షోకాజ్ నోటీసిచ్చి నిష్పాక్షికంగా విచారణ జరపాలి
క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉండటం విధుల నిర్వహణకు అడ్డంకి కాదు
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ కీలక తీర్పు
సాక్షి, అమరావతి: క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన ఓ ఉద్యోగిని నేరుగా ఉద్యోగం నుంచి తీసేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. నేరం నిరూపణ అయ్యేంతవరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నిర్దోషే అని.. దీనిని అధికారులు విస్మరించకూడదని గుర్తు చేసింది. క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉండటం ఆ ఉద్యోగి తన అధికారిక విధులను నిర్వర్తించడానికి ఎంతమాత్రం అడ్డంకి కాదని తేల్చిచెప్పింది.
క్రిమినల్ కేసు ఉన్నప్పుడు ఉద్యోగంలోంచి తీసేయాలంటే.. ముందుగా ఆ ఉద్యోగికి షోకాజ్ నోటీసు ఇవ్వడం, విచారణ జరపడం అధికారుల బాధ్యత అని తెలిపింది. నోటీసు ఇవ్వకుండా, విచారణ జరపకుండా ఉద్యోగం నుంచి తొలగించేంత భారీ శిక్ష విధించడం చట్టప్రకారం చెల్లదని స్పష్టం చేసింది. అలాంటి శిక్ష రద్దవుతుందని తేల్చి చెప్పింది. అంగన్‌వాడీ వర్కర్‌గా పనిచేస్తున్న ఓ మహిళను ఏసీబీ కేసు నెపంతో నేరుగా ఉద్యోగం నుంచి తొలగించడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. సదరు మహిళను ఉద్యోగం నుంచి తొలగిస్తూ అధికారులు జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసింది.
ఇదీ కేసు
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామానికి చెందిన కె.ధనలక్ష్మి 1998లో అంగన్‌వాడీ కార్యకర్తగా నియమితులయ్యారు. ఆ తరువాత కాంట్రాక్ట్ పద్ధతిలో సూపర్వైజర్ గ్రేడ్–2 పోస్టుకు ఆమెను ఎంపిక చేశారు. కాగా.. 2008 డిసెంబర్ 11న ఏసీబీ అధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే.. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు డిసెంబర్ 14న అధికారులు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. తనను ఏకపక్షంగా తొలగించారంటూ ఆమె 2009లో హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ జరిపిన హైకోర్టు ధనలక్ష్మిని అంగన్‌వాడీ వర్కర్‌గా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో ధనలక్ష్మి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తీవ్రంగా స్పందించడంతో విధిలేని పరిస్థితుల్లో 2010లో ఆమెను విధుల్లోకి తీసుకున్నారు. తమపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారన్న ఉద్దేశంతో అధికారులు ధనలక్ష్మిని ఏసీబీ కేసును సాకుగా చూపి ఉద్యోగం నుంచి తొలగిస్తూ 2011లో ప్రొసీడింగ్స్ ఇచ్చారు.
వీటిని సవాల్ చేస్తూ ఆమె అదే ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది అంబటి శ్రీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అధికారులు కావాలనే ఆమెను తప్పుడు కేసులో ఇరికించారన్నారు. ఈ విషయం నిరూపణ కావడంతో 2016లో ఏసీబీ కోర్టు ధనలక్ష్మిని నిర్దోషిగా ప్రకటించి.. కేసు కొట్టేసిందని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ పైన పేర్కొన్న వ్యాఖ్యలు చేస్తూ రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించారు.
ధనలక్ష్మిని నాలుగు వారాల్లో తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆమె అన్ని రకాల సర్వీసు ప్రయోజనాలకు అర్హురాలని, చెల్లించాల్సిన మొత్తంలో 50 శాతం మొత్తాన్ని నాలుగు వారాల్లో చెల్లించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment