Single Judge Judgment
-
హైకోర్టుకన్నా మీరే ఎక్కువా?
సాక్షి, అమరావతి: ‘హైకోర్టుకన్నా మీరే ఎక్కునుకుంటున్నారా? సంక్షేమ పథకాల నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదు’అంటూ ఎన్నికల సంఘం (ఈసీ)పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం నిప్పులు చెరిగింది. ‘2019లో పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధుల విడుదలకు అనుమతిచ్చారు. మొన్న తెలంగాణలో రైతు బంధు పథకానికి అనుమతించారు. ఇక్కడా అనుమతి కోరింది పాత పథకాలకే కదా! అప్పుడు పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవకు అనుమతిచ్చిన వాళ్లు ఇప్పుడెందుకు అనుమతి ఇవ్వరు ’అని గట్టిగా నిలదీసింది. సంక్షేమ పథకాల అమలుకు అనుమతినిచ్చే విషయంలో ఈసీ తీరు ఆందోళన కలిగిస్తోందని, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానాన్ని అనుసరించడం ఏమిటని వ్యాఖ్యానించింది. ‘నిధుల పంపిణీకి బ్రేక్ వేస్తూ మీరు ఇచి్చన ఉత్తర్వులను సింగిల్ జడ్జి అబయన్స్‌లో పెట్టిన తరువాత కూడా నిధుల పంపిణీకి ఎన్వోసీ ఇవ్వకుండా తిరిగి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా వివరణ కోరతారని మండిపడింది. అసలు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలా నిధుల పంపిణీ చేయకూడదని చట్టం ఏదైనా ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘సింగిల్ జడ్జి తీర్పుపై ఎన్నికల సంఘం అప్పీల్ చేసిందా? ఎన్నికల సంఘానికి లేని అభ్యంతరం మీకెందుకు’అని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అప్పీల్ రాష్ట్రంలోని పేదల అభ్యున్నతికి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాల్లో కొన్నింటికి నిధులు పంపిణీ చేయాల్సి ఉంది. ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో ఈ నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది. పోలింగ్ ముగిసే వరకు నిధుల పంపిణీ చేయవద్దని ఈసీ ఆదేశాలివ్వడంతో నిధుల పంపిణీ ఆగిపోయింది. ఈసీ నిర్ణయంపై పలువురు రైతులు, మహిళలు, విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి ఈనెల 10 వరకు ఈసీ ఉత్తర్వులు అమలు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటునిస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, వాటిని అమలు చేయకుండా, ఎన్వోసీ జారీ చేయకుండా ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరిన్ని వివరాలు కోరింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ నవతరం పార్టీ ధర్మాసనం ముందు 4 అప్పీళ్లు దాఖలు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఎలా అసాధారణం? ఈ అప్పీళ్ల గురించి నవతరం పార్టీ తరఫు సీనియర్ న్యాయవాదుల్లో ఒకరైన నాదకర్ణి సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించారు. నిధుల పంపిణీకి అనుమతినిస్తూ సింగిల్ జడ్జి ఇచి్చన ఉత్తర్వులపై తక్షణమే స్టేటస్ కో ఇవ్వాలని కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. అందరి వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. సింగిల్ జడ్జి రాత్రి 10.35 గంటల సమయంలో అసాధారణ ఉత్తర్వులు జారీ చేశారని నాదకర్ణి అనగా.. ఎలా అసాధారణం అవుతాయని ధర్మాసనం గట్టిగా ప్రశ్నించింది. ‘సంక్షేమ పథకాల నిధులనే కదా సింగిల్ జడ్జి పంపిణీ చేయవచ్చని చెప్పింది. అందులో తప్పేముంది? ఆ పథకాలు పాతవే కదా ’అని వ్యాఖ్యానించింది. ఇవి రాష్ట్రంలో చాలా పాపులర్ పథకాలు.. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా, సంక్షేమ పథకాల కింద నిధుల పంపిణీకి వీల్లేదని నాదకర్ణి అన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘నియమావళి అమల్లో ఉండగా, పథకాలు అమలుకు ఈసీ అనుమతులు తప్పనిసరా? ఏ చట్టంలో ఉందో చెప్పాలి’అనగా.. నాదకర్ణి ఎన్నికల నియమావళి గురించి చెప్పడం మొదలు పెట్టారు. ధర్మాసనం కలి్పంచుకొని.. ‘ఈసీ ఏదైనా ఉత్తర్వులిస్తే కోర్టులు ఏమీ చేయకూడదంటారా? కోర్టులకన్నా ఈసీ ఎక్కువని భావిస్తున్నారా?’అంటూ నిలదీసింది. ప్రస్తుతం కోర్టు ముందున్న పథకాలు పాతవని, రాష్ట్రంలో చాలా పాపులర్ పథకాలని ధర్మాసనం గుర్తు చేసింది. తెలంగాణలో రైతుబంధుకు ఎన్నికల సంఘం అనుమతినిచి్చన విషయాన్ని ధర్మాసనం ప్రముఖంగా ప్రస్తావించింది. తెలంగాణలో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారానే నిధుల పంపిణీ జరిగిందని, ఇక్కడ మాత్రం ఎందుకు అనుమతించరని నిలదీసింది. మా అధికారులనే బెదిరిస్తారా? ఈ అప్పీల్ దాఖలులో నవతరం పార్టీ న్యాయవాదుల తీరుపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ‘సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హౌస్ మోషన్ పిటిషన్ వేయాలంటూ ఫోన్ చేసి మా రిజిస్ట్రీని, మా అధికారులనే బెదిరిస్తారా? తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరిస్తారా?’అంటూ గట్టిగా నిలదీసింది. ‘మీ దెబ్బకు రిజిస్ట్రీ నాకు ఫోన్ చేసింది. ఉదయాన్ని లేచి చూస్తే రిజిస్ట్రీ నుంచి నా ఫోన్‌కు మెసేజ్‌లతో పాటు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మా రిజిస్ట్రీని మీరు ఉదయం 5 గంటలకే నిద్ర లేపుతారా? అంత ఉదయాన్నే నిద్ర లేచి మీ సేవలో ఉండాలని భావిస్తున్నారా? మేము ఆ సమయంలో నిద్ర లేచి మీ పిటిషన్‌ను హౌస్‌మోషన్ రూపంలో విచారించాలని భావిస్తున్నారా’అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇంకా నయం తనకు నేరుగా ఫోన్ చేయలేదని సీజే ఘాటుగా వ్యాఖ్యానించారు. ఐదేళ్లుగా అమలవుతున్న పథకాలను ఎందుకు అడ్డుకుంటున్నారు? అనంతరం ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగింది. ‘సింగిల్ జడ్జి ఉత్తర్వులపై మీరు అభ్యంతరం చెప్పలేదు. మీకు అభ్యంతరం ఉంటే మా ముందు అప్పీల్ చేసేవారు. అప్పీల్ చేయనప్పుడు సింగిల్ జడ్జి ఉత్తర్వులు అమలు చేయాలి. అప్పీల్ వేయకుండా సింగిల్ ఉత్తర్వులను అమలు చేయకుండా ఉండటం ఏమిటి? మీ తీరును ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలను వారి సొమ్ము వారు పొందకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? గత ఐదేళ్లుగా అమలవుతున్న పథకాలను ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎన్నికల బరిలో ఉన్న వారందరికీ సమాన అవకాశాలు (లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్) కల్పించేందుకే పథకాల అమలును ఆపామని మీరు చెబుతున్నారు. కానీ గతంలో పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ, రైతు బంధు పథకాలకు అనుమతినిచి్చ, ఇప్పుడు ఇక్కడ పథకాలను ఆపడం ద్వారా లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదన్న విషయాన్ని మీరే రుజువు చేశారు. ఎన్నికలు జరుగుతున్న ప్రతి రాష్ట్రంలో మీరు ఇలాగే ప్రభుత్వ పథకాలను ఆపుతున్నారా’అంటూ ఎన్నికల సంఘంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్కో ప్రభుత్వం విషయంలో ఒక్కో రకంగా..అసలు నిధుల పంపిణీ సంగతి ఏమిటని ధర్మాసనం రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. 10వ తేదీన నిధుల పంపిణీకి సింగిల్ జడ్జి అనుమతినిచి్చన విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎన్నికల సంఘానికి లేఖ ద్వారా తెలియజేశారన్నారు. నిధుల పంపిణీకి ఎన్వోసీ జారీ చేయాలని కోరారన్నారు. ఎన్వోసీ విషయాన్ని తేల్చని ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వాన్ని బడ్జెట్ కేటాయింపులు, పథకాలు అమలవుతున్న తేదీల వివరాలను అడుగుతూ సీఎస్‌కు లేఖ పంపిందని వివరించారు. ఎన్ఈవోసీ విషయాన్ని ఏం చేసిందో ఈసీనే అడగా లని ధర్మాసనాన్ని అభ్యరి్థంచారు. ఎన్నికల సంఘం తీరు ఒక్కో ప్రభుత్వం విషయంలో ఒక్కోరకంగా ఉంటోందన్నారు. గతంలో పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలకు అనుమతిచి్చందని, ఇందుకు పాత పథకాలన్న కారణం చెప్పిందన్నారు. ఇప్పుడు తాము కూడా పాత పథకాలనే అమలు చేస్తున్నప్పటికీ అభ్యంతరం చెబుతోందన్నారు. ఈసీ పరిధి దాటి వ్యవహరిస్తోందా? దీంతో ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వివరణను ధర్మాసనం కోరింది. నిధుల పంపిణీ వద్దంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో ఎక్కడా నిధులు పంపిణీ చేసుకోవచ్చని చెప్పలేదని అవినాష్ దేశాయ్ అనగా.. ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘మీ ఉత్తర్వులను సింగిల్ జడ్జి అబయన్స్‌లో పెట్టిన తరువాత ఆ ఉత్తర్వులు అమలు చేయడమే మీ పని. కానీ మీరేం చేశారు? కోర్టుకన్నా మీరు ఎక్కువని అనుకుంటున్నారా’అంటూ ప్రశ్నించింది. ‘ఈసీ ఇలాగే ప్రతి పథకాన్ని అడ్డుకోవచ్చా? అది ఈ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కావొచ్చు, వేరే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కావొచ్చు. ఈసీ పరిధి దాటి వ్యవహరిస్తోందా అన్నదే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న’అని ధర్మాసనం స్పష్టం చేసింది. తాము ఈ అప్పీళ్లపై విచారణ జరిపి, సింగిల్ జడ్జి ఉత్తర్వులను పరిశీలించి, తాము నిర్ణయించిన మేరకు ఉత్తర్వులిచి్చ, ఆ ఉత్తర్వుల కాపీ అందుబాటులోకి వచ్చేసరికి రాత్రి అవుతుందని తెలిపింది. బ్యాంకుల పని వేళలు సాయంత్రంతో ముగుస్తాయని, అలాంటప్పుడు ఈ నెల 10న నిధుల పంపిణీ ఎలా సాధ్యమవుతందని ప్రశ్నించింది. ఈ పరిస్థితుల్లో తాము ఈ అప్పీళ్లపై ఇప్పటికిప్పుడు తేల్చడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపింది. ఎన్నికల సంఘం వల్లే నిధులు పంపిణీ చేసే పరిస్థితి లేదు దీనిపై అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాన్ని కోరింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఈసీ అమలు చేయకపోవడం వల్ల, ఎన్ఈవోసీ ఇవ్వకపోవడం వల్ల నిధులు పంపిణీ చేసే పరిస్థితి లేకుండా పోయిందని ఏజీ శ్రీరామ్ వివరించారు. ఈ అప్పీళ్లను ఇప్పటికిప్పుడు తేల్చకపోయినా, ఈసీ తీరును మాత్రం ఖచి్చతంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సంఘం ఇష్టమొచ్చినట్టు వ్యవహరించవచ్చా అన్న విషయాన్ని తేల్చాలని ధర్మాసనాన్ని కోరారు. ఏజీ చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ‘14వ తేదీ నుంచి నిధులు పంపిణీ చేసుకోవచ్చని మీరు (ఎన్నికల సంఘం) చెబుతున్నారు. అప్పుడైనా నిధుల పంపిణీకి అనుమతిస్తారా లేక ఇలాగే ఆ వివరాలు, ఈ వివరాలు కావాలని అడుగుతూ వెళ్తారా’అంటూ ఎన్నికల సంఘాన్ని నిలదీసింది. అలాంటిది ఏమీ లేదని, 14 నుంచి నిధులు పంపిణీ చేసుకోవచ్చని ఈసీ న్యాయవాది అవినాష్ దేశాయ్ చెప్పారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఈసీ అనుమతి ఇవ్వని నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిధులు పంపిణీ చేసే పరిస్థితి లేదని, అందువల్ల ఈ మొత్తం వ్యవహారంలో తదుపరి ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదంటూ ఉత్తర్వులిచ్చింది. ఈ అప్పీళ్లపై తదుపరి విచారణను సెప్టెంబర్ 2న చేపడతామని ధర్మాసనం పేర్కొంది.మోకాలడ్డింది చంద్రబాబే! ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకోవడంలో చంద్రబాబు నక్కజిత్తులు మరోసారి బయటపడ్డాయి. నవతరం పార్టీతో పిటిషన్లు దాఖలు చేయించడం ద్వారా రైతులు, మహిళలు, విద్యార్థులకు సంక్షేమ నిధులు అందకుండా టీడీపీ అధినేత నారా చంద్రబాబు మరోమారు మోకాలడ్డారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల మేరకు వివిధ పథకాలకు సంబంధించి ప్రభుత్వం రూ.14,165 కోట్లు శుక్రవారం లబి్ధదారుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై నేరుగా కోర్టును ఆశ్రయిస్తే ప్రజల్లో ఆగ్రహావేశాలకు గురికావాల్సి వస్తుందని భయపడిన చంద్రబాబు దొడ్డిదారిని వెతుక్కున్నారు. తనతో సన్నిహితంగా ఉండే గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన నవతరం పార్టీ అనే అనామక పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యంతో హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేయించారు. అంతేకాక ఒక్క రోజు వాదనలకు రూ.20 లక్షల వరకు వసూలు చేసే మీనాక్షి అరోరా (రామోజీరావు తరపున మార్గదర్శి కేసుల్లో హాజరయ్యే న్యాయవాది), దేవ్‌దత్ కామత్ (రాజధాని కేసులో న్యాయవాది), ఎస్.నాదకర్ణి నవతరం పార్టీ తరపున వాదనలకు దించారు. ఇంత ఖరీదైన లాయ ర్లను పెట్టుకొనే స్థోమతు ఆ పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యంకు లేదు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగినప్పటికీ, వాదనలతో సాయంత్రం అయిపోయింది. దీంతో ని ధుల విడుదలపై సింగిల్ జడ్జి ఇచి్చన గడువు ముగిసిపోయింది. ఫలితంగా ప్రభుత్వం నగ దు విడుదల చేసినప్పటికీ లబ్ధిదారుల ఖాతా ల్లో జమ చేయలేకపోయింది. చంద్రబాబు చేసిన ఈ పాపానికి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు, లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఎన్నికల్లో రావు సుబ్రహ్మణ్యం నవతరం పార్టీకి రెండు చోట్ల గాజు గ్లాసు గుర్తు వచ్చింది. దీంతో ఆయన చంద్రబాబును కలిసి లోపాయికారీ ఒప్పందం ప్రకారం ఎన్నికల నుంచి తప్పుకున్నారు. పైగా టీడీపీ కేంద్ర కార్యాలయం కేంద్రంగా తన సంపూర్ణ మద్దతును టీడీపీకి ప్రకటించడం గమనార్హం. -
ఫలించిన మూడు దశాబ్దాల న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో స్వామి హథీరాంజీ మఠానికి చెందిన 25.36 ఎకరాలపై రక్షిత కౌలుదారులు మూడు దశాబ్దాలుగా చేస్తున్న న్యాయ పోరాటం ఫలించింది. ఈ కేసులు పెండింగ్‌లో ఉండగానే తల్లిదండ్రులు మరణించడంతో వారి పిల్లలు చట్టబద్ధ వారసులుగా న్యాయ పోరాటాన్ని కొనసాగించారు. ఫలితం అందుకున్నారు. ఈ భూమిని సాగు చేసుకుంటున్న రక్షిత కౌలుదారులకే విక్రయించేందుకు మఠం సంరక్షకునికి అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 1990లో జారీ చేసిన జీవో 751ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చి న తీర్పును ధర్మాసనం రద్దు చేసింది. వేలంలో కాకుండా, మఠానికి పూర్తిస్థాయి సంరక్షకుడు లేకుండా భూములను విక్రయించడానికి వీల్లేదన్న సింగిల్ జడ్జి తీర్పును ధర్మాసనం తప్పుపట్టింది. ఆ భూముల విక్రయం ప్రతిపాదనను మఠాధిపతి సర్జుదాస్ 1979లోనే తీసుకొచ్చారని గుర్తు చేసింది. 1957 నుంచి ఆ భూములు రక్షిత కౌలుదారుల సాగులోనే ఉన్నాయని, వాటిని వారి నుంచి స్వాదీనం చేసుకోవడం న్యాయపరంగా చాలా కష్టమని భావించడం, వివాదాలకు ఆస్కారం ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఆ భూములను వారికే విక్రయించడం మేలని మఠం సంరక్షకుడు చెప్పిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఇదీ నేపథ్యం: హథీరాంజీ మఠానికి తిరుపతిలోని సర్వే నంబర్లు 51/1, 54/2లో ఉన్న 25.36 ఎకరాలను ఎం.చెంగమ్మ, టి.మునుస్వామి నాయుడు 1957 నుంచి రక్షిత కౌలుదారులుగా సాగు చేస్తున్నారు. ఆ తరువాత వారికి మఠం మహంత్ శాశ్వత లీజు మంజూరు చేశారు. మహంత్ మరణం తరువాత 1966లో ఆ లీజు రద్దయింది. అయినా వారు లీజు డీడ్ల ద్వారా కొనసాగుతున్నారు. 1980లో అప్పటి మహంత్ సస్పెండ్ అయ్యారు. మఠానికి సంరక్షకుడు నియమితులయ్యారు. అనంతరం ఆ భూమిని కౌలుదారులకే విక్రయించాలని మఠం నిర్ణయించింది. దీనిపై వి.నాగమణి, డి.కుప్పుస్వామి నాయుడు మరికొందరు అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం ఈ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ రక్షిత కౌలుదారులకే భూమిని విక్రయించేందుకు అనుమతిస్తూ 1990లో జీవో 751 జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ నాగమణి తదితరులు హైకోర్టులో అదే ఏడాది పిటిషన్ వేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. జీవో 751ని రద్దు చేస్తూ 2002లో తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ చెంగమ్మ తదితరులు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అనంతరం చెంగమ్మ, ఆమె భర్త వెంకట్రామనాయుడు మరణించడంతో వారి పిల్లలు ఈ వ్యాజ్యంలో చట్టబద్ధ వారసులుగా చేరారు. ఈ అప్పీల్‌పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తుది విచారణ జరిపి ఇటీవల తీర్పునిచ్చింది. -
సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ధర్మాసనం స్టే
సాక్షి, అమరావతి: వైద్య పరికరాలు, ఫర్నీచర్ సరఫరా చేసిన సంస్థకు ఏపీ వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) బిల్లులు చెల్లించినప్పటికీ, ఆ చెల్లింపులపై సందేహం వ్యక్తం చేస్తూ సంస్థ వైస్ చైర్మన్, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) డైరెక్టర్ కోర్టు ముందు హాజరు కావాలంటూ సింగిల్ జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ ఇచ్చిన ఉత్తర్వులపై ధర్మాసనం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో హెల్త్ వెల్నెస్ కేంద్రాలకు వైద్య పరికరాలు, ఫర్నీచర్ సరఫరా చేసిన ఆర్మీ సర్జికల్ వర్క్స్ తమకు రూ.3.05 కోట్లను చెల్లించడంలేదంటూ దాఖలు చేసిన వ్యాజ్యంపై సింగిల్ జడ్జి జస్టిస్ దేవానంద్ విచారణ జరిపారు. ఆర్మీ సర్జికల్ వర్క్స్ బిల్లు చెల్లించేందుకు ఏపీఎంఎస్ఐడీసీ వైస్ చైర్మన్ చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. విచారణను డిసెంబర్ 22కి వాయిదా వేశారు. ఆరోజు విచారణకు రాగా, డిసెంబరు 21నే బిల్లు చెల్లించినట్లు ఏపీఎంఎస్ఐడీసీ న్యాయవాది వెంకటరెడ్డి చెప్పారు. బిల్లులు చెల్లించాలని తాను ఆదేశాలు ఇవ్వకపోయినా ఆర్మీ సర్జికల్ కంపెనీకి బిల్లు చెల్లించడంపై సందేహం ఉందని న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ అన్నారు. పెండింగ్ బిల్లులన్నింటి వివరాలతో ఏపీఎంఎస్ఐడీసీ వైస్ చైర్మన్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ వ్యాజ్యం డిసెంబర్ 29న మరోసారి విచారణకు రాగా.. ఏపీఎంఎస్ఐడీసీ వైస్ చైర్మన్ అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఎన్హెచ్ఎం డైరెక్టర్ ఆర్మీ సర్జికల్ వర్క్స్ బిల్లు రూ.3.05 కోట్లు విడుదల చేశారని, దానిని పిటిషనర్‌కు చెల్లించామని అఫిడవిట్లో పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ స్పందిస్తూ, దాదాపు రూ.300 కోట్ల మేర బిల్లులు ఆ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారని, ఎంతెంత బిల్లులు చెల్లించాలో వివరాలను ఇవ్వడంలో విఫలమయ్యారని ఆక్షేపించారు. జనవరి 5న స్వయంగా కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఏపీఎంఎస్ఐడీసీ వైస్ చైర్మన్, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్లను న్యాయమూర్తి ఆదేశించారు. బిల్లులు చెల్లించడమూ తప్పేనట ఈ ఆదేశాలను సవాలు చేస్తూ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, ఏపీఎంఎస్ఐడీసీ వైస్ చైర్మన్, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను చదివి వినిపించారు. పిటిషనర్ కంపెనీకి బిల్లులు చెల్లించకపోవడాన్ని సింగిల్ జడ్జి తప్పుపట్టారని, దీంతో వారికి బిల్లులు చెల్లించేశామని ఏఏజీ చెప్పారు. దీనినీ సింగిల్ జడ్జి తప్పుపట్టారన్నారు. ఆదేశాలు ఇవ్వకపోయినా ఎలా చెల్లిస్తారంటూ అధికారులపై మండిపడ్డారని, వారి వ్యక్తిగత హాజరుకు, మొత్తం బిల్లులు వివరాలు సమర్పించాలని ఆదేశాలిచ్చారన్నారు. ధర్మాసనం సైతం సింగిల్ జడ్జి ఉత్తర్వులను చదివింది. వెంటనే సింగిల్ జడ్జి జస్టిస్ దేవానంద్ ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది. -
ఏపీహెచ్‌ఏఏ ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేయండి : హైకోర్టు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం (ఏపీహెచ్‌ఏఏ) ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎంతమాత్రం తగదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని పేర్కొంది. ఎన్నికల నిర్వహణ విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని, అసలు ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం ఉందా? అని ప్రస్తుత కార్యవర్గాన్ని ప్రశ్నించింది. 2023 మార్చిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రస్తుత కార్యవర్గం సమర్పించిన షెడ్యూల్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ సిద్ధం చేయాలని, ఆ వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రస్తుత కార్యవర్గం కాల పరిమితి ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించేందుకు బార్ కౌన్సిల్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఈ విషయంలో తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ న్యాయవాది ఎన్.విజయభాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారించిన సింగిల్ జడ్జి జస్టిస్ దేవానంద్.. పిటిషనర్ ఫిర్యాదు ఆధారంగా ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియజేస్తూ నివేదిక ఇవ్వాలని బార్ కౌన్సిల్‌ను ఆదేశించారు. ఈ ఆదేశాలతో బార్ కౌన్సిల్ చైర్మన్.. ఏపీహెచ్‌ఏఏ కార్యకలాపాల నిర్వహణకు సీనియర్ న్యాయవాదులతో ఓ అడహక్ కమిటీని నియమించారు. దీంతో వెంటనే ప్రస్తుత కార్యవర్గం నుంచి బాధ్యతలు తీసుకోవాలని అడహక్ కమిటీని ఆదేశిస్తూ జస్టిస్ దేవానంద్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రస్తుత కార్యవర్గం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కోనపల్లి నర్సిరెడ్డి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై విచారించిన ధర్మాసనం సింగిల్‌జడ్జి ఉత్తర్వులపై స్టే విధించిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం సీజే ధర్మాసనం ఈ అప్పీళ్లపై మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రస్తుత కార్యవర్గం తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి ఎన్నికల షెడ్యూల్‌ను మెమో రూపంలో ధర్మాసనం ముందుంచారు. అయితే మార్చిలో ఎన్నికలు నిర్వహించే విధంగా ఆ షెడ్యూల్ ఉండటంతో దానిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణలో జాప్యం చేస్తే, సింగిల్‌జడ్జి ఉత్తర్వులపై తాము విధించిన స్టేను ఎత్తేస్తామని చెప్పింది. ఎన్నికల నిర్వహణ బాధ్యతలను తాత్కాలిక కమిటీకి అప్పగిస్తామంది. తిరిగి షెడ్యూల్ ఖరారు చేసి, ఆ వివరాలతో సవరించిన మెమోను కోర్టు ముందుంచుతామని మోహన్‌రెడ్డి తెలిపారు. -
ఇప్పటం ఇళ్ల యజమానులకు ధర్మాసనంలోనూ షాక్
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి చెందిన కొందరు ఇళ్ల యజమానులకు హైకోర్టు ధర్మాసనం సైతం గట్టి షాక్‌నిచ్చింది. రోడ్డు మార్జిన్లను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టడమే కాకుండా వాటిని కూల్చివేసేందుకు అధికారులు నోటీసులిచ్చినా ఆ విషయాన్ని దాచిపెట్టి మధ్యంతర ఉత్తర్వులు పొందిన ఇళ్ల యజమానులు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఖర్చులు విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈమేరకు సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ 14 మంది ఇళ్ల యజమానులు దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను ధర్మాసనం కొట్టి వేసింది. ఖర్చుల మొత్తాన్ని తగ్గించాలన్న విజ్ఞప్తిని సైతం తోసిపుచ్చింది. వాస్తవాలను దాచి పెట్టి కోర్టుల నుంచి సానుకూల ఉత్తర్వులు పొందే తీరును తామెంత మాత్రం ప్రోత్సహించబోమని తేల్చి చెప్పింది. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే నిజమైన బాధితులకు అన్యాయం జరుగుతుందని, వారు సకాలంలో కోర్టును ఆశ్రయించి న్యాయం పొందే పరిస్థితి ఉండదని వ్యాఖ్యానించింది. ఒక్కొక్కరూ రూ.లక్ష చొప్పున 14 మంది రూ.14 లక్షలను ఖర్చుల కింద చెల్లించాలంటూ సింగిల్‌జడ్జి ఇచ్చిన తీర్పు సరైందేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదీ నేపథ్యం.. రహదారి విస్తరణలో భాగంగా పలు ఇళ్ల కూల్చివేతకు నిర్ణయం తీసుకున్న తాడేపల్లి మునిసిపల్ అధికారులు రోడ్ మార్జిన్లను ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఇళ్ల యజమానులకు ఈ ఏడాది మే 21న చట్ట ప్రకారం నోటీసులు జారీ చేశారు. అయితే రాజకీయ పార్టీల అండతో ఈ నోటీసులను సవాలు చేస్తూ బెల్లంకొండ వెంకట నారాయణ, మరో 13 మంది ఇళ్ల యజమానులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా నేరుగా కూల్చివేత నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న సింగిల్ జడ్జి జస్టిస్ రవినాథ్ తిల్హారీ... పిటిషనర్ల ఇళ్ల విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మునిసిపల్ అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అటు తరువాత ఆ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా ఇళ్ల కూల్చివేత విషయంలో పిటిషనర్లకు అధికారులు ముందుగానే షోకాజ్ నోటీసులతో పాటు ఇతర నోటీసులు కూడా అందచేశారంటూ అందుకు సంబంధించి అన్ని ఆధారాలను మునిసిపల్ కార్పొరేషన్ తరఫు న్యాయవాదులు న్యాయమూర్తి ముందుంచారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి హైకోర్టును ఆశ్రయించిన 14 మంది పిటిషనర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు అందుకుని కూడా నోటీసులు ఇవ్వలేదంటూ హైకోర్టును తప్పుదోవ పట్టించడంపై మండిపడ్డారు. కోర్టు ముందు వాస్తవాలను దాచి పెట్టినందుకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున 14 మందికి రూ.14 లక్షలను ఖర్చులుగా విధిస్తూ ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆ 14 మంది ఇళ్ల యజమానులు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేశారు... ఇళ్ల యజమానుల తరఫున సీనియర్ న్యాయవాది కలిగినీడి చిదంబరం వాదనలు వినిపిస్తూ పిటిషనర్లందరూ వ్యవసాయదారులని పేర్కొన్నారు. వారికి షోకాజ్ నోటీసులకు, తుది నోటీసులకు తేడా తెలియదన్నారు. దీంతో నోటీసులు ఇవ్వలేదని చెప్పారన్నారు. అంతేకానీ కోర్టును తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశం వారికి లేదన్నారు. జరిగిన తప్పులకు క్షమాపణ చెబుతున్నామన్నారు. అయితే ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. సింగిల్ జడ్జి తీర్పు సరైందేనని తేల్చి చెప్పింది. ఇలాంటి వ్యాజ్యాల వల్ల కోర్టుల సమయం వృథా అవుతోందని పేర్కొంది. వాస్తవాలను తొక్కి పెట్టి పిటిషన్ దాఖలు చేయడం ద్వారా కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేశారని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యాజ్యం దాఖలు చేయడం ద్వారా మిగిలిన కక్షిదారుల వ్యాజ్యం విచారణ జాబితాలో వచ్చే అవకాశం లేకుండా పోయిందని, ఇది ఓ రకంగా అన్యాయం చేయడమేనని వ్యాఖ్యానించింది. కేసులు సకాలంలో విచారణకు రాకపోవడంతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని, అందుకు ఇప్పటం ఇళ్ల యజమానులు లాంటి వారు దాఖలు చేసే వ్యాజ్యాలే కారణమని పేర్కొంది. ఈ వ్యాజ్యాన్ని విచారించేందుకు హైకోర్టు ఎంతో సమయం వెచ్చించిందని తెలిపింది. ఆ సమయాన్ని నిజమైన బాధితులు దాఖలు చేసే వ్యాజ్యాలను విచారించేందుకు వెచ్చించి ఉంటే వారికి న్యాయం జరుగుతుందని పేర్కొంటూ అప్పీల్‌ను కొట్టేసింది. -
లోపాలపై తేల్చండి
సింగిల్ జడ్జి తీర్పును సవరించిన ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల అఫిలియేషన్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. దీనిపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం సవరించింది. పిటిషన్లు దాఖలు చేసుకున్న కాలేజీల్లో తనిఖీలు చేయడం కోసం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), జేఎన్టీయూల ఆధ్వర్యంలో 25 బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆయా కాలేజీలను వెబ్‌కౌన్సెలింగ్‌లో చేర్చినా.. వాటిల్లో చేపట్టే ప్రవేశాలు తనిఖీల అనంతరం తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలన్నదే తమ తపన అని.. అందుకే ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నామని పేర్కొంది. ఏఐసీటీఈ అనుమతి ఉండి ఈ విద్యా సంవత్సరానికి అఫిలియేషన్ పొందలేకపోయిన ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలకు తాత్కాలిక అఫిలియేషన్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ జేఎన్టీయూ ధర్మాసనానికి అప్పీలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. వాదనలు విన్న అనంతరం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘కాలేజీల్లో తనిఖీల కోసం 25 బృందాలు ఏర్పాటు చేయాలి. వీటిల్లో ఏఐసీటీఈ నుంచి ఇద్దరు, జేఎన్టీయూ నుంచి ఒకరు ఉంటారు. హైకోర్టును ఆశ్రయించిన అన్ని కాలేజీల్లో 48 గంటల ముందస్తు సమాచారంతో తనిఖీలు చేయాలి. ఏఐసీటీఈ నిర్దేశించిన ప్రమాణాల మేరకు బోధనా సిబ్బంది, సాంకేతిక సహాయ సిబ్బంది, పాలనా సిబ్బంది, లేబొరేటరీలు ఉన్నాయా, లేవా అన్న అంశాలకు మాత్రమే తనిఖీలను పరిమితం చేయాలి. బోధనా సిబ్బంది సహా అంతా తమ ఫోటోలు, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్లతో తనిఖీ బృందాల ముందు హాజరుకావాలి. తనిఖీ బృందాల సభ్యులకయ్యే ఖర్చుల నిమిత్తం ఒక్కో కాలేజీ జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ వద్ద రూ.2లక్షలను వారంలోగా డిపాజిట్ చేయాలి. ఈ డబ్బు డిపాజిట్‌తో సంబంధం లేకుండానే తనిఖీలు జరగాలి. రంజాన్ దృష్ట్యా మైనారిటీ కాలేజీల్లో ఈనెల 20లోపు తనిఖీలు వద్దు. తనిఖీ బృందాలు తనిఖీలు చేసిన 3 రోజుల్లోగా తమ నివేదికలను సీల్డ్కవర్లో హైకోర్టు రిజిస్ట్రార్‌కు, జేఎన్టీయూకు అందచేయాలి. ఈ 25 బృందాల్లో ఉండే సభ్యుల వివరాలను 3 రోజుల్లో ఏఐసీటీఈ తెలియచేయాలి. తనిఖీలన్నీ ఆగస్టు 1 లోపు పూర్తికావాలి. ఈలోపు సింగిల్ జడ్జి ఆదేశించిన మేర ప్రవేశాల ప్రక్రియను కొనసాగించవచ్చు. అయితే ఈ కాలేజీల్లో ప్రవేశాలు ధర్మాసనం తుది తీర్పునకు లోబడి ఉంటాయి. ఒకవేళ తనిఖీ బృందాల నివేదిక ఆధారంగా ఏదైనా కాలేజీకి అఫిలియేషన్ తిరస్కరిస్తే.. ఆ కాలేజీలో చేరిన విద్యార్థులను జేఎన్టీయూ మరో కాలేజీలో చేర్పించాలి. అది సాధ్యం కాకుంటే ఆ విద్యార్థులకు వడ్డీతో సహా ఫీజును వాపసు ఇవ్వాలి. ఆ కాలేజీల్లో ప్రవేశాలు పొందే సమయంలోనే విద్యార్థులకు ఈ ఉత్తర్వుల గురించి తెలియచేయాలి. అఫిలియేషన్ కోసం కోర్టుకు వచ్చిన కాలేజీలు ఏదైనా కోర్సు అఫిలియేషన్ వద్దనుకుంటే.. గురువారం ఉదయం 10 గంటలకల్లా జేఎన్టీయూకు తెలపాలి. ఈ తనిఖీలను అఫిలియేషన్ లేని కోర్సులకు మాత్రమే పరిమితం చేయాలి. అవసరమైన పక్షంలో అఫిలియేషన్ వచ్చిన కోర్సులకు సంబంధించిన బోధనా సిబ్బంది వివరాలను తనిఖీ బృందాలు కోరవచ్చు..’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది. ఆ అధికారం జేఎన్టీయూదే.. తనిఖీ బృందాల్లో ఎవరుండాలన్న విషయంలో జేఎన్టీయూహెచ్, కాలేజీల న్యాయవాదుల మధ్య తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి. ఏఐసీటీఈ తనిఖీలు చేస్తే తమకు ఇబ్బంది లేదని.. జేఎన్టీయూతోనే సమస్య కాబట్టి స్వతంత్ర వ్యక్తులకు తనిఖీల బాధ్యతలను అప్పగించాలని కాలేజీల తరఫు న్యాయవాదులు కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించలేదు. కాలేజీల్లో బోధనా సిబ్బంది, లేబొరేటరీలను తనిఖీ చేసే అధికారం జేఎన్టీయూదేనని ఏఐసీటీఈ తరఫు న్యాయవాది కూడా చెప్పారు. కాగా.. తమ కాలేజీల్లో లోపాలు వెతుకుతున్న జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలోని కాలేజీల్లోనే సరైన సదుపాయాలు లేవని, ఈ విషయాన్ని గుర్తించాలని కాలేజీల తరఫు సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి పేర్కొన్నపుడు.. కోర్టు హాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న కాలేజీల యజమానులు, ప్రతినిధులు చప్పట్లు కొట్టారు. దీనిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం కోర్టు ప్రతిష్టను దిగజార్చడమేనని పేర్కొంటూ.. వారందరినీ కోర్టు హాల్ నుంచి బయటకు పంపించింది.