మధ్యంతర ముందస్తు బెయిలు పొడిగింపు
హైకోర్టు ఉత్తర్వులు
సాక్షి, అమరావతి : పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఈ వ్యాజ్యాల్లో తీర్పు వెలువరించే వరకు పొడిగిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగఢ మల్లికార్జునరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన వెంటనే పోలీసులు ఆయనపై రెండు హత్యాయత్నం కేసులతో సహా మూడు కేసులు నమోదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పిన్నెల్లి పాల్గొనకుండా పెట్టిన ఈ తప్పుడు కేసులపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు.
ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు.. కౌంటింగ్‌లో పాల్గొనేందుకు పిన్నెల్లికి ఈ నెల 6వ తేదీ వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తరువాత ఈ ఉత్తర్వులను పొడిగిస్తూ వచ్చింది. గురువారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి.
పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టించారు.. తీవ్రంగా పరిగణించండి
ఈ సందర్భంగా పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎన్నికల సంఘం, పోలీసుల తీరును ఎండగట్టారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి తీరాలన్న లక్ష్యంతో ఎన్నికల కమిషన్ అసాధారణ రీతిలో ఉత్తర్వులిచ్చిందని, గతంలో ఎన్నడూ కమిషన్ ఇలా వ్యవహరించలేదని అన్నారు. పోలీసులు పరిధి దాటి వ్యవహరించారన్నారు. తప్పుడు వివరాలతో కోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని తెలిపారు.
ఈవీఎం కేసులో పిన్నెల్లికి హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వనున్నట్లు సంకేతాలు రావడంతో ఆ వెంటనే హత్యాయత్నం కేసులు బనాయించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారన్నారు. గత నెల 22న హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వగా, 23న ఇతర కేసుల్లో పిన్నెల్లిని నిందితునిగా చేర్చారని తెలిపారు. హైకోర్టుకు మాత్రం 22నే చేసినట్లు చెప్పారని, తరువాత ఇది అబద్ధమని తేలడంతో 23నే నిందితునిగా చేర్చినట్లు పోలీసులు అంగీకరించక తప్పలేదన్నారు.
ఇదే విషయాన్ని హైకోర్టు సైతం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొందని తెలిపారు. పోలీసుల తీరును తీవ్రంగా పరిగణించాలన్నారు. హత్యాయత్నం చేశారని చెప్పినంత మాత్రాన ఆ సెక్షన్ కింద కేసు నమోదుకు వీల్లేదని, అందుకు నిర్దిష్ట విధానం ఉందని వివరించారు. సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిన్నెల్లిపై పెట్టిన మరో కేసు చెల్లదని చెప్పారు.
నేర చరిత్రను పరిగణనలోకి తీసుకోండి
పోలీసుల తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం కేసు నమోదు చేశామని తెలిపారు. 2019లో కూడా ఇదే తరహా కేసు నమోదైందన్నారు. మధ్యంతర ముందుస్తు బెయిల్ షరతులను పిన్నెల్లి ఉల్లంఘించారని, సాక్షులను బెదిరించారని తెలిపారు.
పిన్నెల్లి, అతని అనుచరుల దాడిలో కారెంపూడి సీఐ నారాయణస్వామి తీవ్రంగా గాయపడ్డారన్నారు. పిటిషనర్ నేర చరిత్రను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. బాధితుల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకునేందుకు వచ్చిన శేషగిరిరావు, ప్రశ్నించిన మరో మహిళపై పిన్నెల్లి, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారన్నారు.
అశ్వనీ కుమార్ నియామకం చట్ట విరుద్ధం
అనంతరం పిన్నెల్లి న్యాయవాది నిరంజన్‌రెడ్డి పోలీసుల తరఫున అశ్వనీ కుమార్ హాజరు కావడంపై అభ్యంతరం తెలిపారు. ఆయన నియామకం సీఆర్‌పీసీ నిబంధనలకు అనుగుణంగా జరగలేదన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం గురించే నిబంధనల్లో ఉంది తప్ప, స్పెషల్ కౌన్సిల్ గురించి లేదన్నారు. తప్పును సరిచేసుకుని చట్ట ప్రకారం ఆయన్ను నియమించుకుంటే అభ్యంతరం లేదన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment