సాక్షి, విజయవాడ : జిల్లాలోని అన్నివర్గాలూ సమైక్యాంధ్ర ఆకాంక్షను బలంగా వ్యక్తం చేస్తున్నాయి. రోడ్లపైకి వచ్చి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఎండగడుతున్నాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా ట్రేడ్‌బంద్ విజయవంతమైంది. ముస్లింలు మసీదుల్లో ప్రార్థనల అనంతరం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. మచిలీపట్నంలో మునిసిపల్ అధికారులు, ఉద్యోగులు వినూత్నంగా రోడ్లు ఊడ్చి, డ్రెయిన్ల పూడిక తీసి నిరసన తెలిపారు. మచిలీపట్నం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వ్యాపారులు బంద్ పాటించారు. పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు జెడ్పీ కార్యాలయం ఎదుట వంటావార్పు నిర్వహించారు.
రెండు వేలమందికి భోజనాలు పెట్టారు. కంకిపాడులో ఉపాధ్యాయులు, సమైక్యవాదులు, ఎన్జీవోలు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు మోకాళ్లపై నడిచి నిరసన వ్యక్తం చేశారు. గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్లో జరుగుతున్న జేఏసీ రిలేదీక్షల్లో మాజీ సైనికోద్యోగులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణంలో సెల్ మెకానిక్‌లు, అసోసియేషన్ నాయకులు భారీ ఎత్తున ప్రదర్శన చేశారు. మునిసిపల్ కార్యాలయ సిబ్బంది, ఉద్యోగులు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. న్యాయవాదులు మానవహారంగా ఏర్పడ్డారు. కైకలూరులో జాతీయ రహదారిపై మాక్ డ్రిల్ చేపట్టారు.
చిల్లకల్లులో తోపుడు బళ్ల వ్యాపారులు మానవహారం నిర్మించారు. మైలవరంలో ఆర్‌ఎంపీలు, ల్యాబ్‌ల నిర్వాహకులు, మెడికల్ షాపుల యజమానులు, పారా మెడికల్ సిబ్బంది, వ్యాపారులు తమ దుకాణాలు మూసి భారీ ర్యాలీ నిర్వహించారు. దివిసీమ బంద్ విజయవంతమైంది. చల్లపల్లిలో జాతీయరహదారిపై ముస్లింలు వంటావార్పు నిర్వహించారు. రహదారిపైనే ప్రార్థనలు జరిపి, భోజనాలు చేశారు. విస్సన్నపేటలో బంద్ నిర్వహించారు. ఏకొం డూరు మండలం పోలిశెట్టిపాడులో రాస్తారోకో చేశారు. గంపలగూడెంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నూజివీడు లో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేదీక్షలు 23వ రోజుకు చేరాయి. న్యాయవాదుల రిలేదీక్షలు 12వ రోజుకు చేరాయి.
మున్సిపల్ ఉద్యోగులు రోడ్లు ఊడ్చి నిరసన ప్రదర్శన చేశారు. జగ్గయ్యపేటలో ఉపాధ్యాయ సంఘాల నేతలు స్థానిక రైతుబజారులో కూరగాయలు అమ్ముతూ నిరసనను వ్యక్తం చేశారు. గుడ్లవల్లేరులో పెయింటర్లు కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఉయ్యూరులో ఐఎంఏ నేతృత్వంలో వైద్యులు సంపూర్ణ బంద్ పాటిం చారు. దీక్షా శిబిరం వద్దే అత్యవసర వైద్య సేవలు అందించి వినూత్న నిరసన తెలిపారు. టింబర్ డిపో, కార్పెంటరీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ-మచిలీపట్నం జాతీ య రహదారిపై బస్టాండ్ సెంటర్ సమీపంలో వంటవార్పుతో రహదారిని దిగ్బంధించారు. క్రేనుకు కేసీఆర్ ఫ్లెక్సీని దుంగకు ఉరివేసి వేలాడదీసి వాహనాలతో భారీ ప్రదర్శనగా ఉయ్యూరు వీరమ్మతల్లి ఆలయం వరకు వెళ్లారు.
విజయవాడలో..
రామవరప్పాడు రింగ్ వద్ద విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పోస్టుకార్డుల ఉద్యమం జరిగింది. మున్సిపల్, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లు సమావేశమై 7న సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయిం చారు. 10 నుంచి వీధిదీపాలు ఆపేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత సమావేశమై మంచినీటి సరఫరాపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇరిగేషన్ ఇంజినీర్లు వారం రోజుల పాటు ఆందోళనలు నిర్వహించాలని ఆ తర్వాత సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. తెలుగుతల్లి ఐసీయూ లో ఉందంటూ వైద్యులు, వైద్య ఉద్యోగులు వినూత్న నిరసన తెలిపారు. రాష్ట్రంలో చిచ్చుపెట్టిన సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్, చంద్రబాబునాయుడిపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
విద్యుత్ జేఏసీ సభ్యులు ఎన్‌జీవోల దీక్షా శిబిరంలో రిలే దీక్షలు చేశారు. కృష్ణవేణి హోల్‌సేల్ క్లాత్ మార్కెట్ వ్యాపారులు ట్రేడ్ బంద్ పాటిస్తూ ర్యాలీ నిర్వహించారు. చిట్టినగర్‌లో కొత్త అమ్మవారి దేవస్థాన కమిటీ సభ్యులు అమ్మవారికి 101 కొబ్బరి కాయలను కొట్టారు. ఆర్టీసీ బస్సులు లేకపోవటంతో సీఐటీయూ ఆధ్వర్యంలో ఉచిత ఆటో సర్వీసులను ప్రారంభించారు. లయోలా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి నల్లబెలూన్లను వదిలి నిరసన తెలిపి, నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
బార్ అసోసియేషన్ సభ్యులు, లాయర్లు పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నివాళులర్పించి గుంటూరు వరకు పాదయాత్ర చేపట్టారు. సింగ్‌నగర్ పైపులరోడ్డు సెంటర్‌లో వివిధ పాఠశాలల విద్యార్థులతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు ఉప్పలగుప్ప, కరా టే, ఇతర ఆటలను ఆడి నిరసన తెలిపారు. టీడీపీ ఆధ్వర్యంలో ప్రదర్శన, మానవహారం జరిగింది.