
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు
వీరికి చెక్ పెట్టే దిశగా మావోల ప్రతివ్యూహాలు
ఒకేచోటకు చేరుతున్న మావోయిస్టు కమిటీల సాయుధులు
మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్)ను కేంద్ర బలగాలు చేపట్టాయి. ఈక్రమంలోనే బస్తర్ అడవుల్లో నెత్తురు ఏరులై పారింది. ఎదురుకాల్పుల్లో 300 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. అయితే ప్రభుత్వ దళాల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు మావోయిస్టులు (Maoists) ఎదురుదాడులకు సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది.
– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
వేసవి వ్యూహం..
వేసవి (Summer) సమీపించడంతో ఆకులు రాలిపోయి అడవులు వెలవెలబోతాయి. దీంతో ప్రతి వేసవిని మావోయిస్టులు గడ్డుకాలంగానే పరిగణిస్తారు. అడవిలో చాటు తగ్గిపోవడంతో పాటు నీటి వనరుల లభ్యత పరిమితంగా ఉంటుంది. దీంతో అడవుల్లోకి పోలీసులు, భద్రతా దళాలు చొచ్చుకురాకుండా ‘ట్యాక్టిక్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్’ పేరుతో ముందుగానే ఎదురుదాడులకు దిగే వ్యూహాన్ని ఆ పార్టీ అమలు చేస్తోంది. కానీ పెరిగిన నిర్బంధం వల్ల ప్రస్తుతం బస్తర్ అడవుల్లో మావోయిస్టులు, వారి సానుభూతిపరులకు మధ్య సంబంధాలు గతంలో పోలిస్తే తగ్గిపోయాయి. సానుభూతిపరుల నుంచి అవసరమైన మేర సాయం అందే పరిస్థితి లేదు. ఈ లోటును పూడ్చుకునేందుకు తమ సాయుధ బలగాలనే ఏకం చేసి వ్యూహాత్మక దాడులు చేయాలనే ప్లాన్‌లో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం.
ఏకమవుతున్న దళాలు..
బస్తర్ అడవులు కేంద్రంగా కేంద్ర కమిటీతో పాటు వివిధ రాష్ట్రాలు, ఏరియా కమిటీలు పనిచేస్తున్నాయి. ఈ కమిటీలకు రక్షణగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన సాయుధులు రక్షణ కల్పిస్తున్నారు. దీనికి తోడు ప్రతి కమిటీకి సాయుధ దళాలు ఉంటాయి. వేసవి ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుత్వ భద్రతా బలగాలను ఎదుర్కోవాలంటే దళాలు వేర్వేరుగా కాకుండా కలిసికట్టుగా దాడులు చేయాలనే వ్యూహానికి మావోలు పదును పెడుతున్నట్టు సమాచారం. ఈ మేరకు దండకారణ్యం, అబూజ్‌మడ్ అడవుల్లో తమకు పట్టున్న ప్రాంతానికి వివిధ దళాలు చేరుకున్నట్టు తెలుస్తోంది.
సురక్షితంగా ఎంట్రీ–ఎగ్జిట్..
ఒకప్పుడు రెడ్ కారిడార్ అంటే నేపాల్ నుంచి దక్షిణ భారతదేశం వరకు ఉండేది. ప్రస్తుతం బస్తర్ అడవులు మాత్రమే మిగిలాయి. ఇందులోనూ చాలా ప్రాంతం భద్రతా దళాల అధీనంలోకి వెళ్లింది. అయినప్పటికీ దక్షిణ బస్తర్, ఏవోబీ, ఛత్తీస్‌గఢ్ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఇప్పటికీ మావోల గుప్పిట్లోనే ఉన్నాయి. దీంతో తమకు పట్టు ఉన్న ప్రాంతానికి చేరుకుంటున్న దళాలు... ఆయా ప్రాంతాల నుంచి ఎంట్రీ, ఎగ్జిట్, రిట్రీవ్ రూట్‌లు సేఫ్‌గా ఉండేలా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. తమ స్థావరాల సమీపంలోకి భద్రతా దళాలు వస్తే భీకరంగా ఎదురుదాడి చేయాలని మావోయిస్టులు లక్ష్యంగా పెట్టుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
జవాన్ల జోరు తగ్గిందా?
ఈ ఏడాది ఆరంభంలో జనవరి 16, 21, ఫిబ్రవరి 9న భారీ ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనల్లో 80 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి సైతం ప్రాణాలు కోల్పోయారు. కానీ గడిచిన నెలరోజులుగా భారీ ఎన్‌కౌంటర్లు ఎక్కడా జరగలేదు. నక్సలైట్ల వేసవి వ్యూహాలను పసిగట్టడం వల్లనే గడిచిన నెల రోజులుగా గాలింపు చర్యలను భద్రతా దళాలు ఆచితూచి చేపడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దూకుడుగా అడవుల్లోకి వెళ్లి మావోయిస్టుల వలలో చిక్కితే భారీగా ప్రాణనష్టం జరగడంతో పాటు జవాన్ల ఆత్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్లే కూంబింగ్‌కు సమాంతరంగా బేస్ క్యాంపులను సుస్థిరం చేయడం, కొత్తగా అధీనంలోకి వచ్చిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై భద్రతా దళాలు ఫోకస్ చేస్తున్నాయి.
కవ్వింపు చర్యలు
తీవ్ర నిర్బంధం కొనసాగుతున్నప్పటికీ మార్చి 6న దంతేవాడ జిల్లా కేంద్రానికి 40 కి.మీ. దూరంలో బస్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించారు. విప్లవ ద్రోహులుగా పేర్కొంటూ అక్కడ కొన్ని కుటుంబాలను ఊరు వదిలి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. గాలింపు చర్యల్లో భద్రతా దళాల దూకుడు తగ్గడంతో వారిని రెచ్చగొట్టి అడవుల్లోకి రప్పించేందుకే మావోయిస్టులు ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
మావోయిస్టుల ప్రింటింగ్ సామగ్రి స్వాధీనం
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా చింతల్నార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోమ్‌గూడ క్యాంపు బలగాలు ఆదివారం మావోయిస్టుల ప్రింటింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. గోమ్‌గూడ క్యాంపు నుంచి డీఆర్జీ, కోబ్రా, 241 బెటాలియన్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టాయి.

ఈ క్రమంలో గోమ్‌గూడ క్యాంపు పరిధిలోని జాలేర్‌గూడ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు స్పైక్(పదునైన కడ్డీలు)లను ఏర్పాటు చేశారు. వాటిని తొలగించుకుంటూ గాలిస్తుండగా.. మావోయిస్టులకు చెందిన ప్రింటింగ్ స్థావరం బయటపడింది. అక్కడ మావోయిస్టులు దాచిపెట్టిన ప్రింటర్లు, ఇన్వర్టర్ యంత్రాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: మావోయిస్టులకు లొంగుబాటే శరణ్యమా?
Comments
Please login to add a commentAdd a comment