కిరాతకం
జంగారెడ్డిగూడెం : నాలుగు రోజుల పాటు ఉత్కంఠత రేకెత్తించిన ఫైనాన్స్ వ్యాపారి కుమారుడు బొమ్మా హరినాథ్(24) కిడ్నాప్ ఉదంతం విషాదాంతమైంది. కిడ్నాప్‌కు గురైన హరినాథ్ దమ్మపేట మండలం పి.అంకంపాలెం అటవీ ప్రాంతంలోని పూసకుంట పాతరోడ్డు సమీపంలోని వాగులో శవమై కనిపించాడు. అనుమానాస్పద వ్యక్తులు ముగ్గురిని అశ్వారావుపేట పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించటంతో కిరాతకం బయటపడింది. వివరాలు ఇవి.. కొయ్యలగూడెం మండలం కన్నాపురానికి చెందిన బొమ్మా హరినాధ్ గత నెల 29 రాత్రి 10 గంటలకు తన అక్క ఇంటికి వెళుతున్నానని తల్లిదండ్రులతో చెప్పి కారులో బయలుదేరాడు. వివాహిత అయిన ఆమె ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం మందలపల్లిలో ఉంటున్నారు. అతను చెప్పిన విధంగా మందలపల్లి వెళ్లకుండా దమ్మపేటలో ఆగిపోయాడు.
కారును వేసుకెళ్లిపోమని డ్రైవర్‌తో చెప్పాడు. ఇదిలా ఉండగా హరినాథ్‌ను కిడ్నాప్ చేశామని జులై 30 ఉదయం హరినాథ్ సెల్ నుంచి అతని తండ్రి గంట్లయ్యకు ఫోన్ వచ్చింది. ఆయన తన కొడుకును ఎందుకు కిడ్నాప్ చేస్తారని భావించారు. 31న అదే ఫోన్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ.10 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. దీంతో ఆందోళన చెందిన ఆయన రూ.10 లక్షలు వారు చెప్పిన విధంగా దుండగులకు అందేలా చేశారు. సొమ్ము తీసుకున్న కిడ్నాపర్లు అరగంటలో విడిచి పెడతామని చెప్పారు. మరుసటి రోజు కూడా హరినాథ్ రాకపోవడంతో గంట్లయ్య కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌లో తన కుమారుడు కనిపించటం లేదని ఫిర్యాదు చేశారు. తన కొడుకును కిడ్నాప్ చేశారని అశ్వారావుపేట పోలీస్‌స్టేష న్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేశారు.
క్రూరంగా హత్య
అశ్వారావుపేట పోలీసులు హరినాథ్ సెల్‌ఫోన్‌కు వచ్చిన, వెళ్లిన కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. హరినాథ్ చివరిగా ఫోన్ చేసిన నంబరు అశ్వారావుపేట మండలం జమ్మికుంటకు చెందిన పొదలి వెంకటేశ్వరరావుగా గుర్తించారు. అతడిని, అతడి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతని తండ్రి పాత్ర ఏమీ లేదని తెలిసి వదిలేశారు. వెంకటేశ్వరరావును వారు తమదైన శైలిలో ప్రశ్నించగా తాను, తన బావమరిది కంచర్ల నాగరాజు కలిసి హరినాథ్‌ను హత్యచేశామని తెలిపాడు. జమ్మికుంటలోని తన ఇంటి సమీపంలో గడ్డిమేటులో దాచిన రూ.10లక్షల విషయం కూడా చెప్పాడు. వెంకటేశ్వరరావు ట్రాక్టర్‌కు హరినాథ్ ఫైనాన్స్ చేయటంతో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.
తాను దమ్మపేట వచ్చానని వెంకటేశ్వరరావుకు హరినాథ్ 29 రాత్రి సమాచారం ఇచ్చాడు. అక్కడకు చేరుకున్న తాను, తన బావమరిది కలిసి హరినాథ్‌కు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చామని, స్పృహ తప్పిన అతడిని కర్రలతో కొట్టామని వివరించారు. అతను అప్పటికీ ప్రాణాలతో ఉండటంతో మెడకు తాడు వేసి లాగామని తెలిపాడు. అతను మరణించకపోవడంతో కాళ్లూ చేతులు కట్టి దమ్మపేట మండలం పి.అంకంపాలెం పూసకుంట పాతరోడ్డు సమీపంలోని వాగు వద్దకు తీసుకువచ్చి సుమారు 12 అడుగుల ఎత్తు నుంచి పడేసినట్టు చెప్పాడు.
అప్పటికీ మృతిచెందకపోవడంతో గొంతును బ్లేడ్‌తో కోసి హత్యచేసినట్లు తెలిపాడు. హరినాథ్ సెల్‌ఫోన్ తీసుకుని దాని నుంచే అతని తండ్రికి ఫోన్ చేశామని వివరించాడు. మృతదేహాన్ని వాగు సమీపంలోని ఇసుకలో పూడ్చి పెట్టినట్టు తెలిపాడు. హరినాథ్ మృతదేహాన్ని పూడ్చి పెట్టిన ప్రాంతాన్ని అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పైకి తీయించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తెలిపారు.
హత్య తరువాతే కిడ్నాప్ డ్రామా
హరినాథ్‌ను 29 రాత్రి హత్య చేసిన తరువాతే వెంకటేశ్వరరావు, నాగరాజు కిడ్నాప్ డ్రామాకు తెర లేపారని పోలీసులు చెప్పారు. హరినాధ్ నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్ ద్వారా అతని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తాము నక్సలైట్లమని చెప్పి రూ.10 లక్షలు ఇవ్వాలని బెదిరించారని వివరించారు. రూ.10 లక్షలు ఇచ్చిన తరువాత కూడా హరినాథ్ జాడ తెలియకపోవడంతో అతని కుటుంబసభ్యులు కేసు పెట్టడంతో హత్యోదంతం బయటకు వచ్చిందని చెప్పారు.
క్షేమంగా వస్తాడని నాలుగు రోజులుగా ఎదురు చూసి..
కొయ్యలగూడెం: తమ కుమారుడు క్షేమంగా తిరిగి వస్తాడని నాలుగు రోజులు ఎదురు చూసిన హరినాథ్ తలిదండ్రులకు ఆదివారం ఉదయం చేదు కబురు అందటంతో శోకసంద్రంలో మునిగిపోయారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ఇక లేడని అతని తల్లి జానకీరత్నం పడుతున్న వేదనను తీర్చడం ఎవరివల్ల కాలేదు. కిడ్నాప్ చేసింది మొదట మావోయిస్టులుగా భావించామని, వారి డిమాండ్స్ నెరవేర్చితే హరినాథ్‌కు ఏఆపదా రాదని అనుకున్నామని, కక్షకట్టిన అగంతకులు అతడిని బలితీసుకున్నార ని అతని బంధువులు కంటనీరుపెట్టారు.
డిగ్రీ చేస్తూ మధ్యలో మానేసిన హరినాథ్ తన తండ్రి గంట్లయ్యకు ఫైనాన్స్ వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటుండేవాడని, అదే వ్యాపారం అతడిని బలి తీసుకుందని వారు విలపించారు. కొయ్యలగూడెం గవరవరానికి చెందిన యువకుడు సిర్రా భానును నెల క్రితం ఇదే తరహాలో హత్య చేశారు. నెల వ్యవధిలో ఇది రెండో ఘటన. 25 ఏళ్ల క్రితం స్థానిక బస్టాండ్‌లోని క్యాంటీన్ ఓనర్ మనవరాలిని అదే క్యాంటీన్‌లో సర్వర్‌గా పనిచేసే వ్యక్తి కిడ్నాప్‌చేసి హతమార్చిన అనంతరం మళ్లీ ఇన్నేళ్లకు మండలంలో కిడ్నాప్ హత్యోదంతాలతో ప్రజలు భయభ్రాంతులవుతున్నారు.