విజ్ఞాన యాత్రలో విషాదం | Tragedy in science trip | Sakshi

విజ్ఞాన యాత్రలో విషాదం

Oct 9 2024 5:41 AM | Updated on Oct 9 2024 5:41 AM

Tragedy in science trip

రాజస్థాన్‌లో బెజవాడ న్యాయవాదులు ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం

బార్‌ కౌన్సిల్‌ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్‌ భార్య జ్యోత్స్న మృతి

20 మందికి తీవ్ర గాయాలు

విజయవాడ స్పోర్ట్స్‌/సాక్షి, అమరావతి:  బెజవాడ బార్‌ అసోసియేషన్‌ (బీబీఏ) న్యాయవాదులు చేపట్టిన విజ్ఞాన యాత్రలో విషాదం చోటుచేసుకుంది. దసరా సెలవులు కావడంతో ఈ నెల 2న 80 మంది న్యాయవాదులు విజయవాడ నుంచి 2 బస్సుల్లో యాత్రకు బయలుదేరారు. ఆంధ్రా, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని పలు న్యాయస్థానాలు, విజ్ఞాన ప్రాంతాలను చూసుకుంటూ ఈ నెల 6న రాజస్థాన్‌ చేరుకున్నారు. 7న రాత్రి రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ నుంచి జైపూర్‌ వస్తుండగా మార్గ మధ్యలోని జో«ధ్‌పూర్‌ వద్ద మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఓ బస్సు ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌ సతీమణి జ్యోత్స్న మృతిచెందారు. రాజేంద్రప్రసాద్‌తో పాటు బీబీఏ కార్యదర్శి అరిగల శివరామప్రసాద్‌ (రాజా), న్యాయవాదులు పద్మజ, అరుణదేవి, నాగరాజు, గంగాభవాని, జయలక్ష్మీ, సత్యవాణి, శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్‌తో పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు జోధ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. మృతురాలు జ్యోత్స్న విద్యార్ధి ఉద్యమ కార్యకర్తగా పనిచేశారు. 

నేటి తరుణీతరంగాలు, సేఫ్‌ లను స్థాపించడంతో కీలకభూమిక పోషించారు. జ్యోత్స్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని విమానంలో బుధవారం విజయవాడ తీసుకు­వచ్చేందుకు న్యాయవాదులు సన్నాహాలు చేస్తున్నారు. క్షతగాత్రులైన వారు సైతం విమానంలో విజయవాడ చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, విమానం టికెట్లు లభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని బీబీఏ కార్యదర్శి రాజా తెలిపారు. 

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్‌ సతీమణి జ్యోత్స్న మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థినులను చైతన్యం పరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించిన జ్యోత్స్న మృతి బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన సాయం అందించాలని తన కార్యాలయ అధికారులకు సీఎం సూచించారు. రాజస్థాన్‌ సీఎం బజన్‌ లాల్‌ శర్మతో ఫోన్‌లో మాట్లాడి బాధితులకు అవసరమైన సాయం 
అందించాలని కోరారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement