
కాకినాడ సీ పోర్ట్ వాటాల బదిలీ కేసులో హైకోర్టు ఊరట
వాటాల బదిలీపై నాలుగున్నరేళ్ల తరువాత కేవీ రావు ఫిర్యాదు చేశారు
ఇంత జాప్యానికి ఆయన సంతృప్తికర వివరణ ఇవ్వలేదు
బెదిరించి ఉంటే కోర్టులో ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
ఫిర్యాదుకు ముందే పోలీసులు ప్రాథమిక విచారణ ఎలా చేస్తారు?
ఆడిట్ రిపోర్ట్‌ను ఆడిట్ కంపెనీనే తయారు చేసిందని కేవీ రావే చెబుతున్నారు
అలాంటప్పుడు ఆ నివేదికను విక్రాంత్‌రెడ్డి ఎలా ఫోర్జరీ చేస్తారు?
తీర్పులో పేర్కొన్న హైకోర్టు
సాక్షి, అమరావతి: కాకినాడ సీ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో యర్రంరెడ్డి విక్రాంత్‌రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని, కేసుతో సంబంధం ఉన్న ఏ వ్యక్తినీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రలోభపెట్టడం, భయపెట్టడం చేయరాదని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం తీర్పు వెలువరించారు.
తనను బెదిరించి పోర్టులో వాటాలను అరబిందో సంస్థ కొనుగోలు చేసిందంటూ సీఎం చంద్రబాబు సన్నిహితుడు, పోర్టు ప్రమోటర్ కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ విక్రాంత్‌రెడ్డి డిసెంబర్‌లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విక్రాంత్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, కేవీ రావు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు సుదీర్ఘ వాదనలు వినిపించారు. అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరించారు.
నాలుగున్నరేళ్ల తర్వాత ఫిర్యాదా?
‘నాలుగున్నరేళ్ల క్రితం ఘటన జరిగితే ఇప్పుడు ఫిర్యాదు చేశారు. ఈ ఆలస్యంపై ఫిర్యాదుదారు కేవీ రావు నుంచి సంతృప్తికర సమాధానం రాలేదు. జాప్యానికి బెదిరింపులే కారణమని, ప్రభుత్వం మారడంతో ఫిర్యాదు చేశానంటూ ఆయన చేసిన వాదన ఆమోదయోగ్యం కాదు. అయన్ని బెదిరించి ఉంటే, కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు ఎందుకు దాఖలు చేయలేదో వివరణ లేదు. కేవీ రావును బెదిరించడం వల్లే ఆయన వాటాలను నామమాత్రపు ధరకు అరబిందో రియాలిటీకి బదిలీ చేశారన్నదే పిటిషనర్ విక్రాంత్‌రెడ్డిపై ఉన్న ప్రధాన నేరారోపణ.
పీకేఎఫ్ శ్రీధర్ సంతానం ఆడిట్ సంస్థతో విక్రాంత్ కుమ్మక్కయి ఆడిట్ రిపోర్ట్‌లో సంఖ్యలను పెంచి చూపారని, దీన్ని అడ్డంపెట్టుకునే కేవీ రావును బెదిరించారని ఆరోపిస్తున్నారు. ఆడిట్ సంస్థతో కలిసి విక్రాంత్‌రెడ్డి సంఖ్యలను పెంచి చూపారనేందుకు ప్రాథమిక ఆధారాలు లేవు. దీనిద్వారా విక్రాంత్ లబ్ధి పొందారని సీఐడీ కూడా చెప్పడంలేదు. ఎఫ్‌ఐఆర్‌లోనూ ఆడిట్ కంపెనీని విక్రాంత్ కలిసినట్లు లేదు. అంతేకాక అరబిందో కొన్న వాటాల ద్వారా విక్రాంత్‌రెడ్డి ఆర్థికంగా లబ్ధి పొందినట్లు ఎలాంటి ఆరోపణలు లేవు.
రిపోర్ట్‌ను ఆడిట్ సంస్థే తయారు చేసిందని కేవీ రావే అంగీకరిస్తున్నారు. అలాంటప్పుడు ఈ నివేదిక విషయంలో విక్రాంత్‌పై నేరారోపణలు చేయడానికి వీల్లేదు. దానిని విక్రాంత్‌రెడ్డి ఫోర్జరీ చేశారన్న ప్రశ్నే తలెత్తదు. ఫోర్జరీ చేశారని సీఐడీ, ఫిర్యాదుదారు కూడా చెప్పడం లేదు. విక్రాంత్‌రెడ్డి ఆ నివేదికను తారుమారు చేయడం, మార్చడం, మోసపూరితంగా సంపాదించడం చేయలేదు. అందువల్ల ఆయనకు సెక్షన్ 464 వర్తించదు’ అని జస్టిస్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
ఫిర్యాదు లేకుండానే ప్రాథమిక విచారణ జరపడమా!
‘2024 సెపె్టంబర్‌లో తామిచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారని కేవీ రావు చెబుతున్నారు. ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలిస్తే.. 2024 డిసెంబరు 2న కేవీ రావు ఫిర్యాదు చేశారు. అంటే అంతకు ముందు ఎలాంటి ఫిర్యాదు లేదు. ఫిర్యాదు లేకుండానే పోలీసులు ఎలా ప్రాథమిక విచారణ జరిపారో తెలియడంలేదు.
నాలుగున్నరేళ్ల జాప్యంతో ఫిర్యాదు చేసినప్పుడు, పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి తీరాలి. కానీ, ఇక్కడ ఫిర్యాదు ఇవ్వకపోయినా పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు. దీనినిబట్టి పోలీసులు దర్యాప్తును ఏ తీరున సాగించారన్న దానిపై ఎలాంటి సందేహం అక్కర్లేదు’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.