ఫలించిన మూడు దశాబ్దాల న్యాయ పోరాటం  | The bench set aside the judgment of the single judge | Sakshi

ఫలించిన మూడు దశాబ్దాల న్యాయ పోరాటం 

May 30 2023 2:10 AM | Updated on May 30 2023 8:15 AM

The bench set aside the judgment of the single judge - Sakshi

సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో స్వామి హథీరాంజీ మఠానికి చెంది­న 25.36 ఎకరాలపై రక్షిత కౌలుదారులు మూడు దశాబ్దాలుగా చేస్తున్న న్యాయ పోరాటం ఫలించింది. ఈ కేసులు పెండింగ్‌లో ఉండగానే తల్లిదండ్రులు మరణించడంతో వారి పిల్లలు చట్టబద్ధ వారసులుగా న్యాయ పోరాటాన్ని కొనసాగించారు. ఫలితం అందుకున్నారు.

ఈ భూమిని సాగు చేసుకుంటున్న రక్షిత కౌలుదారులకే విక్రయించేందుకు మఠం సంరక్షకునికి అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 1990లో జారీ చేసిన జీవో 751ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చి న తీర్పును ధర్మాసనం రద్దు చేసింది. వేలంలో కాకుండా, మఠానికి పూర్తిస్థాయి సంరక్షకుడు లేకుండా భూములను విక్రయించడానికి వీల్లేదన్న సింగిల్‌ జడ్జి తీర్పును ధర్మాసనం తప్పుపట్టింది. ఆ భూముల విక్రయం ప్రతిపాదనను మ­ఠాధిపతి సర్జుదాస్‌ 1979లోనే తీసుకొచ్చారని గుర్తు చేసింది.

1957 నుంచి ఆ భూములు రక్షిత కౌలుదారుల సాగులోనే ఉన్నాయని, వాటిని వారి నుంచి స్వాదీనం చేసుకోవడం న్యాయపరంగా చాలా కష్టమని భావించడం, వివాదాలకు ఆ­స్కారం ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఆ భూములను వారికే విక్రయించడం మే­ల­ని మఠం సంరక్షకుడు చెప్పిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ మే­రకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. 

ఇదీ నేపథ్యం: హథీరాంజీ మఠానికి తిరుపతిలోని సర్వే నంబర్లు 51/1, 54/2లో ఉన్న 25.36 ఎకరాలను ఎం.చెంగమ్మ, టి.మునుస్వామి నాయుడు 1957 నుంచి రక్షిత కౌలుదారులుగా సాగు చేస్తున్నారు. ఆ తరువాత వారికి మఠం మహంత్‌ శాశ్వత లీజు మంజూరు చేశారు. మహంత్‌ మరణం తరువాత 1966లో ఆ లీజు రద్దయింది. అయినా వారు లీజు డీడ్‌ల ద్వారా కొనసాగుతున్నారు. 1980లో అప్పటి మహంత్‌ సస్పెండ్‌ అయ్యారు. మఠానికి సంరక్షకుడు నియమితులయ్యారు.

అనంతరం ఆ భూమిని కౌలుదారులకే విక్రయించాలని మఠం నిర్ణయించింది. దీనిపై వి.నాగమణి, డి.కుప్పుస్వామి నాయుడు మరికొందరు అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం ఈ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ రక్షిత కౌలుదారులకే భూమిని విక్రయించేందుకు అనుమతిస్తూ 1990లో జీవో 751 జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ నాగమణి తదితరులు హైకోర్టులో అదే ఏడాది పిటిషన్‌ వేశారు.

విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. జీవో 751ని రద్దు చేస్తూ 2002లో తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ చెంగమ్మ తదితరులు హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. అనంతరం చెంగమ్మ, ఆమె భర్త వెంకట్రామనాయుడు మరణించడంతో వారి పిల్లలు ఈ వ్యాజ్యంలో చట్టబద్ధ వారసులుగా చేరారు. ఈ అప్పీల్‌పై జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తుది విచారణ జరిపి ఇటీవల తీర్పునిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement