Mithila stadium
-
అంగరంగ వైభవంగా రామయ్య కల్యాణం
భద్రాచలం : భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో అభిజిత్ లగ్నమందు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారు సీతమ్మ వారి మెడలో మాంగల్యధారణ గావించారు. పురోహితులు పవిత్రమైన అభిజిత్ లగ్నంలో కల్యాణ రాముడి చేత జగన్మాత వైదేహి మెడలో మాంగల్యధారణ చేయించారు. అంతకు ముందు వేద పండితులు మూలమూర్తులకు కల్యాణం అనంతరం మిథిలా మండపానికి ఊరేగింపుగా తీసుకు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణం ఇలలో జరిగే రమణీయ వేడుక. ఊరూరా రాములోరి పెళ్లి జరిగినా భద్రాద్రి కల్యాణోత్సవం కనులారా చూసిన వారిదే వైభోగం. నీలమేఘశ్యాముని నామస్మరణతో భద్రాద్రి పరవశించింది. రామాయణ రసరమ్య సన్నివేశాలతో పులకించిన దివ్యధాత్రి భద్రాచలంలో రామయ్య కల్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తజనులు తరలి వచ్చారు. దాంతో స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చిన భక్తులతో భద్రాద్రి కిక్కిరిసిపోయింది. సీతారాముల కల్యాణానికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. కాగా శనివారం జరిగే శ్రీరాముడి మహాపట్టాభిషేకంలో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొంటారు. -
భద్రాచలంలో నృత్యాభిషేకం సందడి
-
కల్యాణం.. కమనీయం
* భద్రాద్రిలో వేడుకగా సీతారాముల కల్యాణం * ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్ భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ వేడుకగా జరిగిన శ్రీ సీతారాముల కల్యాణాన్ని కనులారా తిలకించి భక్తజనం పులకించిపోయారు. రామయ తండ్రి సీతమ్మ వారిని పరిణయమాడిన వేళ మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపం వైకుంఠాన్ని తలపించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుటుంబసమేతంగా కల్యాణానికి విచ్చేశారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణం సందర్భంగా శనివారం వేకువజామున రెండు గంటలకే రామాలయం తలుపులు తెరిచారు. స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళాశాసనం, అభిషేకం నిర్వహించారు. గర్భగుడిలో మూలవరులకు తొలుత కల్యాణం జరిపించారు. ఆ తరువాత ఉత్సవమూర్తులను పూల పల్లకిలో ఉంచి మంగళ వాయిద్యాలతో, వేదనాద పురస్సరంగా సకల విధ రాజలాంఛనాలతో గిరిప్రదక్షిణ నిర్వహించారు. ఊరేగింపుగా కల్యాణ మండపం వద్దకు తీసుకువచ్చారు. భక్తుల రామనామస్మరణ మధ్య శిల్ప కళాశోభితంగా పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా నిర్మించిన కల్యాణ మండపంపై సీతమ్మ వారిని, స్వామివారిని ఆసీనులను చేశారు. కల్యాణ వేడుకలో భాగంగా స్వామివారికి తిరువారాధన, విష్వక్సేనపూజ నిర్వహించారు. అందరి గోత్రనామాలు జపించి, చేయబోయే కల్యాణ తంతుకు ఎలాంటి విఘ్నాలూ జరగకుండా కర్మణ్యే పుణ్యాహవచనం అనే మంత్రంతో మండపశుద్ధి చేశారు. కల్యాణానికి సంబంధించిన వస్తువులకు ఎటువంటి దోషాలు లేకుండా మంత్రజలంతో ప్రోక్షణ గావించారు. దీని ద్వారా కల్యాణ సామగ్రి అంతా సీతారాములకు వినియోగించేందుకు యోగ్యతమవుతాయి. శ్రీ యముద్వాహ్యస్యే అన్న సంకల్పంతో స్వామికి ఎదురుగా సీతమ్మను కూర్చుండబెట్టారు. కన్యావరణను జరిపించారు. మోక్ష బంధనం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీతధారణం గావించారు. వధూవరుల వంశ గోత్రాల ప్రవరలు ప్రవచించారు. అనంతరం ఆశీర్వచనం, పాద ప్రక్షాళనం, పుష్పోదక స్నానం నిర్వహించి వరపూజ చేశారు. గతేడాది కంటే కాస్త తగ్గిన భక్తులు శ్రీ సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. గతేడాదికంటే స్వల్పంగా తగ్గినప్పటికీ.. సుమారు 60 వేలు పైగా భక్తులు హాజరయ్యూరు. విద్యార్థుల పరీక్ష లు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కడప జిల్లా ఒంటిమిట్టలోనూ సీతారాముల కల్యాణం జరగటంతో కొంతమంది భక్తులు తగ్గినట్లు భావిస్తున్నారు. కల్యాణం తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఇంకా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్వరరెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీలు పొంగులే టి శ్రీనివాసరెడ్డి, సీతారాంనాయక్, జడ్జిలు చల్లా కోదండరామ్, సునీల్ చౌదరి, శివశంకర్‌రావు, ఎస్. జగన్నాథం, ఐ.రమేశ్, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, సున్నం రాజయ్య, పువ్వాడ అజయ్‌కుమార్, రాంరెడ్డి వెంకటరెడ్డి, కోరం కనకయ్య, మదన్‌లాల్, జలగం వెంకట్రావు, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పల్లా రాజేశ్వరరెడ్డి, పూల రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, పర్యాటక శాఖ చైర్మన్ పేర్వారం రాములు, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, జిల్లా కలెక్టర్ ఇలంబరితి, జాయింట్ కలెక్టర్ దివ్య, భద్రాచలం ఆర్డీవో అంజయ్య, దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతితో పాటు పలువురు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రామదాసు ఆభరణాలతో కల్యాణం భక్త రామదాసు చేయించిన బంగా రు ఆభరణాలను స్వామివారికి, అమ్మవారికి అలంకరించారు. మధుపర్కప్రాశన అనంతరం తేనె, పెరుగు కలిపిన మిశ్రమాన్ని స్వామికి నివేదించారు. సీతారాములకు నూతన వస్త్రాలంకరణ చేశారు. లోకమంతా సుఖసంతోషాలతో ఉండాలని మహాసంకల్పం పఠించారు. కన్యాదానంతో పాటు గోదానం, భూదానం చేయించారు. స్వామికి ఎనిమిది శ్లోకాలు, అమ్మవారికి మరో ఎనిమిది శ్లోకాలతో మంగళాష్టకం చదివారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉత్సవ విగ్రహాల శిరస్సులపై ఉంచారు. భక్తరామదాసు చేయించిన మంగళసూత్రాలకు మాంగల్యపూజ నిర్వహించి సీతమ్మ వారికి మాంగల్యధారణ గావించారు. అనంతరం తలంబ్రాల కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. సీతారాముల శిరస్సు పైనుంచి జాలువారిన తలంబ్రాల కోసం భక్తులు ఎంతో ఆసక్తి చూపారు. తాత్కాలిక నివేదన ఇచ్చి బ్రహ్మముడి వేశారు. మహదాశీర్వచనం నిర్వహించి హారతి పట్టడంతో స్వామివారి కల్యాణ తంతు పూర్తయింది. ఆ తరువాత స్వామి వారిని తిరువీధి సేవకు తీసుకెళ్లారు. నేడు శ్రీరామ పట్టాభిషేకం స్వామివారి పట్టాభిషేక మహోత్సవం ఆదివారం మిథిలాస్టేడియంలోని కల్యాణ మండపంపై ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీరామపట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు. -
వైభవంగా రాములోరి కల్యాణం
-
వైభవంగా రాములోరి కల్యాణం
భద్రాచలం : భద్రాచలంలో సీతారాముల కల్యాణం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో అభిజిత్ లగ్నమందు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారు సీతమ్మ వారి మెడలో మాంగల్యధారణ గావించారు. అంతకు ముందు శనివారం మూలమూర్తులకు కల్యాణం అనంతరం మిథిలా మండపానికి వూరేగింపుగా వేంచేస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణం ఇలలో జరిగే రమణీయ వేడుక. ఊరూరా రాములోరి పెళ్లి జరిగినా భద్రాద్రి కల్యాణోత్సవం కనులారా చూసిన వారిదే వైభోగం. దాంతో స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చిన భక్తులతో భద్రాద్రి కిక్కిరిసిపోయింది. కాగా ఈ నెల 29న శ్రీరాముడి మహాపట్టాభిషేకంలో గవర్నర్ నరసింహన్ పాల్గొననున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకూ జరిగే ఈ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. -
వైభవంగా సహస్ర కలశాభిషేకం
మహాయజ్ఞంలో అద్భుత ఘట్టం భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ సమీపలోని మిథిలాస్టేడియం(కల్యాణమండపం)లో జరుగుతున్న శ్రీరామమహాయజ్ఞంలో గురువారం అద్భుత ఘట్టం నిర్వహించారు. 1,008 కలశాలతో పెరుమాళ్‌కు తిరుమంజనం( సహస్రకలశాభిషేకం) జరిపించారు. సాయంత్రం పెరుమాళ్ దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు తీసుకొచ్చిన ప్రమిదలు, ఒత్తులు, నూనె తదితర సామగ్రి స్వామి వారికి నివేదనగా ఇచ్చారు. శ్రీరామ మహాయజ్ఞంలో భాగంగా ముందుగా శ్రీఅష్టలక్ష్మీ పీఠం వ్యవస్థాపకుడు పీతాంబరం రఘునాథాచార్య స్వామి వారు యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ అష్టలక్ష్మీ శ్రీనివాస్ పెరుమాళ్ వారికి, శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు, అర్చకులు యజ్ఞ క్రతువును నిర్వహించారు. పెరుమాళ్ వారికి, శ్రీసీతారామచంద్రస్వామి వారికి ఘనంగా అభిషేకం జరిపించారు. సాయంత్రం పెరుమాళ్ వారికి వైభవంగా దీపోత్సవం జరిపించారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరాముడి సేవలో తరలించాలి శ్రీరామమహాయజ్ఞంలో భాగంగా జరిగిన వేడుకలకు గురువారం తమిళనాడు శ్రీవిల్లివుత్తూర్కు చెందిన త్రిదండి శఠగోపి రామానుజ జీయర్ స్వామి హాజరయ్యారు. శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతి ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు జీయర్ స్వామికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. యాగశాలను సందర్శించిన జీయర్ స్వామి వారు పెరుమాళ్ వారిఅభిషేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ ఆంజనేయలు, ఎస్సై మురళి హాజరై స్వామి వారి ప్రసాదాలను అందుకున్నారు. లయన్స్ క్లబ్ ప్రముఖులు కొండిశెట్టి బుజ్జి, కుంభంపాటి సురేష్‌కుమార్, తాళ్లూరి పంచాక్షరయ్య తదితరులు కూడా పూజల్లో పాల్గొన్నారు. నేడు లక్ష కుంకుమార్చన శ్రీరామమహాయజ్ఞంలో భాగంగా శుక్రవారం సీతమ్మతల్లికి సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. -
13న భద్రాచలంలో లక్ష దీపోత్సవం
భద్రాచలం: భద్రాద్రి దివ్యక్షేత్రంలో ఈ నెల 13న అరుదైన వేడుకను నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మిథిలా స్టేడియం(కల్యాణమండపం) ప్రాంగణంలో కార్తీక పుష్యమి లక్ష దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కార్యచరణ సిద్ధం చేశారు. ఆధ్యాత్మికతను పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించ తలపెట్టిన ఈ ఉత్సవానికి అయ్యే వ్యయాన్ని బెంగళూరుకు చెందిన పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ వారు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఆ రోజు రామాలయ ప్రాంగణమంతా కార్తీక దీపాలతో అలంకరించనున్నారు. దర్బార్ సేవ జరిగే ఉత్సవ మంటపాన్ని కూడా ప్రత్యేకంగా దీపాలంకరణ చేయనున్నారు. ఇందుకోసమని 50 వేల ప్రమిదలను, లక్ష వత్తులను, దీపాలను వెలిగించేందుకు నూనె వంటి వస్తువులను నిర్వాహకులే అందజేయనున్నారు. కల్యాణ మండపంలో దీపాలంకరణ కోసం 24 గ్రూపుల(దళం)ను ఎంపిక చేయనున్నారు. ఒక్కో గ్రూపులో 12 మంది మహిళలు ఉంటారు. ఎంపిక చేసిన దళాలను దేవతా మూర్తుల పేర్లతో నమోదు చేసుకుంటారు. సాయంత్రం 4గంటల నుంచి 7గంటల వరకు ఈ జరిగే ఈవేడుకలో అధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. భద్రాద్రికి భక్తులను రప్పించడమే లక్ష్యం.. పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసి, తద్వారా దివ్యక్షేత్రానికి భక్తులను రప్పించటమే లక్ష్యంగా ఈ అరుదైన వేడుకను నిర్వహిస్తున్నట్లుగా దేవస్థానం అధికారులు ప్రకటించారు. పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ వారు సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకు రావటం అభినందనీయమని దేవస్థానం ఈఓ కూరాకుల జ్వోతి, ఏఈఓ శ్రావణ్ కుమార్ తెలిపారు. దీపోత్సవంలో పాల్గొనే మహిళా టీమ్‌లకు వారి ప్రతిభకు గుర్తింపుగా బహుమతులను కూడా అందజేసేందుకు ఫౌండేషన్ వారు ముందుకొచ్చారని తెలిపారు. మొదటి బహుమతిగా రూ.50 వేలు, రెండో బహుమతిగా రూ.25 వేలు, తృతీయ బహుమతిగా రూ.15 వేలు విలువ గల వెండితో తయారు చేసిన అమ్మవారి ప్రతిమ, పీఠాలను అందజేయనున్నట్లుగా చెప్పారు. వేడుకలో పాల్గొనే టీమ్‌లలో సభ్యులందరికీ భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి చిత్రాలను అందజేస్తామన్నారు. 9లోగా నమోదు చేసుకోవాలి.. భద్రాద్రి క్షేత్రంలో జరిగే లక్ష దీపోత్సవంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రామభక్తులు పాల్గొనవచ్చు. ఇందుకోసం టీమ్‌లుగా ఏర్పడి ఈ నెల 9లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని దేవస్థానం అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం దేవస్థానం ఉద్యోగులకు చెందిన 76600 07679, 76600 07684 సెల్ నంబర్ర్లలో సంప్రదించాలని కోరారు.