Harinath
-
కేసు ఉన్నా.. ఉద్యోగం తొలగించరాదు
సాక్షి, అమరావతి: క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన ఓ ఉద్యోగిని నేరుగా ఉద్యోగం నుంచి తీసేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. నేరం నిరూపణ అయ్యేంతవరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నిర్దోషే అని.. దీనిని అధికారులు విస్మరించకూడదని గుర్తు చేసింది. క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉండటం ఆ ఉద్యోగి తన అధికారిక విధులను నిర్వర్తించడానికి ఎంతమాత్రం అడ్డంకి కాదని తేల్చిచెప్పింది. క్రిమినల్ కేసు ఉన్నప్పుడు ఉద్యోగంలోంచి తీసేయాలంటే.. ముందుగా ఆ ఉద్యోగికి షోకాజ్ నోటీసు ఇవ్వడం, విచారణ జరపడం అధికారుల బాధ్యత అని తెలిపింది. నోటీసు ఇవ్వకుండా, విచారణ జరపకుండా ఉద్యోగం నుంచి తొలగించేంత భారీ శిక్ష విధించడం చట్టప్రకారం చెల్లదని స్పష్టం చేసింది. అలాంటి శిక్ష రద్దవుతుందని తేల్చి చెప్పింది. అంగన్వాడీ వర్కర్‌గా పనిచేస్తున్న ఓ మహిళను ఏసీబీ కేసు నెపంతో నేరుగా ఉద్యోగం నుంచి తొలగించడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. సదరు మహిళను ఉద్యోగం నుంచి తొలగిస్తూ అధికారులు జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసింది. ఇదీ కేసుపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామానికి చెందిన కె.ధనలక్ష్మి 1998లో అంగన్వాడీ కార్యకర్తగా నియమితులయ్యారు. ఆ తరువాత కాంట్రాక్ట్ పద్ధతిలో సూపర్వైజర్ గ్రేడ్–2 పోస్టుకు ఆమెను ఎంపిక చేశారు. కాగా.. 2008 డిసెంబర్ 11న ఏసీబీ అధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే.. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు డిసెంబర్ 14న అధికారులు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. తనను ఏకపక్షంగా తొలగించారంటూ ఆమె 2009లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ధనలక్ష్మిని అంగన్వాడీ వర్కర్‌గా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో ధనలక్ష్మి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తీవ్రంగా స్పందించడంతో విధిలేని పరిస్థితుల్లో 2010లో ఆమెను విధుల్లోకి తీసుకున్నారు. తమపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారన్న ఉద్దేశంతో అధికారులు ధనలక్ష్మిని ఏసీబీ కేసును సాకుగా చూపి ఉద్యోగం నుంచి తొలగిస్తూ 2011లో ప్రొసీడింగ్స్ ఇచ్చారు. వీటిని సవాల్ చేస్తూ ఆమె అదే ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది అంబటి శ్రీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అధికారులు కావాలనే ఆమెను తప్పుడు కేసులో ఇరికించారన్నారు. ఈ విషయం నిరూపణ కావడంతో 2016లో ఏసీబీ కోర్టు ధనలక్ష్మిని నిర్దోషిగా ప్రకటించి.. కేసు కొట్టేసిందని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ పైన పేర్కొన్న వ్యాఖ్యలు చేస్తూ రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. ధనలక్ష్మిని నాలుగు వారాల్లో తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆమె అన్ని రకాల సర్వీసు ప్రయోజనాలకు అర్హురాలని, చెల్లించాల్సిన మొత్తంలో 50 శాతం మొత్తాన్ని నాలుగు వారాల్లో చెల్లించాలని సూచించారు. -
కొత్త నేరచట్టాలపై ఉద్యమించాలి!
పార్లమెంట్‌ను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగం, లోక్‌సభలో స్పీకర్ వ్యవహార శైలి, జూలై 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త నేర చట్టాలు వంటి వాటిని గమనిస్తే 50 ఏళ్ల నాటి ఎమర్జెన్సీ చీకటి రోజులు మళ్లీ రాబోతున్నాయనిపిస్తోంది. ముఖ్యంగా కొత్త క్రిమినల్ చట్టాలు ప్రజాస్వామికవాదులనూ, పౌరహక్కుల కార్యకర్తలనూ ఉక్కుపాదంతో అణచేలా ఉన్నాయి.గుజరాత్ నమూనా అంటూ ఊదరగొట్టిన మోదీ– అమిత్ షాలు దశాబ్ద కాలంగా చేస్తున్న నరమేధపు రక్తపు మరకలను ఎమర్జెన్సీ బూచి చూపి తుడిచి వేయలేరు. బిల్కిస్ బానో కేసులో ముద్దాయిలను స్వాగత సత్కారాలతో విడుదల చేయటం, డేరా బాబా లాంటి వారికి పెరోల్ ఇవ్వటం, గోవింద్ పాన్స్రే, స్టాన్ స్వామి లాంటి వారి ప్రాణాలను హరించి, ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వారిని ఆరు సంవత్సరాలు నేరం నిరూపణ కాకుండానే నిర్బంధించటం, వరవరరావు, సుధా భరద్వాజ్‌లను అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో ఎట్టకేలకు విడుదల చేయటం... వంటివన్నీ మోదీ పాలన ఎంత అమానవీయంగా, అన్యాయంగా సాగుతున్నదో తెలిపే కొన్ని ఉదాహరణలు మాత్రమే.ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఉపా, దేశ ద్రోహం, మనీ లాండరింగ్ చట్టాలను రాజ్యాంగ విరుద్ధంగా సవరించారు. డా‘‘ నరేంద్ర దాభోల్కర్, కామ్రేడ్ గోవింద్, ప్రొఫెసర్ ఎమ్ఎమ్ కల్బుర్గి, గౌరీ లంకేశ్ ప్రాణాలను బలిగొన్నారు. ఇటువంటి తరుణంలో అమలులోకి తెచ్చిన కొత్త నేర చట్టాలు పోలీసులకు అపరిమిత అధికారాలను దఖలు పరుస్తున్నాయి.కేసులు నమోదు చేయడంలో వారికి హద్దూ అదుపూ లేకుండా చేస్తున్న ఈ చట్టాలు మానవహక్కుల కార్యకర్తలూ, రాజకీయ కార్యకర్తల మనుగడనే కాదు, సామాన్యుల బతుకులనూ ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కాబట్టి ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకునేలా ప్రజలు ఉద్యమించాలి. – దినవహి హరినాథ్, సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు -
నమ్మకాన్ని వమ్ము చేయొద్దు!
పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్డీఏకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. మోదీ హవా లేదనేది స్పష్టమైంది. ‘భారతదేశాన్ని రక్షించండి! ప్రజాస్వామ్యాన్ని కాపాడండి!’ అని దేశవ్యాప్తంగా ‘ఇండియా’ కూటమి, దాని భాగస్వామ్య పార్టీలు, సోషల్ మీడియా మేధావులు, అనేకమంది జర్నలిస్టులు చేసిన కృషి, ప్రజల స్పందన ద్వారా భారతదేశ లౌకిక సమాఖ్య స్ఫూర్తి కాపాడ బడింది. 400 సీట్లకు పైగా సాధించాలన్న బీజేపీ కల నెరవేరలేదు. ఎన్డీఏ 293 సీట్లతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. ‘ఇండియా’ కూటమి తన బలాన్ని పెంచుకొని 233 సీట్లు పొందగలిగింది.రామ జపం చేసిన అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోయింది. యూపీలో అధికారంలో ఉండి కూడా కేవలం 37 సీట్లకే పరిమితమైంది. ‘ఇండియా’ కూటమి 43 స్థానాలు కైవసం చేసుకుంది. మహారాష్ట్రలో శివసేన కూటమిని విచ్ఛిన్నం చేసినందుకు ఎన్డీఏను ప్రజలు తిరస్కరించారు. 30 సీట్లు గెలుచుకొని ‘ఇండియా’ కూటమి బీజేపీని నివ్వెరపరిచింది. బెంగాల్లో మమతా బెనర్జీ తన పట్టు నిలబెట్టుకుంది. దక్షిణాదిన బలం పెంచుకోవాలని చూసిన బీజేపీ తమిళనాడులో ఒక్క సీటూ గెలవలేదు. కేరళలో ఒక్క స్థానం పొందింది. కర్ణాటకలో ఎనిమిది స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది.ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ– జనసేనలతో కలిసి 21 స్థానాలు గెలుచుకుంది. తెలంగాణలో కేసీఆర్ వైఫల్యం బీజేపీకి అనుకూలించింది. జాతీయ రాజకీయాల్లో నేషనల్ ఫ్రంట్ పెట్టి ఆనాడు ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. నేడు మతోన్మాద ఎన్డీఏ పాలన మైనారిటీల పైనా, దళితులపైనా దాడులు కొనసాగిస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కల్పిస్తున్న విధానాలను చంద్రబాబు సమీక్ష చేసుకొని ఎన్డీఏ భాగస్వామ్యం విషయంలో పునరాలోచన చేయాలి. భారతదేశ లౌకిక ఫెడరల్ స్ఫూర్తిని కాపాడాల్సిన చారిత్రక కర్తవ్యం చంద్రబాబుపై ఉంది. బిహార్‌లో నితీష్ కుమార్ సైతం ఎన్డీఏ కూటమి నుండి వేరుపడకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రజల తీర్పును గౌరవించి ఫాసిస్ట్ శక్తులను మూడోసారి అధికార పీఠం ఎక్కకుండా నిరోధించాలి. – దినవహి హరినాథ్ -
మొక్కలంటే వ్యసనం.. ఓ ప్రకృతి ప్రేమికుడి కథ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన హరినాథ్ గత పదేళ్లుగా మొక్కల పెంపకమే లోకంగా బతుకుతున్నాడు. ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లి రోడ్లు, అడవులవెంట తిరుగుతూ విత్తనాలు చల్లడమే ఆయన పని. ఆరు పదుల వయసులో అలుపెరగకుండా అడవుల పెంపకమే లక్ష్యంగా శ్రమిస్తున్న ఆయన ఈ పనికి దిగడం వెనుక ఆసక్తికరమైన కథ దాగుంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం హరినాథ్ తల్లిదండ్రులు కష్టపడటంతో పాల్వంచ సమీపాన జగన్నాథపురంలో ఆ కుటుంబానికి 1970వ దశకంలో 50 ఎకరాలకు పైగా భూమి సొంతమైంది. చదువు కోసం పాల్వంచలోని కేటీపీఎస్ స్కూల్‌కు రోజూ నడిచి వెళ్లే హరినాథ్ ఆకాశం కనిపించకుండా పెరిగిన చెట్లు, వాటి మధ్యన తిరిగే పక్షులు, పాములు, వన్యప్రాణులను చూస్తుండేవాడు. అయితే హరినాథ్ ఎస్సెస్సీ, ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలోకి అడుగుపెట్టగానే విలాసాలు దరిచేరాయి. చదువు పూర్తయి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లో ఉద్యోగిగా పనిచేసిన ఆయన జూదం, తాగుడులాంటి వ్యసనాల్లో చిక్కుకుపోయారు. యాభై ఏళ్లు దాటినా బయటపడలేకపోయారు. దీంతో భూమి హరించుకుపోగా రూ.30 లక్షల అప్పు మిగిలింది. వనజీవి రామయ్య స్ఫూర్తితో.. కేటీపీఎస్ ఉద్యోగిగా కెరీర్ చివరి దశలో ఉన్నప్పుడు 2013లో విలాసాలు, వ్యసనాలపై వైరాగ్యం ఏర్పడింది. దీంతో ఏం చేయాలో తెలియని స్థితికి చేరుకోగా టీవీలో పద్మశ్రీ వనజీవి రామయ్య జీవితంపై వచ్చిన కథనం హరినాథ్‌ను ఆకట్టుకుంది. దట్టమైన అడవి మీదుగా స్కూల్‌కు వెళ్లిన రోజులు గుర్తుకురాగా.. ప్రస్తుతం పాల్వంచ – కొత్తగూడెం పరిసర ప్రాంతాలు కాంక్రీట్ జంగిల్‌గా మారడం కళ్లెదుట కనిపించింది. దీంతో వనజీవి మార్గంలో నడవాలనే నిర్ణయానికి రాగా, కొత్తగూడెంకు చెందిన మొక్కల వెంకటయ్య తదితరులు పరిచయమయ్యారు. అలా పదేళ్లుగా పాల్వంచ – కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో పచ్చదనం పెంపే లక్ష్యంగా హరినాథ్ గడుపుతున్నాడు. మొక్కల పెంపకమే లక్ష్యంగా... ఏటా మార్చి నుంచి జూన్ వరకు 40 రకాల చెట్ల విత్తనాలను సేకరిస్తాడు. ఆ విత్తనాలను జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అడవుల్లో చల్లుతాడు. పాల్వంచ, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి, సుజాతనగర్ మండలాల పరి ధి రోడ్లు, అడవులు, కార్యాలయాలు.. ఖాళీ స్థలం కనిపి స్తే చాలు ఔషధాలు, పండ్లు, నీడనిచ్చే నలభై రకాల మొ క్కల విత్తనాలు చల్లుతున్నాడు. పండ్లను కోతులు, పక్షు లు తింటున్నప్పుడు కలిగే సంతోషం తనకు జీవితంలో ఎప్పుడూ కలగలేదని హరినాథ్ చెబుతుంటాడు. 2016 లో ఉద్యోగ విరమణ చేశాక వచ్చే పెన్షన్ నుంచే మొక్కల పెంపకానికి ఖర్చు భరిస్తున్నాడు. పదేళ్ల క్రితం హరినాథ్ మొలుపెట్టిన పయనానికి ఇప్పుడు మరో ఇరవై మంది సాయంగా ఉంటున్నారు. మరో ఏడు జిల్లాల నుంచి వనప్రేమికులు విత్తనాలు తీసుకెళ్తుంటారు. మొక్కలపై అవగాహన పెంచండి పదేళ్లుగా లక్షలకొద్దీ విత్తనాలు చల్లుతున్నాను. పశువుల కాపర్ల అత్యుత్సాహంతో చెట్లు చనిపోతున్నాయి. మొక్కల సంరక్షణపై పశువుల కాపర్లకు అవగాహన కలి్పస్తే మంచిది. నాకు ముగ్గురు ఆడపిల్లలు. నేను వ్యసనాల్లో మునిగిపోయినప్పుడు వాళ్ల బాగోగులు మా ఆవిడే చూసు కుంది. వ్యసనాల నుంచి బయటకు వచ్చాక ప్రకృతి రక్ష ణ, అడవుల పెంప కంపై ధ్యాస పె ట్టా. నా సహకారం లేకున్నా ముగ్గురు పిల్లలు చదువు పూ ర్తి చేసి అమెరికాలో స్థిరపడ్డారు. ఇది ప్రకృతి నాకు తిరిగి ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నా. –హరినాథ్ -
మనోధర్మం కోసమే సినిమాలు
‘‘వృత్తిధర్మం కోసం డాక్టర్‌గా చేస్తున్నాను. మనోధర్మం కోసం సినిమాల్లో నటిస్తున్నాను. కేవలం డబ్బు వల్లే అన్ని విషయాలూ సాధించలేం’’ అని దర్శక–నిర్మాత హరినాథ్ పొలిచర్ల అన్నారు. ఆయన టైటిల్ రోల్లో రూపొందిన చిత్రం ‘కెప్టెన్ రాణాప్రతాప్’. హరినాథ్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా హరినాథ్ చెప్పిన విశేషాలు. ► మిలిటరీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. రానా ప్రతాప్ పాత్రలో నేను నటించాను. ఓ కోవర్టు అపరేషన్ కోసం రానా ప్రతాప్ పాకిస్తాన్ వెళ్తాడు. అక్కడికి వెళ్లి రానా ప్రతాప్ ఆ ఆపరేషన్‌ను ఎలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారన్నదే కథ. మా సినిమాకి, అభినందన్ వర్తమాన్ (భారతీయ సైనికుడు) సంఘటనకూ సంబంధం లేదు. రెండేళ్ల క్రితమే ఈ కథ రాసుకున్నా. ► చిన్నతనం నుంచే నాకు నటనపై ఆసక్తి ఉంది. స్టేజ్ ఆర్టిస్ట్‌ని కూడా. సినిమాలు చేస్తూనే ఉన్నాను. ‘చంద్రహాస్’ సినిమా టైమ్‌లో నేను పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తానని... ఆ చిత్రదర్శకుడు శివదత్తా (ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి) గారు నాకు మంచి కాంప్లి్లమెంట్ కూడా ఇచ్చారు. ‘కెప్టెన్ రాణాప్రతాప్’ సినిమాకు హీరోగా నేనైతే న్యాయం చేయగలనని నాకు అనిపించింది. అందుకే నేనే నటించాను. నా విజన్‌ను స్క్రీన్‌పై చూపించడానికి సులువు అవుతుందని నేనే ఈ సినిమాకు దర్శకుడిగా మారాను. ఈ సినిమా రిలీజ్‌కు మైత్రీ మూవీ మేకర్స్ సహకరించింది. ► ఇందులో దాదాపు గంటకు పైగా యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. మార్షల్ ఆర్ట్స్‌లో నాకు ప్రవేశం ఉండటంతో యాక్షన్ సీక్వెన్స్ చేయడం నాకు ప్రాబ్లమ్ అనిపించలేదు. అలాగే ఈ సినిమాలో సైనికుల కుటుంబాల సమస్యలను కూడా ప్రస్తావించాం. మహిళా సాధికారిత అంశాన్ని కూడా టచ్ చేశాం. ఇందుకోసం కొందరి సైనికుల కుటుంబాలతో మాట్లాడటం జరిగింది. సుమన్‌గారు గ్రేట్ యాక్టర్ ఆయన ఈ సినిమాలో మేజర్‌గా నటించారు. ► ఈ సినిమా తర్వాత రజాకార్ల కాలంలో పోరాడిన ఓ కుటుంబం నేపథ్యంలో ఓ సినిమా చేయబోతున్నాను. ఇది పీరియాడికల్ మూవీ కాబట్టి నేను దర్శకత్వం వహించాలనుకోవడం లేదు. -
పేదరికాన్ని జయించి.. లక్ష్యాన్ని చేరుకుని..
పలమనేరు: అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు ఓ గ్రామీణ యువకుడు. తల్లిదండ్రుల కష్టాలను చూసి కష్టపడి చదివి ఎస్ఐగా ఎంపికయ్యాడు. పలమనేరులోని పెద్దపంజాణి మండలం గోనుమాకులపల్లికి చెందిన వెంకటేష్, ముత్యాలమ్మల కుమారుడు తోటి హరినాథ్ గత ఏడాది ఎస్ఐగా ఎంపికయ్యాడు. అనంతపురంలోని పోలీసు శిక్షణకేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకుని రెండ్రోజుల క్రితం ఉపముఖ్యమంత్రి నుంచి నియామక పత్రం అందుకున్నారు. గురువారం గ్రామానికి చేరుకున్న అతనికి గ్రామస్తుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. హరినాథ్ మాట్లాడుతూ తాను ఈ స్థాయికి రావడానికి తన తల్లే కారణమన్నాడు. కూలిపనులు చేసి తనను చదివించిందన్నారు. ఆమె ఆశయాన్ని నిలబెట్టడమే ధ్యేయంగా తాను కష్టపడ్డానన్నారు. ప్రజలకు ఉత్తమ సేవలను అందించి బాధితులకు న్యాయం జరిగేలా కృషిచేస్తానని హరినాథ్ పేర్కొన్నాడు. -
బుల్లితెర పోలీస్
బెళుగుప్ప: బుల్లితెర సీరియల్స్, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు బెళుగుప్పకు చెందిన రాచర్ల హరినాథ్ గుప్తా. రైతు, ధాన్యం వ్యాపారి రాచర్ల కోటేశ్వరప్ప పెద్ద కుమారుడు హరినాథ్‌గుప్తా టీవీ సీరియల్స్‌లో ఎస్సై, కానిస్టేబుల్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. న్యాయవాది, ఎమ్మెల్యే తదితర పాత్రల్లోనూ తన అభినయాన్ని ప్రదర్శిస్తున్నాడు. హరినాథ్ గుప్తా తన మిత్ర బృందంతో కలిసి 1983లో గ్రామంలో ఒక వీధి నాటకం ప్రదర్శించారు. ఆ నాటకంలో ఎస్సైగా హరినాథ్ గుప్తా అభినయం అందరినీ ఆకట్టుకుంది. అప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన 2013లో హైదరాబాద్‌కు మకాం మార్చాడు. అక్కడ జరిగే అనేక ఆడిషన్స్‌లో పాల్గొన్నాడు. 2014లో తొలిసారిగా ‘ఈజీ మనీ’ అనే సినిమాలో కృష్ణభగవాన్, రాకెట్ రాఘవల కాంబినేషన్లో నటించే అవకాశం వచ్చింది. నటించిన సినిమాలు, సీరియళ్లు.. ఆడదేఆధారం, జాబిలమ్మ, మిస్సమ్మ, సౌభాగ్యవతి, కాంచనగంగ, స్వాతిచినుకులు, అగ్నిపూలు, శ్రావణ సమీరాలు, కెరటాలు తదితర 15 సీరియళ్లలో హరినాథ్‌గుప్తా నటించారు. వీటిలో కెరటాలు సీరియల్లో రాజుపాలెం ఎస్సై పాత్ర మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. పడ్డానండి ప్రేమలో మరి, ఊపిరి, శౌర్య, సింగం 123, భంభంబోలేనాథ్, వైరస్, మెంటల్ కృష్ణ తదితర సినిమాలలో నటించారు. ప్రస్తుతం విడుదల కానున్న ఆక్సిజన్, రూల్, కార్తీకా సినిమాలలోనూ నటించారు. రూల్ సినిమాలో ఎమ్మెల్యే పాత్ర పోషించారు. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలి నటనారంగంలో అవకాశాలు రావడమే కష్టం. వచ్చిన ఎలాంటి అవకాశాన్నీ వదులుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి. అనంత జిల్లా వాసిగా నటనా రంగంలో రాణిస్తున్నందుకు సంతోషంగా ఉంది. జిల్లా నుంచి మరింత మంది నటనా రంగంలోకి రావాలి. అలాంటివారికి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నా. – హరినాథ్‌గుప్తా -
రోడ్డు ప్రమాదంలో సద్గురు పైప్స్ ఎండీ మృతి
నల్లగొండ: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో సద్గురు పీవీసీ పైపుల ఎండీ హరినాథ్ గుప్తా(45) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు కుటుంబ సభ్యులతో కలసి కారులో వెళ్తున్నారు. ఆ క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో హరినాథ్ గుప్తా అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను నార్కెట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు.అలాగే మృతదేహన్ని స్వాధీనం చేసుకుని... పోస్ట్ మార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నారు. -
‘లవర్స్’ సినిమా మొదట హిందీలో చేద్దామనుకున్నా!
‘‘హిందీలో ఓ సినిమా చేయాలనుకుని, మొదట ‘లవర్స్’ కథ తయారు చేసుకున్నా. ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడే, దర్శకుడు మారుతి ‘ప్రేమకథా చిత్రమ్’ను హిందీలో రీమేక్ చేయమని అడిగాడు. కుదర్లేదు. ఆ సమయంలోనే మారుతి ‘లవర్స్’ కథ విని తెలుగులో చేయమని అడిగారు. భవిష్యత్తులోనైనా ‘లవర్స్’ని హిందీలో చేస్తాను’’ అని దర్శకుడు హరినాథ్ చెప్పారు. సుమంత్ అశ్విన్, నందిత జంటగా మారుతి సమర్పణలో మాయాబజార్ మూవీస్ సంస్థ నిర్మించిన ‘లవర్స్’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోందని హరినాథ్ ఆనందం వెలిబుచ్చారు. తన సినీప్రస్థానం గురించి హరినాథ్ వివరిస్తూ -‘‘న్యూయార్క్ ఫిలిమ్ అకాడమీలో ఫిలిమ్ మేకింగ్, స్క్రీన్ రైటింగ్‌లో స్పెషల్ కోర్స్ చేశాను. ముంబైలో మూడు హిందీ సినిమాలకు పని చేశాను. శ్రీకాంత్ హీరోగా ‘లక్కీ’ సినిమాతో దర్శకునిగా మారాను. ఆ తర్వాత మళ్లీ ముంబై వెళ్లి ‘లవర్స్’ కోసం హైదరాబాద్ వచ్చాను. ఇకపై రెగ్యులర్‌గా తెలుగు సినిమాలే చేస్తాను. ప్రస్తుతం నా దగ్గర నాలుగైదు కథలు సిద్ధంగా ఉన్నాయి’’ అన్నారు. ‘లవర్స్’ మేకింగ్ గురించి హరనాథ్ మాట్లాడుతూ -‘‘కథలో ఫ్రెష్‌నెస్ ఉంది. అలాగే ఆర్టిస్టుల్లోనూ ఫ్రెష్‌నెస్ ఉంది. సుమంత్ ఆశ్విన్, నందిత, సప్తగిరి ఈ సినిమా విజయంలో మెయిన్ పిల్లర్స్. మారుతి స్క్రిప్టు సైడ్ ఇచ్చిన సహకారం మరిచిపోలేనిది. ఆయన క్రియేటివ్ సైడ్ ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు’’ అని తెలిపారు. -
భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే...
జంగారెడ్డిగూడెం : ఫైనాన్స్ వ్యాపారి హరినాథ్ హత్యకేసులో నిందితులు వెంకటేశ్వరరావు, నాగరాజులను కొయ్యలగూడెం పోలీసులు సోమవారం మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. నిందితుల నుంచి రూ.9.70 లక్షల నగదు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.... తన భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే వెంకటేశ్వరరావు .... వ్యాపారి హరినాథ్ హత్యకు కుట్ర పన్నినట్లు తెలిపారు. హత్య కేసు నుంచి తప్పించుకోవటం కోసమే నిందితులు కిడ్నాప్ డ్రామా ఆడారని పోలీసులు వెల్లడించారు. -
కిరాతకం
జంగారెడ్డిగూడెం : నాలుగు రోజుల పాటు ఉత్కంఠత రేకెత్తించిన ఫైనాన్స్ వ్యాపారి కుమారుడు బొమ్మా హరినాథ్(24) కిడ్నాప్ ఉదంతం విషాదాంతమైంది. కిడ్నాప్‌కు గురైన హరినాథ్ దమ్మపేట మండలం పి.అంకంపాలెం అటవీ ప్రాంతంలోని పూసకుంట పాతరోడ్డు సమీపంలోని వాగులో శవమై కనిపించాడు. అనుమానాస్పద వ్యక్తులు ముగ్గురిని అశ్వారావుపేట పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించటంతో కిరాతకం బయటపడింది. వివరాలు ఇవి.. కొయ్యలగూడెం మండలం కన్నాపురానికి చెందిన బొమ్మా హరినాధ్ గత నెల 29 రాత్రి 10 గంటలకు తన అక్క ఇంటికి వెళుతున్నానని తల్లిదండ్రులతో చెప్పి కారులో బయలుదేరాడు. వివాహిత అయిన ఆమె ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం మందలపల్లిలో ఉంటున్నారు. అతను చెప్పిన విధంగా మందలపల్లి వెళ్లకుండా దమ్మపేటలో ఆగిపోయాడు. కారును వేసుకెళ్లిపోమని డ్రైవర్‌తో చెప్పాడు. ఇదిలా ఉండగా హరినాథ్‌ను కిడ్నాప్ చేశామని జులై 30 ఉదయం హరినాథ్ సెల్ నుంచి అతని తండ్రి గంట్లయ్యకు ఫోన్ వచ్చింది. ఆయన తన కొడుకును ఎందుకు కిడ్నాప్ చేస్తారని భావించారు. 31న అదే ఫోన్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ.10 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. దీంతో ఆందోళన చెందిన ఆయన రూ.10 లక్షలు వారు చెప్పిన విధంగా దుండగులకు అందేలా చేశారు. సొమ్ము తీసుకున్న కిడ్నాపర్లు అరగంటలో విడిచి పెడతామని చెప్పారు. మరుసటి రోజు కూడా హరినాథ్ రాకపోవడంతో గంట్లయ్య కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌లో తన కుమారుడు కనిపించటం లేదని ఫిర్యాదు చేశారు. తన కొడుకును కిడ్నాప్ చేశారని అశ్వారావుపేట పోలీస్‌స్టేష న్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేశారు. క్రూరంగా హత్య అశ్వారావుపేట పోలీసులు హరినాథ్ సెల్‌ఫోన్‌కు వచ్చిన, వెళ్లిన కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. హరినాథ్ చివరిగా ఫోన్ చేసిన నంబరు అశ్వారావుపేట మండలం జమ్మికుంటకు చెందిన పొదలి వెంకటేశ్వరరావుగా గుర్తించారు. అతడిని, అతడి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతని తండ్రి పాత్ర ఏమీ లేదని తెలిసి వదిలేశారు. వెంకటేశ్వరరావును వారు తమదైన శైలిలో ప్రశ్నించగా తాను, తన బావమరిది కంచర్ల నాగరాజు కలిసి హరినాథ్‌ను హత్యచేశామని తెలిపాడు. జమ్మికుంటలోని తన ఇంటి సమీపంలో గడ్డిమేటులో దాచిన రూ.10లక్షల విషయం కూడా చెప్పాడు. వెంకటేశ్వరరావు ట్రాక్టర్‌కు హరినాథ్ ఫైనాన్స్ చేయటంతో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. తాను దమ్మపేట వచ్చానని వెంకటేశ్వరరావుకు హరినాథ్ 29 రాత్రి సమాచారం ఇచ్చాడు. అక్కడకు చేరుకున్న తాను, తన బావమరిది కలిసి హరినాథ్‌కు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చామని, స్పృహ తప్పిన అతడిని కర్రలతో కొట్టామని వివరించారు. అతను అప్పటికీ ప్రాణాలతో ఉండటంతో మెడకు తాడు వేసి లాగామని తెలిపాడు. అతను మరణించకపోవడంతో కాళ్లూ చేతులు కట్టి దమ్మపేట మండలం పి.అంకంపాలెం పూసకుంట పాతరోడ్డు సమీపంలోని వాగు వద్దకు తీసుకువచ్చి సుమారు 12 అడుగుల ఎత్తు నుంచి పడేసినట్టు చెప్పాడు. అప్పటికీ మృతిచెందకపోవడంతో గొంతును బ్లేడ్‌తో కోసి హత్యచేసినట్లు తెలిపాడు. హరినాథ్ సెల్‌ఫోన్ తీసుకుని దాని నుంచే అతని తండ్రికి ఫోన్ చేశామని వివరించాడు. మృతదేహాన్ని వాగు సమీపంలోని ఇసుకలో పూడ్చి పెట్టినట్టు తెలిపాడు. హరినాథ్ మృతదేహాన్ని పూడ్చి పెట్టిన ప్రాంతాన్ని అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పైకి తీయించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తెలిపారు. హత్య తరువాతే కిడ్నాప్ డ్రామా హరినాథ్‌ను 29 రాత్రి హత్య చేసిన తరువాతే వెంకటేశ్వరరావు, నాగరాజు కిడ్నాప్ డ్రామాకు తెర లేపారని పోలీసులు చెప్పారు. హరినాధ్ నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్ ద్వారా అతని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తాము నక్సలైట్లమని చెప్పి రూ.10 లక్షలు ఇవ్వాలని బెదిరించారని వివరించారు. రూ.10 లక్షలు ఇచ్చిన తరువాత కూడా హరినాథ్ జాడ తెలియకపోవడంతో అతని కుటుంబసభ్యులు కేసు పెట్టడంతో హత్యోదంతం బయటకు వచ్చిందని చెప్పారు. క్షేమంగా వస్తాడని నాలుగు రోజులుగా ఎదురు చూసి.. కొయ్యలగూడెం: తమ కుమారుడు క్షేమంగా తిరిగి వస్తాడని నాలుగు రోజులు ఎదురు చూసిన హరినాథ్ తలిదండ్రులకు ఆదివారం ఉదయం చేదు కబురు అందటంతో శోకసంద్రంలో మునిగిపోయారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ఇక లేడని అతని తల్లి జానకీరత్నం పడుతున్న వేదనను తీర్చడం ఎవరివల్ల కాలేదు. కిడ్నాప్ చేసింది మొదట మావోయిస్టులుగా భావించామని, వారి డిమాండ్స్ నెరవేర్చితే హరినాథ్‌కు ఏఆపదా రాదని అనుకున్నామని, కక్షకట్టిన అగంతకులు అతడిని బలితీసుకున్నార ని అతని బంధువులు కంటనీరుపెట్టారు. డిగ్రీ చేస్తూ మధ్యలో మానేసిన హరినాథ్ తన తండ్రి గంట్లయ్యకు ఫైనాన్స్ వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటుండేవాడని, అదే వ్యాపారం అతడిని బలి తీసుకుందని వారు విలపించారు. కొయ్యలగూడెం గవరవరానికి చెందిన యువకుడు సిర్రా భానును నెల క్రితం ఇదే తరహాలో హత్య చేశారు. నెల వ్యవధిలో ఇది రెండో ఘటన. 25 ఏళ్ల క్రితం స్థానిక బస్టాండ్‌లోని క్యాంటీన్ ఓనర్ మనవరాలిని అదే క్యాంటీన్లో సర్వర్‌గా పనిచేసే వ్యక్తి కిడ్నాప్‌చేసి హతమార్చిన అనంతరం మళ్లీ ఇన్నేళ్లకు మండలంలో కిడ్నాప్ హత్యోదంతాలతో ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. -
కిడ్నాప్ కథ.. విషాదాంతం
-
కిడ్నాప్ కథ.. విషాదాంతం
హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లాలో కిడ్నాప్‌కు గురైన ఓ వ్యాపారి కుమారుడి జీవితం విషాదాంతమైంది. కొయ్యలగూడెం మండలం కన్నాపురానికి చెందిన హరినాథ్‌ను దుండగులు కిడ్నాప్ చేసి భారీ మొత్తం డిమాండ్ చేశారు. బాధితుడి కుటుంబం నుంచి 10 లక్షల రూపాయిలు తీసుకున్నారు. అయితే దుండగులు డబ్బులు తీసుకున్నా హరినాథ్‌ను ప్రాణాలతో విడిచిపెట్టలేదు. అతణ్ని అమానుషంగా చంపేశారు. ఖమ్మం జిల్లా దమ్మపేట అటవీ ప్రాంతంలో హరినాథ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. హత్య వెనుక పలు కారణాలు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. -
మాజీ ఎంపీటీసీ కుమారుడి కిడ్నాప్ కలకలం
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురంలో టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ కుమారుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కుమారుడు హరినాథ్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారనే వదంతులు వ్యాపించాయి. వారు డబ్బు డిమాండ్ చేయటంతో మాజీ ఎంపీటీసీ గురువారం జంగారెడ్డి గూడెం వెళ్లి వారికి రూ.10 లక్షలు ముట్టచెప్పినట్లు సమాచారం. అయినా కిడ్నాపర్లు అతడిని విడిచి పెట్టకపోవటంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కొయ్యలగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్‌కు గురైన హరినాథ్ పలు వ్యాపారాలు నిర్వహిస్తుండగా... అతడిని జూలై 28న ఖమ్మం జిల్లా మందలపల్లి వద్ద అపహరణకు గురయ్యాడు. అయితే అతడిని కిడ్నాప్ చేసింది మావోయిస్టులా... లేక నకిలీలా ...వ్యాపారానికి సంబంధించిన బకాయిదారులా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఓ ఫైనాన్స్ వ్యాపారి కుమారుడు హరినాథ్‌ను దుండగులు వారం క్రితం అపహరించుకు వెళ్లారు. అతడిని విడిచిపెట్టాలంటే పెద్ద మొత్తంలో నగదు ముట్టచెప్పాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. దాంతో హరినాథ్ కుటుంబ సభ్యులు రూ.10 లక్షలు ముట్టచెప్పారు. అయినా కిడ్నాపర్లు హరినాథ్‌ను విడిచి పెట్టకపోవటంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కొయ్యలగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కిడ్నాపర్ల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు.