సీతారాముల కల్యాణము చూతము రారండి! | Sri rama navami celebrations in bhadrachalam | Sakshi
Sakshi News home page

సీతారాముల కల్యాణము చూతము రారండి!

Published Sun, Apr 6 2025 5:15 AM | Last Updated on Sun, Apr 6 2025 7:09 AM

Sri rama navami celebrations in bhadrachalam

నేడు భద్రాచలంలో వేడుకగా రాములోరి కల్యాణం  

పల్లకీలో ఆలయం నుంచి మిథిలా స్టేడియానికి వధూవరులు

ఉదయం 10 గంటలవేళ కల్యాణ క్రతువు మొదలు  

సింహాసనంపై శ్రీరాముడు, గజాసనంపై సీతమ్మ

రామదాసు ఆభరణాలతో వధూవరుల అలంకరణ 

మధ్యాహ్నం అభిజిత్‌ లగ్నంలో జీలకర్ర బెల్లం

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: శ్రీరామ నవమి రోజున ఆగమ శాస్త్ర పద్ధతిని అనుసరిస్తూ భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మిథిలా స్టేడియంలో నేడు సీతారాముల కల్యాణం జరగనుంది. ఆ వివాహ వేడుక వివరాలు.. 

భజంత్రీలు, కోలాటాలతో స్వాగతం..
ఉదయం 9:30 గంటల తర్వాత శంఖు, చక్ర, ధనుర్బాణాలను ధరించి సీతమ్మతో కూడిన రాముడి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకీలో వెలుపలకు తీసుకొస్తారు. కల్యాణ వేదిక మీదకు వెళ్తున్న సీతారాములకు భజంత్రీలు, కోలాటం, సంప్రదాయ నృత్యాలతో భక్తజనం స్వాగతం పలుకుతారు. జై శ్రీరామ్‌ నినాదాల నడుమ మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి స్వామి, అమ్మవార్లు చేరుకుంటారు. 

మండప శుద్ధి
కల్యాణ మండపానికి చేరుకున్న సీతారాములు, లక్ష్మణుడిని అక్కడ వేంచేపు చేస్తారు. కల్యాణ వేడుకలకు ఎలాంటి విఘ్నాలు రాకుండా ముందుగా విశ్వక్సేన పూజ నిర్వహిస్తారు. పుణ్యాహవచన మంత్రాలతో కల్యాణ వేడుకలకు ఉపయోగించే స్థలం, వస్తువులు, ప్రాంగణం, వేడుకలో పాల్గొనే వారిని మంత్ర జలంతో శుద్ధి చేస్తారు.

రాముడి ఎదురుగా సీతమ్మ..
శ్రీయోద్వాహము నిర్వహించి అప్పటివరకు మండపంలోనే ఉన్న సీతమ్మను శ్రీరాముడికి ఎదురుగా కూర్చుండబెడతారు. శ్రీరాముడు సింహాసనంపై ఆసీనులు కాగా సీతమ్మ గజాసనంపై ఆసీనులవుతారు. సీతారాముల వంశగోత్రాల ప్రవరలు చెబుతారు.

సీతారాములు ఎదురెదురుగా కూర్చున్న తర్వాత ద్వాదశ దర్భలతో తయారుచేసిన యోక్త్రంతో సీతమ్మకు యోక్త్రా బంధనం చేస్తారు. ఇలా చేయడం వల్ల గర్భస్థ దశలో కలిగే దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. మరోవైపు శ్రీరాముడు గృహస్థాశ్రమంలోకి వెళ్తున్నాడనే దానికి సూచనగా యజ్ఞోపవీతధారణ చేస్తారు. యజ్ఞోపవీతధారణ, యోక్త్రాబంధన కార్యక్రమాలు జరిగిన తర్వాత శ్రీరాముడి పాదప్రక్షాళనతో వరపూజ నిర్వహిస్తారు.

అలంకరణలు
కల్యాణం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వస్త్రాలను సీతారాములకు ధరింపజేస్తారు. అనంతరం రామదాసు చేయించిన చింతాకు పతకం సీతమ్మకు, పచ్చలహారం రామయ్యకు అలంకరిస్తారు. లక్ష్మణుడికి రామమాడను ధరింపజేస్తారు. సీతారాములకు తేనె, పెరుగు కలిపిన మధుపర్కంతో నివేదన చేస్తారు

రాష్ట్ర ప్రభుత్వం తరఫున, శృంగేరీ పీఠంలతో పాటు భక్తరామదాసు, తూము నర్సింహదాసు వంశస్తుల తరఫున వధూవరులకు పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది.

కన్యాదానం
వేదమంత్రాలను ఉచ్ఛరిస్తూ కన్యాదానం సందర్భంగా భూదానం, గోదానం చేస్తారు. అనంతరం మహాసంకల్పం, చూర్ణిక పఠనం గావిస్తారు. మంగళాష్టకాలు జపిస్తూ శ్రీరాముడికి సంబంధించి ఎనిమిది శ్లోకాలను, సీతమ్మకు సంబంధించి ఎనిమిది శ్లోకాలను పఠిస్తారు. ఈ మంగళాష్టకంలో వధూవరులకు సంబంధించిన ఏడు తరాల వివరాలను, ఘనతలను తెలియజేస్తారు. 

అభిజిత్‌ లగ్నంలో..
చైత్రశుద్ధ నవమి నాడు అభిజిత్‌ లగ్నంలో శ్రీరాముడి కల్యాణం నిర్వహించడం ఆచారంగా వస్తోంది, సాధారణంగా నవమి రోజున అభిజిత్‌ లగ్నం మధ్యాహ్నం 12 గంటలకు కాస్త అటుఇటుగా రావడం పరిపాటి. ముహూర్త లగ్నం రాగానే వధూవరులైన సీతారాముల తలలపై జీలకర్ర, బెల్లం ఉంచుతారు. 

ఆ తర్వాత శ్రీరామదాసు చేయించిన మూడు తాళిబొట్లు ఉన్న మంగళసూత్రానికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం మూడు బొట్లు ఉన్న తాళిని సీతమ్మ వారి మెడలో కట్టడంతో కల్యాణ వేడుకలో కీలక ఘట్టం ముగుస్తుంది.

భద్రాచల వీధుల్లో వధూవరుల ఊరేగింపు..
తలంబ్రాల కార్యక్రమం ముగిసిన సీతారాములకు తర్వాత తాత్కాలిక నివేదన చేయిస్తారు. నివేదన అనంతరం సీతమ్మ చీరకు, రామయ్య పంచె/«ధోతితో కలుపుతూ బ్రహ్మముడి వేస్తారు. అనంతరం మంగళ హారతి అందిస్తారు. బ్రహ్మముడి అనంతరం కల్యాణం ముగించుకున్న సీతారాములను వేడుకగా పల్లకీలో భద్రాచల వీధుల్లో ఊరేగిస్తూ ఆలయంలోనికి తీసుకెళ్తారు. 

తలంబ్రాలు..
ముత్యాలు కలిపిన, గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరులైన సీతారాములపై పోస్తారు. సాధారణంగా తలంబ్రాలు పసుపురంగులో ఉంటాయి. కానీ భద్రాచల రామయ్య కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలు గులాబీ రంగులో ఉంటాయి. ఇక్కడ తలంబ్రాల తయారీలో పసుపుతో పాటు గులాల్‌ను కూడా ఉపయోగించడం తానీషా కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది.

సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకమ్ము!
ఆలయ నిర్మాణం సహా సీతారాములకు ఆభరణాల తయారీ
మ్యూజియంలో కంచర్ల గోపన్న ఆభరణాలు
భద్రాచలం: హస్నాబాద్‌ (పాల్వంచ) తహసీల్దార్‌గా పని­చేసిన కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీసీతారాముల ఆల­యం నిర్మించాడని తెలిసిందే. అయితే, ఆయన ఆల­యాన్ని నిర్మించడమే కాకుండా.. సీతారామ లక్ష్మణులకు పలు ఆభర­ణాలను ఆ సమయంలోనే తయారు చేయించా­డు. వీటిని ఆలయ ప్రాంగణంలోని మ్యూజియంలో భక్తు­లకు అందు­బాటులో ఉంచారు. ప్రధాన ఉత్సవాలైన ము­క్కో­టి, శ్రీరామనవమి రోజుల్లో ఈ ఆభరణాలను మూలవ­రు­లు, ఉత్సవ విగ్రహాలకు అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.

భద్రశిల మహత్మ్యం 
భద్రగిరిపై శ్రీ సీతారామచంద్రస్వామి వారి కరుణా కటాక్షాల కోసం భద్ర మహర్షి కఠోర తపస్సు చేశాడు. రామాలయం ప్రాంగణంలో గర్భగుడి వెనుక ఇప్పటికీ భద్రుని శిల.. చరిత్రకు నిదర్శనంగా దర్శనమిస్తోంది. ఆ మహర్షి కఠోర తపస్సుకు సంతుష్టుడైన శ్రీరామన్నారాయణుడు.. శంఖుచక్రాలతో సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడి అవతారంలో సాక్షాత్కరించిన తపో భూమి భద్రాచలమని భక్తులు భావిస్తారు. 

ఇంతటి చారిత్రక నేపథ్యం గల ఈ శిలను తాకేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తారు. భద్రుడికి గుడి కట్టించి పూజలు సైతం నిర్వహిస్తున్నారు. అందుకే ఈ క్షేత్రం తొలుత భద్రగిరి, అనంతరం భద్రాచలంగా ప్రఖ్యాతి గాంచింది. 

అదరహో... శిల్పకళా నైపుణ్యం
జగదభిరాముడికి భద్రాచలంలో జరిగే కల్యాణం ఎంతో ప్రత్యేకమైంది. ఈ కల్యాణం నిర్వహించే మండపం మొత్తాన్ని శిలతోనే నిర్మించారు. దీనిపై రామాయణ ఇతివృత్తాలకు చెందిన అనేక అపురూప శిల్పాలను చెక్కారు. ఈ శిల్పాలను నాటి మ­ద్రాస్, ప్రస్తుత చెన్నైకి చెందిన గణపతి స్థపతి నేతృత్వంలో చె­క్కారు. శ్రీరామనవమి రోజు ప్రత్యేకంగా అలంకరించి కల్యాణా­న్ని ఇదే వేదికపై జరుపుతారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణాన్ని.. మొదట్లో ఆలయంలోని పొగడ చెట్టు ముందున్న రామకోటి స్తూపం వద్ద నిర్వహించేవారు. 

ఆ తర్వాత చిత్రకూట మండపంలో వేదిక నిర్మించి కల్యాణం జరిపేవారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెర­గడంతో.. రామాలయానికి సమీపంలో 1960 మే 30న ప్రస్తుత కల్యాణ మండపానికి అప్పటి దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కల్లూరి చంద్రమౌళితో శంకుస్థాపన జరిగింది. దీన్ని 1964 ఏప్రిల్‌ 6న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డితో ప్రా­రంభించి.. అదే రోజు స్వామివారి కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. 

ఆ  తర్వాత మహాసామ్రాజ్య పట్టాభిషేకం సంద­ర్భంలో.. 1988లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కల్యా­ణ మండపం ప్రాంగణంలో.. స్టేడియం మాదిరిగా గ్యాలరీలు ఏర్పాటు చేసి మిథిలా స్టేడియంగా నామకరణం చేశారు. ఈ స్టే­డి­యంలో ప్రస్తుతం 35 వేలమంది భక్తులు కూర్చుని స్వామి­వారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించే అవకాశం ఉంది.

సుదర్శన చక్ర దర్శనం.. సర్వ పాపహరణం
భద్రగిరిపై కొలువుదీరిన మూలమూర్తులకు ఎంతటి ప్రత్యేకత ఉందో.. ప్రధాన ఆలయంపైను­న్న గోపురంపై సుదర్శన చక్రానికీ అంతే ప్రత్యేకత ఉంటుంది. భక్త రామదాసు రామా­ల­యాన్ని ప్రత్యే­క రాతి శిల్పాలతో నిర్మించాక.. ఆల­య శిఖరంపై విమాన ప్రతిష్ట కోసం సుదర్శన చక్రం తయారు చేయించాలని నిర్ణయించారు. ఇలా సుదర్శన చక్రా­న్ని ఎంతమందితో తయారు చేయించినప్పటికీ అది భిన్నం (ముక్కలు) అయి­పోయేదట. 

భక్త రామ­దాసు చివరకు రామయ్య తండ్రిని ప్రార్థించగా.. స్వామివారు స్వప్నంలో కనిపించి మానవుడు నిర్మించిన ఏదీ ఇందుకు పనికిరాదని, గోదావరి నదిలో సుదర్శన చక్రం ఆవిర్భవించి ఉందని చెప్పినట్లు పురాణం చెబు­తోంది. దీంతో నాలుగు వందల మంది గోదావరి నదిలో దానికోసం వెతికినా.. కనిపించలేదు. రామదాసు భక్తి శ్రద్ధలతో సీతారామచంద్రస్వామి వారిపై కీర్తనలు ఆలపించగా.. సుదర్శన చక్రం గోదావరి నదిలో దొరికిందట. ఇలా గోదావరి నదిలో దొరికిన సుదర్శన చక్రాన్ని ఆలయ గర్భగుడిపై భక్త రామదాసు ప్రతిష్టించారు.

రాములోరి మొదటి కల్యాణం గర్భగుడిలోనే..
నేడు తెల్లవారుజామున రెండు గంటలకే పూజలు మొదలు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో సాధారణ రోజుల్లో తెల్లవారు­జామున నాలుగు గంటల తర్వాత సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పుతారు. ఆ తర్వాత తిరువా­రాధన, మంగళాశాసనం, అభిషేకం తదితర పూజ­లు నిర్వహిస్తారు. కానీ శ్రీరామనవమిని పురస్కరించుకుని గర్భగుడిలో ఉన్న సీతారాములను రాత్రి రెండు గంటల సమయంలోనే మేల్కొల్పుతారు. 

ఆ తర్వాత నిత్యం నిర్వహించే పూజా కార్యక్రమాలు చేపడతారు. అనంతరం ఉదయం ఎనిమిది గంటల సమయంలో భద్రాచలం ఆలయం గర్భగుడిలో ఉన్న మూల విరాట్‌లకు శాస్త్రోక్తంగా లఘు కల్యాణం జరుపుతారు. 40 నిమిషాల వ్యవధిలోనే ఈ తంతును ముగిస్తారు.

ఆ రోజుల్లో పొగడ చెట్టు నీడలో..
శ్రీరామదాసు కాలంలో భద్రాచలం ఆలయ ప్రాంగణంలో ఉన్న పొగడ చెట్టు నీడలో సీతారాముల కల్యాణం నిర్వహించేవారు. ఆ తర్వాత భక్తుల సంఖ్య పెరగడంతో పొగడ చెట్టు నుంచి బేడా మండపంలోకి పెళ్లి వేదికను మార్చారు. గోదావరిపై వంతెన నిర్మాణం పూర్తయ్యాక భద్రాచలం వచ్చే భక్తుల సంఖ్య వేలల్లోకి చేరుకుంది. బేడా మండపంలో అంతమంది వీక్షించే పరిస్థితి లేకపోవడంతో ఆలయ ప్రాంగణం నుంచి బయట కల్యాణం జరి­పిం­చా­లని నిర్ణయించారు. 

దీంతో ఉత్తర ద్వారానికి ఎదురుగా నవమి కల్యాణం కోసం ప్రత్యేకంగా మండపాన్ని 1964లో నిర్మించారు. సుమారు రెండు దశాబ్దాలపాటు ఎత్తైన కల్యాణ మండపంలో పెళ్లి తంతు జరుగుతుండగా చుట్టూరా భక్తులు చేరి చూసేవారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1988లో కల్యాణ మండపం చుట్టూ భక్తులు కూర్చుని చూసేందుకు వీలుగా మిథిలా స్టేడియాన్ని నిర్మించారు.

పెళ్లి పెద్దలుగా..
శ్రీరామదాసు కాలం నుంచి భద్రాచలంలో నిత్య పూజలు, శ్రీరామనవమి, పట్టాభిషేకం తదితర వేడుకలు నిర్వహించేందుకు తమిళనాడులోని శ్రీరంగానికి చెందిన వేద పండితులను భద్రాచలం తీసుకువచ్చారు. ఇలా తీసుకువచ్చిన వారిలో కోటి, అమరవాది, పొడిచేటి, గొట్టుపుళ్ల, తూరుబోటి ఇంటిపేర్లు గల కుటుంబాలు ఉన్నాయి. అప్పటి నుంచి ఆ కుటుంబాలే వంశపారంపర్యంగా, వంతుల వారీ­గా నవమి వేడుకల బాధ్యతలను నిర్వర్తిస్తున్నాయి. 

శ్రీరామ నవమికి మిథిలా స్టేడియంలో జరిగే శ్రీ సీతా­రాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్స­వా­లలో కీలక పాత్ర పోషించేది ఆచార్య. ఇతని చేతుల మీదుగానే కల్యాణం మొత్తం జరుగుతుంది. ఆయ­నకు సూచనలను అందించే వ్యక్తిని బ్రహ్మగా పే­ర్కొంటారు. వీరిద్దరికి సహాయకులుగా ఇద్దరు చొ­ప్పున నలుగురు రుత్వికులు ఉంటారు. పూజా సా­మగ్రి అందించేందుకు నలుగురు పరిచారకులు ఉంటారు. 

ప్రస్తుతం ఆలయంలో ప్రధాన అర్చకులైన ఇద్దరు వీరందరికీ అధర్వులుగా వ్యవహరిస్తారు. మొత్తంగా 12 మంది సీతారాముల పెళ్లి వేడుకలో కీలకంగా వ్యవహరిస్తారు. వీరందరిని ఉత్సవాలలో భాగస్వామ్యం చేస్తూ కల్యాణ తంతు శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా జరిగేలా స్థానాచార్యులు స్థలశాయి పెద్దన్న పాత్రను నిర్వర్తిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement