సాక్షి, అమరావతి: మోడల్ బైలాస్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం (ఏపీహెచ్‌ఏఏ) ఎన్నికలు నిర్వహిస్తామని ప్రస్తుత కార్యవర్గం బుధవారం హైకోర్టుకు నివేదించింది. ఇప్పటికే ఖరారు చేసిన షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఆ షెడ్యూల్ ప్రకారం ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది.
ఈ వ్యాజ్యంలో ఇక విచారించేందుకు ఏమీ లేదని, వ్యాజ్యాన్ని మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యవర్గం కాలపరిమితి ముగిసిప్పటికీ, ఎన్నికలకు బార్ కౌన్సిల్ చర్యలు తీసుకోలేదని, తన ఫిర్యాదునూ పట్టించుకోలేదని న్యాయవాది ఎన్.విజయభాస్కర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సింగిల్ జడ్జి జస్టిస్ దేవానంద్ ఇటీవల విచారణ జరిపారు.
పిటిషనర్ ఫిర్యాదు ఆధారంగా తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని బార్ కౌన్సిల్‌ను ఆదేశించారు. ఈ ఆదేశాలతో హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యకలాపాల నిర్వహణకు ఏడుగురు న్యాయవాదులతో ఓ అడ్‌హాక్ కమిటీని బార్ కౌన్సిల్ చైర్మన్ నియమించారు. దీంతో అడ్‌హాక్ కమిటీ వెంటనే కార్యవర్గం నుంచి బాధ్యతలు తీసుకోవాలని జస్టిస్ దేవానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రస్తుత కార్యవర్గం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కోనపల్లి నర్సిరెడ్డి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. తాము మోడల్ బైలాస్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రస్తుత అధ్యక్షుడు జానకిరామిరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ఎస్.సత్యనారాయణ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ను ఈ నెల 14న కోర్టు ముందుంచామని, దాని ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
మోడల్ బైలాస్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తాం
Published Thu, Dec 22 2022 5:50 AM | Last Updated on Thu, Dec 22 2022 2:57 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment