- సుప్రీంకు బార్ అసోసియేషన్ నివేదన
న్యూఢిల్లీ: న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించే కొలీజియం వ్యవస్థను మార్చి.. ఆ స్థానంలో తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన చట్టాలకు తాము బలంగా మద్దతిస్తున్నామని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (సీఎస్‌బీఏ) గురువారం సుప్రీంకోర్టులో పేర్కొంది. ప్రస్తుతమున్న కొలీజియం వ్యవస్థలో తీవ్ర లోటుపాట్లు ఉన్నాయనే అంశంపై ఏకాభిప్రాయం ఉందని సీఎస్‌బీఏ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే చెప్పారు.
కొలీజియం వ్యవస్థను రద్దు చేసి, దాని స్థానంలో ప్రభుత్వం తెచ్చిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టం చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ అర్హతపై జస్టిస్ ఎ.ఆర్.దవే నేతృత్వంలోని జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ మదన్ బి లోకూర్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం ఆయా పక్షాల వాదనలను ఆలకించింది. రాజ్యాంగ సవరణ చేయక ముందు ఎన్‌జేఏసీ చట్టాన్ని ఆమోదించి ఉండాల్సింది కాదని పిటిషన్‌దార్లలో ఒకరైన సీనియర్ న్యాయవాది నారిమన్ వాదించారు. పిటిషన్లపై తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.