అనంతపురం లీగల్ : హైకోర్టు సాధన కోసం సమైక్యాంధ్ర ఉద్యమం కంటే తీవ్ర స్థాయిలో పోరుబాట సాగించాలని జిల్లా న్యాయవాదులు నిర్ణయించారు. ప్రభుత్వం జిల్లాకు అన్ని విధాలా అన్యాయం చేస్తోందని, దీన్ని సహించబోమని వారు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం అనంతపురంలోని జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించారు.
కోర్టు ఎదురుగా ఉన్న రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. తర్వాత ఉద్యమ శిబిరాన్ని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.మల్లికార్జున ప్రారంభించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు జి.పద్మజ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు హైకోర్టు బెంచ్ కోసం ఉద్యమించామని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన జరిగిన ప్రస్తుత తరుణంలో అనంతపురంలో హైకోర్టు ఏర్పాటు చేయటం అత్యవసరమన్నారు. రాష్ట్రంలో న్యాయవాద ఉద్యమాలకు, న్యాయవాదుల సంక్షేమానికి అనంత వేదికగా నిలుస్తోందని, హైకోర్టు సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా అందరి సహకారం కోరతామని చెప్పారు. ముఖ్యంగా రాయల సీమ న్యాయవాదులు సహకరించాలని కోరారు. ప్రతి రోజూ ఉద్యమాన్ని చేపట్టి.. తమ డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు.
ఈ నెల పదో తేదీ తరువాత శాసనసభ్యులతో చర్చలు జరుపుతామని, జిల్లా అభివృద్ధి కోసం కీలక సంస్థల ఏర్పాటులో భాగంగా హైకోర్టు ప్రధానంగా ఉండాలని కోరతామని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో రాయలసీమ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాల్మీకి గంగాధర్, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ కన్వీనర్ బి.నారాయణరెడ్డి, బార్ అసోసియేషన్ కార్యదర్శి జయమోహన్, కోశాధికారి శశికళ, కె.ఎస్.జయరాం, మెమోరియల్ లైబ్రరీ కార్యదర్శి బాలకృష్ణ, నోటరీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వీజే రవికుమార్ పాల్గొన్నారు.
విధుల బహిష్కరణ .. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం దర్మవరం, కళ్యాణదుర్గం, పెనుకొండ, గుంతకల్లు, గుత్తి తదితర కోర్టుల్లో న్యాయవాదులు మూకుమ్మడిగా విధులు బహిష్కరించారు. శనివారం వరకు విధులు బహిష్కరిస్తున్నట్లు బార్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వం దిగిరాని పక్షంలో నిరవధికంగా విధులు బహిష్కరించడానికీ సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. పెనుకొండలో బార్ అసోసియేషన్ జిల్లా అధ్య క్షుడు భాస్కరరెడ్డి, గుంతకల్లులో అధ్యక్షుడు పీజీఎస్ బాబు, కార్యదర్శి బడేసాబ్, కోశాధికారి కృష్ణారెడ్డి, ధర్మవరంలో అధ్యక్షుడు పుల్లయ్య, గుత్తిలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామచంద్రారెడ్డి, నద్దిముల్ల మహ్మద్ ఇస్మాయిల్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, కళ్యాణదుర్గంలో అధ్యక్షుడు ఎం.వెంకటేశులు, ఉపాధ్యక్షుడు ఎంఏ శంకరయ్య పాల్గొన్నారు.
అనంతలో హైకోర్టు ఏర్పాటు చేయాలి
Published Thu, Sep 4 2014 1:50 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM
Advertisement
Advertisement