
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం (ఏపీహెచ్‌ఏఏ) ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎంతమాత్రం తగదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని పేర్కొంది. ఎన్నికల నిర్వహణ విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని, అసలు ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం ఉందా? అని ప్రస్తుత కార్యవర్గాన్ని ప్రశ్నించింది. 2023 మార్చిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రస్తుత కార్యవర్గం సమర్పించిన షెడ్యూల్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.
వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ సిద్ధం చేయాలని, ఆ వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రస్తుత కార్యవర్గం కాల పరిమితి ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించేందుకు బార్ కౌన్సిల్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఈ విషయంలో తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ న్యాయవాది ఎన్.విజయభాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారించిన సింగిల్ జడ్జి జస్టిస్ దేవానంద్.. పిటిషనర్ ఫిర్యాదు ఆధారంగా ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియజేస్తూ నివేదిక ఇవ్వాలని బార్ కౌన్సిల్‌ను ఆదేశించారు. ఈ ఆదేశాలతో బార్ కౌన్సిల్ చైర్మన్.. ఏపీహెచ్‌ఏఏ కార్యకలాపాల నిర్వహణకు సీనియర్ న్యాయవాదులతో ఓ అడహక్ కమిటీని నియమించారు. దీంతో వెంటనే ప్రస్తుత కార్యవర్గం నుంచి బాధ్యతలు తీసుకోవాలని అడహక్ కమిటీని ఆదేశిస్తూ జస్టిస్ దేవానంద్ ఉత్తర్వులు జారీచేశారు.
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రస్తుత కార్యవర్గం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కోనపల్లి నర్సిరెడ్డి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై విచారించిన ధర్మాసనం సింగిల్‌జడ్జి ఉత్తర్వులపై స్టే విధించిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం సీజే ధర్మాసనం ఈ అప్పీళ్లపై మరోసారి విచారించింది.
ఈ సందర్భంగా ప్రస్తుత కార్యవర్గం తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి ఎన్నికల షెడ్యూల్‌ను మెమో రూపంలో ధర్మాసనం ముందుంచారు. అయితే మార్చిలో ఎన్నికలు నిర్వహించే విధంగా ఆ షెడ్యూల్ ఉండటంతో దానిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేయాలని స్పష్టం చేసింది.
ఎన్నికల నిర్వహణలో జాప్యం చేస్తే, సింగిల్‌జడ్జి ఉత్తర్వులపై తాము విధించిన స్టేను ఎత్తేస్తామని చెప్పింది. ఎన్నికల నిర్వహణ బాధ్యతలను తాత్కాలిక కమిటీకి అప్పగిస్తామంది. తిరిగి షెడ్యూల్ ఖరారు చేసి, ఆ వివరాలతో సవరించిన మెమోను కోర్టు ముందుంచుతామని మోహన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment