
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన హరినాథ్ గత పదేళ్లుగా మొక్కల పెంపకమే లోకంగా బతుకుతున్నాడు. ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లి రోడ్లు, అడవులవెంట తిరుగుతూ విత్తనాలు చల్లడమే ఆయన పని. ఆరు పదుల వయసులో అలుపెరగకుండా అడవుల పెంపకమే లక్ష్యంగా శ్రమిస్తున్న ఆయన ఈ పనికి దిగడం వెనుక ఆసక్తికరమైన కథ దాగుంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
హరినాథ్ తల్లిదండ్రులు కష్టపడటంతో పాల్వంచ సమీపాన జగన్నాథపురంలో ఆ కుటుంబానికి 1970వ దశకంలో 50 ఎకరాలకు పైగా భూమి సొంతమైంది. చదువు కోసం పాల్వంచలోని కేటీపీఎస్ స్కూల్‌కు రోజూ నడిచి వెళ్లే హరినాథ్ ఆకాశం కనిపించకుండా పెరిగిన చెట్లు, వాటి మధ్యన తిరిగే పక్షులు, పాములు, వన్యప్రాణులను చూస్తుండేవాడు.
అయితే హరినాథ్ ఎస్సెస్సీ, ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలోకి అడుగుపెట్టగానే విలాసాలు దరిచేరాయి. చదువు పూర్తయి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లో ఉద్యోగిగా పనిచేసిన ఆయన జూదం, తాగుడులాంటి వ్యసనాల్లో చిక్కుకుపోయారు. యాభై ఏళ్లు దాటినా బయటపడలేకపోయారు. దీంతో భూమి హరించుకుపోగా రూ.30 లక్షల అప్పు మిగిలింది.
వనజీవి రామయ్య స్ఫూర్తితో..
కేటీపీఎస్ ఉద్యోగిగా కెరీర్ చివరి దశలో ఉన్నప్పుడు 2013లో విలాసాలు, వ్యసనాలపై వైరాగ్యం ఏర్పడింది. దీంతో ఏం చేయాలో తెలియని స్థితికి చేరుకోగా టీవీలో పద్మశ్రీ వనజీవి రామయ్య జీవితంపై వచ్చిన కథనం హరినాథ్‌ను ఆకట్టుకుంది.
దట్టమైన అడవి మీదుగా స్కూల్‌కు వెళ్లిన రోజులు గుర్తుకురాగా.. ప్రస్తుతం పాల్వంచ – కొత్తగూడెం పరిసర ప్రాంతాలు కాంక్రీట్ జంగిల్‌గా మారడం కళ్లెదుట కనిపించింది. దీంతో వనజీవి మార్గంలో నడవాలనే నిర్ణయానికి రాగా, కొత్తగూడెంకు చెందిన మొక్కల వెంకటయ్య తదితరులు పరిచయమయ్యారు. అలా పదేళ్లుగా పాల్వంచ – కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో పచ్చదనం పెంపే లక్ష్యంగా హరినాథ్ గడుపుతున్నాడు.
మొక్కల పెంపకమే లక్ష్యంగా...
ఏటా మార్చి నుంచి జూన్ వరకు 40 రకాల చెట్ల విత్తనాలను సేకరిస్తాడు. ఆ విత్తనాలను జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అడవుల్లో చల్లుతాడు. పాల్వంచ, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి, సుజాతనగర్ మండలాల పరి ధి రోడ్లు, అడవులు, కార్యాలయాలు.. ఖాళీ స్థలం కనిపి స్తే చాలు ఔషధాలు, పండ్లు, నీడనిచ్చే నలభై రకాల మొ క్కల విత్తనాలు చల్లుతున్నాడు.
పండ్లను కోతులు, పక్షు లు తింటున్నప్పుడు కలిగే సంతోషం తనకు జీవితంలో ఎప్పుడూ కలగలేదని హరినాథ్ చెబుతుంటాడు. 2016 లో ఉద్యోగ విరమణ చేశాక వచ్చే పెన్షన్ నుంచే మొక్కల పెంపకానికి ఖర్చు భరిస్తున్నాడు. పదేళ్ల క్రితం హరినాథ్ మొలుపెట్టిన పయనానికి ఇప్పుడు మరో ఇరవై మంది సాయంగా ఉంటున్నారు. మరో ఏడు జిల్లాల నుంచి వనప్రేమికులు విత్తనాలు తీసుకెళ్తుంటారు.
మొక్కలపై అవగాహన పెంచండి
పదేళ్లుగా లక్షలకొద్దీ విత్తనాలు చల్లుతున్నాను. పశువుల కాపర్ల అత్యుత్సాహంతో చెట్లు చనిపోతున్నాయి. మొక్కల సంరక్షణపై పశువుల కాపర్లకు అవగాహన కలి్పస్తే మంచిది. నాకు ముగ్గురు ఆడపిల్లలు. నేను వ్యసనాల్లో మునిగిపోయినప్పుడు వాళ్ల బాగోగులు మా ఆవిడే చూసు కుంది.
వ్యసనాల నుంచి బయటకు వచ్చాక ప్రకృతి రక్ష ణ, అడవుల పెంప కంపై ధ్యాస పె ట్టా. నా సహకారం లేకున్నా ముగ్గురు పిల్లలు చదువు పూ ర్తి చేసి అమెరికాలో స్థిరపడ్డారు. ఇది ప్రకృతి నాకు తిరిగి ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నా. –హరినాథ్