయి విష్ణువర్థన్, ఈర్ల సతీష్‌కుమార్, వేణుగోపాల్ తూము తదితరులు విజయం సాధించారు. -
‘విభజన’ మార్గదర్శకాలు అమలు చేయండి
ఏసీజేకు తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: కింది కోర్టుల విభజన నిమిత్తం ఫిబ్రవరిలో జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితం గా అమలయ్యేలా చూడాలని తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం, న్యాయవాదుల జేఏసీ బుధవారం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బొసాలేకు విజ్ఞప్తి చేశా యి. సంఘం అధ్యక్షుడు జి.మోహనరావు, జేఏసీ కన్వీనర్ రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో న్యాయవాదులు ఏసీజేకు వినతిపత్రం సమర్పించారు. కింది స్థాయి న్యాయ వ్యవస్థ విభజన నిమిత్తం న్యాయాధికారుల నుంచి హైకోర్టు ఆప్షన్లు కోరిందని, ఇందుకు మార్గదర్శకాలూ జారీ చేసిందని వారు తెలిపారు. అయితే ఏపీకి చెందిన న్యాయాధికారులు తెలంగాణకు ఆప్షన్ ఇచ్చినట్లు తెలిసిందని, దీనివల్ల తెలంగాణ న్యాయాధికారులకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు. -
క్లెయిమ్స్ ట్రిబ్యునల్ సభ్యులను నియమించాలి
రైల్వే ప్రమాద బాధిత కుటుంబాల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రమాదాల్లో గాయపడిన, చనిపోయిన కుటుంబాలు పరిహారానికి దాఖలు చేసుకునే పిటిషన్లను విచారించే రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌లో ఖాళీగా ఉన్న సభ్యుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు బాధితులు మంగళవారం సికింద్రాబాద్ సమీపంలోని ట్రిబ్యునల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దాదాపు 4 వేల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని, ట్రిబ్యునల్‌లో సభ్యులు లేని కారణంగా విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతోందని, దీంతో నష్ట పరిహారం అందక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. పరిహారం చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యంపై ట్రిబ్యునల్‌లో పిటిషన్లు దాఖలు చేసినా సభ్యులు లేకపోవడంతో విచారించే పరిస్థితి లేదన్నారు. చైర్మన్ పదవి కూడా ఖాళీగా ఉండటంతో సభ్యులను నియమించే దిక్కు లేకుండా పోయిం దన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఎం.పాండురంగారావు, కృష్ణమోహన్‌రావు, గిరికుమార్, గీతామాధురి, ద్వారకానాథ్ పట్నాయక్‌లు పాల్గొన్నారు. -
బెజవాడ లాయర్లకు అమరావతిలో ఇళ్లస్థలాలు!
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం బెజవాడ బార్ అసోసియేషన్‌పై అమితమైన ప్రేమచూపింది. నూతన రాజధానిలో నిర్మించే జస్టిస్ సిటీలో బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు ఇవ్వనుంది. ఈ మేరకు గురువారం బెజవాడ బార్ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్న న్యాయవాదులకు మొబైల్ మెసేజ్‌లు వచ్చాయి. అమరావతి నగరంలో జస్టిస్ సిటీ ఏర్పాటు చేసేందుకు సీఆర్డిఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ తర్వాత సింగపూర్ బృందం ఇచ్చిన మాస్టర్‌ప్లాన్‌లో జస్టిస్ సిటీని చేర్చారు. జస్టిస్ సిటీలో హైకోర్టు న్యాయమూర్తులకు నివాస గృహలు, న్యాయశాఖ సిబ్బందికి క్వార్టర్లు, ఇంకా స్థలాలు మిగిలితే హైకోర్టులో ప్రాక్టీస్ చేసే న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని గతంలో ప్రకటించారు. ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా అమరావతి నగరం శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సీఆర్డీఏ అధికారులు మాస్టర్ ప్లాన్ గురించి వివరించి జస్టిస్ సిటీలో నిర్మించనున్న కట్టడాల వివరాలను వెల్లడించారు. బెజవాడ బార్ అసోసియేషన్‌లో 2,300 మంది న్యాయవాదులు ఉన్నారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా అమరావతిలో బెజవాడ బార్ న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్నారు. ఆసక్తిగల సభ్యులు తమ దరఖాస్తులను బార్ అసోసియేషన్‌లో తమ పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా బార్ కార్యాలయం సూచించింది వాస్తవానికి గుంటూరు జిల్లాలో అమరావతి నగరం నిర్మితమవుతోంది. అయితే గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులను కనీసం పట్టించుకోకుండా విజయవాడకే ప్రాధాన్యం ఇవ్వడంపై మిగిలిన బార్ అసోసియేషన్లలో తీవ్ర వ్యతిరేక వ్యక్తం అవుతోంది. విశాఖపట్నం, కర్నూలు జిల్లాల న్యాయవాదులు హైకోర్టు లేదా హైకోర్టు బెంచ్ డిమాండ్‌తో సుదీర్ఘ కాలం పోరాడారు. ఇలా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో న్యాయవాదులను పట్టించుకోకుండా కేవలం ఒక బార్ అసోసియేషన్‌పై ప్రేమ చూపడం న్యాయవాదుల్లో చర్చగా మారింది. -
మేం వకాల్తా పుచ్చుకోం...
కోల్‌కతా: కోల్‌కతా నన్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితుని తరపున వాదించబోమని స్థానిక బార్ అసోసియేషన్ తేల్చి చెప్పింది. 70 యేళ్ల క్రైస్తవ సన్యాసినిపై కిరాతకంగా దాడిచేసి దుశ్చర్యకు పాల్పడిన ఘటనకు నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు బార్ అసోసియేషన్ సెక్రటరీ మిలన్ సర్కార్ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సలీంను సీఐడి పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈకేసులో సీసీఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు. అయితే ప్రధాన నిందితుడు అరెస్ట్ చేసినప్పటికీ... మిగతా వారు ఇంకా పరారీలోనే ఉన్నారు. కాగా సబ్- డివిజనల్ లీగల్ ఎయిడ్ కమిటీ నిందితుడికి న్యాయ సహకారం అందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి వాసుదేవ్ ముఖోపాధ్యాయ నియమితులైనట్లు సమాచారం. -
కొలీజియం స్థానంలో కొత్త చట్టాలకు పూర్తి మద్దతు
సుప్రీంకు బార్ అసోసియేషన్ నివేదన న్యూఢిల్లీ: న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించే కొలీజియం వ్యవస్థను మార్చి.. ఆ స్థానంలో తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన చట్టాలకు తాము బలంగా మద్దతిస్తున్నామని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (సీఎస్బీఏ) గురువారం సుప్రీంకోర్టులో పేర్కొంది. ప్రస్తుతమున్న కొలీజియం వ్యవస్థలో తీవ్ర లోటుపాట్లు ఉన్నాయనే అంశంపై ఏకాభిప్రాయం ఉందని సీఎస్బీఏ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే చెప్పారు. కొలీజియం వ్యవస్థను రద్దు చేసి, దాని స్థానంలో ప్రభుత్వం తెచ్చిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టం చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ అర్హతపై జస్టిస్ ఎ.ఆర్.దవే నేతృత్వంలోని జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ మదన్ బి లోకూర్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం ఆయా పక్షాల వాదనలను ఆలకించింది. రాజ్యాంగ సవరణ చేయక ముందు ఎన్‌జేఏసీ చట్టాన్ని ఆమోదించి ఉండాల్సింది కాదని పిటిషన్‌దార్లలో ఒకరైన సీనియర్ న్యాయవాది నారిమన్ వాదించారు. పిటిషన్లపై తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. -
విభజనపై దద్దరిల్లిన హైకోర్టు
హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలని తెలంగాణ బార్ అసోసియేషన్ మంగళవారం హైకోర్టులో ఆందోళన చేపట్టింది. ఛలో హైకోర్టు పిలుపుతో జిల్లాల నుంచి పెద్ద ఎత్తున న్యాయవాదులు తరలివచ్చి నినాదాలు చేశారు. కోర్టులో కేసులు విచారణ జరుగుతుండగానే ఆవరణలో జై తెలంగాణ నినాదాలు మారు మోగాయి. ఆందోళన ఎక్కువ కావడంతో పోలీసులు భారీగా మొహరించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
అనంతలో హైకోర్టు ఏర్పాటు చేయాలి
అనంతపురం లీగల్ : హైకోర్టు సాధన కోసం సమైక్యాంధ్ర ఉద్యమం కంటే తీవ్ర స్థాయిలో పోరుబాట సాగించాలని జిల్లా న్యాయవాదులు నిర్ణయించారు. ప్రభుత్వం జిల్లాకు అన్ని విధాలా అన్యాయం చేస్తోందని, దీన్ని సహించబోమని వారు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం అనంతపురంలోని జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. కోర్టు ఎదురుగా ఉన్న రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. తర్వాత ఉద్యమ శిబిరాన్ని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.మల్లికార్జున ప్రారంభించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు జి.పద్మజ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు హైకోర్టు బెంచ్ కోసం ఉద్యమించామని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన జరిగిన ప్రస్తుత తరుణంలో అనంతపురంలో హైకోర్టు ఏర్పాటు చేయటం అత్యవసరమన్నారు. రాష్ట్రంలో న్యాయవాద ఉద్యమాలకు, న్యాయవాదుల సంక్షేమానికి అనంత వేదికగా నిలుస్తోందని, హైకోర్టు సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా అందరి సహకారం కోరతామని చెప్పారు. ముఖ్యంగా రాయల సీమ న్యాయవాదులు సహకరించాలని కోరారు. ప్రతి రోజూ ఉద్యమాన్ని చేపట్టి.. తమ డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. ఈ నెల పదో తేదీ తరువాత శాసనసభ్యులతో చర్చలు జరుపుతామని, జిల్లా అభివృద్ధి కోసం కీలక సంస్థల ఏర్పాటులో భాగంగా హైకోర్టు ప్రధానంగా ఉండాలని కోరతామని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో రాయలసీమ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాల్మీకి గంగాధర్, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కన్వీనర్ బి.నారాయణరెడ్డి, బార్ అసోసియేషన్ కార్యదర్శి జయమోహన్, కోశాధికారి శశికళ, కె.ఎస్.జయరాం, మెమోరియల్ లైబ్రరీ కార్యదర్శి బాలకృష్ణ, నోటరీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వీజే రవికుమార్ పాల్గొన్నారు. విధుల బహిష్కరణ .. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం దర్మవరం, కళ్యాణదుర్గం, పెనుకొండ, గుంతకల్లు, గుత్తి తదితర కోర్టుల్లో న్యాయవాదులు మూకుమ్మడిగా విధులు బహిష్కరించారు. శనివారం వరకు విధులు బహిష్కరిస్తున్నట్లు బార్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వం దిగిరాని పక్షంలో నిరవధికంగా విధులు బహిష్కరించడానికీ సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. పెనుకొండలో బార్ అసోసియేషన్ జిల్లా అధ్య క్షుడు భాస్కరరెడ్డి, గుంతకల్లులో అధ్యక్షుడు పీజీఎస్ బాబు, కార్యదర్శి బడేసాబ్, కోశాధికారి కృష్ణారెడ్డి, ధర్మవరంలో అధ్యక్షుడు పుల్లయ్య, గుత్తిలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామచంద్రారెడ్డి, నద్దిముల్ల మహ్మద్ ఇస్మాయిల్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, కళ్యాణదుర్గంలో అధ్యక్షుడు ఎం.వెంకటేశులు, ఉపాధ్యక్షుడు ఎంఏ శంకరయ్య పాల్గొన్నారు. -
పొన్నవోలు కిడ్నాప్ యత్నంపై బార్ అసోసియేషన్ ఖండన
హైదరాబాద్: హైకోర్టు బార్ అసోసియేషన్ బుధవారం మధ్యాహ్నం అత్యవసర భేటీ అయింది. ఈ భేటిలో లాయర్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కిడ్నాప్ యత్నాన్ని ఖండిస్తూ హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కిడ్నాప్ యత్నంపై తెలంగాణ, ఏపీ డీజీపీలకు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేస్తామని హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గిరిధరరావు మీడియాకు తెలిపారు. నెల్లూరు జిల్లా పరిషత్ ఎన్నికల్లో జరిగిన అరాచకాలను హైకోర్టుకు విన్నవించిన న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని కిడ్నాప్‌యత్నం జరిగింది. దీనిపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఎన్నిక నిర్వహణకు కోర్టు ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని, ఎన్నికలు సజావుగా జరపాలని ఆదేశాలు పొందిన నేపథ్యంలో కిడ్నాప్ కు కొందరు ప్రయత్నించారు. ఈ నెల 5న జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ గొడవలు సృష్టించి, ఎన్నికలను వాయి దా వేయించిన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రజాహిత వ్యాజ్యంగా దాఖలు చేసిన న్యాయవాది సుధాకర్‌రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లో కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. -
కేసీఆర్‌కు బార్ అసోసియేషన్ శుభాకాంక్షలు
వరంగల్ లీగల్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును శనివారం బార్ అసోసియేషన్ ప్రతినిధి బృందం కలిసి శుభాకాంక్షలు తెలిపింది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. అలాగే న్యాయవాదుల సంక్షేమం కోసం 500 కోట్ల రూపాయలతో ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన ఉంటుందని కేసీఆర్ తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం తొలి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన న్యాయవాదులకు హామీ ఇచ్చారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గుడిమల్ల రవికుమార్, సూరం నర్సింహస్వామి, కార్యవర్గ సభ్యులు గురి, రంజిత్‌కుమార్, ఎన్.వసంతియాదవ్, సురేష్, న్యాయవాదులు ఉన్నారు. -
జూనియర్ సివిల్ జడ్జి మోడల్ పరీక్ష
గుంటూరు లీగల్, న్యూస్‌లైన్,గుంటూరు బార్ అసోసియేషన్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) సంయుక్త ఆధ్వర్యంలో జూనియర్ సివిల్ జడ్జి మోడల్ పరీక్ష శుక్రవారం ఉదయం గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పరీక్ష పత్రాలను రెండో అదనపు జిల్లా జడ్జి వి.నాగేశ్వరరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యాయమూర్తి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావాలని ఆకాంక్షించారు. జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైతే సమాజానికి తమవంతు సహాయ సహకారాలు అందించవచ్చని తెలిపారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులకు వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు మోడల్ పరీక్ష నిర్వహించేందుకు తనవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తానని తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఐలు జిల్లా కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ హైకోర్టు జూనియర్ సివిల్ జడ్జి పరీక్ష నిర్వహించే వరకు ప్రతి శని, ఆదివారాలు సెలవు దినాల్లో జూనియర్ సివిల్ జడ్జి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు శిక్షణ తరగతులు కొనసాగిస్తామని తెలిపారు. మోడల్ టెస్ట్‌లో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురికి నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి.భాస్కరరావు బహుమతులు అందజేశారు. అనంతరం అభ్యర్థులకు న్యాయమూర్తి భాస్కరరావు కాంట్రాక్ట్ యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనే అంశాలపై తరగతులు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఐలు జిల్లా అధ్యక్షుడు కట్టా కాళిదాసు, బార్ అసోసియేషన్ మహిళా ప్రతినిధి ఏపీ లాలి పర్యవేక్షించారు. -
'అభయ' కేసులో బార్ అసోసియేషన్ తీర్మానం రాజ్యాంగ విరుద్ధం
సుమారు ఏడాది క్రితం దేశ రాజధానిలో 'నిర్భయ' ఉదంతాన్ని పోలిన మరో దుర్ఘటన రాష్ట్ర రాజధానిలో జరగటం సభ్య సమాజాన్ని కలవరపాటుకి గురిచేసింది. 'అభయ 'గా పోలీసులు వ్యవహరిస్తున్న ఈ కేసులో నేర తీవ్రత విషయంలో తేడా ఉన్నప్పటికీ, ఆ అఘాయిత్యం జరిగిన తీరు ఆడపిల్లల భద్రతపై కొత్త భయాలు రేపింది. ఇదిలా ఉండగా, అభయ కేసు నిందితుల తరపున ఎవరూ వాదించకూడదని రంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే కొన్ని తీవ్రమైన నేరాల విషయంలో ప్రజలు భావోద్రేకాలకి గురౌతారు. ఆ ఆవేశమే యాసిడ్ దాడి చేసిన నేరస్తుడిని ఎన్కౌంటర్ ద్వారా హతం చేయాలని, ఉగ్రవాద దుశ్చర్యలకి పాల్పడిన వ్యక్తిని విచారణ లేకుండా ఉరితీయాలని, రేప్ చేసిన వాడిని నపుంసకుడుగా మార్చాలని డిమాండ్లు చేయిస్తుంది. వ్యక్తులు లోనయ్యే ఇటువంటి ఆవేశకావేశాలకి వ్యవస్థలు లోను కాకూడదని సుప్రీం కోర్టు పలుసార్లు వ్యాఖ్యానించింది. తాజాగా, అభయ కేసు విషయానికి వస్తే, నిందితులైన డ్రైవర్లు సతీష్, వెంకటేశ్వర్లు తరపున ఎవరూ వాదించకూడదని రంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. సదరు బార్ అసోసియేషన్ ఈ నిర్ణయం ద్వారా బహుశా ఒక విషయాన్ని స్పష్టం చేయదలిచుకుంది: అభయ కేసులో నిందితుల తరఫున వాదించడమంటే అన్యాయానికి వకాల్తా పుచ్చుకున్నట్టే కాబట్టి, దానిని ఆ బార్ అసోసియేషన్‌లో సభ్యులైన న్యాయవాదులు అందరూ మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నారు. తద్వారా, తాము అప్పటి వరకీన్యాయం వైపే నిలబడ్డామని, అన్యాయం పక్షాన ఏనాడూ లేనేలేమని. ఒకవేళ న్యాయం పట్ల వారి నిబద్ధత నిజమే అని నమ్మాల్సి వచ్చినా, రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకునే హక్కు మాత్రం బార్ అసోసియేషన్‌కు లేదనే చెప్పుకోవాలి. కోర్టులో న్యాయం పొందటం దేశంలోని ప్రతి పౌరుడికీ రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. ఆ రాజ్యాంగ హక్కు కాలరాచే తీర్మానం చేయడానికి బార్ అసోసియేషన్‌కు హక్కు లేదని పలు సందర్భాలలో సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టింది. "మీ అంతట మీరే చట్టము, తీర్పు కాబోరని" దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలో చేసిన హితవుల్ని బార్ అసోసియేషన్లు పెడచెవిన పెట్టడానికి కారణం- అటువంటి సంచలనాత్మక తీర్మానాల ద్వారా మీడియాలో వచ్చే ప్రచారమే. -
ప్రశాంతంగా బార్ అసోసియేషన్ ఎన్నికలు
సాక్షి, బళ్లారి : బళ్లారి బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి బార్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం బళ్లారి బార్ అసోసియేషన్ ఎన్నికలు జిల్లా కోర్టు ఆవరణంలో నిర్వహించారు. బళ్లారిలో బార్ అసోసియేషన్ సభ్యులు 910 మంది ఉండగా, ఇందులో 783 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బళ్లారి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పాటిల్ సిద్ధారెడ్డి, వై.రంగనాథ్ పోటీలో ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టు ఆవరణంలో ఎన్నికల సందడి నెలకొంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న బార్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల గడువు ముగియడంతో ఈ ఎన్నికలు నిర్వహించారు. దాదాపు 84 శాతం ఓటింగ్‌లో పాల్గొన్నారని, శనివారం ఓట్ల లెక్కింపు జరగనుందని ఎన్నికల అధికారి శ్యామ్‌సుందర్ తెలిపారు. -
అందరి ఆకాంక్ష సమైక్యతే
సాక్షి, విజయవాడ : జిల్లాలోని అన్నివర్గాలూ సమైక్యాంధ్ర ఆకాంక్షను బలంగా వ్యక్తం చేస్తున్నాయి. రోడ్లపైకి వచ్చి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఎండగడుతున్నాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా ట్రేడ్బంద్ విజయవంతమైంది. ముస్లింలు మసీదుల్లో ప్రార్థనల అనంతరం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. మచిలీపట్నంలో మునిసిపల్ అధికారులు, ఉద్యోగులు వినూత్నంగా రోడ్లు ఊడ్చి, డ్రెయిన్ల పూడిక తీసి నిరసన తెలిపారు. మచిలీపట్నం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వ్యాపారులు బంద్ పాటించారు. పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు జెడ్పీ కార్యాలయం ఎదుట వంటావార్పు నిర్వహించారు. రెండు వేలమందికి భోజనాలు పెట్టారు. కంకిపాడులో ఉపాధ్యాయులు, సమైక్యవాదులు, ఎన్జీవోలు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు మోకాళ్లపై నడిచి నిరసన వ్యక్తం చేశారు. గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్లో జరుగుతున్న జేఏసీ రిలేదీక్షల్లో మాజీ సైనికోద్యోగులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణంలో సెల్ మెకానిక్‌లు, అసోసియేషన్ నాయకులు భారీ ఎత్తున ప్రదర్శన చేశారు. మునిసిపల్ కార్యాలయ సిబ్బంది, ఉద్యోగులు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. న్యాయవాదులు మానవహారంగా ఏర్పడ్డారు. కైకలూరులో జాతీయ రహదారిపై మాక్ డ్రిల్ చేపట్టారు. చిల్లకల్లులో తోపుడు బళ్ల వ్యాపారులు మానవహారం నిర్మించారు. మైలవరంలో ఆర్ఎంపీలు, ల్యాబ్‌ల నిర్వాహకులు, మెడికల్ షాపుల యజమానులు, పారా మెడికల్ సిబ్బంది, వ్యాపారులు తమ దుకాణాలు మూసి భారీ ర్యాలీ నిర్వహించారు. దివిసీమ బంద్ విజయవంతమైంది. చల్లపల్లిలో జాతీయరహదారిపై ముస్లింలు వంటావార్పు నిర్వహించారు. రహదారిపైనే ప్రార్థనలు జరిపి, భోజనాలు చేశారు. విస్సన్నపేటలో బంద్ నిర్వహించారు. ఏకొం డూరు మండలం పోలిశెట్టిపాడులో రాస్తారోకో చేశారు. గంపలగూడెంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నూజివీడు లో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేదీక్షలు 23వ రోజుకు చేరాయి. న్యాయవాదుల రిలేదీక్షలు 12వ రోజుకు చేరాయి. మున్సిపల్ ఉద్యోగులు రోడ్లు ఊడ్చి నిరసన ప్రదర్శన చేశారు. జగ్గయ్యపేటలో ఉపాధ్యాయ సంఘాల నేతలు స్థానిక రైతుబజారులో కూరగాయలు అమ్ముతూ నిరసనను వ్యక్తం చేశారు. గుడ్లవల్లేరులో పెయింటర్లు కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఉయ్యూరులో ఐఎంఏ నేతృత్వంలో వైద్యులు సంపూర్ణ బంద్ పాటిం చారు. దీక్షా శిబిరం వద్దే అత్యవసర వైద్య సేవలు అందించి వినూత్న నిరసన తెలిపారు. టింబర్ డిపో, కార్పెంటరీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ-మచిలీపట్నం జాతీ య రహదారిపై బస్టాండ్ సెంటర్ సమీపంలో వంటవార్పుతో రహదారిని దిగ్బంధించారు. క్రేనుకు కేసీఆర్ ఫ్లెక్సీని దుంగకు ఉరివేసి వేలాడదీసి వాహనాలతో భారీ ప్రదర్శనగా ఉయ్యూరు వీరమ్మతల్లి ఆలయం వరకు వెళ్లారు. విజయవాడలో.. రామవరప్పాడు రింగ్ వద్ద విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పోస్టుకార్డుల ఉద్యమం జరిగింది. మున్సిపల్, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లు సమావేశమై 7న సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయిం చారు. 10 నుంచి వీధిదీపాలు ఆపేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత సమావేశమై మంచినీటి సరఫరాపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇరిగేషన్ ఇంజినీర్లు వారం రోజుల పాటు ఆందోళనలు నిర్వహించాలని ఆ తర్వాత సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. తెలుగుతల్లి ఐసీయూ లో ఉందంటూ వైద్యులు, వైద్య ఉద్యోగులు వినూత్న నిరసన తెలిపారు. రాష్ట్రంలో చిచ్చుపెట్టిన సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్, చంద్రబాబునాయుడిపై వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యుత్ జేఏసీ సభ్యులు ఎన్జీవోల దీక్షా శిబిరంలో రిలే దీక్షలు చేశారు. కృష్ణవేణి హోల్‌సేల్ క్లాత్ మార్కెట్ వ్యాపారులు ట్రేడ్ బంద్ పాటిస్తూ ర్యాలీ నిర్వహించారు. చిట్టినగర్‌లో కొత్త అమ్మవారి దేవస్థాన కమిటీ సభ్యులు అమ్మవారికి 101 కొబ్బరి కాయలను కొట్టారు. ఆర్టీసీ బస్సులు లేకపోవటంతో సీఐటీయూ ఆధ్వర్యంలో ఉచిత ఆటో సర్వీసులను ప్రారంభించారు. లయోలా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి నల్లబెలూన్లను వదిలి నిరసన తెలిపి, నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బార్ అసోసియేషన్ సభ్యులు, లాయర్లు పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నివాళులర్పించి గుంటూరు వరకు పాదయాత్ర చేపట్టారు. సింగ్‌నగర్ పైపులరోడ్డు సెంటర్లో వివిధ పాఠశాలల విద్యార్థులతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు ఉప్పలగుప్ప, కరా టే, ఇతర ఆటలను ఆడి నిరసన తెలిపారు. టీడీపీ ఆధ్వర్యంలో ప్రదర్శన, మానవహారం జరిగింది. -
శాంతియుతంగా విడిపోదాం
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : సీమాంధ్ర, తెలంగాణ భాయీ.. భాయీ. విడిపో యి కలిసుందాం.. అంటూ సద్భావన శాంతిసందేశాన్ని అందించేందుకు ఓరుగల్లు వేదికైంది. సీమాంధ్ర ఉద్య మానికి వ్యతిరేకంగా.. తెలంగాణ ఉద్యోగులపై దాడుల కు నిరసనగా శుక్రవారం టీజేఏసీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా టీఎన్జీఓలు, ఉద్యోగులు, న్యాయవాదులు, తెలంగాణవాదులు, జేఏసీల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ లు నిర్వహించారు. వరంగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిం చారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రాంతాల్లో తెలంగాణ ఉద్యోగులపై దాడిని తీవ్రంగా ఖండించారు. సంఘటన లు ఇలాగే జరిగితే ‘ఆంధ్రా ఉద్యోగులు గోబ్యాక్’ నినాదాన్ని తీసుకోవాల్సి ఉంటుందని రాష్ర్ట బార్ కౌన్సిల్ మెంబర్ ముద్దసాని సహోదర్‌రెడ్డి హెచ్చరించారు. అనంతరం డీఆర్వో కార్యాలయం వద్ద నిరసన కార్యక్ర మం చేపట్టారు. తెలంగాణపై వెనక్కి తగ్గితే వచ్చే ఉద్యమాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బార్అసోసియేషన్ అధ్యక్షుడు అంబరీష్, గుడిమల్ల రవికుమార్, అబ్దుల్నబీ, రాజేంద్రకుమార్, జనార్దన్‌గౌడ్, నీలా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పరకాలలో.. పరకాలలో స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. కోర్టు ప్రాంగణం నుంచి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అమరధామంలో అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ఉద్యోగులపై దాడులను ఖండించారు. సహృద్భావ వా తావరణంలో విడిపోయేందుకు అన్ని వర్గాలు సహకరిం చాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అ ధ్యక్షుడు పున్నం రాజిరెడ్డి, నాయకులు నరేష్‌రెడ్డి, రాజ మౌళి, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొర్రూరులో.. తొర్రూరు కోర్టు నుంచి న్యాయవాదులు ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలిసిమెలిసి ముందుకు సాగాలని కోరారు. కురవిలో తెలంగాణవాదులు సీమాంద్రుల దాడులను ఖండిస్తూ నిరసన తెలియజేశారు. ట్రైబల్ జేఏసీ ఆధ్వర్యంలో.. అమరవీరుల స్థూపం వద్ద దాడులకు నిరసనగా ర్యాలీ నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ జైసింగ్ రాథోడ్, సమ్మయ్య, బానోతు బాలాజీ, సజ్జన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. ములుగురోడ్డులో.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులపై దాడులపట్ల నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణను అడ్డుకునే కుట్రలను తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. విద్యుత్ జేఏసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు సంపత్‌రావు, నాయకులు దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ప్రకటిస్తే సుప్రీంలో పిల్
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే సుప్రీంలో పిల్ వేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇక్కడి ఒక హోటల్లో గురువారం సాయంత్రం అన్ని ప్రభుత్వ శాఖల జేఏసీ, ప్రజా సంఘాల జేఏసీ, బార్, డాక్టర్స్ అసోసియేషన్ల జేఏసీల ఆధ్వర్యంలో జరిగిన సమైక్యాంధ్ర రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణను అడ్డుకునేందుకు రాజ్యాంగబద్ధంగా ఎన్ని విధాలుగా చేయొచ్చో అన్ని రకాలుగా చేస్తూనే, సమైక్యాంధ్ర ఉద్యమాన్ని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉధృతం చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రాన్ని విభజించకుండా ఉండేందుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచినట్టు తె లిపారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పల్లెపల్లెకు తీసుకుపోవడానికి విద్యార్థి, ఉద్యోగ జేఏసీ నేతలు మరింత ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోవాలని కోరారు. వారికి పోలీసుల నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురైనా వాటిని పరిష్కరించేందుకు ఓ లీగల్ కమిటీని బార్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తుందన్నారు. విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని కోరారు. కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకుండా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని, అందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హోర్డింగ్స్ ద్వారా ప్రచారాన్ని చేపడతామని చెప్పారు. జాతీయ రహదారిపై వంటావార్పు, మానవ హారాలు, రైల్‌రోకో, బంద్‌లను తీవ్రతరం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ సమైక్యంగా ఉంచుతున్నామంటూ కేంద్రం ప్రకటించేవరకూ ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, మళ్ల విజయప్రసాద్, చింతలపూడి వెంకట్రామయ్య, అవంతి శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. వివిధ సంఘాల నుంచి 38 మంది ప్రతినిధులు తమతమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.