ప్రజలు వారి సొమ్మును వారు పొందకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు?
సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదు?
మీ ఉత్తర్వులను అబయన్స్‌లో పెట్టిన తరువాత ప్రభుత్వాన్ని వివరణ కోరడం ఏమిటి?
గతంలో ఏపీలో పసుపు కుంకుమకు, అన్నదాత సుఖీభవకు,
తెలంగాణలో రైతుబంధుకు అనుమతినిచ్చారుగా?
ఇప్పుడెందుకు అమనుమతివ్వరు? ఇవీ పాత పథకాలేగా
ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగిన ఏపీ సీజే ధర్మాసనం
రిజిస్ట్రీని బెదిరించడంపై పిటిషనర్లపై మండిపడ్డ ధర్మాసనం
సాక్షి, అమరావతి: ‘హైకోర్టుకన్నా మీరే ఎక్కునుకుంటున్నారా? సంక్షేమ పథకాల నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదు’అంటూ ఎన్నికల సంఘం (ఈసీ)పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం నిప్పులు చెరిగింది. ‘2019లో పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధుల విడుదలకు అనుమతిచ్చారు. మొన్న తెలంగాణలో రైతు బంధు పథకానికి అనుమతించారు. ఇక్కడా అనుమతి కోరింది పాత పథకాలకే కదా! అప్పుడు పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవకు అనుమతిచ్చిన వాళ్లు ఇప్పుడెందుకు అనుమతి ఇవ్వరు ’అని గట్టిగా నిలదీసింది.
సంక్షేమ పథకాల అమలుకు అనుమతినిచ్చే విషయంలో ఈసీ తీరు ఆందోళన కలిగిస్తోందని, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానాన్ని అనుసరించడం ఏమిటని వ్యాఖ్యానించింది. ‘నిధుల పంపిణీకి బ్రేక్ వేస్తూ మీరు ఇచి్చన ఉత్తర్వులను సింగిల్ జడ్జి అబయన్స్‌లో పెట్టిన తరువాత కూడా నిధుల పంపిణీకి ఎన్‌వోసీ ఇవ్వకుండా తిరిగి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా వివరణ కోరతారని మండిపడింది. అసలు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలా నిధుల పంపిణీ చేయకూడదని చట్టం ఏదైనా ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘సింగిల్ జడ్జి తీర్పుపై ఎన్నికల సంఘం అప్పీల్ చేసిందా? ఎన్నికల సంఘానికి లేని అభ్యంతరం మీకెందుకు’అని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది.
సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అప్పీల్
రాష్ట్రంలోని పేదల అభ్యున్నతికి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాల్లో కొన్నింటికి నిధులు పంపిణీ చేయాల్సి ఉంది. ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో ఈ నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది. పోలింగ్ ముగిసే వరకు నిధుల పంపిణీ చేయవద్దని ఈసీ ఆదేశాలివ్వడంతో నిధుల పంపిణీ ఆగిపోయింది. ఈసీ నిర్ణయంపై పలువురు రైతులు, మహిళలు, విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి ఈనెల 10 వరకు ఈసీ ఉత్తర్వులు అమలు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటునిస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, వాటిని అమలు చేయకుండా, ఎన్‌వోసీ జారీ చేయకుండా ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరిన్ని వివరాలు కోరింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ నవతరం పార్టీ ధర్మాసనం ముందు 4 అప్పీళ్లు దాఖలు చేసింది.
సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఎలా అసాధారణం?
ఈ అప్పీళ్ల గురించి నవతరం పార్టీ తరఫు సీనియర్ న్యాయవాదుల్లో ఒకరైన నాదకర్ణి సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించారు. నిధుల పంపిణీకి అనుమతినిస్తూ సింగిల్ జడ్జి ఇచి్చన ఉత్తర్వులపై తక్షణమే స్టేటస్ కో ఇవ్వాలని కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. అందరి వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. సింగిల్ జడ్జి రాత్రి 10.35 గంటల సమయంలో అసాధారణ ఉత్తర్వులు జారీ చేశారని నాదకర్ణి అనగా.. ఎలా అసాధారణం అవుతాయని ధర్మాసనం గట్టిగా ప్రశ్నించింది. ‘సంక్షేమ పథకాల నిధులనే కదా సింగిల్ జడ్జి పంపిణీ చేయవచ్చని చెప్పింది. అందులో తప్పేముంది? ఆ పథకాలు పాతవే కదా ’అని వ్యాఖ్యానించింది.
ఇవి రాష్ట్రంలో చాలా పాపులర్ పథకాలు..
ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా, సంక్షేమ పథకాల కింద నిధుల పంపిణీకి వీల్లేదని నాదకర్ణి అన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘నియమావళి అమల్లో ఉండగా, పథకాలు అమలుకు ఈసీ అనుమతులు తప్పనిసరా? ఏ చట్టంలో ఉందో చెప్పాలి’అనగా.. నాదకర్ణి ఎన్నికల నియమావళి గురించి చెప్పడం మొదలు పెట్టారు. ధర్మాసనం కలి్పంచుకొని.. ‘ఈసీ ఏదైనా ఉత్తర్వులిస్తే కోర్టులు ఏమీ చేయకూడదంటారా? కోర్టులకన్నా ఈసీ ఎక్కువని భావిస్తున్నారా?’అంటూ నిలదీసింది. ప్రస్తుతం కోర్టు ముందున్న పథకాలు పాతవని, రాష్ట్రంలో చాలా పాపులర్ పథకాలని ధర్మాసనం గుర్తు చేసింది. తెలంగాణలో రైతుబంధుకు ఎన్నికల సంఘం అనుమతినిచి్చన విషయాన్ని ధర్మాసనం ప్రముఖంగా ప్రస్తావించింది. తెలంగాణలో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారానే నిధుల పంపిణీ జరిగిందని, ఇక్కడ మాత్రం ఎందుకు అనుమతించరని నిలదీసింది.
మా అధికారులనే బెదిరిస్తారా?
ఈ అప్పీల్ దాఖలులో నవతరం పార్టీ న్యాయవాదుల తీరుపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ‘సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హౌస్ మోషన్ పిటిషన్ వేయాలంటూ ఫోన్ చేసి మా రిజిస్ట్రీని, మా అధికారులనే బెదిరిస్తారా? తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరిస్తారా?’అంటూ గట్టిగా నిలదీసింది. ‘మీ దెబ్బకు రిజిస్ట్రీ నాకు ఫోన్ చేసింది. ఉదయాన్ని లేచి చూస్తే రిజిస్ట్రీ నుంచి నా ఫోన్‌కు మెసేజ్‌లతో పాటు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మా రిజిస్ట్రీని మీరు ఉదయం 5 గంటలకే నిద్ర లేపుతారా? అంత ఉదయాన్నే నిద్ర లేచి మీ సేవలో ఉండాలని భావిస్తున్నారా? మేము ఆ సమయంలో నిద్ర లేచి మీ పిటిషన్‌ను హౌస్‌మోషన్ రూపంలో విచారించాలని భావిస్తున్నారా’అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇంకా నయం తనకు నేరుగా ఫోన్ చేయలేదని సీజే ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఐదేళ్లుగా అమలవుతున్న పథకాలను ఎందుకు అడ్డుకుంటున్నారు?
అనంతరం ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగింది. ‘సింగిల్ జడ్జి ఉత్తర్వులపై మీరు అభ్యంతరం చెప్పలేదు. మీకు అభ్యంతరం ఉంటే మా ముందు అప్పీల్ చేసేవారు. అప్పీల్ చేయనప్పుడు సింగిల్ జడ్జి ఉత్తర్వులు అమలు చేయాలి. అప్పీల్ వేయకుండా సింగిల్ ఉత్తర్వులను అమలు చేయకుండా ఉండటం ఏమిటి? మీ తీరును ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలను వారి సొమ్ము వారు పొందకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? గత ఐదేళ్లుగా అమలవుతున్న పథకాలను ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎన్నికల బరిలో ఉన్న వారందరికీ సమాన అవకాశాలు (లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్) కల్పించేందుకే పథకాల అమలును ఆపామని మీరు చెబుతున్నారు. కానీ గతంలో పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ, రైతు బంధు పథకాలకు అనుమతినిచి్చ, ఇప్పుడు ఇక్కడ పథకాలను ఆపడం ద్వారా లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదన్న విషయాన్ని మీరే రుజువు చేశారు. ఎన్నికలు జరుగుతున్న ప్రతి రాష్ట్రంలో మీరు ఇలాగే ప్రభుత్వ పథకాలను ఆపుతున్నారా’అంటూ ఎన్నికల సంఘంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఒక్కో ప్రభుత్వం విషయంలో ఒక్కో రకంగా..
అసలు నిధుల పంపిణీ సంగతి ఏమిటని ధర్మాసనం రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. 10వ తేదీన నిధుల పంపిణీకి సింగిల్ జడ్జి అనుమతినిచి్చన విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎన్నికల సంఘానికి లేఖ ద్వారా తెలియజేశారన్నారు. నిధుల పంపిణీకి ఎన్‌వోసీ జారీ చేయాలని కోరారన్నారు. ఎన్‌వోసీ విషయాన్ని తేల్చని ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వాన్ని బడ్జెట్ కేటాయింపులు, పథకాలు అమలవుతున్న తేదీల వివరాలను అడుగుతూ సీఎస్‌కు లేఖ పంపిందని వివరించారు. ఎన్‌ఈవోసీ విషయాన్ని ఏం చేసిందో ఈసీనే అడగా లని ధర్మాసనాన్ని అభ్యరి్థంచారు. ఎన్నికల సంఘం తీరు ఒక్కో ప్రభుత్వం విషయంలో ఒక్కోరకంగా ఉంటోందన్నారు. గతంలో పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలకు అనుమతిచి్చందని, ఇందుకు పాత పథకాలన్న కారణం చెప్పిందన్నారు. ఇప్పుడు తాము కూడా పాత పథకాలనే అమలు చేస్తున్నప్పటికీ అభ్యంతరం చెబుతోందన్నారు.
ఈసీ పరిధి దాటి వ్యవహరిస్తోందా?
దీంతో ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వివరణను ధర్మాసనం కోరింది. నిధుల పంపిణీ వద్దంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో ఎక్కడా నిధులు పంపిణీ చేసుకోవచ్చని చెప్పలేదని అవినాష్ దేశాయ్ అనగా.. ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘మీ ఉత్తర్వులను సింగిల్ జడ్జి అబయన్స్‌లో పెట్టిన తరువాత ఆ ఉత్తర్వులు అమలు చేయడమే మీ పని. కానీ మీరేం చేశారు? కోర్టుకన్నా మీరు ఎక్కువని అనుకుంటున్నారా’అంటూ ప్రశ్నించింది. ‘ఈసీ ఇలాగే ప్రతి పథకాన్ని అడ్డుకోవచ్చా? అది ఈ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కావొచ్చు, వేరే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కావొచ్చు. ఈసీ పరిధి దాటి వ్యవహరిస్తోందా అన్నదే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న’అని ధర్మాసనం స్పష్టం చేసింది. తాము ఈ అప్పీళ్లపై విచారణ జరిపి, సింగిల్ జడ్జి ఉత్తర్వులను పరిశీలించి, తాము నిర్ణయించిన మేరకు ఉత్తర్వులిచి్చ, ఆ ఉత్తర్వుల కాపీ అందుబాటులోకి వచ్చేసరికి రాత్రి అవుతుందని తెలిపింది. బ్యాంకుల పని వేళలు సాయంత్రంతో ముగుస్తాయని, అలాంటప్పుడు ఈ నెల 10న నిధుల పంపిణీ ఎలా సాధ్యమవుతందని ప్రశ్నించింది. ఈ పరిస్థితుల్లో తాము ఈ అప్పీళ్లపై ఇప్పటికిప్పుడు తేల్చడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపింది.
ఎన్నికల సంఘం వల్లే నిధులు పంపిణీ చేసే పరిస్థితి లేదు
దీనిపై అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాన్ని కోరింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఈసీ అమలు చేయకపోవడం వల్ల, ఎన్‌ఈవోసీ ఇవ్వకపోవడం వల్ల నిధులు పంపిణీ చేసే పరిస్థితి లేకుండా పోయిందని ఏజీ శ్రీరామ్ వివరించారు. ఈ అప్పీళ్లను ఇప్పటికిప్పుడు తేల్చకపోయినా, ఈసీ తీరును మాత్రం ఖచి్చతంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సంఘం ఇష్టమొచ్చినట్టు వ్యవహరించవచ్చా అన్న విషయాన్ని తేల్చాలని ధర్మాసనాన్ని కోరారు. ఏజీ చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ‘14వ తేదీ నుంచి నిధులు పంపిణీ చేసుకోవచ్చని మీరు (ఎన్నికల సంఘం) చెబుతున్నారు. అప్పుడైనా నిధుల పంపిణీకి అనుమతిస్తారా లేక ఇలాగే ఆ వివరాలు, ఈ వివరాలు కావాలని అడుగుతూ వెళ్తారా’అంటూ ఎన్నికల సంఘాన్ని నిలదీసింది. అలాంటిది ఏమీ లేదని, 14 నుంచి నిధులు పంపిణీ చేసుకోవచ్చని ఈసీ న్యాయవాది అవినాష్ దేశాయ్ చెప్పారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఈసీ అనుమతి ఇవ్వని నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిధులు పంపిణీ చేసే పరిస్థితి లేదని, అందువల్ల ఈ మొత్తం వ్యవహారంలో తదుపరి ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదంటూ ఉత్తర్వులిచ్చింది. ఈ అప్పీళ్లపై తదుపరి విచారణను సెప్టెంబర్ 2న చేపడతామని ధర్మాసనం పేర్కొంది.
మోకాలడ్డింది చంద్రబాబే!
ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకోవడంలో చంద్రబాబు నక్కజిత్తులు మరోసారి బయటపడ్డాయి. నవతరం పార్టీతో పిటిషన్లు దాఖలు చేయించడం ద్వారా రైతులు, మహిళలు, విద్యార్థులకు సంక్షేమ నిధులు అందకుండా టీడీపీ అధినేత నారా చంద్రబాబు మరోమారు మోకాలడ్డారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల మేరకు వివిధ పథకాలకు సంబంధించి ప్రభుత్వం రూ.14,165 కోట్లు శుక్రవారం లబి్ధదారుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై నేరుగా కోర్టును ఆశ్రయిస్తే ప్రజల్లో ఆగ్రహావేశాలకు గురికావాల్సి వస్తుందని భయపడిన చంద్రబాబు దొడ్డిదారిని వెతుక్కున్నారు.
తనతో సన్నిహితంగా ఉండే గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన నవతరం పార్టీ అనే అనామక పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యంతో హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేయించారు. అంతేకాక ఒక్క రోజు వాదనలకు రూ.20 లక్షల వరకు వసూలు చేసే మీనాక్షి అరోరా (రామోజీరావు తరపున మార్గదర్శి కేసుల్లో హాజరయ్యే న్యాయవాది), దేవ్‌దత్ కామత్ (రాజధాని కేసులో న్యాయవాది), ఎస్.నాదకర్ణి నవతరం పార్టీ తరపున వాదనలకు దించారు. ఇంత ఖరీదైన లాయ ర్లను పెట్టుకొనే స్థోమతు ఆ పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యంకు లేదు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగినప్పటికీ, వాదనలతో సాయంత్రం అయిపోయింది. దీంతో ని ధుల విడుదలపై సింగిల్ జడ్జి ఇచి్చన గడువు ముగిసిపోయింది.
ఫలితంగా ప్రభుత్వం నగ దు విడుదల చేసినప్పటికీ లబ్ధిదారుల ఖాతా ల్లో జమ చేయలేకపోయింది. చంద్రబాబు చేసిన ఈ పాపానికి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు, లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఎన్నికల్లో రావు సుబ్రహ్మణ్యం నవతరం పార్టీకి రెండు చోట్ల గాజు గ్లాసు గుర్తు వచ్చింది. దీంతో ఆయన చంద్రబాబును కలిసి లోపాయికారీ ఒప్పందం ప్రకారం ఎన్నికల నుంచి తప్పుకున్నారు. పైగా టీడీపీ కేంద్ర కార్యాలయం కేంద్రంగా తన సంపూర్ణ మద్దతును టీడీపీకి ప్రకటించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment