వైభవంగా సహస్ర కలశాభిషేకం
మహాయజ్ఞంలో అద్భుత ఘట్టం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ సమీపలోని మిథిలాస్టేడియం(కల్యాణమండపం)లో జరుగుతున్న శ్రీరామమహాయజ్ఞంలో గురువారం అద్భుత ఘట్టం నిర్వహించారు. 1,008 కలశాలతో పెరుమాళ్‌కు తిరుమంజనం( సహస్రకలశాభిషేకం) జరిపించారు. సాయంత్రం పెరుమాళ్ దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు తీసుకొచ్చిన ప్రమిదలు, ఒత్తులు, నూనె తదితర సామగ్రి స్వామి వారికి నివేదనగా ఇచ్చారు. శ్రీరామ మహాయజ్ఞంలో భాగంగా ముందుగా శ్రీఅష్టలక్ష్మీ పీఠం వ్యవస్థాపకుడు పీతాంబరం రఘునాథాచార్య స్వామి వారు యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ అష్టలక్ష్మీ శ్రీనివాస్ పెరుమాళ్ వారికి, శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు, అర్చకులు యజ్ఞ క్రతువును నిర్వహించారు. పెరుమాళ్ వారికి, శ్రీసీతారామచంద్రస్వామి వారికి ఘనంగా అభిషేకం జరిపించారు. సాయంత్రం పెరుమాళ్ వారికి వైభవంగా దీపోత్సవం జరిపించారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీరాముడి సేవలో తరలించాలి
శ్రీరామమహాయజ్ఞంలో భాగంగా జరిగిన వేడుకలకు గురువారం తమిళనాడు శ్రీవిల్లివుత్తూర్‌కు చెందిన త్రిదండి శఠగోపి రామానుజ జీయర్ స్వామి హాజరయ్యారు. శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతి ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు జీయర్ స్వామికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. యాగశాలను సందర్శించిన జీయర్ స్వామి వారు పెరుమాళ్ వారిఅభిషేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ ఆంజనేయలు, ఎస్సై మురళి హాజరై స్వామి వారి ప్రసాదాలను అందుకున్నారు. లయన్స్ క్లబ్ ప్రముఖులు కొండిశెట్టి బుజ్జి, కుంభంపాటి సురేష్‌కుమార్, తాళ్లూరి పంచాక్షరయ్య తదితరులు కూడా పూజల్లో పాల్గొన్నారు.
నేడు లక్ష కుంకుమార్చన
శ్రీరామమహాయజ్ఞంలో భాగంగా శుక్రవారం సీతమ్మతల్లికి సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.