బదిలీ అధికారం యజమానికి ఉంది  | Sakshi
Sakshi News home page

బదిలీ అధికారం యజమానికి ఉంది 

Published Tue, Mar 26 2024 5:26 AM

Key judgment of High Court on transfer of contractual employees: Andhra Pradesh - Sakshi

కేజీబీవీల్లో కాంట్రాక్టు టీచర్ల బదిలీలు తప్పుకాదు 

ఈ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు సబబే 

రాష్ట్ర ప్రభుత్వం తన సంక్షేమ విధానంలో 

భాగంగానే వారికీ కనీస వేతన స్కేల్‌ ఇచ్చింది 

కేజీబీవీల్లో పనిచేసే కాంట్రాక్టు టీచర్లకు కనీస వేతన స్కేల్‌ అమలుచేయాల్సిందే.. కాంట్రాక్టు ఉద్యోగుల బదిలీలపై హైకోర్టు కీలక తీర్పు  

సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగుల బదిలీ విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వారిని బదిలీచేసే అధికారం సదరు యజమాని (ప్రభుత్వం)కి ఉందని స్పష్టంచేసింది. ఒప్పందంలో బదిలీ ప్రస్తావన ఉన్నప్పుడు ప్రభుత్వం వారిని బదిలీ చేయడం తప్పుకాదని తేల్చిచెప్పింది. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లను బదిలీచేస్తూ 2022లో ప్రభుత్వం జారీచేసిన జీఓ–103ను హైకోర్టు సమర్ధిం­చింది. అలాగే, కాంట్రాక్టు ఉద్యోగులు కనీస వేత­న స్కేల్‌కు అర్హులని స్పష్టంచేసింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన సంక్షేమ విధానంలో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసు­కుని వారందరికీ కనీస వేతన స్కేల్‌ను వర్తింపజేస్తూ సమగ్ర ఉత్తర్వులు జారీచేసిందని.. అందులో కేజీబీవీల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఉన్నా­రని పేర్కొంది. సవరించిన కనీస వేతన స్కేల్‌­ను కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 1–1–2022 నుంచి అమలుచేయాలని.. వారికి చెల్లించాల్సిన బకాయి­లను 12 వారాల్లో చెల్లించాలని అధికారులకు తేలి్చచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు, డాక్టర్‌ జస్టిస్‌ వక్కలగడ్డ కృపాసా­గర్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. 

సింగిల్‌ జడ్జి తీర్పుపై అప్పీళ్లు.. 
రాష్ట్ర ప్రభుత్వం తమకు కనీస వేతన స్కేల్‌ను ఖరారుచేస్తూ జారీచేసిన ఉత్తర్వులను అమలుచేసేలా అధికారులను ఆదేశించడంతో పాటు, తమను వివిధ ప్రాంతాలకు బదిలీచేస్తూ జారీచేసిన ఉత్తర్వులను చట్ట విరుద్దంగా ప్రకటించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీల్లోని కాంట్రాక్టు టీచర్లు 2022లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి డాక్టర్‌ జస్టిస్‌ కుంభజడల మన్మథరావు కాంట్రాక్టు టీచర్ల బదిలీల ఉత్తర్వుల విషయంలో జోక్యానికి నిరాకరించారు.

ఇదే సమయంలో కోర్టుకొచ్చిన టీచర్లు ఎక్కడ పనిచేస్తున్నారో వారిని అక్కడే కొనసాగించాలని.. అంతేకాక.. వారికి కనీస వేతనాలు, తదనుగుణ బకాయిలు కూడా చెల్లించాలని చెప్పారు. బదిలీల విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ కాంట్రాక్టు టీచర్లు.. కనీస వేతనాలపై ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు.  

బదిలీ అధికారం యజమానికి ఉంది
‘ఇక కాంట్రాక్టు టీచర్ల బదిలీ విషయానికొస్తే, వారిని కావాల్సిన చోటుకు బదిలీ చేయడం సబబే. నిజానికి.. 2013 నాటి కాంట్రాక్టు ఒప్పందంలో బదిలీల విషయంలో ఎలాంటి నిబంధన లేదు. దీని ఆధారంగా కాంట్రాక్టు టీచర్లు తమను బదిలీ చేయడానికి వీల్లేదంటున్నారు. అయితే, 2022లో తీసుకొచ్చిన కొత్త ఒప్పందంలో బదిలీ నిబంధన ఉంది. అందువల్ల ప్రస్తుత కేసులో కాంట్రాక్టు టీచర్ల బదిలీ ఉత్తర్వులను ఎంతమాత్రం తప్పుపట్టలేం. బదిలీల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు సమర్థనీయమే’.. అని ధర్మాసనం తన తీర్పులో స్పష్టంచేసింది.  

వారికిచ్చి వీరికివ్వకపోవడం వివక్షే.. 
వీటిపై జస్టిస్‌ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కాంట్రాక్టు టీచర్ల తరఫు న్యాయవాది ఎన్వీ సుమంత్‌ వాదనలు వినిపిస్తూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందన్నారు. ఈ తీర్పు కాంట్రాక్టు, తాత్కాలిక, అడ్‌హాక్‌ తదితర ఉద్యోగులకు వర్తిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీస వేతనాలను వర్తింపజేస్తూ జీఓ ఇచ్చిందని, అయితే అధికారులు వాటిని కాంట్రాక్టు టీచర్లకు వర్తింపచేయడం లేదన్నారు. పిటిషనర్లు కాంట్రాక్టు టీచర్లు మాత్రమేనని, వారికి ట్రాన్స్‌ఫర్లు వర్తింపజేయడానికి వీల్లేదని తెలిపారు.

కనీస వేతనాలు వర్తింపజేయకుండా బదిలీలు చేయడానికి వీల్లేదన్నారు. సర్వశిక్షాభియాన్‌ తరఫు న్యాయవాది కేవీ రఘువీర్‌ వాదనలు వినిపిస్తూ.. కేజీబీవీ, యూనివర్సిటీలు, సొసైటీలు, మోడల్‌ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులందరికీ కనీస వేతన స్కేల్‌ను వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అయితే, ఈ ఉత్తర్వులు మంజూరు చేసిన ఖాళీల కింద నియమితులైన వారికి మాత్రమే వర్తిస్తాయన్నారు. అలాగే, బదిలీ చేయాలని పలువురు కాంట్రాక్టు టీచర్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమరి్పంచారని, ఆ మేరకు వారి బదిలీ  జరిగిందన్నారు.

ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కనీస వేతనాల విషయంలో ఎన్వీ సుమంత్‌ వాదనలతో ఏకీభవిస్తూ ఇటీవల తీర్పు వెలువరించింది. అంతేకాక.. ‘తమకు కనీస వేతన స్కేల్‌ ఉత్తర్వులను వర్తింపజేయాలన్న కాంట్రాక్టు టీచర్ల అభ్యర్థన సబబైనదే. సమాన పనికి సమాన వేతనం చెల్లించకపోవడం అన్నది దోపిడీ, బానిసత్వం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తన సంక్షేమ విధానంలో భాగంగానే కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకునే వారికి కనీస వేతన స్కేల్‌ను అమలుచేస్తూ ఉత్తర్వులిచ్చింది. అధికారులు ఆ స్కేల్‌ను వర్తింపజేయకపోవడం ఏకపక్షం. కనీస వేతనాల విషయంలో సింగిల్‌ జడ్జి తీర్పును ఏ రకంగానూ విమర్శించాల్సిన అవసరంలేదు’.. అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement